Thursday, January 3, 2019

కొండవీటి రెడ్డి రాజులు

కొదమసింహాల గర్జన.....కొండవీడు రెడ్డి రాజులపాలన 女
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
                       1
     సేకరణ : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
 తెలుగుజాతి మహోజ్వల చరిత్రకు....
      తిరుగులేని సాహిత్య సముపార్జనకు....
      ఎదురులేని వీరత్వానికి...
      ఇంకని పౌరుషానికి...
      తొణకని పరాక్రమానికి....
     మారుపేరు కొండవీడు రెడ్డిరాజులు !!
   ఎవ్వరి పేరు చెబితే రోమాలు                   నిక్కపొడుచుకుంటాయో...మరెవ్వరి పేరు చెబితే శత్రువుల గుండెలు అదురుతాయో...వారే గండర గండలు రెడ్డిరాజులు...!
        వీరు.....
తమ అడుగుల చప్పుడు తోనే ప్రత్యర్థుల  శరీరంలో కంపనం తెప్పించగల రణధీరులు.....
      నర నరాల్లో నిదురించిన కదనాసక్తిని కంటి చూపుతూనే మేల్కొల్పగల  యుద్దనినాదాలు....濾
  
    రెడ్డిరాజులు పాలించిన కొండవీడు ప్రాంతం...గుంటూరుకు 12 km దూరానా ప్రస్తుతం అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నది. ఘన చరితను జాతికి అందించిన ఈ కోట శిథిలావస్థలోనూ వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నది....నిన్నటి విజయాల ప్రమాణంగా కూలిన గోడల్లోనూ చెదరని ధీమా తొణికిసలాడుతున్నది...
    అక్కడి రాళ్ళు రప్పలు  ధీరుల రహస్యాలు వివరిస్తాయి....
       అక్కడి చెట్టు పుట్ట గెలుపు  కథలను తమ వసంతంగా పులుముకుని  వికసిస్తుంటాయి...  
      అక్కడి ప్రకృతి పోరాటాల ఆనవాళ్ళను తన ఉనికిగా ప్రకటించుకుని నిరుడి గాథల  శ్వాసగా మనుగడ సాగిస్తున్నది..
    అక్కడి అడుగడుగున గుర్రపు డెక్కల చప్పుడులు...కత్తుల కోలాటాల సవ్వడులు...వహవ్వా అనెడి జ్ఞాపకాలు.. భళా అనిపించే  జారవిడుచుకున్న గురుతులు... !
   ఆంధ్రదేశపు రాజకీయ చరిత్రలో కొండవీడు అనగానే గుర్తుకు వచ్చే మొదటి పేరు రెడ్డిరాజులు.కాకతీయ సామ్రాజ్యంలో చివరివాడైన ప్రతాపరుద్రుని వద్ద సేనానిగా పనిచేసిన ప్రోలయవేమారెడ్డి  క్రీ.శ.1324 లో అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర్యంగా రెడ్డిరాజ్యాన్ని స్థాపించాడు. క్రీ.శ.1325 లో రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చుకుని , క్రీ.శ. 1350 వరకు తనదైన పాలన కొనసాగించాడు.  మహాభారతం రచించిన కవిత్రయంలో ఒకరైన ఎర్రన వారు కళాప్రియుడైన   ఈ ప్రోలయవేమారెడ్డి ఆస్థాన కవిగా కొనసాగడం ఒక అద్భుతం.
     వేమారెడ్డి కుమారులు...అనపోతారెడ్డి , అనవేమారెడ్డిలు.వీరు కేవలం తండ్రి తర్వాత క్రీ.శ. 1383 వరకు మాత్రమే పాలన కొనసాగించారు.
     అనపోతారెడ్డి కుమారుడు కుమారగిరిరెడ్డి క్రీ.శ. 1383 లో వారసత్వంగా సింహాసనాన్ని అధిష్టించి క్రీ.శ.1400 వరకు ఎదురులేకుండా తన పాలన సాగించాడు.ఇతడు గొప్ప విద్వాంసుడు...రసికుడు...కళాపిపాసి...భోగశీలి..ప్రత్యేకంగా సంగీత నాట్యకళా ప్రవీణుడు.ఈ క్రమంలో ' వసంతరాజీయం ' పేరుతో నాట్యశాస్త్ర గ్రంధాన్ని రచించాడు.
