Monday, April 15, 2024

పాలమూరు సాహితీ ద్వారా రెడ్డి మొగ్గలు

పాలమూరు సాహితీ అవార్డు వ్యవస్థాపకులు , మొగ్గలు ప్రక్రియ సృష్టికర్త, భీంపల్లి శ్రీకాంత్ గారు, పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ సుమారు 50 కి పైగా కులాల వారిగా.... కులానికి 108 మొగ్గలు రాయించం జరిగింది. బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, పద్మశాలి, యాదవ, ముదిరాజ్, గౌడు, నాయిబ్రాహ్మణ , విశ్వబ్రాహ్మణ (అవుసలి, వడ్ల, కంసాలి, కమ్మరి, కాంచరీ) కుమ్మరి , రజక, ఎరుకల, లంబాడ, దూదేకుల, బలిజ,మాదిగ, మొదలగు అన్ని కులాల కవులు తమ కుల చరిత్రలను మొగ్గలుగా రాయడం జరిగింది. ఇందులో భాగంగా నేను, పాలమూరు కవయిత్రి Shantha Reddy గారు రెడ్డి మొగ్గలు రాయడం జరిగింది. అవకాశం ఇచ్చిన Sreekanth Bheempally గారికి ధన్యవాదములు

రెడ్డి మొగ్గలు 
°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

▪️చారిత్రక పూర్వ యుగం 

1
శాతవాహనులకు పూర్వమే ఉనికిని చాటుతూ 
కాపులుగా గ్రామ సంరక్షణ కొనసాగించిన వారు 
ప్రాచీనమైనది రెడ్ల పుట్టుక ... 
2
మౌర్యుల కంటే ముందు మనగడ సాగించి 
కృషీవలురుగా రాణించిన వారు 
కాపుదానం రెడ్లకు ఆరోప్రాణం... 
3
క్రీస్తు పూర్వమే యోధులుగా చరిత్ర కలిగి 
అడుగడుగున ఘనతను ముద్రించిన వారు 
బుద్దిబలం రెడ్లకు మారుపేరు... 

▪️జానపద సాహిత్యంలో

4
రెడ్ల పూర్వీకుడు ఆదిరెడ్డి కథనాల్ని
వినిపిస్తున్నాయి జానపద గాథలు 
గెలిచి నిలిచిన యుగసంకేతాలు రెడ్లు... 
5
మట్టారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కాటమరెడ్డి 
పేర్లతో జానపదుల ఉయ్యాల పాటలున్నాయి 
ప్రజాబంధువులుగా రెడ్ల పేరు సార్థకం.... 

▪️చాళుక్య యుగం 

6
గ్రామాధికారులు రట్టగుడులుగా పిలువబడి 
రట్టోడి - రట్ట - రడ్డ -రెడ్డిగా మారిన క్రమం 
వృత్తి ధర్మానికి రెడ్డి పదం నిర్వచనం... 
7
ఉత్తరాదినుండి నుండి దక్షిణ ప్రాంతాల్లోకి వచ్చి 
స్థిరపడిన రాష్ట్రకూటులే రెడ్లుగా పరిశోధనలు 
రెడ్ల చరిత్ర విస్తృతమైనది... 
8
చారిత్రక ఆధారాలు ప్రకారం చాళుక్యులు రెడ్లను గ్రామాలకు పెదకాపులుగా నియమించారు 
పాలనాధికారాలకు అర్హులు రెడ్లు...  

▪️కాకతీయయుగం (క్రీ. శ. 750-1323)

