Wednesday, June 19, 2019

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు

కుశల కుమారి కథలు -1
°°°°°°°°°°°°°°°°°°°°°✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
నవ్వడం ఒక భోగం..
నవ్వించడం ఒక యోగం..
నవ్వకపోవడం ఒక రోగం... అన్నాడు  మహానుభావుడు జంధ్యాల గారు !అయితే ఎదుటి వాళ్ళను నవ్వించడానికి హాస్యాన్ని ప్రదర్శించేవాళ్ళు వేరు ! ఈ ఆరోగ్యకరమైన హాస్యానికి విరుద్దంగా తమ విపరీత ప్రవర్తనలతో ఎదుటి వారిని పీడిస్తూ.. ఎవ్వరికీ అర్థం కానీ తీరులో గ్రహాంతర వాసులుగా అగుపిస్తూ... చివరకు  ఎదుటివారి దృష్టిలో కామెడీ పీసులుగా ముద్రపడి పోవడం వేరు ! ఈ రకం వ్యక్తులు
నెత్తినొప్పి గాళ్ళు. మన నెత్తిని బొప్పి గట్టిస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళను గుర్తుకు చేసుకుని అప్పుడప్పుడు కాస్తా నవ్వుకుంటే మనసుకు హాయిగా ఉంటుంది.  నిజం ! మరే  కామిక్ పుస్తకాలు అవసరం లేనంతగా వీరి ప్రవర్తన ఉంటుంది  మరి !. ఒట్టు ! బాగా పరిశీలించండి. మన చుట్టే బోలెడుమంది ఈ తరహా హాస్య నటులు కనిపిస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళ కారణంగా ఆ సమయానికి బాధ పడ్డా, చివరకు నవ్వుకోడానికి ఒక పాత్ర దొరికిందిలే అనిపిస్తుంది.  ఏరి కోరి ఇట్లాంటి   వింత విడ్డురాలను మీకు  పరిచయం చేస్తాను. నాకు ఎదురైనా ఈ కొందరు  టముకు టమారా బిల్లి బిత్తిరి డిప్పేం గాళ్ళు  అమాయకులు అస్సలు కారు. కొంపలు కాల్చి వచ్చే  కొరివి గాళ్ళు. వీళ్ళు కొన్నిసార్లు ఎదుటివాళ్లను తీవ్రంగా మనసు నొప్పించ వచ్చును కూడా. అయినా ఫర్వాలేదు. హాస్యానికి బాగా సూటయ్యారు కదా.. ఆ కథలు ఏందో ఒకసారి చూసొద్దాం.
😅😀🤣😄😁
ఆమె ఒక బామ్మ!  ఎవ్వరినీ ఓర్చుకోలేని పురుగు. అందుకే.. ఒకే ఇంట్లో పై అంతస్థులో
ఒంటరిగా ఉంటుంది. కింది అంతస్థులో కొడుకు కుటుంబం ఉంటుంది. ఒకే కాంపౌండ్ అయినా ఒకరితో ఒకరికి సత్సంబంధాలు తక్కువ. 
బామ్మగారి పేరు....
గుణవతి... బాలాకుమారి.. అందావతి...ఏదో ఒకటి అనుకుందాం. ఎందుకంటే క్యారెక్టర్ కు అన్నీ సూటవుతాయి. నేను బామ్మ కాదు,  ఇంకా భామనే అనుకునే ఈవిడ గారి  పిల్లలకు పెళ్ళిళ్ళయి, మనుమలు మనుమరాండ్రు ఒక వయసుకు వచ్చినప్పటికీ. ..' ఆ.. ! నా వయసెంతని !? '' అంటూ  అందంగా సరిపెట్టుకుంటుంది. ఇదేమైనప్పటికీ ... అస్సలు ముచ్చటకు వస్తే... వాళ్ళ ఇంట్లో చెప్పుల అల్మారా ఒకటి వృధాగా పడి ఉన్నది. తాళాలు ఎక్కడో పడిపోవడం వల్ల  గత పదహైదు ఏండ్ల నుండి ఆ  చెప్పుల అల్మారా సడి సప్పుడు కాకుండా ఉన్నది. ఒకానొక రోజు బామ్మ  గారి అబ్బాయిగారు మెకానిక్ ని  పనిగట్టుకు వెంటేసుకొచ్చి ఆ అల్మారా తెరిపించాడు.  వాస్తవానికి ఎప్పుడో ఆ పని చేయాల్సింది. కానీ పనుల్లో బడి నిర్లక్ష్యం చేయడం వల్ల 15ఏండ్ల తర్వాత ఆ అల్మారకు మోక్షం లభించింది. కాగా సమయానికి బామ్మ గారు ఇంట్లో లేరు.