      కుమారగిరిరెడ్డి కళల యందు ఆసక్తి కలవాడై ప్రజలతో మమేకం కావడం కంటే తనదైన సాహిత్యలోకంలో విహరించడం మొదలెట్టినప్పుడు ....రాజ్యపాలనా బాధ్యతలను అతడి సోదరి భర్త అయిన కాటయవేమారెడ్డి సమర్థ వంతంగా తానే రాజై చూసుకున్నాడు. అందుకే కుమారగిరిరెడ్డి పాలన ఎదురులేకుండా కొనసాగింది. కాగా కాటేయవేమారెడ్డికి తర్వాతి కాలంలో కుమారగిరిరెడ్డి ' రాజమహేంద్రవరం 'సీమను అరణంగా ఇచ్చాడు  ఈ విధంగా రాజమహేంద్రవరంలోనూ రెడ్డిరాజ్య శాఖ ఏర్పడింది.
       కుమారగిరిరెడ్డి తర్వాత అతడి పినతండ్రి అనవేమారెడ్డి కుమారుడు పెదకోమటి వేమారెడ్డి సింహాసనాన్ని అధిష్టంచాడు.ఇతడు క్రీ.శ.1400 నుండి 1420 వరకు పాలన చేసాడు. వీరు కూడా గొప్ప విద్వాంసులు. సంస్కృతభాషా కోవిదుడు.అట్లాగే వీరాధివీరుడు..卵 శాస్త్రం...అస్త్రశస్త్రం...రెండూ తెలిసిన ఉద్దండుడు.కాబట్టే తెలంగాణలో రాచకొండ వెలమ రాజులను ...అటు విజయనగరరాజులను తన యుద్దనీతితో వణికించాడు.రెడ్డిరాజ్యంపై ఈగ కూడా వాలకుండా సమర్థవంతంగా కాపాడుకున్నాడు.  ఇతడి ఆస్థానకవి కవిసార్వభౌముడు శ్రీనాథుడు.
      వీరుడైన పెదకోమటివేమారెడ్డికి రాజమహేంద్రవరం సీమను కాటేయ వేమారెడ్డికి ధారాదత్తం చేయడం మొదటి నుండి ఇష్టం లేదు. కాబట్టే కాటయవేమారెడ్డికి పెదకోమటి వేమారెడ్డికి శతృత్వం ఏర్పడింది.బద్ద శతృవులుగా మారిపోయారు.
      పెదకోమటి వేమారెడ్డి కుమారుడు రాచవేమారెడ్డి. ఇతడు అసమర్థుడు కావడంతో కొండవీటి రెడ్డిరాజుల ప్రాభవం క్రమంగా పతనావస్థకు చేరుకుంది. ఆ తర్వాత అక్కడ విజయనగర రాజుల కేతనం రెప రెప లాడింది.
కొండవీడులో కత్తులబావి....
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°సేకరణ : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
      కొండవీడు....!
     గుంటూరు జిల్లా యడ్లపాడు మండలానికి సమీపంగా వున్నది. పూర్వం ఈ కొండవీడును   ' కిండిన నగరం ' ' గోపినాథ పురం ' ' మోర్తాజ నగరం ' పేర్లతోనూ పిలిచినట్టుగా తెలుస్తున్నది. ఇక్కడ రెడ్డిరాజులు నిర్మించిన కోట ఒక పురాతన కోటగా నేడు  వన్నె తగ్గినా విలువ తగ్గని పసిడిలా చారిత్రకారుల   ఔత్సాహికుల   దృష్టిని ఆకర్శిస్తున్నది.
      సైనికశక్తికి యుద్ద వ్యూహ ప్రతివ్యూహాలకు మారుపేరైన  ఈ కొండవీడు కోట పరిధిలో అత్యంత   ప్రత్యేకత ఉన్న ప్రాంతం   గోపీనాథ దేవాలయం ! దీన్నే కత్తులబావి    అంటారు.చీకటికోనేరు అనే మరో పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. శిల్పకారుల నైపుణ్యం...చాతుర్యం...ఇక్కడ సాటిలేని శిల్పకళావైభవానికి ఊపిరులూదింది.
       ప్రస్తుతం నీతి మరిచిన వ్యక్తుల కారణంగా  విచ్చలవిడిగా నిధల వేటలో భాగంగా కోటలో  కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాజుల హయాంలో అక్కడ మణులు, మాణిక్యాలు, బంగారం తదితర విలువైన లోహాలను భద్రపరచి ఉంటారనే అంచనాలతో.... అపోహలతో...దురాశతో...చారిత్రక నిర్మాణాల ఆనవాళ్ళను నిర్దాక్షిణ్యంగా  నాశనం చేస్తున్నారు. జాతి సంపదలపై అఘాయిత్యాలకు  పాల్పడుతున్నారు.
