Tuesday, April 16, 2024

చరిత్ర మరిచిన సాయుధపోరాట వీరులు

చరిత్ర మరిచిన సాయుధపోరాట వీరులు
 °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

తెలంగాణ సాయుధ ప్రజా పోరాటంలో ఎందరో రెడ్లు ప్రాణాలకు తెగించి పోరాడారు. వీరి త్యాగాలు మరుగున పడిపోవడం బాధాకరం. సాయుధ ప్రజా ఉద్యమకారుడు కల్లూరి భద్రారెడ్డి స్వయంగా తన జీవిత చరిత్రలో " ఈ అమర వీరుల గురించి ఏ కమ్యూనిస్టు రచయితలు వ్రాసిన దాఖలాలు లేవు " అనడం ఈ కఠోర వాస్తవాన్ని రూఢీ చేస్తున్నది.

1. రాపోలు కొండల్ రెడ్డి ( నల్గొండ జిల్లా సైదాపురం )
2.క్యాసారం ముత్యంరెడ్డి ( నల్గొండ జిల్లా సైదాపురం )
3. దుంబాల రాంరెడ్డి (నల్గొండ జిల్లా సైదాపురం )
4. కొండి రాంరెడ్డి ( ప్రస్తుతం యాదాద్రి జిల్లా ధర్మారెడ్డి గూడెం )

▪️వివరాల్లోకి వెళ్తే....

సైదాపురం గ్రామపెద్దలు మాలీ పటేల్ రాపోలు కొండల్ రెడ్డి , క్యాసారం ముత్యంరెడ్డి, దుంబాల రాంరెడ్డి గార్లు.
గ్రామంలో శాంతి భద్రతలు, ఐక్యత, వీరి లక్ష్యం.ఈ క్రమంలో మొదటినుండి కూడా గ్రామంలో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా , ముగ్గురిలో ఎవ్వరో ఒకరి ఇంటి తలుపులు తట్టేవారు. కాదనకుండా లేదనకుండా సాయం కోరి వచ్చిన ప్రజలకు పెద్దలు వెన్నుదన్నుగా నిలబడేవారు.

ఈ పెద్దమనుషులకి సర్కారుతో స్నేహపూర్వక సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కానీ ఇది తటస్థం.

ముఖ్యంగా 1947 డిసెంబర్ నాటికి సాయుధ పోరాటం క్రమంగా ఊపందుకుంటున్నది. క్రమంగా పరిసర ప్రాంతాల్లోనే కాదు సైదాపురం గ్రామంలోనూ రజాకార్ల ఆగడాలు చెదురు మదురుగా ఆరంభం అయ్యాయి. గ్రామాల్లో రజాకార్లు సృష్టించే అలజడికి, 
చేసే అల్లర్లకు, పాల్పడే దొంగతనాలకు, దగా పడ్డ ప్రజలను పెద్దమనుషులు ఎప్పటికప్పుడు తమ వంతుగా ఆదుకుంటున్నారు.

సాయుధ దళాలకు సహకరించడానికి పెద్దమనుషులు మొదట ఒప్పుకోలేదు. ఆంధ్రమహాసభతో సంబంధం లేకుండా తమ గ్రామంలో రక్షణ దళాలు ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారు. 
 
ఇటువంటి పరిస్థితుల్లో సైదాపురం ప్రాంతంలో దళాలు తమ కార్యకలాపాలు జరుపుకోవాలి అంటే గ్రామపెద్దల అండదండలు కావాలి. అందుకే సైదాపురం దళంలో ఉన్న పిన్నపురెడ్డి వెంకటరెడ్డి, కల్లూరి భద్రారెడ్డి గార్లచొరవతో ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు గ్రామపెద్దలను కలిసాడు. ప్రభుత్వం తీరు తెన్నులను వివరిస్తూ సుధీర్ఘ మంతనాలు చేసాడు. ఫలితంగా " ప్రజల క్షేమం కోసం " ముగ్గురు గ్రామ పెద్దలు ఆరుట్ల రామచంద్రారెడ్డి దళానికి వెన్నుదన్నుగా నిలబడ్డారు.

