Monday, April 15, 2024

దుక్క రాజన్నరెడ్డి

దుక్క రాజన్నరెడ్డి
( 1898-1956 )
( భారత స్వాతంత్ర్య సమరయోధుడు - గాంధేయవాది )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

పరాధీనత నిరసిస్తూ... 
పట్టుదలగా పయనిస్తూ... 
సంకల్పంతో పనిచేస్తూ.. 
ప్రజాబంధువై జీవిస్తూ... 
దేశం కోసం జీవితకాలాన్ని త్యాగం చేసిన నిరాడంబరుడు ... దుక్క రాజన్నరెడ్డి.

👉పరిచయం :

పర్లాకిమిడి సంస్థానం మెళియాపుట్టి గ్రామంలో 04.02.1898 సంవత్సరంలో దుక్క రాజన్నరెడ్డి తల్లిదండ్రుల మొదటి సంతానంగా జన్మించాడు. ఆనాటి గ్రామ మునసబు దుక్క పాపన్నాయుడు , ముత్యాలమ్మ దంపతులు వీరి తల్లిదండ్రులు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మునసబులుగా పనిచేసిన / చేసే వాళ్ళను అప్పట్లో నాయుడుగా పిలిచేవాళ్ళు. తెలంగాణలో పటేలా అని పిలిచే సంప్రదాయం ఇందుకు ఉదాహరణ. అట్లా పాపన్నరెడ్డి పాపన్ననాయుడుగా పిలవబడ్డాడు. 
 
రాజన్నరెడ్డి పర్లాకిమిడి రాజా వారి ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ వరకు చదివారు. చురుకైన విద్యార్థిగా ఉపాధ్యాయులు నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత అప్పట్లో శ్రీకాకుళం జిల్లా చుట్టు పక్కల కళాశాలలు లేకపోవుటచే కాకినాడ పిఠాపురం మహరాజు వారి కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరాడు. అక్కడ కూడా చురుకుగా ఉంటూ తోటి విద్యార్థులు అందరి కంటే చదువులో ఆటపాటల్లో ముందుండే వాడు. తమ కుమారుడు ఉన్నత విద్యలు అభ్యసించాలని కలలు కంటున్న తల్లిదండ్రుల ఆశలకు రాజన్నరెడ్డి ప్రాణం ఇక్కడే పోసాడు. కానీ అనుకోకుండా జీవితం మలుపు తిరిగింది. 

👉దేశనాయకుల ఉపన్యాసాలే ప్రేరణగా :

అది 1919 వ సంవత్సరం. రాజన్నరెడ్డి 21 సంవత్సరాల వయసులో ఉన్నాడు. కాకినాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు . అదే సంవత్సరం కాకినాడలో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య ఉద్యమ మహాసభ జరిగింది. యువత, విద్యార్థులు, ఆ సభకు పెద్దఎత్తున హాజరయ్యారు. ఆ సభలో గాంధీ గారితో పాటుగా ఇతర దేశనాయకులు యువతను ఉద్దేశించి ఉపన్యాసాలు చేసారు. ఈ ఉపన్యాసాలు రాజన్నరెడ్డి మనసును ఉద్యమం వైపు మరల్చాయి. ఇక చదువు కొనసాగించలేని వాడై... దేశభక్తి పూరితుడై ........ చదువు మధ్యలో ఆపివేసి ఇంటికి తిరిగి వచ్చేసాడు. స్వాతంత్ర పోరాటంలో తనదైన భాగస్వామ్యం కోసం
ఇంటి నుండే అడుగు ముందుకు వేసాడు. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు కూడా రాజన్నరెడ్డికి అడ్డు చెప్పలేదు. 

