Monday, April 15, 2024

వెదిరే రామచంద్రారెడ్డి ( భూదాన్ )

వెదిరే రామచంద్రారెడ్డి ( భూదాన్ )
(1905 - 1986)
( సామాజిక కార్యకర్త - దానశీలి )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి 

ఆలోచనల్ని ఆచరణ వైపు నడిపించాడు -
ఆచరణలో ఫలితం ఆశించాడు -
ఫలితంలో అందరి క్షేమానికై తపించాడు -
అతడి చేతికి ఎముక లేదు...
అతడి దానగుణానికి సాటిలేదు...
అతడే ---
దేశం గర్వించదగిన
భూదాన్ రామచంద్ర రెడ్డి !

#పరిచయం 

 తెలంగాణ రాష్ట్రం ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా
ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో 1905 జూలై 13 న
రామచంద్రారెడ్డి జన్మించారు. తండ్రి నరసారెడ్డి.తల్లి లక్ష్మి నరసమ్మ.వీరిది భూస్వామ్య కుటుంబం. ఈ దంపతులకు మొత్తం తొమ్మిది మంది సంతానం. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు.... మాణిక్యదేవి విమలాదేవి సీతాదేవి. 
ఆరుగురు మగసంతానం....రామచంద్రారెడ్డి,రాణాప్రతాప్ రెడ్డి , లక్ష్మణరెడ్డి ,మన్మోహన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి,నారాయణ్ కరణ్ రెడ్డి.
 రామచంద్రా రెడ్డి గారికి , ఐదుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు.

పూణేలోని ఫెర్గూసన్ లా కాలేజీలో 1935 - 1938 లో వీరు న్యాయశాస్త్రం అభ్యసించారు. న్యాయవాదిగా కొన్నాళ్ళు కొనసాగి తరువాత ఉద్దేశ్య పూర్వకంగా వృత్తి నుండి తప్పుకున్నాడు.సామాజిక సంస్కరణల కోసం పనిచేయడం ప్రారంభించాడు

#ఉద్యమాలు

ఉద్యమాల ఖిల్లా ప్రసిద్ధి పొందిన నల్లగొండ జిల్లాలో మొదట #సాయుధరైతాంగ_పోరాటం, ఆతర్వాత #భూదానోద్యమం జరిగాయి.ఈ రెండు పరస్పర విరుద్ధమైన ఉద్యమాలు. 
సాయుధ పోరాటానికి రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించారు. భుదానోద్యమానికి వెదిరె రామచంద్రారెడ్డి ఆధ్యులుగా ఘనత సాధించారు. ఇక్కడ విశేషం ఏమంటే ఈ నాయకులు ఇద్దరూ బావా -బావమరుదులు.
రామచంద్రారెడ్డి చెల్లెలు సీతాదేవిని రావి నారాయణరెడ్డి వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ప్రజాసేవ కోసం పాటుపడటం విశేషం.

ఈ సాయుధ రైతాంగ పోరాటంలో భూమిని సేకరించి, నిరు పేదలకు పంచాలనే సంకల్పం ఊపిరి పోసుకుంది. సామరస్యంగా శాంతియుతంగా , భూస్వాముల నుండి భూమిని సేకరించి పంచడం భూదాన ఉద్యమం.

#భుదానోద్యమం

మొత్తం భారతదేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రాంతంలో ఆచార్య వినోభాభావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమంలో భాగంగా 1951 వ సంవత్సరంలో నిరుపేదలకు భూమిని దానం చేసిన మొదటి భూస్వామి వేదిరే రామచంద్రారెడ్డి.చరిత్రలో వీరి పేరు చెరగని సంతకం !

1951 ఏప్రిల్ 18 న తన మహాత్మాగాంధీ మార్గ దర్శకత్వంలో శాంతి పర్యటనలో భాగంగా నల్గొండ జిల్లా పోచంపల్లి మండలంలో
ఆచార్య వినోబాభావే ప్రవేశించారు.ఈ ఊరు చేనేత పరిశ్రమకు పుట్టినిల్లు. గామస్తులు అతడిని ఒక సంఘసేవకుడిగా ప్రజా బంధువుగా స్వాగతించారు. కొంత కాలం అతడు పోచంపల్లిలోనే ఉన్నాడు. ప్రజల కష్ట సుఖాలను క్షుణ్ణంగా అద్యయనం చేసాడు. ఈ క్రమంలో పోచంపల్లికి సమీపంలోని హరిపురం గ్రామంలోని 40 మంది హరిజన కుటుంబాలను వినోభాభావే కలుసుకన్నాడు. వారి కష్టాలను తెలుసుకున్నాడు. కష్టాలకు కారణం భూమి లేకపోవడనే అని గ్రహించాడు. కాగా వారికి భూములు ఇప్పించడం సులువు కాదు, అయినప్పటికీ ప్రయత్నం చేసాడు. మరుసటి రోజే సమావేశం ఏర్పాటు చేసాడు.

సగం తరి (తడి) భూములు మరియు ఇంకో సగం షెలక (పొడి ) భూములు కావాలని ఆ గ్రామస్థులు కోరారు.

ఇందులో భాగంగా మొదటి ప్రయత్నంగా వెదిరె రామచంద్రారెడ్డిని నిరుపేదల కోసం 80 ఎకరాల భూమి అవసరం అవుతుందని, పెద్ద మనసుతో భూమిని దానం చేయమని అభ్యర్థించాడు.ఆయన అడగ్గానే స్పందించిన వెదిరె రామచంద్రారెడ్డి లేచి తన తండ్రి నరసారెడ్డి జ్ఞాపకార్థం వందెకరాల భూమిని దానంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సభా ముఖంగా ప్రకటించారు.

