Monday, January 28, 2019

కదిలే బొమ్మల కథలు

 టి .వి.రమణారెడ్డి(1921-1974)

బక్క పలుచగా పొడవుగా  గాలి వీస్తే ఎగిరిపోయే పర్సనాలిటితో పాత తరం ప్రేక్షకుల్ని తన నటనతో కడుపుబ్బ నవ్వించిన రమణారెడ్డి ...

తెలుగు ప్రజలకు సంపూర్ణ  నవ్వుల రసాన్ని అందించిన హాస్యపు విరిజల్లు !వీరి పూర్తి పేరు తిక్కవరపు వెంకటరమణారెడ్డి.హాస్య నటుడిగా ప్రపంచానికి పరిచయం అయిన వీరు , ఒక  నిర్మాతగా కూడా తన  సత్తా చాటుకున్నారు. కాని వీరి ఆసక్తి హాస్యం మీదే ! టి సుబ్బిరామిరెడ్డి వీరి సమీప బంధువు.
        వీరి మొదటి సినిమా 1951 లో ' మాయపిల్ల 'తో  ఆరంభమైన సినిమా ప్రస్థానం 1974 వరకు కొనసాగింది.సినిమాల్లోకి రాక ముందు వీరు నెల్లూరులో శానిటరి ఇన్స్ పెక్టర్ గా పని చేయడం జరిగింది.సినిమాల మీద ఆసక్తితో మద్రాసు రైలు ఎక్కినప్పటికీ....స్వతహాగా వీరికి మ్యాజిక్ అంటే ఎంతో ఇష్టం.కాబట్టి మ్యజిక్ ప్రదర్శనని  నటుడిగా తీరిక లేని సమయాల్లో సైతం కొనసాగించేవాడు.ఈ ప్రదర్శన ద్వారా వచ్చే డబ్బుల్ని 'సేవా సంఘాలకు ' విరాళంగా అందించేవాడు.
  సినిమాల్లో గొప్ప హాస్యాన్ని పండించే రమణారెడ్డి , నిజ జీవితంలో  మాత్రం మౌనంగా గంభీరంగా ఉండేవాడు.ముఖ్యంగా తన నటనతో అందరినీ నవ్వించే రమణారెడ్డి జీవితంలో తనని మాత్రం  ఆరోగ్య సమస్య కారణంగా  నవ్వించుకోలేకపోయాడు.వాస్తవానికి మొదటి నుండి  అనారోగ్యం రిత్యా బక్క పలుచగా ఉండే రమణారెడ్డికి నటన పరంగా అదే గొప్ప క్వాలిఫికేషన్ అయ్యిందని చెప్పవచ్చు. మొత్తానికి అనారోగ్యంతోనే  వీరు కలధర్మం పొందారు.వీరి స్వస్థలం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జగదేవిపేట.

▪️డా. ఎం .ప్రభాకర్ రెడ్డి (1935-1997)

విలక్షణ నటుడిగా తనదైన ప్రతిభను చాటుకున్న మందడి ప్రభాకర్ రెడ్డి...తెలుగు ప్రేక్షకుల్ని గొప్పగా అలరించిన గొప్ప నటుల్లో ఒకరు. విలన్ గా...క్యారెక్టర్ ఆర్టిస్టుగా  ...తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న ప్రభాకర్ రెడ్డి 1960 నుండి 1988 వరకు తీరిక లేకుండా నటనా యాత్ర కొనసాగించాడు.472 సినిమాల్లో నటించాడు.వీరు స్వతాహాగా ఒక డాక్టరు.ఉస్మానియా  నుండి ఎం.బి.బి.ఎస్ పట్టా పొందారు. వీరు మంచి రచయిత కూడా.వీరు కథల్ని సమకూర్చిన అన్ని సినిమాలు మంచి విజయాలు సాధించాయి. వీటిలో పచ్చని సంసారం , గృహప్రవేశం , ధర్మాత్ముడు , కార్తీకదీపం , పండంటి కాపురం , గాంధి పుట్టిన దేశం మొదలగుణవి ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి వీరి స్వస్థలం నల్లగొండ జిల్లా తుంగతుర్తి దగ్గర ఏటూరునాగారం.

✍️తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

No comments:

Post a Comment