9
పలనాటి యుద్ధంలో ఎదురు నిలిచి 
పరాక్రమాన్ని చాటింది నాయకీ నాగమ్మ 
కదన రంగంలో రెడ్ల వనితలు ధీశాలులు... 
10
సమర్థతకు పర్యాయంగా రెడ్డి పదాన్ని స్వీకరించి తమ సైనికాధికారులకు రెడ్డి బిరుదు ఇచ్చారు కాకతీయులు 
శక్తి సామర్థ్యాలకు రెడ్లు పునాదిరాళ్ళు.... 
11
రెడ్ల తెగువ తెగింపును కాకతీయులు గుర్తించి 
తమ సైన్యాధ్యక్షులుగా నియమించుకున్నారు 
శౌర్య ప్రతాపాలకు మారుపేరు రెడ్లు... 
12
కాకతీయ సామంతుడుగా రాజ్యాధికారానికి 
శ్రీకారం చుట్టాడు గోన బుద్దారెడ్డి 
రెడ్ల చారిత్రక వైభవానికి తిరుగులేదు... 
13
తొలితెలుగు రామకథ రంగనాథ రామాయణాన్ని ద్విపదలో రచించాడు గోన బుద్దారెడ్డి 
సాహిత్య సృజనలోనూ రెడ్లు అగ్రగణ్యులు 
14
విధేయతకు వీరత్వానికి పెట్టింది పేరుగా 
రుద్రమ కత్తి అంచై చెలరేగాడు గోనగన్నారెడ్డి 
రాజనీతిజ్ఞతలో రెడ్లకి సరిలేరు.... 
15
బుద్దారెడ్డి ప్రియపుత్రిక కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రిగా గుర్తింపు పొందినది 
రెడ్ల మహిళలు ప్రతిభకు పట్టపురాణులు 
16
తన సర్వం శ్రీశైలం మల్లిఖార్జునుడుగా హేమారెడ్డి మల్లమ్మ గొప్ప శివభక్తిని ప్రదర్శించి దేవతై నిలిచింది 
రెడ్ల స్త్రీల ఆరాధనకు ముల్లోకాలు మురిసాయి.. 

▪️రెడ్డిరాజుల వైభవం ( క్రీ. శ. 1325-1434)

17
 కొండవీడు రాజధాని చేసుకుని తీరాంధ్ర ప్రాంతాల ప్రతినిధులుగా రెడ్డి రాజులు అవతరించారు 
మధ్యయుగంలో రెడ్ల వైభవం అఖండం 
18
చరిత్రలో జాతి కీర్తిని సుస్థిరం చేస్తూ 
రెడ్డి రాజ్య స్థాపించాడు ప్రోలయ వేమారెడ్డి 
రాజకీయంలో రెడ్లు అపర చాణుక్యులు.... 
19
ప్రబంధ పరమేశ్వరుడు ఎఱ్ఱాప్రగడను 
ఆస్థానకవిగా రెడ్డిరాజులు ఆదరించారు 
కవులని పోషించిన కళా హృదయులు రెడ్లు 
20
కొండవీటి ప్రభువు సర్వజ్ఞసింగ భూపాలుని 
రాజాశ్రయం పొందాడు శ్రీనాథ కవిసార్వ భౌముడు 
పండితుల్ని ప్రోత్సహించడంలో రెడ్లు గణనీయులు.. 
21
పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి, సంగీత చింతామణి, శృంగారదీపిక గ్రంథాలను రచించాడు
ఆయుధాలతో పాటు అక్షరాలను గెలిచారు రెడ్లు 
22
వసంత రాజీయం గ్రంథాన్ని రచించిన కుమారగిరిరెడ్డికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఉన్నది 
సకల కళల్లో ఆరితేరిన చక్రవర్తులు రెడ్లు.. 
23
అనపోతారెడ్డి కాలంలో తమిళప్రాంతంలో 
ట్రావెల్ కోర్ రాజులను ఓడించారు రెడ్డియార్లు
యుద్ధరంగంలో రెడ్లు మహాయోధులు 

▪️సంస్థానాలు - పరిపాలనలు 

24
ఆత్మకూరు గద్వాల వనపర్తి దోమకొండ వంటి 
పెద్ద సంస్థానాలను పాలించాయి రెడ్డివంశాలు 
పరిపాలనాదక్షతలో రెడ్లు ప్రజా బంధువులు 

25
సంస్థానాధీశులుగా సాహిత్యాన్ని సృజిస్తూనే  
సాహిత్యకారుల్ని ఆదరించారు రెడ్డి ప్రభువులు 
ఖడ్గానికి కాలానికి వారధులు రెడ్లు.. 
26
పాపన్నపేట రాణి శంకరమ్మ మహారాష్ట్ర పీష్వాలను 
మట్టి కరిపించి ఆడసింహంగా బిరుదు పొందినది 
రణరంగంలో రౌద్ర నాదాలు రెడ్ల మహిళలు... 