👉 దటీజ్ రాజన్నరెడ్డి :

03.12.1927 వ తారీఖు. 
స్వాతంత్రోద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ కాలినడకన దేశ మొత్తం పర్యటిస్తూ శ్రీకాకుళం ప్రాంతంలోకి ప్రవేశించాడు. రాజన్నరెడ్డి  
గాంధీ గారిని మెళియాపుట్టి గ్రామానికి ఆహ్వానించారు .అదే సమయంలో
పర్లాకిమిడి మహారాజా వారు గాంధీ గారిని ఆహ్వానించాడు.కానీ గాంధీ గారు మహారాజా వారి ఆహ్వానాన్ని తిరస్కరించి, ప్రజల మనిషి రాజన్నరెడ్డి ఆహ్వానాన్ని మన్నిస్తూ మళియాపుట్టి గ్రామానికి వచ్చాడు. అప్పుడు అశేష జనవాహిని సమక్షంలో రాట్నాలతో గాంధీ గారికి స్వాగతం పలికాడు రాజన్నరెడ్డి. ఈ సందర్బంగా గ్రామంలో పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసాడు. ఆ సభలో శ్రీ మహాత్మా గాంధీ గారిని ఒక వెయ్యి రూపాయలు నగదు ఇచ్చి సత్కరించాడు. అంటే ఇప్పటి లెక్కల ప్రకారం దాదాపు కోటి రూపాయలు. మళియాపుట్టి సంస్థలో తయరైన సన్న నూలు వస్త్రంతో సత్కరించాడు. 

విదేశీ వస్త్రాలు వీడి, స్వదేశీ వస్త్రాలనే ధరించి దేశభక్తి చాటుకోవాలని ఈ సందర్బంగా మహాత్ముడు పిలుపు ఇచ్చాడు. గాంధీ పిలుపు అందుకున్న రాజన్నరెడ్డి మెళియాపుట్టిలో ఒక ఖాదీ సంస్థను ఏర్పాటుచేశాడు. ఖాదీ ఉద్యమం వ్యాప్తిలో అహర్నిశలు కృషి చేసాడు.

 ముఖ్యంగా మెళియాపుట్టి గ్రామంలో
 "అఖిల భారత చరక సంఘం " స్థాపించి జాడుపల్లి గ్రామంలో ముదక ఖద్దరు ఉత్పత్తి , బుడితి గ్రామంలో సన్న నూలు ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాడు. బొంబాయి , ఢిల్లీ , కలకత్తా వంటి నగరాలకు
సన్న నూలు ఉత్పత్తులను ఎగుమతి చేసాడు. ఈ క్రమంలో రాజన్నరెడ్డి ఖాదీ సంస్థకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాడు 

👉సత్యాగ్రహం 

మెళియాపుట్టి నుంచి పూండీ వరకు కాలి నడకన బయలుదేరి వెళ్లి ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టాడు రాజన్నరెడ్డి.ఈ సందర్బంగా వేల మందిని సత్యాగ్రహంలో భాగస్వాములను చేసాడు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరినో స్వచ్ఛంద సైనికులుగా తీర్చిదిద్దాడు. 

👉 సంఘసేవకుడిగా రాజన్నరెడ్డి :

▪️ఉత్తర విశాఖ సర్వోదయ సహాయక సమితి  

మెళియాపుట్టిలో ఖాధీ సంస్థను స్వతంత్ర్య సంస్థగా ఉంచుటకు , అఖిల భారత చరఖా సంఘం నుండి విడిపోయి " ఉత్తర విశాఖ సర్వోదయ సహాయక సమితి " పేరుతో స్వతంత్ర్య సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ఆధ్వర్యంలో నాలుగు ఉత్పత్తి కేంద్రాలు , ఆరు విక్రయ కేంద్రాలు ప్రారంభించాడు. ఎందరికో ఉపాధి అవకాశాలు కలిపించాడు. ఖద్దరును అభివృద్ధి చేసి రాష్ట్ర ఖాధీ చరిత్రలోనే మెళియాపుట్టి
ఖాధీ సంస్థకు ప్రత్యేక గౌరవం తెచ్చిపెట్టాడు. 

▪️రైతు ఉద్యమం 

పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ వారు రైతులకు గౌరవం ఇవ్వడం లేదని, రైతులను పట్టించుకోవడం లేదని, రైతుల కష్టసుఖాలు గురించి కనీస ఆలోచన కూడా లేదని, రాజరికం ముసుగులో ఉన్నత వర్గాలకు కొమ్ముకాస్తున్నాడని, రాజా వారికి వ్యతిరేకంగా 
" రైతు ఉద్యమం " నడిపాడు. వేలాది మంది రైతులను ముందుండి నడిపించాడు. 

పర్లాకిమిడి పాతపట్నం ఉమ్మడి తాలూకా బోర్డు ఉపాధ్యకులుగా ఎన్నికై ప్రజల కోసం, రైతుల కోసం పనిచేశాడు. 

