Tuesday, April 16, 2024

సుబ్బరాయలు రెడ్డియార్ ( మద్రాసు ప్రెసిడెన్సీ తొలి ముఖ్యమంత్రి )

సుబ్బరాయలు_రెడ్డియార్
(1855-1921)
( మద్రాసు ప్రెసిడెన్సీ తొలి ముఖ్యమంత్రి )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

చురుకైన మనస్తత్వం... 
ధీటైన వ్యక్తిత్వం... 
ముక్కుసూటి తనం... 
గుండె నిండా ధైర్యం... 
అతడే 
దివాన్ బహదూర్ అగరం సుబ్బరాయలు రెడ్డియార్ !
1920 డిసెంబర్ 17 నుండి 1921 జూలై 11 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా సుబ్బరాయలు రెడ్డియార్ జస్టిస్ పార్టీ నుండి పనిచేసారు. ముఖ్యమంత్రిని ప్రీమియర్ అనే వారు. ప్రీమియర్ సంప్రదాయం 1920 నుండి మొదలయ్యింది. 

జననం - బాల్యం :

సుబ్బరాయలు రెడ్డియార్ 15 అక్టోబర్ 1855 లో
సౌత్ ఆర్కాట్ కు చెందిన భూస్వామ్య సంపన్న రెడ్డియార్ కుటుంబంలో జన్మించాడు. సంపన్నులైన కుటుంబ సభ్యులు పేదలకు చేసే వివిధ దాన ధర్మాలు సుబ్బరాయలురెడ్డియార్ పై చిన్నతనం నుండే ప్రభావం 
చూపాయి. మనిషి బతకడానికి మనిషే ఏదో చేయాలనే ఆలోచన బాల్యంలోనే వారిలో అంకురించింది. 

చదువు - రాజకీయ ప్రవేశం :

చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నాడు. తరువాత యునైటెడ్ కింగ్‌డమ్‌లో న్యాయవిద్యను అభ్యసించాడు
అప్పట్లో న్యాయశాస్త్రం అభ్యసించడం అత్యంత ప్రతిష్టాత్మకం. ఈ క్రమంలో విదేశాల్లో న్యాయవిద్యను అభ్యసించి భారతదేశానికి తిరిగి వచ్చాడు కానీ న్యాయవాద వృత్తిలో కొనసాగడాని ఆసక్తి చూపలేదు. స్వతాహాగా రెడ్డియార్ అత్యంత చైతన్యశీలి. చెలాయించుకునే ధోరణి ఎక్కువ. పైగా పేరెన్నిక ఉన్న కుటుంబం. ఈ క్రమంలో సౌత్ ఆర్కాట్ జిల్లా రాజకీయాల్లోకిఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ నుండి ఒక యువశక్తిగా ప్రవేశించాడు. 

తొలి ముఖ్యమంత్రిగా అవకాశం :

1912 లో కడలూరు తాలూకా బోర్డు అధ్యక్షుడిగా పనిచేశారు. 
1917 లో సౌత్ ఆర్కాట్ జిల్లా బోర్డు అధ్యక్షుడయ్యాడు. రాజకీయంగా ఆయా పదవుల్లో కొనసాగుతున్న రెడ్డియార్ ఛరిష్మా ఎప్పటికప్పుడు పెరుగుతున్న క్రమంలో 1916 కాంగ్రెస్ పార్టీని విడిచి జస్టిస్ పార్టీలో చేరాడు. జస్టిస్ పార్టీలో కీలక భూమిక పోషిస్తూ ముందుకు నడిచాడు. 
నవంబర్ 1920 చివరలో మాంట్ఫోర్డ్ సంస్కరణల ప్రకారం మద్రాస్ శాసనసభకు మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. సహకారేతర ఉద్యమ సమయంలో దాని విధానంలో భాగమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ ఎన్నికలను బహిష్కరించింది.
మద్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ అధికారంలోకి ఎన్నికయ్యింది. 98 అసెంబ్లీ స్థానాల్లో 63 స్థానాలను గెలుచుకుంది. 
శక్తి యుక్తులకు మారుపేరైన సుబ్బారాయలు రెడ్డియార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి పదవితో పాటుగా విద్య, ప్రజా పనులు, ఎక్సైజ్ మరియు రిజిస్ట్రేషన్ వ్యవహారాల పదవులు ను నిర్వహించారు. 
ఆ విధంగా, మద్రాస్ ప్రెసిడెన్సీ మొదటి ముఖ్యమంత్రిగా సుబ్బరాయలు రెడ్డియార్ చరిత్రలో నిలబడిపోయారు. 
కానీ సుబ్బరాయలు రెడ్డియార్ ముఖ్యమంత్రిగా ఎంతోకాలం పనిచేయలేక పోయాడు. ఆరోగ్యం క్రమంగా క్షిణించింది. ఈ కారణంగా స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కొద్దికాలానికే నవంబర్ మాసం 1921 లో మరణించాడు.