▪️ప్రబంధయుగం - ప్రబంధయుగానంతరం 

27
విజయనగర అచ్యుతరాయలు కట్టిన కర్నూలు కోట దేశభక్తుడు కొండారెడ్డి బురుజుగా ప్రసిద్దికెక్కినది 
ఎందరో రెడ్లు మహానుభావులు.... 
28
మహనీయుడు భక్త మల్లారెడ్డి తాత 
రెడ్ల కుల గురువుగా పూజలందుకుంటున్నాడు 
రెడ్లలో చరితార్థులకు కొదవలేదు.... 
29
భక్త మల్లారెడ్డి స్వామి పిచ్చుగుంట్లను ఆదరించి 
గోత్రాలను శాఖలను భద్రపరిచినట్టుగా కథనాలు 
రెడ్ల పుట్టుపూర్వోత్తరాలు ఆసక్తిదాయకం.. 
30
విశ్వదాభిరామ వినురవేమ అంటూ ఆటవెలదిలో 
జీవనసారం వినిపించాడు యోగి వేమారెడ్డి 
తాత్విక చింతనలో రెడ్లు యుగపురుషులు... 

▪️భారత తొలి స్వాతంత్రోద్యమ కాలంలో 

31
ప్రజల కోసం బ్రిటిష్ వారిపై తిరగబడి ఉరికంభం 
ఎక్కాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 
స్వాతంత్ర్య తొలి సమరయోధులు రెడ్లు... 
32
కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి 
ప్రజల ప్రాణాల్ని కాపాడాడు బుడ్డా వెంగళరెడ్డి
దానధర్మాల్లో రెడ్లు కర్ణుడి వారసులు 
33
సైసైరా చిన్నపరెడ్డి నీపేరే బంగారు కడ్డీ అంటూ 
జానపదుల గేయాల్లో నిలిచాడు పల్నాటి వీరుడు 
పరాక్రమంలో రెడ్లది ప్రథమ శ్రేణి.... 

▪️భారత స్వాతంత్ర్య రెండవ దశలో 

34
 రాజాజీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖా మంత్రిగా హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించాడు కడప కోటిరెడ్డి 
సమసమాజం సమతాభావం రెడ్ల సంకల్పం... 
35
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారిపై తమిళుల ఆధిపత్యాన్ని నిరసించాడు హాలహర్వి సీతారామరెడ్డి
ఆంధ్రమహాసభలను జయప్రదం చేశారు రెడ్లు 
36
బ్రిటిష్ పాలన అంతం కావాలనే పంతంతో క్విట్ ఇండియా ఉద్యమంలో పిడికిలెత్తాడు పెంచికల బసిరెడ్డి 
పోరాటమైనా ఆరాటమైనా తెగిస్తారు రెడ్లు 

▪️సాయుధపోరాట కాలంలో 

37
భూమి భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం 
నిజాంరాజు ఎదురించారు రెడ్డిదొరలు 
పేదల పెన్నిధులుగా రెడ్లు చిరస్మరణీయులు...  
38
తెలంగాణ ఆత్మగౌరవం కోసం మట్టి మనుషులను మరణాయుధాలుగా మలిచారు రెడ్డివీరులు 
కార్యసాధనలో మొండిఘటాలు రెడ్లు 
39
రావి, గంగసాని, బద్దం ఆరుట్ల, భీంరెడ్డిలు 
తమ భూములను పేదలకు పంచిపెట్టారు 
దీనజనోద్ధరణ కోసం నడుం బిగించారు రెడ్లు...
40
బందూకు ఎత్తి రజాకార్ మూకల మీద తిరగబడి 
అపరరుద్రమగా కీర్తింపబడింది ఆరుట్ల కమలాదేవి 
రెడ్డి జాతిలో వీరనారీమణులకు కొదవలేదు .... 
41
కుర్రారం రామిరెడ్డి, రేణికుంట రామిరెడ్డి, ఇమ్మడి రాజిరెడ్డిలు గ్రామ రక్షణ దళాలు ఏర్పర్చి గర్జించారు 
ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు రెడ్లు
42
బొడ్డెమ్మ పాటలు గట్టి ఊరూరా తిరిగి ఆడిపాడి 
గ్రామీణుల్ని జాగృతం చేసింది మల్లు స్వరాజ్యం  
రెడ్ల మహిళలు చైతన్యదీప్తులు.... 
43
అక్షర కోటీశ్వరుడై నిజాంను వణికించాడు 
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 
గుణానికి గుండె ధైర్యానికి నిర్వచనాలు రెడ్లు 
44
నిజాం పాలనలో పోలీసు ఉన్నతాధికారిగా ప్రజల శ్రేయస్సుకై పాటుబడ్డాడు రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి 
మనసున్న మారాజులు రెడ్లు.... 