▪️సాయుధ పోరాటంలో తమ వంతుగా...

ప్రభుత్వం తరుపున అధికారులు ఎప్పట్లా దౌరాలకు వస్తున్నారు. బలవంతపు ఎప్పట్లా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎప్పట్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందుకు పెద్దమనుషులు ఒక నిర్ణయానికి వస్తూ గ్రామాల్లోకి వచ్చే అధికారులను ఉద్దేశ్య పూర్వకంగా దూరం పెట్టడం మొదలెట్టారు. ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తూ, గ్రామ రక్షణ కోసం యువకులను సంఘటితం చేయసాగారు. 

▪️ప్రభుత్వ పన్నాగం

గ్రామపెద్దలు ఆంధ్రమహాసభకు సహకరిస్తున్నారు అనే విషయం రాజాకార్లకు అర్థం అయ్యింది ..అగ్గిమీద గుగ్గిళం అయ్యారు. విషయం ప్రభుత్వం దాక కూడా వెళ్ళింది.. కాగా అప్పటికకే నిర్ణయాలు తీసుకోవడానికి.. అమలు చేయడానికి.... ప్రభుత్వం రజాకార్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉన్నది. ఈ క్రమంలో సైదాపురం ముట్టడించాడానికి రజాకార్లు సన్నద్దులు అయ్యారు. సైదాపురం కొరియర్ ద్వారా దళానికి వార్త చేరింది. అట్నుంచి ఊరి పెద్దమనుషులకు వర్తమానం అందింది.

రజాకార్లు వస్తున్నారు అని తెలిసి అందరూ అప్రమత్తం అయ్యారు. రజాకార్లు గ్రామంలోకి ప్రవేశించే మార్గాన్ని ఆఘమేఘాల మీద మూసేశారు. ఇందులో భాగంగా ఊరికి మైలు దూరంలో కట్టు కాల్వ దగ్గర దారికి అడ్డంగా తాటి చెట్లు , కంప చెట్లు, నరికి వేశారు.అయినప్పటికీ దొంగమార్గాల నుండి రజాకార్లు ఊర్లోకి ప్రవేశిస్తే 
ఊరి కచేరి దగ్గర వున్న బురుజు మీద నుంచి గాని, కొండల్ రెడ్డి గారి బంగ్లాపై నుంచి గాని పసిగట్టి 
నాటు తుపాకులతో ఎదిరించాలని సిద్ధపడ్డారు.

కానీ ఆరోజు రజాకార్లు ఊర్లోకి రాలేదు.మరుసటి రోజున ఉదయం లారీలపై పెద్దఎత్తున తరలి వచ్చారు.అడ్డంకులని తొలగించుకొన్నారు . వరదలా దూసుకు వచ్చిన రజాకార్ల సైన్యాన్ని చూసిన ఊరి జనం ఒక్కసారిగా భయపడింది బతుకు జీవుడా అనుకుంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని సమీపంలో ఉన్న గుట్టలవైపు చెట్లల్లోకి దౌడు తీసింది .

దళ సభ్యులు ప్రతి దాడికి బందూకులతో సిద్ధంగా వున్నాం .కానీ రజాకార్లు తెలివిగా ప్రవర్తిస్తూ ప్రభుత్వం తరుపున రాయభారానికి వచ్చినట్టుగా తహసీల్దార్ సమక్షంలో నమ్మించారు. అప్పటికి వేరేచోట గ్రామ ప్రజలతో కలిసి ఉన్న కొండల్ రెడ్డి , ముత్యంరెడ్డి ,రాంరెడ్డి గార్లు సర్కారు వాళ్ళ రాయభారం ఏమిటో తెలుసుకోదలిచారు. దళం కూడా సర్కారు రాయభారంగా నమ్మింది. కానీ రజాకార్ల పన్నాగాన్ని పసిగట్టలేక పోయింది.