#రెడ్డియార్ల_పరిచయం 

రెడ్డి + అర్ = రెడ్డియార్ అంటే రెడ్డి గారు అని అర్థం.  
పెద్దవాడు, గౌరవస్థుడు అని అర్థం.

తెలుగుప్రాంతాల్లో రెడ్డి అని పిలవబడుతున్న జాతి పాండిచ్చేరి కేరళ తమిళనాడు శ్రీలంక ప్రాంతాల్లో రెడ్డియర్స్ గా పిలువబడుతున్నది. 

పరిశోధకుల ఒక అంచనా ప్రకారం తెలుగు ప్రాంతాల నుండి జీవన అవసరాల రీత్యా వివిధ ప్రాంతాలకి వ్యాపంచిన రెడ్ల పేర్లు అనేవి...... వారు విస్తరించి ఉన్న ప్రాంతాల సంప్రదాయం జీవనశైలి ప్రకారం నిర్ణయించబడ్డాయి అని నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఏర్పడ్డవే రెడ్డి - కర్ణాటక రెడ్డప్ప - తమిళనాడు రెడ్డియార్ !  

తమిళనాడులో రెడ్డియార్ జనాభా ఉన్న జిల్లాలు గమనిస్తే... 
చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు, ప్రాంతాల్లో గణనీయంగా ఉన్నారు. 
అట్లాగే వెల్లూర్,తిరుపత్తూర్ , తిరువన్నమలై, క్రిష్ణగిరి, ధర్మపురి, పుదుచ్చేరి రోడ్, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచి , సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, కరూర్, పెరంబలూర్, తిరుచిరాపల్లి, దిండిగల్, మధురై, విరుధునగర్, తూతుకుడి మరియు తిరునల్వేలి ప్రాంతాల్లోనూ రెడ్డియార్లు విస్తరించి ఉన్నారు

రాజకీయ సామజిక మనుగడ కోసం.... ద్రావిడ రాజ్యంలో తమ వంశ కీర్తిని కొనసాగించడం కోసం ...ఇక్కడి రెడ్డియార్లు స్థానిక ఆలయ సమాజాలకు స్థానిక రాజకీయ ఆకాంక్షలకు మద్దతు ఇవ్వడంలో చురుకుగా ఉన్నారు. 

కొందరు రెడ్డియార్లు తమిళ సాహిత్య విస్తృతిలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. దాన ధర్మాలు చేయడంలో పేదలకు చేయూత ఇవ్వడంలో రెడ్డియార్ల ఉదారత చెప్పుకోదగినది. 
కొందరు రెడ్డియార్లు తమిళ భాష పండితులుగా ప్రాతినిధ్యం వహించారు.

#మద్రాసు_ప్రెసిడెన్సీలోరెడ్లు :

బ్రిటిష్ కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో ఇప్పటి తమిళనాడుతో పాటుగా ఆంధ్ర, కర్ణాటక, కేరళలలోని కొన్నిభాగాలు కలసి ఉండేవి.మద్రాస్ ప్రెసిడెన్సీ 1652 లో ఏర్పడి 1947లో అంతం అయ్యింది. ఈ క్రమంలో -
రాజకీయంగా #దివాన్_బహదూర్_అగరం_సుబ్బరాయలు_రెడ్డియార్ తర్వాత కూడా రెడ్లు తమ హవా కొనసాగించారు. 