▪️చలనచిత్రరంగంలో 

45
తొలి తెలుగు మాటల సినిమా 'భక్త ప్రహ్లాద 'ను తెర మీదకు తీసుకు వచ్చిన సృష్టికర్త హెచ్. ఎం. రెడ్డి 
కదిలే బొమ్మలకు మాటలు నేర్పిన సినీమాంత్రికులు రెడ్లు
46
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు దర్శకనిర్మాత బొమ్మిరెడ్డి నరసింహ్మారెడ్డి 
సంచలనాలు సృష్టించడంలో సమున్నతులు రెడ్లు... 
47
భక్త పోతన, యోగి వేమన, సత్యహరిశ్చంద్ర వంటి 
సినీఆణిముత్యాలను అందించిన దర్శకుడు కే. వి.రెడ్డి 
ప్రేక్షకుల నాడి తెలిసిన అమర జక్కన్నలు రెడ్లు... 
48
పిల్లల కోసం తమిళ తెలుగు భాషల్లో చందమామ 
పత్రిక తీసుకు వచ్చాడు నిర్మాత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి 
సంకల్పాలను జయించిన కళా హృదయులు రెడ్లు.... 
49
నెల్లూరుమాండలికంలో మాట్లాడుతూ ప్రేక్షకుల్ని 
నవ్వించి మెప్పించిన హాస్యనటుడు రమణారెడ్డి 
నటనలో రారాజులు రెడ్లు 
50
సినీ కార్మికుల సమాఖ్య ఏర్పాటుచేసి చిత్రపురి కాలని కోసం ఆస్తిని దానం ఇచ్చాడు నటుడు ప్రభాకర్ రెడ్డి 
శ్రామికలోకపు ఆశాదీపాలు రెడ్లు 
51
సంస్కృతంలో భగవద్గీత చిత్రం రూపొందించి ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం పొందాడుసుబ్బిరామిరెడ్డి 
ప్రయోగాలకు ప్రయత్నాలకు సారధులు రెడ్లు 
52
బాలలతో బలరామాయణం నిర్మించి తెలుగు సినిమా ఖ్యాతిని దేశానికి చాటి చెప్పాడు ఎమ్మెస్ రెడ్డి 
వినూత్నకు ప్రాణం పోసే రస హృదయులు రెడ్లు 