గ్రామ పెద్దలు,రజాకార్లు, తహసిల్దారు ఆతని సిబ్బంది , కొందరు సాయుధులుఅందరూ కొండల్ రెడ్డి బంగ్లాలోకి వెళ్లారు. కొండల్ రెడ్డి తహశీల్దారుకు ఆత్మీయ స్వాగతం పలికాడు.తహశీల్దారు మాత్రం కోపంగా ఉన్నాడు. . కొండల్ రెడ్డిని సూటిగా కొర కొరా చూస్తూ ఉర్దు భాషలో ఆగకుండా అడ్డమైన భూతులు తిట్టాడు.అప్పటికి చల్లారని కోపంతో రజాకార్లకు సైగ చేసాడు. వాళ్ళు వెంటనే కొండల్ రెడ్డిని తాళ్లతో బంధించి ప్రక్కకు తీసికెళ్ళి రకరకాలుగా భయంకరంగా హింసించారు. ఒక్కడైన కొండల్ రెడ్డి ఎదురు తిరిగే ప్రయత్నం చేసినప్పటికీ అసహయుడు అయ్యాడు.

తర్వాత అనుకున్న ప్రకారం తహసీల్దార్ ఆ ముగ్గురిని రాజద్రోహులుగా ముద్రవేసాడు. అదేరోజు ఆలేరు పోలీసు రాణాకు పట్టుకుపోయారు .

నమ్మించి మోసం చేసిన నిజాం సర్కారు మోసానికి ప్రజలు ఆందోళన చెందారు. ఇంకేం విపరీతం జరుగుతుందో అనే భయం అనివార్యంగా మొదలయ్యింది. బిక్కు బిక్కు మనసాగారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఏ అర్ధరాత్రి రజాకార్లు విరుచుకు పడుతారో అంచనా వేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా మారిపోయిన గ్రామ వాతావరణాన్ని తట్టుకోలేక ప్రజలు గుట్టల్లోనే తలదాచుకున్నారు.

మరోవైపు గ్రామ పెద్దలు రాజద్రోహులుగా హింసించబడటం సాయుధ దళాలను తీవ్రంగా క్రుంగదీసింది.

▪️ఠాణాలో పెద్ద మనుషులు 

గ్రామపెద్దలు ముగ్గురులో దుంబాల రాంరెడ్డిని ప్రభుత్వం ముసిరాబాద్ జైలుకు పంపింది.

రాపోలు కొండల్ రెడ్డి , క్యాపారం ముత్యంరెడ్డి ఇద్దరిని ఠాణాలో బంధించి ఉంచారు . అదిచూసి పెద్దమనుషులు తమను వదిలి పెడుతారు అనుకోలేదు. ఠాణాలో పరిస్థితులను బట్టి ఏదో విపరీతం ఖచ్చితంగా జరగబోతుంది అంచనా వేసుకున్నారు. అయినా భయపడలేదు.

" ప్రజలకు మద్దతుగా ఉన్న ఆంధ్రమహాసభకు సహకరించాం. మంచిని ప్రోత్సహించాం కాబట్టి మంచి జరుగుతుంది " లోలోపల భావించారు.

గ్రామ ప్రజలు మాత్రం విషయం తెలిసి మరింత భయపడ్డారు. బాధ పడ్డారు. తమకు గ్రామంలో అన్ని విధాలా అండదండలు అందించే తమ పెద్ద మనుషులకు రాజాకార్లు కీడు తల పెట్టవద్దని ఇష్ట దైవాలని మొక్కుకున్నారు. 

దళాలు మాత్రం ఏ మాత్రం అవకాశం ఉన్నా కొండల్ రెడ్డి ముత్యం రెడ్డిలను పోలీసుల నుండి తప్పించాలని ప్రయత్నం చేసింది. కానీ విఫలం అయ్యింది.

