Thursday, January 3, 2019

ఆత్మకూరు సంస్థానంలో అప్పంపల్లి ఘటన

సాయుధపోరాట చరిత్రలో ఒక పేజీ కావాలి....
ఆత్మకూరు సంస్థానంలో అప్పంపల్లి ఘట్టం
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
      సేకరణ : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
       నిజాం సంస్థానానానికి అనుగుణంగా అనుకూలంగా అనుబంధంగా కొనసాగిన సంస్థానాల్లో ఆత్మకూరు సంస్థానం ఒకటి !ఈ సంస్థానంలో భాగమైన  అప్పంపల్లి గ్రామ చరిత్ర ప్రసిద్దమైనది.1947_48 సంవత్సరాలలో  హైదరాబాదు సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయడానికి ముందు జరిగిన సాయుధ పోరాటంలో  ఈ గ్రామంలో జరిగిన సంఘటన మరువలేనిది.నిజాం అదనపు సైన్యం రజాకర్ల  అమానుష వైఖరికి ...దానవ నీతికి ...ఇక్కడ లిఖించబడిన రక్తచరిత్ర  నిజంగా ఒక రాతిశాసనం ! ఇది రజాకర్  రాతి గుండెల కఠోర శబ్ద నిదర్శనం !!
       తెలంగాణ  సాయుధ పోరాట చరిత్ర ఇప్పటికి సంపూర్ణంగా లిఖించబడలేదు అని చెప్పడానికి.... ఈ అప్పంపల్లి గ్రామానికి ఆ చరిత్రలో సముచితమైన స్థానం లభించకపోవడాన్ని నిలువెత్తు ఉదాహరణగా  చెప్పుకోవచ్చు.ఒక్క ఈ గ్రామానికే కాదు.. ఈ గ్రామం నుండి పోరాటంలోకి దూకిన ఏ ఒక్క వీరుడి పేరు కూడా సాయుధ పోరాట చరిత్రలో ప్రముఖంగా  పేర్కొనలేదు.
      ఇక్కడి వీరుల జాబితా ...పోరాట పటిమ.... ఇవన్నీ కేవలం సంధర్భం వచ్చినప్పుడు గుర్తుచేసుకోవడం తప్పిస్తే ఆ వీరత్వాల గురించిన గుర్తింపు ఎక్కడో మరుగున పడిపోయి వున్నది. తెలంగాణ ఇతర ప్రాంతాల్లో  ప్రస్తుతం రాజకీయ సామాజిక ప్రాంతీయ చరితలను పరిస్థితులను గమనిస్తే సాయుధ పోరాటంలో పాల్గొన్న ఎందరివో విగ్రహాలు  వారికి సంబంధిన ప్రాంతాల్లోనే కాకుండా వారి ప్రాంతాలను దాటుకుని వెలుస్తున్నాయి. మరి మన అప్పంపల్లి వీరులు ఎక్కడ వెలిసారు ? తెగించి పోరాటం చేసీ కూడా ఎందుకు వెనకబడిపోయారు ? కారణాలు ఏమిటి ? కులమా ? మతమా? ప్రాంతీయ విద్వేషమా ? ఇదేమైనప్పటికీ మన సంస్థాన వీరులు మన అడుగుజాడలు. వీరిని స్మరించడం ఒక్కటే కాదు...వీరి చరితలను పు :నలిఖించడం కూడా మన బాధ్యతే !
    సాయుధపోరాటం తుది దశలో హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన చాలా గ్రామాల్లో వీరోచిత సంఘటనలు చోటుచేసుకున్నాయి.ఈ క్రమంలో మన అప్పంపల్లి గ్రామంలోకి తొంగిచూస్తే... ఆ ఆనవాళ్ళు ఇప్పటికీ ఆ ఊరిని వదలలేదు. త్యాగాల సౌరభాలు ఊరి అణువణువును అంటిపెట్టుకుని ఉన్నాయి.
      7-10-1947 న ఆత్మకూరులో నిజాంకు వ్యతిరేకంగా  ప్రజలు జండా సత్యాగ్రహం జరిపిన సంఘటన పురస్కరించుకుని , సత్యాగ్రహ నిర్వాహకుల్లో ఒకరైన అప్పంపల్లి వాస్తవ్యుడు బెల్లం నాగన్నను అరెస్టు చేయడం కోసం పోలీసులు అప్పంపల్లి గ్రామాన్ని చేరుకున్నారు . విషయం తెలిసి  గ్రామ ప్రజలు నాగన్న ఇంటికి సమీపంగా ఉన్న రాగిచెట్టు వద్ద ఉన్న రచ్చకట్ట దగ్గర పోగయ్యారు.ప్రజలు ఏక త్రాటి మీద నిలిచారు. నాగన్న అరెస్టును ముక్త కంఠంతో ఖండించారు. దీంతో పోలిసులకు ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది.చూస్తుండగానే ప్రశాంత వాతావరణంలో  భయానకం చోటుచేసుకుంది. అయినప్పటికీ ప్రజలు వెనక్కి తగ్గలేదు.
