Tuesday, April 16, 2024

తొలి న్యూస్ రీడర్ - శాంతి స్వరూప్

వార్తలు చదువుతున్నది - శాంతి స్వరూప్
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

వార్త.... అతడి స్వరనాదం
వార్త.... అతడి హృదయ వేదం
వార్త.... ఇప్పడు అతడి స్మృతి నినాదం
అతడు...
శాంతి స్వరూప్...!
పూర్తిపేరు - జయంతి శాంతి స్వరూప్...!

▪️వివరాల్లోకి వెళ్తే...
ఎదురుగా స్క్రీన్‌పై టెలీ ప్రాంప్టర్లు వంటి సాంకేతికంగా సౌలభ్యం లేని రోజుల్లో తన బట్టీయం వార్తలతో తెలుగువారిని ప్రభావితం చేసిన తొలితరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్. 1970 80 దశకాల్లో పుట్టిన బాల్యానికి వీరు ఒక మధురజ్ఞాపకం!

12.1.1950 లో హైదరాబాద్ చిక్కడపల్లిలో శాంతి స్వరూప్ జన్మించారు. వీరికి ఒక అన్న, ఒక చెల్లి, ఒక తమ్ముడు వున్నారు. వీరి తండ్రి నరసింహం గారు. 1940 ల్లోనే అమెరికా వెళ్లి M.S చదివి వచ్చిన విద్యావంతుడు. 1940 వ దశకంలోనే హైదరాబాద్ లో స్థిరబడ్డాడు. వీరి పూర్వికులది కృష్ణాజిల్లా నందిగామ. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా.
నరసింహంగారు సాయిల్ మెకానిక్స్ రీసెర్చ్ లాబ్స్ డైరెక్టర్ పనిచేస్తూ, ప్రముఖ శాస్త్రవేత్త శాంతి స్వరూప్ పట్నాగర్ తో కలిసి కొన్నాళ్లు పనిచేశాడు. తన కుమారుడు కూడా అంతటివాడు కావాలి అని శాంతి స్వరూప్ కి ఆ పేరు పెట్టుకున్నాడు. ఇది శాంతి స్వరూప్ పేరు వెనక కథ...

▪️విద్యాభ్యాసం :
 పదవతరగతి వరకు ఆంధ్ర విద్యాలయంలో చదివారు. న్యూ సైన్స్ కాలేజీలో బీ ఎస్సి చదివారు. ఆంధ్ర విద్యాలయంలో చదువుతున్నప్పుడే అక్కడ తెలుగు మాస్టారు సూర్యనారాయణ గారు శాంతి స్వరూప్ స్వరంలో ఉన్న విభిన్నతను గుర్తించారు. పద్యాలు పాడడానికి ప్రోత్సహించారు.

గురువు ప్రోత్సాహంతో స్కూల్ మ్యాగజైన్ కు చిన్న చిన్న కథలు, కవితలు రాయడం మొదలెట్టాడు . స్నేహితులతో కలిసి సామాజిక సమాకాలిన అంశాలను ఇతివృత్తంగా ఎంచుకుని నాటకాలు రచించుకుని వార్షికోత్సవానికి ప్రదర్శించేవాడు.

సుధామ, వై.రామకృష్ణారావు, ఎన్.గోపి, సుబ్బారావు, చక్రపాణి మొదలుగు వారు విద్యార్థి దశ నుండే స్నేహితులు. అప్పట్లో వీరు ఒక సమూహంగా శ్రీకృష్ణదేవరాయ భాషానిలయంలో ఎక్కువగా కలుస్తుండేవాళ్ళు. సాహిత్యాంశాలను చర్చించుకునే వారు.

 వాస్తవానికి శాంతి స్వరూప్ ఇంజనీర్ కావాలనుకున్నాడు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీట్ కూడా వచ్చింది. అప్పట్లో ఉన్న నియమ నిబంధనల ప్రకారం ఇంటర్ మార్కులను బట్టి సీట్లు ఇచ్చేవారు. ఇంజనీరింగ్ విద్య కోసం వయసు సరిపోకపోవడంతో సీటు తిరస్కరించారు. దీంతో బిఎస్సి లో చేరాడు. ఐఏఎస్ కావాలని కలలు కన్నాడు.కానీ ఆ కాలంలో ఒకరిద్దరు ఐఏఎస్ అధికారుల అవినీతిని చూసాక ఆ రంగం మీద విసుగు చెందాడు.