ఒమండూర్_రామస్వా మి_రెడ్డియార్ వీరు 23 మార్చి 1947 నుండి ఏప్రిల్ 6, 1949 వరకు కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రిగా కొనసాగారు. వీరి ముఖ్యమంత్రి అధికారం బ్రిటిష్ ఇండియా నుండి స్వతంత్ర భారతానికి సంధి కాలంగా కొనసాగింది. 

#మద్రాసు_ప్రెసిడెన్సీ_తమిళనాడు 

1947 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పరిస్థితులు మారిపోయాయి. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 
భాషా ప్రాతిపదికన 1953లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. 
1968లో మద్రాసు రాష్ట్రానికి "తమిళనాడు" అని పేరు మార్చారు.  

#రెడ్డియార్_రాజులు 

తెలుగు రెడ్లు తమిళనాడుకు వలస వచ్చి 
రెడ్డియర్స్ గా స్థిరపడి అక్కడ రాజరికాన్ని సంపాదించుకున్నారు. జన్మతా ఎదురించి నిలబడగలిగే స్వభావం ఉన్న రెడ్లు రెడ్డియార్లుగా తమ రెడ్డి రాజవంశం విస్తరణను కాంచీపురం ప్రాంతాల వరకు కొనసాగించారని పరిశోధకులు భావిస్తున్నారు. 

కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందిన అనపోతారెడ్డి (క్రీ.శ 1335-1364) తన రాజ్యం ఆధిపత్యాన్ని ఉత్తరాన రాజమండ్రి, దక్షిణాన కంచి మరియు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించాడు. 
ఇదే 14 వ శతాబ్దంలో తమిళప్రాంతం వల్లియూర్ వద్ద జరిగిన యుద్ధంలో రెడ్డియాపురం సైన్యం ట్రావెన్కోర్ సైన్యాన్ని ఓడించింది.ఈ విషయం వల్లియూర్ మురుగన్ ఆలయ ప్రవేశద్వారం వద్ద ఉన్న సమాచార బోర్డులో -

"14 వ శతాబ్దపు వల్లియూర్ వార్ - రెడ్డియపురం సైన్యం వల్లియూర్ యుద్ధంలో ట్రావెన్కోర్ సైన్యాన్ని ఓడించింది " అని తెలుపబడింది. 

వల్లీయూర్ యుద్ధం తరువాత రెడ్డియార్స్ సముగరెంగపురం, సీలాతికులం మరియు తిరునెల్వేలి ప్రాంతమంతా స్థిరపడ్డారు.

ఇటు తెలుగు ప్రాంతాల్లో కొండవీటి రెడ్లు, అటు తమిళ ప్రాంతంలో రెడ్డియాపురం రెడ్లు, ఇద్దరూ దేశ భూభాగం మొత్తం ఆక్రమిస్తారేమో అని ఒక దశలో సమకాలీన రాజవంశాలు భయపడినట్టుగా కూడా పరిశోధకులు భావిస్తున్నారు. 

#రెడ్డిలు_రెడ్డియార్ల_పండుగలు 

తెలుగు ప్రాంతాల్లో రెడ్లు ఉగాది దసరా సంక్రాంతి వంటి పండుగల్ని ఘనంగా జరుపుకుంటూ తెలుగు సాంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తారు..

కాగా తమిళ ప్రాంతానికి చెందిన రెడ్డియర్స్ మాత్రం థాయ్ పొంగల్, ఉగాది పండుగల్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో తమిళం తెలుగు రెండూ సాంస్కృతిక ప్రమాణాలను అనుసరిస్తారు. రెడ్డియార్లు తమిళ భాషతో పాటుగా తెలుగు కూడా మాట్లాడుతారు.ఈ సంస్కృతీ సంప్రదాయాలను బట్టి కూడా తెలుగు రెడ్లే తమిళ రెడ్డియార్లు అనే అంచనా బలపడుతున్నది. 
__________________________________
ఆధారం -
1) జస్టిస్ పార్టీ గోల్డెన్ జూబ్లీ సావనీర్. 1968.
2 ) reddyars history

No comments:

Post a Comment