Tuesday, April 16, 2024

క్యాసంబల్ల చెంగల్రాయరెడ్డి ( కేసిరెడ్డి ) ( కర్ణాటక తొలి ముఖ్యమంత్రి )

క్యాసంబల్ల చెంగల్రాయరెడ్డి ( కేసిరెడ్డి )
 ( 1902 - 1976 )
( కర్ణాటక తొలి ముఖ్యమంత్రి )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : డా తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

భారత స్వతంత్ర్య సమర జ్వాల... 
విప్లవోద్యమ భావుటా...
తిరుగులేని కన్నడ రాజకీయ శక్తి... 
చెంగల్రాయరెడ్డి !!
కర్ణాటక రాజకీయాల్లో తనదైన ముద్రను వేసిన చెంగల్రాయరెడ్డి... 1902, మే 5 న కర్ణాటక రాష్టం కోలార్ జిల్లా క్యాసంబెల్లిలో వొక్కలిగ రెడ్డి కుటుంబంలో జన్మించారు. ఊరిపేరుతోనే క్యాసంబెల్లి చెంగల్రాయరెడ్డిగా ప్రసిద్ధి గాంచి జన్మభూమి ఋణం తీర్చుకున్నాడు.

▪️ప్రజాపక్ష నేతగా....రైతు పక్షపాతిగా  

 విద్యార్థి దశ నుండి విప్లవోద్యమ నాయకుడుగా ఎదిగాడు.. న్యాయశాస్త్రంలో పట్టా పొందిన తరువాత రాజకీయ శక్తిగా అవతరిస్తూ...మైసూర్ రాచరిక రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రజా ప్రభుత్వాన్ని సాధించడమే లక్ష్యంగా..దివాన్ల పాలనను ముగించాలని ప్రకటన చేస్తూ... 1930 లో " ప్రజాపక్ష " పేరుతో (పీపుల్స్ పార్టీ) ను స్థాపించారు. ప్రజాపక్ష పార్టీ రైతుల సమస్యలకు ప్రాముఖ్యత ఇచ్చింది. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతుల మద్దతు కూడగట్టుకుని రైతుల పార్టీగా వేళ్లూనుకుపోయింది. ఫలితంగా రైతు పక్షపాతిగా కేసిరెడ్డి ఎదురులేని ప్రజాబలాన్ని కూడగట్టుకున్నాడు

" ప్రజా మిత్ర మండలి " అనే సంస్థ కేసిరెడ్డికి మద్దతు ఇచ్చింది. ప్రజాపక్ష పార్టీ తన రాజకీయ మనుగడ కోసం పావులు కదుపుతూ ప్రజామిత్ర మండలితో కలిసి 1934 లో 'ప్రజా సమాఖ్య పక్ష ' (మైసూర్ పీపుల్స్ ఫెడరేషన్) ను ఏర్పాటు చేసింది. ఇవి ఎదురులేని ప్రజా సంయుక్త సంస్థగా పేరు తెచ్చుకున్నాయి.

1935 నుండి 1937 వరకు కేసిరెడ్డి ప్రజా సమాఖ్య పక్ష 'పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత తమ రాజకీయ అవసరాల రీత్యా " ప్రజా సమాఖ్య పక్ష " భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం అయ్యింది.కేసిరెడ్డి రాజకీయంలో చక్రం తిప్పుతూ... ప్రజాభిమానాన్ని చూరగొంటూ... 1937–38 & 1946–47లలో రెండుసార్లు మైసూర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
 
▪️భారత స్వాతంత్ర్య ఉద్యమంలో :

ప్రజాపక్ష లోనూ, ప్రజా సమాఖ్య పక్ష లోనూ , భారతజాతీయ కాంగ్రెస్ లోనూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కేసిరెడ్డి అవిశ్రాంతంగా కేసిరెడ్డి శక్తి వంచన లేకుండా పనిచేశాడు. 

శివపూర్ కాంగ్రెస్‌లో జెండా ఉద్యమంలో పాల్గొని సిద్దలింగయ్య, నిజలింగప్పతో పాటు జైలుకెళ్లారు.