▪️ఆకాశవాణి కేంద్రంలో :
కేరిర్ మొదట్లో ఆకాశవాణి కేంద్రంలో పనిచేసాడు. కొంతకాలం న్యూస్ రీల్ అసిస్టెంట్ గా పని చేశాడు. "యువవాణి " కార్యక్రమం అనవసరంగా కొంతకాలం పని చేశాడు.1972 లో వివిధ భారతి కార్యక్రమం ఆరంభం అయ్యాక వ్యాపార ప్రకటనలు చెప్పేవాడు.
 ఇక్కడే జీవిత సహచరి రోజారాణి పరిచయమైంది.

▪️దూరదర్శన్ వేదికగా:
రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా 1977 అక్టోబరు 23న దూరదర్శన్ సప్తగిరి కార్యక్రమాలను రవీంద్రభారతిలో ప్రారంభించారు. విజ్ఞానం వినోదం కోసం...వార్త పత్రికలు, రేడియో, మాత్రమే అందుబాటులో వున్న ఆనాటి సమాజంలో ఇది విప్లవాత్మక చైతన్యం. ఈ శుభ తరుణాన్ని పురస్కరించుకుని ఛానల్ ప్రారంభం కాగానే సోమాజీగూడలో స్టూడియో నుంచి తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తొలి వ్యాఖ్యాత శాంతిస్వరూప్.

తర్వాత 1978లో దూరదర్శన్‌లో ఉద్యోగిగా చేరారు... 2011 జనవరి వరకు తన ప్రస్థానం కొనసాగించారు. కాగా 1977 - 1997 మధ్యలో మాత్రమే దూరదర్శన్ తన హవా కొనసాగించింది. ఈ క్రమంలో వార్తలు చదవడం, ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేయడం, కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం, దూరదర్శన్ కోసం ప్రత్యేకంగా నాటకాలు రాయడం, చేసాడు. అట్లాగే " " మీరు అడిగి చూడండి - మేము వేసి చూపిస్తాం " ‘జాబులు- జవాబులు’, ‘ధర్మసందేహాలు’ " మొదలగు కార్యక్రమాలను నిర్వహించాడు.

అప్పటి వరకు తాజా వార్తల కోసం కేవలం ఆకాశవాణి మీద ఆధారపడి ఉన్న సమాజానికి మరో అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ 
సప్తగిరిలో 1983 నవంబరు 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. వార్తా విభాగంలో తొలి న్యూస్ రీడర్ మన శాంతి స్వరూప్ గారే. ఈ విధంగా 
దూరదర్శన్‌ తెలుగులో వార్తలు చదివిన తొలి న్యూస్ రీడర్ గా చరిత్రను సృష్టించారు .

ఇంగ్లీషు రిపోర్టును తెలుగులోకి అనువదించకుండా, చదివి అర్థం చేసుకుని, రిపోర్టు కాగితాలను రిఫరెన్స్ కోసం చేతిలో ఉంచుకుని, పరిశీలిస్తూ తెలుగులో ప్రత్యక్షంగా చదివేవారు. ఇది అతడి ప్రతిభ.

▪️రచయితగా :
తండ్రి కోరుకున్నట్టుగా శాంతి స్వరూప్ శాస్త్రవేత్త కాలేక పోయాడు.చిన్నప్పటి నుండి సాహిత్యం మీద మక్కువతో పుస్తకాలు చదవడం, రేడియో వినడం, తన అభిరుచులుగా అలవర్చుకున్నాడు.మూడు విశిష్ట నవలలు రచించాడు.

1.భోపాల్ గ్యాస్ దుర్ఘటనమీద "రాతిమేఘం" నవల , 2. క్రికెట్ ఇతివృత్తంగా రిలయన్స్ వరల్డ్ కప్ సీజన్లో "క్రేజ్" నవల ,
3. ఆనాటి సతీ సహగమనాన్ని నిరసిస్తూ..."అర్ధాగ్ని" నవల 

▪️అభిరుచులు - అంకితభావం : 
" వార్తలు చదవకండి. వార్తలు చెప్పండి...." అంటూ నవతరం న్యూస్ రీడర్లకు సూచించిన శాంతి స్వరూప్ తెలుగు టెలివిజన్ వార్త విభాగానికి గురు సమానులు...! దూరదర్శన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే కొద్ది మందిలో శాంతి స్వరూప్ ఒకరు.  