▪️సాహిత్యంలో రెడ్లు

53
సాహిత్యం రాజకీయం రెండు నేత్రాలుగా 
వెలుగొందాడు బహుభాషావేత్త బెజవాడ గోపాలరెడ్డి 
ప్రజ్ఞలో రెడ్లకు బహుముఖాలు... 
54
విశ్వంభర కావ్యానికి ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీదిగ్గజం సి.నారాయణరెడ్డి 
జ్ఞాన సముపార్జనలో విశ్వవిఖ్యాతులు రెడ్లు 
55
విమర్శలో విప్లవం తీసుకొచ్చి విమర్శకాగ్రేసర చక్రవర్తిగా కీర్తి గడించాడు కట్టమంచి రామలింగారెడ్డి 
నూతన ఆలోచనా రీతులకు యజమానులు రెడ్లు... 
56
చిత్రనళీయంతో సినీదర్శకుడైన మొదటి తెలుగుకవి 
కవికోకిల 'సింహపురి సిరి" దువ్వూరి రామిరెడ్డి 
అద్భుతాలకు ఆద్యులు రెడ్లు... 
57
ఆకాశవాణి ఢిల్లీ వారిచే 'జాతీయకవి 'గా గుర్తింపబడిన  
నిజాం వ్యతిరేకి రైతు పక్షపాతి ముకురాల రామారెడ్డి 
సమాజం కోసం బతికిన సంఘ హితులు రెడ్లు... 
58
వేర్లుతో రిజర్వేషన్లకు సంబంధించి క్రీమీ లేయర్ మీద మొట్టమొదటిసారిగా గొంతువిప్పాడు కేతు విశ్వనాథరెడ్డి 
సమస్యను ప్రశ్నిచడంలో రెడ్లకు వేల గుండెలు.... 
59
పులికంటి,రాచపాళెం,కోట్ల, సిధారెడ్డిల అక్షర నైవేద్యాలతో 
విస్తృతి సాధించి వెలుగుతున్నది తెలుగు సాహిత్యం 
సారస్వత వారసులు రెడ్లు.... 
60
తెలంగాణ మాండలికాన్ని తన రచనల్లో ఉపయోగించిన  
తొలి మహిళా రచయిత్రి పాకాల యశోదారెడ్డి 
ప్రయోగాలకు పునాదిరాళ్ళు రెడ్ల మహిళలు.... 
61
సామాజిక నేపథ్యంలో తెలంగాణ సాహిత్య చరిత్రను వెలువరించిన అగ్రగామి ముదిగంటి సుజాతారెడ్డి 
రెడ్ల మహిళలు సరస్వతి వీణా తంత్రులు... 

▪️రెడ్ల శాఖలు 

62
దక్షిణ మరియు మధ్య భారతదేశాలలో రెడ్ల ఉనికిని పాశ్చాత్య శాస్త్రవేత్త క్రిస్టోఫ్ జాఫ్రెలోట్ వివరించారు 
అన్నిచోట్లా అడుగుపెట్టి అందరువారు రెడ్లు... 
63
మొటాటి, పాకనాటి,వెలనాటి,గుడాటి,,పెడకంటి,
కుంచేటి, రేనాటి,ఓరుగంటి, మొదలైనవి రెడ్ల తెగలు 
మర్రిచెట్టుకు ఊడల్లా విస్తరించినవి రెడ్ల ఉపకులాలు 
64
చేసిన వృత్తి,నివసించిన ప్రాంతం, ఆచరించిన కట్టుబాట్లు, ఆధారంగా మాత్రమే శాఖలు యేర్పడినట్లు తెలుస్తున్నది 
ఒక ఇంటిలో పలువురి పేర్ల వంటివి రెడ్ల శాఖలు 
65
కవి రెడ్రెడ్డి మల్లారెడ్డి (1650-1700) ప్రాంతంలో తాను మొటవాడ వంశానికి చెందిన వ్యక్తినని చెప్పుకున్నాడు
తెగ ఏదైనా రెడ్లంతా ఒక గూటిలో పక్షులు... 
66
చోళులు పాలించిన పాకనాడు పాకనాటిగా, వెలనాడు వెలనాటిగా, రేనాడు రేనాటి శాఖలుగా మారాయి  
జీవించిన ప్రాంతమే రెడ్ల జీవన ఛాయ.. ... 
67
భూమంచి రెడ్లు అంటే బహుమంచి లేదా మంచి భూమిని కలిగి ఉన్నవారు అని పరిశోధకుల అబిప్రాయము 
నాగలి పట్టిన భూపాలురు రెడ్లు... 
68
12,13 వ శతాబ్దాల్లో నెల్లూరు చోడుల పరిపాలనలో భాగంగా ఉన్న పంట రాజ్యము వారే పంట రెడ్లు 
ప్రాంతం ఏదైనా రెడ్లకు పంటలు ఆరోప్రాణం.... 
69
కొండవీడును పాలించిన రాజులను స్థానిక అనే అర్థంలో 
దేశరట్టొడి నుంచి పదోత్పత్తి జరిగిన దేసటిరెడ్లు అంటారు.  
దేశాలను జయించిన దిగ్విజయులు రెడ్లు.... 
70
రెడ్లు నిర్వహించిన వివిద హోదాలు దేశ్ముఖ్ దేశాయి చౌధరిలే కాల క్రమంలో శాఖలు ఇంటిపేర్లుగా మారాయి 
బాధ్యతల్ని నెరవేర్చే నిజ బంధువులు రెడ్లు... 
71
చౌధరిరెడ్డి అంటే శిస్తు వసూలు చేయడానికి నియమించిన గ్రామ పెద్ద అని మల్లారెడ్డి పద్యాల ద్వార తెలుస్తుంది
పదవికి ప్రాణం పోసే వ్యవహారికులు రెడ్లు... 