▪️పాతపట్నం సహకార భూ తనఖా బ్యాంకు

ముఖ్యంగా పాతపట్నం తాలూకా ఏర్పడిన తర్వాత ఆ పరిధిలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. రైతులను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు . వ్యవసాయం కోసం స్థానిక వ్యాపారుల నుండి రుణాలు లభించని పరిస్థితి దాపురించింది. ఒకవేళ ఋణం తీసుకున్నా వడ్డీలు ఎక్కువై తిరిగి తీర్చలేని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల్లో రాజన్నరెడ్డి "పాతపట్నం సహకార భూ తనఖా
 బ్యాంకు" ను స్థాపించాడు. ఈ బ్యాంకు రైతులకు పెద్దమేలు చేసింది. రైతులు వ్యవసాయం కోసం తిప్పలు పడకుండా ధైర్యంగా ముందుకు సాగే ఆసరా కలిగించింది. 

▪️మెళియాపుట్టి కోపనటెస్ స్టోర్స్ 

రైతులకు ఎరువులు , వ్యవసాయ పరికరాలు చౌకగా
అందించేందుకు "మెళియాపుట్టి కోపరేటెవ్ స్టోర్స్ " స్థాపించాడు.  

▪️సహకార సంఘాలు ఏర్పాటు 

రాష్ట్ర సహకార ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా ప్రజల - రైతుల - ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలు స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు. 

▪️గ్రంధాలయం ఏర్పాటు 

ఆనాటి సమాజంలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా వెనకబడి ఉండేది. సరైన సదుపాయాలు - సమాచార వ్యవస్థ అందుబాటులో లేక, ప్రపంచంలో దేశంలో ఏం జరుగుతుందో తెలియక, ప్రజలు ఇబ్బంది పడే వారు. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రజల్లో జాతీయోద్యమ స్ఫూర్తి రగిలించేందుకు కొంత ఆటంకం కలిగేది. అందుకే గ్రామ ప్రజల్లో జాతీయోద్యమ భావాలు పెంపొందడం కోసం, వారి మేధో అభివృద్ధి కోసం, వారి అభిలాష కోసం చేయూత అందిస్తూ మెళియాపుట్టి గ్రామంలో గ్రంధాలయం స్థాపించాడు. తర్వాత పరిసర గ్రామాల్లో గ్రంధాలయాల స్థాపన కోసం 
కృషి చేసాడు. 

▪️భూదానం 

1) చాపర గ్రామానికి జిల్లా బోర్డు హైస్కూల్ మంజురు అయ్యింది. కానీ పాఠశాలకు ఆటస్థలం లేకపోవుటచే పాఠశాల ఏర్పాటుకు అది లోనే హంసపాదు ఎదురయ్యింది. ఈ పరిస్థితుల్లో తమ స్వంత భూమి ఎనిమిది ఎకరాలు పాఠశాల కోసం స్వచ్ఛందంగా రాసిచ్చాడు.  

2) వినోభా భావే భూదానోద్యమంలో పాల్గొని తొమ్మిది ఎకరాల భూమి దానం చేసాడు. 

▪️విద్యాదానం 

మెళియాపుట్టి గ్రామంలో పేద పిల్లలను చేరదీసి, వారికి ఆర్ధిక సాయం చేసి, వారి ఉన్నత చదువులకు చేయూతనిచ్చాడు. విద్యావంతులు ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని కలలు కని, ఆ కలల సాకారం కోసం స్వంత ఆస్తిని ధారపోసాడు. గ్రామ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసాడు. 

▪️పోలీస్ స్టేషన్ ఏర్పాటు 

ప్రజల న్యాయపరమైన అవసరం, రక్షణ నిమిత్తం తమ మెళియాపుట్టి గ్రామంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటులో తోడ్పడ్డాడు. 