▪️కొండల్ రెడ్డి, ముత్యంరెడ్డిల సజీవదహనం

28- 1- 1948
అనుకున్న సమయానికి రజాకార్లు పెద్దమనుషులు ఇద్దరిని నల్గొండ జిల్లా కొలనుపాక సమీపాన గల వెంకటాపురం , గ్రామం శివారుకు తీసుకు వెళ్లారు.అక్కడ గడ్డివాములు ఉన్నాయి. వెంకటాపురం ప్రజలు నిస్సహాయులై ఎక్కడో దూరంగా నిలబడి ఉన్నారు. ఆక్రోషాన్ని ఆవేశాన్ని లోలోపలే చంపుకుంటున్నారు.

" గ్రామాన్ని ఏకత్రాటి మీద నడిపించే సత్తా ఉన్న వాళ్ళు తమ చేయి దాటిపోతే ఎంత ప్రమాదమో , చేయి దాటిన వాళ్ళను క్షమించి వదిలి పెడితే అంతకన్నా ప్రమాదం " అని భావించిన ప్రభుత్వ కఠిన నిర్ణయం ప్రకారం రజాకార్లు తమ దాష్టీకానికి అక్కడ అంతా సిద్ధం చేసుకుని ఉన్నారు.

క్షణాలు గడుస్తున్నాయి....
పెద్దమనుషులకి పరిస్థితి మొత్తం అర్థం అయ్యింది....
తమ చుట్టూ పరుచుకున్న మృత్యువలయాన్ని నిశ్శబ్దంగా మనసుతోనే స్పృశించుకున్నారు.....

రజాకార్లు యమదూతలై ముందుకు వచ్చారు. తాళ్లతో పెద్ద మనుషుల కాళ్ళు చేతులు మరింత బిగించి కట్టారు.
ఆ తర్వాత......
ప్రకృతి సాక్షిగా......
వణుకుతున్న ప్రజల సాక్షిగా...
ఇద్దరినీ ఎత్తి గడ్డివాములోకి పడవేశారు.
 ఆ తక్షణం కరాళకేళి మొదలవుతూ గడ్డి వాములు భగ్గుమన్నాయి.
చావు కేకలు పరిసరాల్లో ప్రతిధ్వనిస్తుంటే పెద్దమనుషులు ఇద్దరూ ఘోరంగా సజీవ దహనం అయ్యారు.
ఇది తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో తొలి సజీవ ప్రాణ త్యాగం.

▪️కొండల్ రెడ్డి కుటుంబం త్యాగాలకు పెట్టింది పేరు

కొండల్ రెడ్డి కుటుంబం మొదటి నుండి పోరాటాలకు పెట్టింది పేరు. కొండల్ రెడ్డి మనవడు వీరరాజారెడ్డి. 
జమ్మూ కశ్మిర్ లో కెప్టెన్ గా పనిచేస్తూ పాకిస్తాన్ సైనికుల తుపాకీ తుపాకీ తుటాలకు బలై పోయాడు. రాజొరీ జిల్లా వద్ద జూలై 31,2002న పాకిస్తాన్ శత్రు మూకలు దేశంలోకి జొరబడి దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేసాయి. ఆపద పసిగట్టిన రాజారెడ్డి అప్రమత్తం అయ్యాడు. నిర్భయంగా ఎదురుతిరిగాడు.పోరాట సూరీడై చండప్రచండంగా చెలరేగిపోయాడు.50 తుటాలు తన శరీరాన్ని చిదిమేసినా ఆత్మస్థయిర్యాన్ని వీడక చివరి శ్వాసవరకు పోరుసలిపాడు. నెత్తుటి చినుకులు శరీరాన్ని తడిపిన ఆ ఉద్రిక్త క్షణాల్లో భారతమాత ఒడిలో అజేయమై ఒదిగిపోతూ...అమరమై నేలకు ఒరిగాడు. ప్రస్తుతం హబ్సిగూడలో వీరుడి స్మారక స్తూపం ఉన్నది. 