      వినాశనాన్ని గమనిస్తే...రాజుల సొమ్ము రాళ్ళపాలు మాటకు నిలువెత్తు నిర్వచనం కొండవీడు కోట ! ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టిన ఈ కోటలో ఎన్నో కళలు ప్రోత్సహించబడ్డాయి...కృతులు ఆవిష్కరించబడ్డాయి...గ్రంధాలు గంధ పరిమళాలై వెదజల్లబడ్డాయి...పండితవాక్యాలు ప్రశంసలు అందుకున్నాయి...సాహితీ సభలు దేవమందారాలై విచ్చుకున్నాయి...ఎందరో జీవితాలు ఇక్కడ భవిష్యత్తుకు బాటలు వేసుకున్నాయి... కలలు  కల్పవృక్షాలు నాటుకున్నాయి...తరాలు కోట ఆలంబనలో మనుగడ సాగించాయి...రాజులూ వారి సంతానాలూ -బంధువులు-వారి వస్రి వేడుకలు ఇక్కడ కొత్త సంతోషాలకు తెరలు ఎత్తాయి. అట్లాంటి ఒకనాటి మహావైభవం ఇప్పుడు భరించరాని నిశ్శబ్ధంలో కూరుకుపోయింది.
  కలలు ఆవిరైనట్టుగా...
  కళలు కరిగిపోయినట్టుగా...
  అయినవాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలే స్తబ్ధత ఇక్కడ అణువణువుని ఆవరించి ఉన్నది. అలనాటి సంగతులను గుచ్చి గుచ్చి గుండెలవిసేలా చెబుతున్నట్టుగా ఉన్నది...
      మొదటి మండపం కప్పునకు ఉన్న పెద్ద రాళ్లను పూర్తిగా  తొలగించేశారు. అంతరాలయంలో ఉత్తర మండపానికి పక్కనున్న కుంభాకార స్తంభాన్ని గుండెలు పగిలే రీతిలో   తొలగించారు.  ఈ కుంభాకార స్తంభం పునాదుల్లో తవ్వకాలను అదును చూసి కొనసాగిస్తున్నారు.  అంతరాలయం పైకప్పును  కూడా  తొలగించారు. గర్భగుడిని కత్తులబావిగా భావించి విలువైన లోహాల కోసం విచ్చలవిడిగా తవ్వకాలను కొనసాగిస్తున్నారు.
     ముఖ్యంగా కాలక్రమంలో అనేకానేక ఒడిదుడుకులకు గురి కాబడుతున్న  ఈ కత్తులబావి గురించి చాలామందికి 'కత్తుల బావి అంటే ఏమిటి? '  'ఎట్లా ఏర్పడింది ? ' 'దాని వెనకవున్న కథ ఏమిటి? 'అనే విషయాలపైఅనేక సందేహాలు వునినాయి. ఈ విషయమై పరిశీలనలు పరిశోధనలు కొనసాగిస్తే...ఇక్కడవున్న ప్రాచీన ప్రాచీన శివాలయమే గోపినాథ ఆలయం.గోల్కొండ నవాబులు కొండవీడు మీద యుద్దం ప్రకటించి దండయాత్రలు జరిపిన సమయంలో ఆలయ పూజారి నవాబుల పక్షం వహించి కోట రహస్యాలను వారికి చేరవేస్తాడు .ఇట్లా తనను పోషిస్తున్న రెడ్డిరాజులవారిని ఆ పూజారి వంచించిన  సంగతిని  రాజావారు గ్రహించడం జరిగింది. ఇట్లాంటి విపత్కర సమయంలో రెడ్డిరాజులు శివదర్శన మార్గంలో   ఒక బావిని తవ్వించారు.శత్రు సైనికులు ఆ మార్గం గుండా కోటలోకి ప్రవేశించే ప్రయత్నంలో ఈ బావి వాళ్ళను నిలువరించే వ్యూహంగా రచింబడినది. ఈ విధంగా  అటు నవాబులను ఓడించిన రెడ్డిరాజులు ....ఇటు పూజారిని శిక్షిస్తారు.
యుద్దసమయంలో తవ్వించిన బావి కాబట్టి ఇది కత్తులబావిగా ప్రసిద్ది చెందినది. రహస్య వ్యూహం కాబట్టి చీకటికోనేరుగానూ పిలవబడినది.ఈ బావి 14 వ శతాబ్దంలో తవ్వించబడినట్టుగా తెలుస్తున్నది. కచ్చితమైన ఆధారాలు లభ్యం కాలేదు.
           ఈ ప్రాంతాన్ని గజపతులు... విజయనగరరాజులు....బహుమని సుల్తానులు...రెడ్డిరాజుల తర్వాత పాలించినప్పటికీ  ఈ కోట పేరు వింటేనే రెడ్డిరాజులు గుర్తుకు వస్తారు. అది వారు సాధించి అక్కడ వేసుకున్న బలమైన ముద్ర !