జోళెపాలెం మంగమ్మ, పన్యాల రంగనాథరావు, తిరుమలశెట్టి శ్రీరాములు, ఏడిద గోపాల్రావు వంటి న్యూస్ రీడర్ల స్వరంలో విషయానికి అనుగుణంగా విలువడే తేడాలని గమనించేడు. వారి స్వరాలకు ఆకర్షితం అయ్యేవాడు.

రేడియాలో ఉషశ్రీ ప్రవచనాలు వింటూ జీవిత పరమార్థిక సత్యాలను ...సందేశాలను.... ఆకళింపు చేసుకునే వాడు.

అట్లాగే శారదా శ్రీనివాసన్, నండూరి విఠల్, నండూరి రాంమోహన్రావు, డి.వెంకట్రామయ్య లాంటి వాళ్ళు రేడియోలో ప్రదర్శించే రేడియో నాటకాలు వినేవాడు. పాత్రలను, సందర్భాలను, హావభావాలాను దృశ్య రూపకంగా ఉహించుకునే వాడు. ఆ విధంగా వీరి అంతరంగంలో అక్షర సాన్నిహిత్యం ఏర్పడింది.

మొత్తానికి వీళ్లంతా కేవలం స్వరం ఆలంబనగా గొప్పవాళ్లయ్యారు అనే ఒక ఆలోచన శాంతిస్వరూప్ లో కలిగింది. కాబట్టే అదే స్వరంతో తాను గొప్పవాడయ్యాడు.
" కలలు కనడం కాదు కలలు నిర్మించుకోవాలి" అనడానికి శాంతిస్వరూప్ జిజ్ఞాస ఒక పెద్ద ఉదాహరణ.

▪️కుటుంబం
వీరి భార్య రోజారాణి గారు.
1980 ఆగస్టు 21న వీరి వివాహం జరిగింది. రోజారాణి కూడా దూరదర్శన్ లో వ్యాఖ్యాతగా, న్యూస్ రీడర్ గా పనిచేసారు.. ఆనాటి మహిళా లోకాన్ని సంపూర్ణంగా ఆకర్శించిన అందమైన వ్యాఖ్యాతల్లో రోజారాణి గారు ఒకరు. వీరు 2009 లో బ్లడ్ క్యాన్సర్ తో చనిపోయారు.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు..మేఘాంశ్, అవ్యయ్. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు.

▪️వెంటాడిన విషాదం :
కొందరు జీవితాలు సుదీర్ఘకాలం సుఖసంతోషాలతో క్షేమంగా ఉంటాయి. ఇంకొందరి జీవితాలు అన్నీ ఉన్నా కూడా ఆటుపోట్లకు లోన్ అవుతూ దుఃఖాన్ని మోస్తూ ఉంటాయి. ఈ కోవలో శాంతిస్వరూప్ తన జీవితం పొడవునా విషాదాన్ని మోస్తూ వచ్చాడు

ఏడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. చిక్కడపల్లిలో ఇంటిని నిర్మిస్తున్న సమయంలో పైకప్పు నుండి జారిపడి మరణించాడు.

తన అన్న జి.ఎస్.వి.ఎల్.నరసింహం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసేవాడు.
 కానీ 35 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో చనిపోయాడు.

తన తమ్ముడు జయంతి అనిల్. ఆప్కాబ్ డి జి ఎం గా పని చేసేవాడు. ఇక్కడ కూడా తన 39 గంటల వయసులో గుండె సంబంధం వ్యాధితో చనిపోయాడు.

▪️పురస్కారాలు

లైఫ్ టైం అఛీవ్‌మెంటు అవార్డు పొందారు 

▪️వార్తలు సమాప్తం
సుదీర్ఘకాలం తన వార్తలతో దూరదర్శన్ ప్రేక్షకులను అలరించి తర్వాత విరమణ పొంది....రామాంతాపూర్ లో తదనంతర జీవితాన్ని కొనసాగించిన శాంతి స్వరూప్ గారు హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో ఏప్రిల్ 5, 2024 న తన సోదరుల మాదిరిగానే గుండెపోటుతో
శివైక్యం చెందారు.
🙏🏿

No comments:

Post a Comment