▪️దొరతనం

72
దొరలు పటేండ్లు పదాలు 1724 తర్వాత అసఫ్ జాహీల కాలంలో తెలుగు ప్రాంతాల్లో వాడకంలోకి వచ్చాయి 
గొప్పవాడు లేదా అధికుడుగా భావింపపడ్డారు రెడ్లు.... 
73
వృత్తి ధర్మం ఐనప్పటికి దొర పటేలా అనేవి శాఖలుగా ఏర్పడకుండా సంభోదనలుగా మాత్రమే స్థిరపడ్డాయి 
జనమే తన జగముగా బతికిన వారు రెడ్లు 

▪️రెడ్ల గోత్రాలు - ఇంటిపేర్లు 

74
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రెడ్లల్లో మొత్తం పదివేల ఇంటిపేర్లు వున్నట్లు చరిత్ర కారులు పేర్కొంటున్నారు 
ఇంటిపేరు ఏదైనా రెడ్లంతా ఒక కుటుంబం.. 
75
ముదనోళ్ళ గావనోళ్ల కుంకునోళ్ల కుడిముళ్ళ కుంభాల మిడిమిళ్ళ పనుకుల మొదలగునవి రెడ్ల గోత్రాలు 
రెడ్లల్లో స్వగోత్రీకులు అన్నదమ్ములు.... 
76
రెడ్ల వంశంలో లక్షా 85 ఇండ్లపేర్లు - లక్షా 85 గోత్రములు
ఉన్నట్టు జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి 
రెడ్ల అనివార్యంగా చరిత్ర అనంతమైనది.... 

▪️రెడ్ల పేరుతో గ్రామాలు - వీరగల్లులు 

77
ధర్మపాలనకు త్యాగానికి సాహసానికి గుర్తుగా రెడ్లపేరుతో గ్రామాలు రహదారులు పూర్వం నుండే వెలిసాయి 
పాలించడానికైనా పలకరించడానికైనా రెడ్లే... 
78
గ్రామాలను పశుసంపదను క్రూర మృగాల నుండి కాపాడి రెడ్లు వీరగల్లులు అయ్యారని కూడా కథలు ఉన్నాయి 
ప్రజల్ని కాపాడి అమరులయ్యారు రెడ్లు... 
78
స్వాతంత్ర్య సమరయోధుడు కొండా వెంకటరంగారెడ్డి 
స్మృతిగా వారి పేరు మీద రంగారెడ్డి జిల్లా ఏర్పడింది 
రెడ్ల సేవలు చిరస్మరణీయం.... 