👉వస్త్రాలు సొంతంగా తయారుచేసుకుని :

రాజన్నరెడ్డి వంటి ఉదాత్తమైన వ్యక్తులు అరుదుగా ఉంటారు. వారి ఉన్నత వ్యక్తిత్వానికి మరొక ఉదాహరణగా వారి ధరించే దుస్తులు గురించి చెప్పుకోవచ్చు. 
గాంధి గారి వార్ధా ఆశ్రమంలో రాజన్నరెడ్డి మూడు నెలలు శిక్షణ పొంది చరఖా వడకడం నేర్చుకున్నాడు. మహాత్ముని సర్వోదయ సూత్రములను అక్కడే బాగా ఆకళింపు చేసుకొని నిజ జీవితంలో ఆచరించడం మొదలెట్టాడు. ఆ క్రమంలోనే తన వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నంతగా తీర్చిదిద్దుకున్నాడు. 
తన జీవితంలో ప్రజసేవలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ప్రతి రోజు ఒక గంట సమయం చరఖాపై నూలు వడికి ఆ నూలుతో తయారైన వస్త్రములనే ధరించిన నిజమైన గాంధేయవాది రాజన్నరెడ్డి. 

👉ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం :

ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక ఆంధ్ర గురించి పాటుపడ్డాడు. ఈ క్రమంలో 
ఆనాటి నాయకులైన భోగరాజు పట్టాభి సీతారామయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు , బెజవాడ గోపాలరెడ్డి, వి.వి. గిరి, మొదలగు వారితో కలిసి ముందుకు నడిచాడు. వారిని తన స్వగృహానికి రప్పించి తన ఇంట ఆతిథ్యము కూడా ఇచ్చాడు. 

👉 ఆంధ్రా ఒరిస్సా ఉద్యమం :

పర్లాకిమిడి పట్టణం దాని చుట్టు పక్కల తెలుగు భాష మాట్లాడే ప్రాంతలను ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంచాలనే సంకల్పంతో జరిగిన ఆంధ్ర ఒడిస్సా ఉద్యమంలో కూడా వీరి పాత్ర కీలకమైనది. గిడుగు సీతాపతి గారితో కలిసి ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ పర్లాకిమిడి రాజా వారి ఒత్తిడికి తలొగ్గిన బ్రిటిష్ పాలకులు తెలుగు మాట్లాడే కొన్ని ప్రాంతాలను ఒరిస్సా రాష్ట్రంలోనే ఉంచివేసారు. ఈ విషయమై రాజన్నరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 

 👉గ్రామ మొదటి సర్పంచ్ గా :

 మెళియాపుట్టి గ్రామ పంచాయితీ 1936లో ప్రారంభం అయ్యింది. ప్రారంభం నుండి తాను మరణించే వరకు అంటే 1956 వరకు 20 సంవత్సరాలు మెళియాపుట్టి గ్రామ సర్పంచ్ గా ఎదురులేకుండా కొనసాగాడు. ప్రజలకి సేవలు అందించాడు . 

👉శివైక్యం 

16.01.1956 తారీఖున తన 58 వ ఏట రాజన్నరెడ్డి మెళియాపుట్టిలో తన స్వగృహంలో మరణించాడు. 
 
👉మరణం తర్వాత 

గొప్ప దేశభక్తుడే కాదు, గొప్ప మానవతా మూర్తి అయిన తమ తండ్రి మరణం కూడా ప్రజలకు అంకితం కావాలని వారి కుమారుడు దుక్క చంద్రశేఖరరెడ్డి గారు భావించాడు. ఈ క్రమంలో మెళియాపుట్టి గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థాపన కోసం విలువైన భూమి , నగదు విరాళంగా ఇవ్వడం జరిగింది. 
దుక్క రాజన్న రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల 2004 వ సంవత్సరం లో స్థాపించబడింది. ఇప్పుడు ఆ కళాశాలలోఎందరో విద్యార్థులు తమ కళాశాల విద్యను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మరణించాడు.వీరి కుమారుడు దుక్క మధుసూదనరెడ్డి తాత రాజన్నరెడ్డి ఆశయాల కోసం పనిచేస్తున్నాడు. 

ఎందరో మహానుభావులు 
అందరికీ వందనాలు
____________________________________________
ఆధారం : 
1 )శ్రీకాకుళం జిల్లా స్వాతంత్ర్య సమరయోధులు
2) జాతీయ రెడ్డి జే ఏ సీ కార్యవర్గ సభ్యులు 
ఆలపాన త్రినాద్ రెడ్డి గారు ఇచ్చిన ప్రచురణ పూర్వక సమాచారం

No comments:

Post a Comment