▪️కర్ణాటక_తొలి_ముఖ్యమంత్రిగా

కెసిరెడ్డి మైసూర్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా 1947లో ఎన్నికయ్యాడు. 1952 వరకు ప్రజానాయకుడుగా మైసూర్ ముఖమంత్రిగా పనిచేశాడు.తరువాత అది కర్ణాటక రాష్ట్రంగా మారింది. బెంగళూరును రాజధాని నగరంగా మార్చారు. " విధానసౌధ " శంకుస్థాపన కూడా చేశారు.

▪️మైసూరు ఉద్యమం :

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మైసూరు రాష్ట్రంలో మహారాజుల పాలన కొనసాగింది. ప్రజాభిప్రాయాలకు విలువ లేని రాజరిక వ్యవస్థను కేసిరెడ్డి నిరసించాడు. ఈ నేపథ్యంలోనే మైసూర్ ఉద్యమం చేపట్టాడు .కన్నడ రాజకీయ చరిత్రలో ఛలో మైసూర్ ఉద్యమం ప్రతిష్టాత్మకమైనది.వీరి నేతృత్వంలోనే మైసూర్ చలో ఉద్యమం జరిగింది.1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, మైసూర్ రాష్ట్రంలో బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ చలో మైసూర్ ఉద్యమం ఊపందుకున్నది. ఉద్యమం తనదైన రాజకీయ చతురతని ప్రదర్శించాడు. యువతని పెద్ద ఎత్తున ఉద్యమం వైపు మళ్ళించాడు. రాచరిక పోకడలు అంతమొందించి...ప్రజాస్వామ్య అమలు కోసం ప్రజా సమీకరణ చేశాడు. అందరిని ఐక్యవేదిక మీదికి రప్పించి పోరుబాట పట్టించాడు. సుమారు 7 వారాలపాటు అలుపెరుగని తీవ్ర ఉద్యమం జరిగింది. కేసిరెడ్డి కృషి ఫలించింది. ఫలితంగా మైసూర్ మహారాజు తన రాజరిక పాలనను విడిచిపెట్టి, ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడానికి అనుమతించాడు. ఈ పరిణామం భారత దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పుల్ని ప్రవేశపెట్టింది

▪️రాజకీయ ప్రస్థానం :

మైసూర్ కాంగ్రెస్ 6వ అధ్యక్షుడిగా పనిచేశాడు.
1941లో శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ నాయకుడిగా తిరుగులేని ప్రతిష్ట సంపాదించుకున్నాడు.

భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడుగా తన సేవలు అందించాడు .

బంగారుపేట నుండి 1952లో మైసూరు శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

1952 నుండి 1957 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసాడు.

1957 నుండి 1962 వరకు కోలార్‌ లోక్ సభకు ప్రాతినిధ్యం వహించాడు. 
ఈ కాలంలోనే కేంద్ర గృహనిర్మాణ - సరఫరా శాఖ మంత్రిగా పనిచేశాడు. 
ఇదే కాలంలో కేంద్ర వాణిజ్య - పరిశ్రమల మంత్రి కూడా పనిచేశారు. 

రాజకీయాల్లో అవిశ్రాంతంగా ముందుకు సాగుతూ 1965 నుండి 1971 వరకు మధ్యప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.

▪️శివైక్యం :

ఫిబ్రవరి 27, 1976 లో తన 73 వ ఏట కేసి రెడ్డి శివైక్యం పొందారు.

▪️శతాబ్ది వేడుకలు

 ''కేసి రెడ్డి జన్మదిన శతాబ్ది వేడుకలు 2002 లో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ప్రశంసించడం ఒక్కటే కాదు, ప్రజా సంక్షేమం కోసం కేసి రెడ్డి పేరిట ప్రణాళికలు కూడా రూపొందించబడ్డాయి. 

▪️కేసి_రెడ్డి_వారసులు 

 కేసి రెడ్డి మనువరాలు వసంత కవిత కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం కొనసాగుతున్నారు. కేసి రెడ్డి పేరిట ప్రజా ప్రయోజనాలను ఆమె నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. 

▪️కేసి_రెడ్డి_పేరుతో_నిర్మాణాలు 

కర్ణాటకలో పలు ప్రభుత్వ ప్రయివేటు భవనాలకు కేసి రెడ్డి పేరు నిర్ణయించారు. కర్ణాటక రాష్టంలో వివిధ ప్రాంతాల్లో కొన్ని రహదారులకు కూడా కేసి రెడ్డి పేరు ఉన్నది. 


No comments:

Post a Comment