▪️ రాజకీయాల్లో రెడ్లు 

80
రాజకీయ వారసత్వాన్ని వ్యతిరేకిస్తూ నిస్వార్థంగా సేవలు అందించిన ప్రజానాయకుడు నీలం సంజీవరెడ్డి
నిరాడంబరత నిబద్దత రెడ్లకు కొత్తకాదు.... 
81
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశాడు రాయలసీమ ముద్దుబిడ్డ కోట్ల విజయభాస్కరరెడ్డి 
పదవుల పందేరంలో విజేతలు రెడ్లు.... 
82
ఖాదీ ప్రచారకుడుగా, గాంధేయుడుగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించాడు మర్రి చెన్నారెడ్డి 
సంకల్పంతో సమర్థులుగా ఎదిగారు రెడ్లు 
83
అవిటితనాన్ని అధిగమిస్తూ దేశంలోనే అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా ఎదిగి గెలిచాడు జయపాల్ రెడ్డి 
ఆత్మవిశ్వాసం రెడ్లకు పెట్టని ఆభరణం.... 
84
గాంధీ బోధనలకు ప్రభావితుడై జీవితాంతం ఖద్దరు ధరిస్తూ శాకాహారిగా బతికాడు కాసు బ్రహ్మానందరెడ్డి 
పట్టుదలే రెడ్లను ముందుకు నడిపించింది.... 
85
ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ పథకాలతో
పేదల జీవితాల్లో వెలుగునింపాడు వై ఎస్ ఆర్ - 
ప్రజలను కన్నబిడ్డలుగా భావిస్తారు రెడ్లు.. 
86
భారత కార్మిక రాజకీయ నాయకుడుగా శ్రమ జీవుల హక్కుల కోసం పోరాడాడు పి. జనార్దనరెడ్డి 
పేదల పక్షపాతులుగా నిరూపించబడ్డారు రెడ్లు.... 
87
తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళా హోమ్ మంత్రి పదవిని అధిష్టించి సంచలనం సృష్టించారు సబితా ఇంద్రారెడ్డి 
ఇంటినే కాదు రాజ్యాలను తీర్చిదిద్దారు రెడ్ల మహిళలు.... 
88
తెలంగాణా రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషిచేశాడు టీజెస్ పార్టీ వ్యవస్థాపకుడు ముద్దసాని కోదండరామిరెడ్డి 
లక్ష్య సాధనకై రెడ్లు దీక్షా పారాయణులు... 

▪️సంఘసేవలో రెడ్లు 
89
హరిజన విద్యార్థి ఉద్ధారక సంఘము, వసతి గృహము
మొదలగు సంస్థలు స్థాపించాడు నేదురుమల్లి నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి
సమతాభావన చాటిన సంఘజీవులు రెడ్లు 

90
విద్యా, సాంఘిక, సంక్షేమ కార్యక్రమాలతో ఎందరో జీవితాల్లో వెలుగునింపాడు మిఠాయిల పుల్లారెడ్డి 
మానవత్వం పరిమళించిన మహనీయులు రెడ్లు... 

▪️ కమ్యునిజంలో నిజాన్ని చూపెట్టిన రెడ్లు 

91
సమాజసేవ కోసం సంతానాన్ని వద్దనుకుని ఆస్తులను సైతం త్యాగం చేసాడు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి 
సంఘమే సర్వస్వంగా తరించారు రెడ్లు... 
92
ఉద్యమకారిణిగా రచయిత్రిగా మహిళాహక్కుల పోరాట యోధురాలుగా కృషి చేసింది కొండపల్లి కోటేశ్వరమ్మ 
సమాజం కోసం కుటుంబంగా భావించారు రెడ్ల మహిళలు
93
పాఠశాల రోజుల్లోనే సమాజములోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాడు తరిమెల నాగిరెడ్డి 
మనుషుల్లో మహనీయులుగా మిగిలారు రెడ్లు 

▪️విప్లవ బాటల్లో రెడ్లు 

94
 బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమం వారధిగా పాటుపడ్డాడు కొండపల్లి సీతారామిరెడ్డి 
ప్రజాపోరుకై సిద్దాంతం రచించారు రెడ్లు... 
95
విప్లవవాద విద్యార్ధుల ఉద్యమ స్థాపకుడుగా ఎదిగి విశ్వవిద్యాలయం సాక్షిగా అమరుడయ్యాడు జార్జిరెడ్డి 
విప్లవ పంథాను చిత్తశుద్ధిగా అనుసరించారు రెడ్లు 
96
నమ్మిన సిద్దాంతం కోసం అడవి బాటలో పయనించి మాతృనేలపై ఒరిగిన అరుణ పతాక పటేల్ సుధాకరరెడ్డి 
సంఘం కోసం విద్రోహుల ముద్రను భరించారు రెడ్లు 

▪️అవధూతలుగా రెడ్లు 

97
లీలా స్వరూపుడై అహంకార స్పృహను వదలి పరమాత్మ తేజస్సుతో భక్తి ప్రపంచాన్ని సృష్టించాడు కాశిరెడ్డి నాయిన 
ప్రతిఫలం ఆశించని ప్రమాణాలతో రెడ్లు బతికారు.... 
98
ఇహలోక సౌఖ్యాలను త్యజించి సాధు రూపుడై నిశ్చల మనస్సుతో యోగ సమాధి పొందాడు రామిరెడ్డి తాత 
మనసే దేవాలయంగా మహితాత్ములై వర్దిల్లారు రెడ్లు.. 