        శత్రుదుర్బేధ్యమైన కొండవీడు కోటకు ప్రోలయవేమారెడ్డి హయాంలోనే పునాదులు వేయగా ...వారి కుమారుడు అనపోతారెడ్డి కోట నిర్మాణాన్ని పూర్తి చేసాడు.
       కళాప్రియత్వంతో అలరాడిన రెడ్డిరాజుల సాహితీ సౌరభాలు ....వీరత్వంతో చెలరేగిన వారి  సమర సంకేతాలు.... ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఒక ఉద్వేగపు రహస్య అచ్చాదనలై గుండెను తడుతుంటాయి. ఆ భావ ప్రకంపనలను తట్టుకోవడం నిజంగా కష్టమే సుమా..
         కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులలోకి వెళ్లే సౌకర్యం ఉన్నది. కొండకింద  కత్తుల బావి ఉన్నది. ఇక్కడే  వేణునాథస్వామి దేవాలయం చూడవచ్చు.
           శ్రీకృష్ణదేవరాయలుప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలు..... కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు....శాసనాలు... 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నీటికొట్టు , ఖజానా, వంటి అలనాటి చారిత్ర సంపద ఒక చరిత్ర పుస్తకాన్ని తెరిచూస్తున్నట్టుగా ఉన్నాయి..
     తరాలు మారినా...పాలకులు మారినా...ఈ  దుర్గం రెడ్డిరాజుల కోటగా గుర్తింపును కొల్పోక పోవడం వెనకాల  రెడ్డిరాజుల అసమాన ప్రతిభా పాటవాల పాత్ర అనివార్యంగా కనిపిస్తున్నది..
       卵కత్తులబావిలో తవ్వకాల గురించి తెలుసుకున్న చంఘిజ్‌ఖాన్‌పేట, కోట, కొత్తపాలెం, హౌస్‌గణేష్‌ ప్రాంతానికి చెందిన అభిమానధనులు  అప్రమత్తులయ్యారు.ఆగంతకులపై వీరావేషం ప్రకటించారు. రాజులు పోతూ పోతూ తమ ప్రాంతానికి ఒక గుర్తింపుగా మిగిల్చి వెళ్ళిన చారిత్రక సంపదను కాపాడుకోడానికి నడుం బిగించారు.అయినప్పటికీ ఎప్పుడో ఒకసారి తవ్వకాలను మూర్ఖులు కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తానికి  కోటలో అభివృద్ధి పనులు ప్రారంభమై....అవి ఒక అంకితభావంతో కొనసాగి  ఒక కొలిక్కి వచ్చేంతవరకు  కోటను  రక్షించుకోవాల్సిన బాధ్యత అటు సర్కారుకు ఇటు పౌరులకూ ఉన్నది .
          కొండవీడు కోటను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రస్తుతం దేశవిదేశీయులను సైతం ఈ కోట ఆకర్శిస్తున్నది. ముఖ్యంగా ఈ కోటను  తమ  జాతిగర్వకారణంగా భావిస్తూ వారోత్సవాలు జరుపుకుంటున్న రెడ్డి మిత్రులు సమిష్టిగా తమ వారసత్వ సంపదను అల్లరిమూకల బెడద నుండి కాపాడుకోవాల్సిన బాధ్యతను విస్మరించకూడదు.
           రెడ్డిరాజుల  పరిపాలనకు ముందు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం అక్కడ బౌద్ధనాగరికత ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.  వివరాల్లోకి వెళ్తే గుంటూరు అటవీశాఖ అధికారులు  అక్కడ   నిధుల కోసం తవ్వకాలు జరిపిన శివాలయం పరిసరాల్లో బౌద్ధ స్థూపాన్ని గుర్తించారు. స్థూపం సుమారు 12 అడుగుల వ్యాసార్థంతో ఉన్నది. నిర్మాణానికి లేత ఆకుపచ్చ, నాపరాళ్లు, నలుపు రంగు రాళ్లు వాడారు.
      ఇక్కడ కొండవీడు దర్గా గా పేరు పొందిన ఒక దర్గాకు సయ్యద్‌ ఖుదాదే ఫకిర్‌ షాఔలియా (దాదాపీర్‌) పేరు మీద  బాబా ఉరుసు జరుగుతుంది. వివిధప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. కొండవీడు నుంచి బాబా గంధ మహోత్సవం ఊరేగింపుగా బయల్దేరి తెల్లవారుజామున దర్గా వద్దకు చేరుతుంది.

No comments:

Post a Comment