Monday, April 15, 2024

ఎం. రాం భూపాల్ రెడ్డి

మనసున్న మాహారాజు ఎం.రాంభూపాల్‌రెడ్డి....
ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌ ( మనసులో మాట )పుస్తకం లో చోటు....

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..గత 9సంవత్సరాలుగా మన్‌ కీ బాత్‌ పేరుతో దేశ ప్రజల కోసం రేడియో కార్యక్రమం నిర్వహిస్తూ వివిధ రంగాల్లో సేవాభావాన్ని ప్రదర్శించిన వ్యక్తుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఆల్ ఇండియా రేడియో , DD నేషనల్ మరియు DD న్యూస్‌లలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 2014 అక్టోబర్ లో విజయదశమి సందర్బంగా ప్రారంభం అయ్యింది.

 మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30, 2023న పూర్తి చేసుకుంది.కాగా 89వ ఎపిసోడ్ లో ప్రధానమంత్రి 
బాలికల విద్య అంశాన్ని స్పృశిస్తూ, ఆ రంగంలో సేవలు అందిస్తున్న తెలుగు ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రాంభూపాల్ రెడ్డి పేరును ప్రస్తావించడం జరిగింది. స్వలాభం కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేయడం మన భారత సంస్కృతిలో అంతర్భాగం అంటూ రాంభూపాల్ రెడ్డి గారిని ప్రశంసించడం జరిగింది.

కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధ్వర్యంలో మన్‌కీబాత్‌లో గుర్తించిన విశిష్టులు వంద మంది చిత్రాలతో ఒక పుస్తకం కూడా విడుదల చేయబడింది. జూన్ 2023 లో విడుదల చేసిన ఈ పుస్తకంలో రామచంద్ర రెడ్డి చేసిన సేవా వివరాలను పొందుపరిచారు. ఈ పుస్తకంలో ఎం.రాంభూపాల్‌రెడ్డి స్థానం సంపాదించుకోవడం తెలుగువారికి గర్వకారణం. 

// ఎం.రాంభూపాల్‌రెడ్డి సేవా వివరాలు //

 ఎం.రాంభూపాల్‌రెడ్డి గారు ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ పదవి విరమణ పొందారు. ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన మొత్తం డబ్బును తన వారసుల కోసమో లేదా తన వ్యక్తిగత అవసరాల కోసమో ఉపయోగించుకోలేదు. పోస్టాఫీసు లో ఉద్దేశపూర్వకంగానే ఫిక్సిడ్‌ డిపాజిట్‌ చేసాడు. అందుకు వస్తున్న వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి పంచాయతీలోని 100 మంది పేద బాలికల విద్య కోసం సుకన్య యోజన పథకంలో బాలికల అకౌంట్లలో జమ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు రాంభూపాలరెడ్డి గారు 25 లక్షల రూపాయలను ఏదో బాలికల కోసం ఉపయోగించుకున్నట్టు ప్రధానమంత్రి తన ప్రసంగంలో చెప్పుకు వచ్చాడు

రాంభూపాల్‌రెడ్డి వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. స్వార్థం విపరీతంగా పెరిగిపోయి మానవ సంబంధాలు నిర్వీర్యమైపోతున్న ఈ కాలంలో మానవత్వం మంచితనం ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి వీరు ఒక ఉదాహరణ...

 ఎందరో ఉదాత్తులు ఉత్తములు
అందరికీ వినమ్ర వందనాలు 🙏🏿

పరిచయం కర్త : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

No comments:

Post a Comment