▪️వ్యాపార రంగంలో రెడ్లు 
 
99
రెడ్డీస్ ల్యాబరేటరీ పేరుతో బహుళజాతి ఔషదాల సంస్థను  
స్థాపించి ఎందరికో ఉపాధి కల్పించాడు డా. అంజిరెడ్డి 
బతుకుతూ బతుకును ఇచ్చేవారు రెడ్లు... 
100
భారత రిజర్వ్ బ్యాంకు గావర్నరుగా ఆర్థికాభివృద్ధిలో దేశాన్ని ముందుకు నడిపించాడు డా.వై వేణుగోపాల్రెడ్డి
వాణిజ్యం సంస్కరణల్లో మేధావులు రెడ్లు 
101
అణు విద్యుత్ ఉత్పత్తి సంస్థ "మెషిన్ టూల్ ఎయిడ్స్ అండ్ రికండిషనింగ్ "స్థాపించాడు పి. రవీందర్ రెడ్డి 
ప్రపంచస్థాయి వ్యాపారాల్లో రాణిస్తున్నారు రెడ్లు... 

▪️పత్రికా రంగంలో రెడ్లు 

102
1946లో గుల్బర్గా జైలు నుండి "పేట్రియల్ " లిఖిత పత్రికలో చేయూత నిచ్చారు నారాయణరెడ్డి రామిరెడ్డిలు 
ఆటంకాలను అధిగమించి అక్షరాన్ని బతికించారు రెడ్లు 
103
1947లో వరంగల్ నుండి "గ్రామజ్యోతి" గోడపత్రిక నడిపి సర్కారుకు సవాలుగా నిలిచాడు బొబ్బల ఇంద్రసేనారెడ్డి 
ధైర్యమే రక్షణ కవచంగా పనిచేసారు రెడ్లు... 
104
1951లో ప్రజావాణి పత్రికతో తన అక్షర గొంతుకను 
మరోసారి వినిపించాడు అక్షరయోగి సురవరం ప్రతాపరెడ్డి 
నెత్తుటి చినుకులే సిరా చుక్కలుగా బతికారు రెడ్లు 
105
 'వీచిక' అనే సాహిత్య మాసపత్రికను నడిపిన ఆస్తిక హేతువాది అభ్యదయ కవి గజ్జెల మల్లారెడ్డి 
అక్షర సేద్యంలో అద్భుతాలు పండించారు రెడ్లు... 

▪️కళా రంగాల్లో రెడ్లు 

106
సంప్రదాయ నృత్యరీతులకు సొగసులద్దుతూ కూచిపూడి నృత్యానికి ఖ్యాతి తెచ్చారు రాజా రాధా రెడ్డిలు 
అడుగులకు మాటలు నేర్పినవారు రెడ్లు 
107
దేశ విదేశాల్లో 3500కి పైగా అనేక ప్రదర్శనలిచ్చి మిమిక్రి కళకే వన్నెతెచ్చిన అద్వితీయ కళాకారుడు శివారెడ్డి 
గళమే బలమై జనావళికి వినోదం పంచుతున్నారు రెడ్లు 

▪️వివాదంలో రెడ్డి పదం 

108 
వృత్తి ధర్మానికి మారుపేరైన రెడ్డిపదాన్ని కొందరు కులగజ్జికి పర్యాయంగా వక్రీకరిస్తున్నారు 
ఆటుపోట్లు ఎదుర్కోవడం రెడ్లకు అలవాటు....
&
అజ్ఞానంతో అహంకారంతో రెడ్డి పదంపై
 అధముల ఎదురుదాడి మొదలయ్యింది
భరించి స్నేహ హస్తం అందిస్తున్నారు రెడ్లు.....

No comments:

Post a Comment