       అల్మారాలో పాత చెప్పులు జతలు చాలా బయటపడ్డాయి. వాటిల్లో ఒక గులాబీ రంగు చెప్పులు ఆ ఇంటి మనవరాలికి తెగనచ్చేసాయి. ఆ పిల్ల వయసు కూడా 15 ఏండ్లు. అంటే ఆ పిల్ల పుట్టినప్పుడో... అంతకు ముందు ఎప్పుడో తెచ్చుకున్న చెప్పులు అన్నమాట. అవి ఎప్పుడు తెచ్చుకుంటేనేం... నచ్చిన ఆ జోళ్లను ఆ పాప ఎంచక్కా తొడుక్కుంది. సాయంకాలానికి బామ్మ వచ్చేసింది . మనవరాలి కాళ్లకు చెప్పులు చూసింది. అవి తనవిగా గుర్తు పట్టేసింది. అల్మారా తెరిచారని పసిగట్టేసింది. అంతేకాదు, తన చెప్పులు తన అనుమతి లేకుండా మనవరాలు తొడుక్కోవడం అస్సలు సహించలేకపోయింది. అట్లాగే తను లేకుండా చెప్పుల తెరిపించినందుకు కొడుకు మీద అంతెత్తు ఎగిరింది. అక్కడ ఒక నేరమో ఘోరమో జరిగిపోయినట్టుగా చాలా సేపు రుసరుస లాడుతూనే ఉండిపోయింది. చివరకు మనవరాలిని దొరక్కపుచ్చుకుంది. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఇట్లా 👇 కొనసాగింది.
'' ఒకరి వస్తువుల్ని అడక్కుండా ముట్టుకోవద్దనే డిసిప్లిన్ మీ అమ్మ నేర్పించలేదా? ''
''..... '' ఆ పాప ఏం మాట్లాడలేదు.మనసులో మాత్రం ''మీరు మా నాయనమ్మ కదా... మిమ్మల్ని అడగడం ఎందుకు అనుకున్నా '' అనుకుంది.
'' ఆ చెప్పులు నాకు  చాలా ఇష్టం. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న.వాటిని ఎవ్వరు తొడుక్కున్న నేను ఒప్పుకోను... ''
''.....'' అప్పటికి ఆ పాప పాపం ఏం మాట్లాడలేదు.మళ్ళీ మనసులోనే '' మా ఫ్రెండ్స్ నాయనమ్మలు పిల్లలకు మించింది ఏమి లేదని అన్నీ ఇచ్చేస్తారు '' అనుకుంది.
''  ఇంకెప్పుడు నా చెప్పులు తొడుక్కోవద్దు. నీకు అంత ఇష్టం అనిపిస్తే నా పర్మిషన్ తీసుకో. కాసేపు వేసుకుని వదిలేద్దువు గానీ... ''
'' సరే " తలాడించింది పాప.
'' అన్నట్టు... నేను మాట్లాడింది ఏదీ మీ ఇంట్లో చెప్పొద్దు.... '' అంది నాయనమ్మ.
పాప  తర్వాత కిందకు వచ్చేసింది. ఇంక ఆరోజు సాయంత్రం నుండే ఆ చెప్పులు కనిపించడం లేదు. పాపకు ఏడుపు వచ్చింది. పాప ఏడుస్తుంటే నాయనమ్మ చూసింది కూడా. కానీ కిమ్మనలేదు.
అంతా గమనిస్తున్న ఆ ఇంటి కోడలికి మాత్రం అంతా అర్థం అయ్యింది. కానీ నోరు మెదపలేదు 
      వారం రోజులు గడిచిపోయాయి. పాప చెప్పుల కోసం వెదుకుతూనే ఉంది. అట్లాంటి చెప్పులు కావాలని తన డ్యాడీని వెంటేసుకుని షాపులు కూడా తిరిగింది. కానీ దొరకలేదు. అందుకే మనసు చిన్నబుచ్చుకుని బయట వాకిట్లో ఉయ్యాల  మీద కూర్చుని ఉంది. సరిగ్గా అప్పుడే  మేడపై నుండి నాయనమ్మ దిగుతూ కనిపించింది. ఆమెతో పాటుగా ఆమె తొడుక్కున్న
గులాబీ రంగు చెప్పులు కూడా కనిపించాయి.
పాపకు ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది. నోట మాట మరిచి నాయనమ్మనే చూస్తూ ఉండిపోయింది.
    నాయనమ్మ వయసు 80 పైనే. ఆ చెప్పులు వంకర్లు తిరిగిన ఆమె పాదాలకు సెట్టవ్వలేదు. బలవంతంగా పాదాలను చెప్పుల్లో ఇరికించుకుని అట్లా గేటు దాటిందో లేదో చెప్పు ఒకటి తెగింది. అస్సలే పాత చెప్పులు. పైగా నాసిరకం. మన్నిక ఏముంటుంది? అయినప్పటికీ కొంపలు మునిగినట్టుగా బావురుమంటూ... మనవరాలి వైపు తిరిగిచూస్తూ.... '' నేను అర్జన్టుగా వెళ్ళాలి. నీ చెప్పులు ఉంటే పట్రా... '' కేకేసింది.
అదివిన్న కోడలు ఇంట్లోంచి గభాల్న బయటకు వచ్చి....'' తన చెప్పులు ఒకరు తొడుక్కోవడం పాపకు నచ్చదు అత్తయ్య గారు ''  సున్నితంగా చెప్పింది.
అంతే... !
అత్తగారి నోట్లోంచి మళ్ళీ మాటలేదు...
            ( మొట్టికాయ్ పడనీ... )

2 comments:

  1. http://simhapurihospitals.com/

    ReplyDelete
  2. Master Health Checkup Package at Simhapuri Hospitals
    http://simhapurihospitals.com/health-packages/#master-health-checkup-package

    ReplyDelete