మాట ఇవ్వడం వరకే కాదు, వెంటనే స్వదస్తూరితో దాన పత్రం రాసి ఇచ్చారడు .భూస్వామి రామచంద్రారెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయానికి....స్పందనకు.....వినోభాభావే సైతం ఆశ్చర్యపోయాడు . ఈ విధంగా భూదానోద్యమ ఆవిర్భవించడానికి బీజం పడింది. భూదానోద్యమ పితగా ఆచార్య వినోభాబవే ప్రథమ భూదాతగా వెదిరె రామచంద్రారెడ్డి చరిత్ర పుటల్లో నిలిచారు

#భూదాన్_బిరుదు 

భూదాన్ ఉద్యమం అంతటితో ఆగిపోలేదు. భూసంస్కరణకు నాంది పలుకుతూ తెలంగాణలో పేదరిక నిర్మూలన కోసం విస్తరించింది. స్వాతంత్ర్య భారతదేశంలో 1 మిలియన్ ఎకరాల భూమిని దానం చేసి పేదలకు పంపిణీ చేశారు. ఇందులో భాగస్వామ్యం వహించిన విదిరే రామచంద్రారెడ్డి తన మొదటి విడత 100 ఎకరాల భూమితో సరిపెట్టుకోలేదు. రెండవ విడతగా 800 ఎకరాల భూమిని విరాళం ఇచ్చారు

1000 ఎకరాలతో భూదానోద్యమానికి సంపూర్ణంగా సహకరించిన వెదిరె రామచంద్రారెడ్డి గురించి -
 " రెడ్డీ అనే ఒక సామాజిక కార్యకర్త ,పేదరికం వెనకబాటుతనం క్రమంగా దూరం కావడం కోసం తన స్వంత భూమిని దానం చేసి భూదాన్ గా చెప్పబడుతున్నాడు అని ప్రశంశించబడ్డాడు.ఆనాటి నుండి విదిరే రామచంద్రారెడ్డి, భూదాన్ రామచంద్రారెడ్డిగా పిలవవడ్డాడు.

#అడుగుజాడల్లో

భూదానం చేసే నాటికి రామచంద్రారెడ్డి 46 ఏళ్ళు.
దాన గుణము గుండె నిండగా కర్మభూమిని కనికరించి న రామచంద్రారెడ్డి పేరు పల్లె పల్లెన మారు మోగింది. 
ఇట్లాంటి నిర్ణయాలు భారతదేశంలో వేళ్ళూనుకు పోయిన భూ సమస్యను పరిష్కరిస్తాయని...ఇది భూస్వాముల దానగుణ సామర్ధ్యం మీద అనివార్యంగా అధారపడి ఉంటుందని ..... ఇందుకు రామచంద్రారెడ్డిని మిగతా భూస్వాములు ఆదర్శంగా తీసుకోవాలని వినోభా భావించి ప్రకటించాడు.
అనుకున్నట్టుగానే మరెందరో భూస్వాములకు రామచంద్రారెడ్డి మేలుకొలుపుతూ ప్రేరణగా నిలిచాడు. ఈ విధంగా వారు దేశంలోనే కొత్త అద్యయనానికి బాటలు వేసాడు.

#భూదాన్_పోచంపల్లి

విదిరే రామచంద్రారెడ్డి సహాయ సహకారాలు కారణంగా మొట్టమొదటి సారి 'భూదాన్ ఉద్యమం ఇక్కడే నుండే ప్రారంభించబడింది కాబట్టి దీనికి 'భూదాన్ పోచంపల్లి' అని పిలుస్తారు.

గ్రామంలో 75% కంటే ఎక్కువ మంది భూమిలేని పేదలు రామచంద్రారెడ్డి కారణంగా బాగు పడ్డారు.

స్థిరాస్తుల్లో భూమిది మొదటి స్థానం ! భూదానాలు ఎంత ఖ్యాతిని అర్జించి పెడుతాయో....భూ తగాదాలు అంతే శత్రుత్వానికి కారకం అవ్వుతుంటాయి. భూమి ఒక అండ...ఆసరా..భరోసా...భవిత...అన్నీకూడా ! ఇట్లాంటి భూమిని ఒక సాధారణ వ్యక్తి దానధర్మాల్లో భాగంగా ఉపయోగించడం అంటే అది కోటి గుండె కాయల ధీమా..ధైర్యం ! ఈ ధైర్యాన్ని సమున్నతంగా ప్రదర్శించిన రామచంద్రారెడ్డి పేరును పోచంపల్లి పల్లి ప్రజలు మరిచిపోలేరు.

#విగ్రహం

కలియుగ దానకర్ణుడు విదిరే రామచంద్రారెడ్డి
డిసెంబర్ 9, 1986 న మరణించారు.ఆ తర్వాత
భూధానంతో తన సేవా నిరతిని మానవీయతను చాటుకున్న రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ప్రజలు కొండత అభిమానంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
 2006లో రామచంద్రారెడ్డి విగ్రహం పోచంపల్లి నడిబొడ్డున ప్రతిష్టించబడింది.

వినోభా తమ గ్రామనికి చేసిన మేలును మరువని ప్రజలు ...ఆయన స్మృతిగా వినోభా నిలయాన్ని ...విగ్రహాన్ని.. ఏర్పాటు చేసుకున్నారు.

బతుకు వందేళ్ళు...
వర్ధిల్లు వెయ్యేళ్ళు....

No comments:

Post a Comment