Thursday, January 3, 2019

బిడ్డా ఎరుకేనా... (కవిత )

✍తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
°°°°°°°°°°°°°°°°°°°°
బిడ్డా ! నీకు ఎరుకే కదా...!?
ఇక్కడొక  'ప్రణయ' కావ్యం చిరిగిపోయింది...
ఓ 'అమృత' హృదయం అతలాకుతలమయ్యిది...
మనం అగ్ర వర్ణమో...అట్టడుగు వర్గమో ...!? ఏమో !?
రాజ్యాంగం మాత్రం మనకు కులం సూచీని అందించింది....
కులం పేరుతో బతకమని పురమాయించింది....
కులాలు వద్దు మహాప్రభో అంటూ
మానవతా మూర్తులో
అభ్యుదయ వాదులో
నెత్తి నోరూ బాదుకుంటున్నా
' కులాలు అనివార్యం ' అంటూ సర్కారే 
కెటాయింపులు కొనసాగిస్తున్నది...
మరి బిడ్డా నువ్వెంత? నేనెంత ?
నియంత్రణ వేళ్ళూనుకు పోయిన చోట
మన కులం వెంబడి మనం సాగిపోతామో
సమసమాజం కోసం కొట్లాడుతామో
ఏమో !?
ఇదంతా చూస్తూ ఎవ్వరో  ఏదో
నిర్ణయించాలనుకుంటారు ..
గీసుకుని ఉన్న  హద్దులు సరిహద్దులను
చెరిపేయాలనుకుంటారు... 
అంతలోపే ...
ఓ తండ్రి తళారిగా మారవచ్చు...
అందుకే బిడ్డా...
నేను చూపిన రంగుల ప్రపంచాన్ని
నేను తొడిగిన రెక్కలను
నేను పరిచయం చేసిన జీవితాన్ని
మరిచిపోవద్దు...!
నీవు ప్రేమవైపు మొగ్గక ముందే
ఇదిగో...నీకోసమో నీలాంటి వాళ్ళ కోసమో
కులాల మరకల్ని తొలగించమని
సర్కారుకు ఆర్జి పెట్టుకుంటాను....
అప్పుడు అందరూ సమానమే కదా
నేనే నీ పెళ్ళికి ముహుర్తాలు నిర్ణయిస్తాను...

No comments:

Post a Comment