Thursday, January 3, 2019

రాజా రాధా రెడ్డి -నాట్య కారులు

సదా  సమ్మోహనం
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° సేకరణ ; తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
వారి  శ్వాస  నాట్యం ...
వారి ఆశ  నవరసాభినయం....
వారి మాట ఆంగికం...
వారి నడకే ఓ అభ్యాసం ....
    కూచిపూడి అనగానే గుర్తుకు వచ్చేది సిద్దేంద్ర యోగి....! కూచిపూడికి కొత్త సొగసులు అనగానే గుర్తుకు వచ్చేది రాధ రాజారెడ్డి దంపతులు !
      ఒక్క కూచిపూడి నాట్య రంగం లోనే కాదు  సకళ కళాలోకానికి  రాజారెడ్డి  - రాధారెడ్డి దంపతులు   రాజా-రాధా రెడ్డిలుగా సుపరిచితులు !
          రాజారెడ్డి 1943, అక్టోబర్ 6 న ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ గ్రామంలో సామాన్య వ్యవసాయకుటుంబంలో జన్మించారు. రాధారెడ్డి 1952, ఫిబ్రవరి 15న జన్మించారు. వీరిది బాల్య వివాహం.
                 ఈ నాట్య కళా కోవిదులు ఆదిలాబాదు జిల్లాకు చెందినవారు.కాని ప్రపంచమే వీరి  స్వగృహం ! ప్రస్తుతం  వీరు న్యూ ఢిల్లీలో  ఔత్సాహిక నాట్య కళాకారుల కోసం 'నృత్య తరంగిణి  'అను నాట్య పాఠశాలను ఏర్పరిచి   కళాకారులను ప్రోత్సహిస్తున్నారు.
         రాజారెడ్డికి  ఇద్దరు భార్యలు . రెండవ భార్య  కౌసల్యారెడ్డి.వీరు కూడా మంచి కళా పిపాసి. నాట్య శిఖామణి....!
     రాజా రాధారెడ్డిలకు ఒక  కూతురు . పేరు యామినీ రెడ్డి . రాజా కౌసల్యారెడ్డిలకు  కూడా ఒక కూతురు . పేరు భావనా రెడ్డి. ఈ ఇద్దరు అమ్మయిలు కూడా  కూచిపూడి  నాట్యంలో ఆరితేరారు ..
        వేదాంతం ప్రహ్లాదశర్మ గారి దగ్గర రాధా రాజారెడ్డి దంపతులు క్రమశిక్షణ అంకితభావం  మేళవించుకుని శిష్యరికం చేసారు..     తర్వాత   1967 వ సంవత్సరం ప్రభుత్వ స్కాలర్షిప్ సహాయంతో ఢిల్లీలోని మాయారావ్ కళాశాలనందు కూచిపూడి నృత్యనభ్యసించారు. నాట్య మెళకువలను...ప్రయోగాలను...ఇక్కడ తెలుసుకున్నారు.
      రాజా రెడ్డికి చిన్ననాటి నుండి కూచిపూడి భాగవతం పైన ప్రత్యేక ఆసక్తి....మొదట ఏలూరులో చిన్న చిన్న నృత్య ప్రదర్శనలు ఇచ్చేవరకు తీసుకు వెళ్ళింది. ఈ ప్రయత్నమే  తరువాతి కాలంలో  భారతదేశములోనే కాకుండా  అమెరికా, క్యూబా, రష్యా, ఫ్రాన్స్ ఇట్లా ప్రపంచమంతటా నృత్యప్రదర్శనలు ఇచ్చేవరకు నడిపించింది.
      కృష్ణాసత్యలుగా శివపార్వతులుగా ఈ దంపతుల లయబద్ధ నృత్యం ఒక మాయాజాలంలా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సంప్రదాయ నృత్యరీతులకు పెద్దపీట వేస్తూనే కూచిపూడి నృత్యానికి ఆధునిక సొబగులద్దే వీరి హావభావాలు సామాన్యులను మాన్యులను ఒక గాట కట్టిపడేసి మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ క్రమంలో  నాటి ప్రధాని ఇందిరాగాంధీనే కాకుండా క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో వంటివారి నుండి ఈ దంపతులకు  ప్రశంసలు అందాయి.
        అవిశ్రాంతంగా....నాట్యమే ప్రాణంగా..తమ నాట్యప్రదర్శనలతో కూచిపూడి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన వీరి కృషి ...శ్రమ.... వృధా కాలేదు. ఎందరో నాట్య కళాకారులు వీరి శిక్షణలో తయారయ్యారు.. గురువులకు తగ్గ శిష్యులుగా వీరిలో ఎందరో కూచిపూడి సాంప్రదాయ ఒరవడిని కొనసాగిస్తూ  దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు.
       కూచిపూడి నృత్యరంగానికి వీరు చేసిన కృషికిగాను 1984వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీతోను 1991వ సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుతోను సత్కరించింది. 2000వ సంవత్సరంలో భారతదేశ తృతీయ అత్యున్నత పౌరపురస్కారమైన పద్మ భూషణ్ వీరిని వరించింది. 2010వ సంవత్సరంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు రాజారెడ్డి రాధారెడ్డిగార్లను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు.

No comments:

Post a Comment