 ▪️మంగలిగుట్ట దాడిలో దుంబాల రాంరెడ్డి - కొండి రాంరెడ్డిల వీరమరణం

దుంబాల రామిరెడ్డి జైలు నుండి తప్పించుకున్నాడు.
ఇప్పుడు అతడిలో కసి ఉన్నది. అట్లాగే అతడిపై నిఘా ఉన్నది. ఈ పరిస్థితిలో గ్రామంలో నెలకొన్న విషాదం, సదరు కుటుంబాలను కమ్మేసిన తీరని వ్యథ, ఇటువంటి పరిస్థితుల్లో గ్రామానికి వెళ్తే రజాకార్ల నుండి ప్రాణాపాయం తనకు ఎట్లాగూ తప్పదు అని పూర్తిగా సాయుధ దళాల్లో కలిసిపోయాడు.

కల్లూరి భద్రారెడ్డి సహచర్యంలో దళాల కార్యకలాపాల్లో పాల్గొనసాగాడు. ఆయుధ శిక్షణ కూడా తీసుకున్నాడు.

9-7-1948

ఆరుట్ల రామచంద్రారెడ్డి, కుర్రారం రాంరెడ్డి,కల్లూరి భద్రారెడ్డి ఆధ్వర్యంలో యాదగిరి గుట్ట సమీపంలో మంగలిగుట్ట ప్రాంతంలో పోరాట వ్యూహరచన సమావేశం ఒకటి రహస్యంగా తలపెట్టారు. 25 మంది పాల్గొన్న సభలో దుంబాల రాంరెడ్డి, ధర్మారెడ్డి గూడెంకు చెందిన కొండి రాంరెడ్డి కూడా ఉన్నారు.

నిజాం పోలీసులకు సమాచారం అందింది. రజాకార్లతో కలిసి అధునాతన ఆయుధలతో మంగలిగుట్టను ముట్టడించారు. 
పోరాట వీరులు ఎదురు తిరిగారు.వీరోచితంగా ఎదురు కాల్పులు మొదలయ్యాయి. దుంబాల రాంరెడ్డి, కొండి రాంరెడ్డి పోలీసులకు పట్టుబడ్డారు .
ఇద్దరినీ బంధించి జీపు ఎక్కించుకుని రాయగిరి క్యాంపుకు పట్టుకుపోయారు.

క్యాంపులో వీరులు ఇద్దరినీ రాత్రంతా తీవ్రంగా హింసించారు. ఎముకలు విరగొట్టి.... శరీరం మొత్తం రక్త సిక్తం చేసి.... జీవశ్చవాలుగా మార్చారు. అప్పటికి వారి కసి నెరవేరలేదు.
తెల్లవారు జామున రాయగిరి రైల్వే స్టేషన్ పక్కన ఉన్న వేప చెట్ల కిందకు తీసుకొచ్చారు. కొనప్రాణాలతో
కొట్టుమిట్టడుతున్న ఇద్దరినీ తుపాకులతో కాల్చారు. ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోగానే అక్కడే గోతి తీసి పూడ్చిపెట్టారు.

ఇద్దరి ఆచూకీ గురించి మొదట గందరగోళం నెలకొన్నది. తర్వాత అస్సలు విషయం బయటపడింది.

ఇది....
ప్రజల మనుషుల మీద పగ తీర్చుకున్న రజాకార్ల రాక్షస ప్రవర్తన!

రాపోల్ కొండల్ రెడ్డి.... క్యాసారం ముత్యంరెడ్డి.... ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రాణాలు కోల్పోయారు. వారి గురించి సాయుధ పోరాట విరమణ తర్వాత ఎవ్వరూ పెద్దగా పట్టించు కోలేదు. వారి చరిత్రకు సందర్భానుసారంగా తప్పిస్తే పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు.
---------------------------------------------------------------------
వ్యాస సహకారం : రాపోలు కొండల్ రెడ్డి హబ్సిగూడ
( కెప్టెన్ రాపోలు వీరరాజారెడ్డి గారి తండ్రి )

No comments:

Post a Comment