        ప్రజల్లో  ఒకవైపు  నిజాం మీద వ్యతిరేకత ....మరోవైపు భారత్ లో విలీన కాంక్ష... మహా సముద్రమై  మహా జ్వలనమై చెలరేగుతుంటే ....ఆ క్రమంలో పొడచూపిన మొండితనాన్ని నిలువరించడం పోలీసుల తరం కాలేకపోయింది. ఈ  మొండితనం పోలీసుల సహనాన్ని పరీక్షించింది. దీంతో పోలీసులు రెచ్చిపోయారు. తమను నాగన్న ఇంటి వైపు  వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రజలపై  విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ పరిణామం ఒక్కసారిగా అక్కడ యుద్ద భూమిని  సృష్టించింది. అయినప్పటికీ  ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని చావో బతుకో అంటూ పారిపోయే ప్రయత్నం చేయలేదు.
     చివరి రక్తపు బొట్టును సైతం విముక్తి పోరాటానికి ధారపోస్తామనే అనన్య చైతన్యంతో  ఎదురునిలిచారు. తెల్లదొరలకు గుండెచూపిన ఆంధ్రకేసరిలా....నిజాంను వణికించిన ఆదివాసీ రగల్ జెండాలా....ఉక్కు పిడికిళ్ళు బిగించి ఉడికిపోయారు. ఈ సంఘటనలో పోలీసు తుటాలకు పదకొండు మంది అక్కడికక్కడే నేలకొరిగారు. అమరవీరులు ఎవ్వరు అనేది గమనిస్తే 
   臘‍♂️ 1.తంగేడి లక్ష్మారెడ్డి, 2తంగేడి రామిరెడ్డి , 3 .తంగేడి బాల్ రెడ్డి , 4. వడ్డెమాన్ నర్సన్న , 5.కటికే నాగమ్మ , 6.పోతురాజు ఈశ్వరయ్య , 7. చాకలి కుర్మయ్య , 8.హరిజన్ కిష్టన్న , 9.హరిజన్ తిమ్మన్న , 10.గొల్ల గజ్జలన్న ,11. కుర్వ సాయన్న...
     ఈ త్యాగధనులకు వందనం మొనరిస్తూ ఆనాటి ఘటనను కన్నీటితో వల్లె వేసుకుంటే గుండెబరువెక్కుతుంది. మానవీయత పూర్తిగా నశించి రాక్షసత్వం నడివీధులో నర్తించిన ఆ వేళ... నరకయాతన దిగంతాలకు ఎగిసింది నిజాం .నియంతృత్వానికి  పరాకాష్టగా  నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోసాయి.
       కొందరు స్థానికుల కథనం ప్రకారం గాయపడిన వాళ్ళలో కొందరు  కొన ఊపిరితో దాహాన్ని అర్తించారని...మరికొందరు సలుపుతున్న గాయాలను తాళలేక ఆ పక్కనే ఉన్న  దిగుడుబావిలోకి దూకేసారని ...నేటికిని తడి ఆరని కన్నీళ్ళతో ఆనాటి హృదయ వేదనను గుర్తుచేసుకుంటున్నారు.
     కాల్పుల కర్కశ క్రీడలో  ఎందరో గాయపడ్డారు. మరెందరో వికలాంగులై పోయారు. మాల కిష్టన్న ,ఈడిగ తిమ్మక్క , కల్వలి రామచంద్రయ్యలు  వికలాంగులుగా మారారని తెలుస్తున్నది. ఇట్లా పరిస్థితి విషమించినా ప్రజలు తమ పట్టు వదల్లేదు. ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవింతురు అన్నట్టుగా జనాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రాణాలకు తెగించి ముందుకొచ్చారు. భారత జాతీయ జెండాను తమ మనో : వాంచగా  ఆవిష్కరించిన బెల్లం నాగన్నకు బలమై బలగమై నిలబడ్డారు.
      అప్పంపల్లి గ్రామంలో  జరిగిన ఈ ఘటన దేశభక్తికి త్యాగనిరతికి ఒక గొప్ప నిదర్శనం. ఆత్మగౌరవ దర్శనం ఇక్కడ తిరుగులేనిది. అస్తిత్వం కోసం ఇక్కడి ప్రజల ఆరాటం సమున్నతమైనది. కన్నీళ్ళు సముద్రమైనా ..గాయాలు బతుకు చిత్రపటాలను చిద్రం చేసినా...తొణకని బెణకని ప్రజల ఆత్మస్థయిర్యం నిజంగా జయహో... !
     అప్పంపల్లి అమరుల స్మృతి  విస్మృతి కావొద్దు....
     పోరాట చరిత్రలో వారికి ఒక పేజీ కెటాయిద్దాం....
     యువతా ! మేలుకో...భావి తరాలకు ఈ గాయాల గేయాలను వినిపించే దిశగా సాగిపో...!

No comments:

Post a Comment