Tuesday, January 29, 2019

భండారు అచ్చమాంబ

తొలి తెలుగు కథా రచయిత్రి
భండారు అచ్చమాంబ
°°°°°°°°°°°°°°°సేకరణ :తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

మొన్నటి వరకు తెలుగులో తొలి కథగా గురజాడ అప్పారావు రాసిన 'దిద్దుబాటు' పేరును చదువుకున్నాము.ఈ కథ ఆంధ్రభారతి పత్రికలో ఫిబ్రవరి 1910 సంచికలో అచ్చయ్యింది.కానీ ఇప్పుడు అదే స్థానంలో అతడి కంటే ఎనిమిదేండ్లకు ముందే
' ధన త్రయోదశి ' పేరుతో కథ రాసిన అచ్చమాంబ పేరును  చదువుకుంటున్నాము. ఈ కథ
'హిందూ సుందరి ' పత్రికలో 1902 నవంబర్ సంచికలో అచ్చయ్యింది.ఈ పత్రికను ఆ రోజుల్లో మహిళల కోసం ప్రత్యేకంగా సీతారామయ్య గారు ప్రారంభించారు.
👉స్త్రీ ఆత్మ స్థయిర్యానికి...
స్త్రీ మానసిక వికాసానికి...
నిలువెత్తు సమాధానం అచ్చమాంబ !
సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు...మనో ధైర్యం ఉంటే ఆటంకాలు ఒక లెక్క కానేకాదు... అని నిరూపించిన ఉదాత్తమైన మహిళ అచ్చమాంబ !
వీరు 1874లో కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పెనుగంచిప్రోలులో సంప్రదాయక ఉన్నత కుటుంబంలో జన్మించారు.వీరి తండ్రి కొమర్రాజు వెంకటప్పయ్య. తల్లి గంగమాంబ . వెంకటప్పయ్య మునగాల సంస్థానంలో దివానుగా పనిచేసేవాడు. సేవానిరతి.. దాన ధర్మాలు..సాహితీ ప్రియత్వం ఇతడిలో పుష్కలంగా ఉండేవి. ఇవే లక్షణాలు తర్వాతి కాలంలో అచ్చమాంబ అందిపుచ్చుకున్నది.
👉అచ్చమాంబ 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తండ్రి మరణించడంతో కుటుంబం పరిస్థితి తలకిందులు అయ్యింది.అప్పటికి అచ్చమాంబకు 3ఏండ్ల తమ్ముడు ఉన్నాడు. అతడు ఎవ్వరో కాదు తర్వాతి కాలంలో తెలుగు భాషను ఉద్ధరించిన ఘనుడు విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకుడు తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాతగా చరితార్థుడు చరిత్ర పరిశోధనలు పరిచయం చేసిన ఆదర్శప్రాయుడు గొప్ప సాహితీవేత్త ఉత్తమ విజ్ఞానవేత్తగా ఖ్యాతి గడించిన కొమర్రాజు లక్షణారావు.
👉తల్లి గంగమాంబ  తన ఇద్దరు పసిపిల్లలను తీసుకుని తన సవతి సోదరుడైన భండారు మాధవరావు ఇంటికి వెళ్ళింది.అతడిది నందిగామ తాలూకా కంచెల గ్రామం. కాగా నల్లగొండ జిల్లా దేవరకొండలో ఉండేవాడు  నిజాం సర్కారులో ఇంజనీరుగా పనిచేసేవాడు .వివాహితుడు.మీనాక్షి అని అచ్చమాంబ కంటే కొంచం చిన్నదయిన కూతురు కూడా ఉండేది.  విశాల హృదయంతో భర్తను కోల్పోయి వచ్చిన అక్కను ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నాడు మాధవరావు. అయితే దురదృష్టవాశాత్తు అతడి భార్య చనిపోగా. మేనకోడలు అచ్చమాంబను పెళ్లిచేసుకున్నాడు. అప్పటికి అచ్చమాంబ వయసు పదేండ్లు మాత్రమే.
👉ఊహ తెలిసినప్పటినుండే చదువు మీద ఆసక్తి ఉన్న అచ్చమాంబకు పెళ్లినాటికి కూడా అక్షరం ముక్కరాదు. పైగా ఆడపిల్ల గడప దాటి బయటకు వచ్చినా తప్పు పట్టే సమాజం ఉన్నది. తోడుగా కట్టుబాట్లు ఎక్కువగా ఉన్న కుటుంబం. అయినప్పటికీ ఆమె నిరాశ చెందలేదు. తన ఆశ కోసం తన మనో బలాన్ని ఆయుధంగా మలుచుకున్నది.ఈ పరిస్థితిలో  తమ వద్దే ఉంటూ చదువుకుంటున్న తమ్ముడు ఆమెకు చీకటిని పారద్రోలే గురువై కనిపించాడు.అందుకే లోలోపల  పట్టు పట్టింది. ఇంకేం?  తమ్ముడు చదువుతున్నప్పుడు పక్కనే కుర్చూని వింటూ తన వినికిడి శక్తి ద్వారా వాగ్దేవిని వశపరుచుకున్న మానస పుత్రికగా  తనను తాను పునర్నిర్మించుకోగలిగింది. .కాబట్టే తొలి తెలుగు కథకు పట్టపురాణియై సాహితీ చరిత్రలో తన స్థానాన్ని పరిపుష్టం చేసుకున్నది. ఆధునిక తెలుగు సాహిత్యంలో కథాప్రక్రియ ఆరంభం కాని దశలోనే కథకు శ్రీకారం చుట్టిన కారణజన్మురాలు అచ్చమాంబ. నాకు తెలిసీ ఊకొట్టె కథలు ప్రాచీనకాలం నుండి ప్రచారంలో ఉన్నాయి కాబట్టి, ఆ ప్రభావంతో కథారచనకు వీరు ప్రయోగం చేసి ఉంటారనేది నా అంచనా.
👉భర్త ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలు తిరగవలసి వచ్చేది.ఈ క్రమంలో అతడికి నాగపూర్ బదిలీ అయ్యింది. అతడు తన భార్యా కూతురితో పాటుగా అక్క గంగమాంబను మేనల్లుడిని తన వెంటే తీసుకు వెళ్ళాడు.
👉వివిధ ప్రాంతాలు తిరగడం వల్ల తెలుగు భాషతో పాటుగా సంస్కృతం, హిందీ, మరాఠి, గుజరాతీ భాషల్లో అతి తక్కువ సమయంలోనే మంచి పట్టు సాధించగలిగింది అచ్చమాంబ. అంతేకాదు, సమాజాన్ని అవగాహన చేసుకుంది. తన ఆలోచనలకు పదును పెట్టింది. స్త్రీ విద్య కోసం తపించింది .స్త్రీ సమస్యల కోసం పోరాటం చేయాలని సంకల్పించింది కూడా. ఇందుకు భర్త తోడ్పాటును అందించాడు. ఫలితంగా 1902లో మచిలీపట్నంలో 'బృందావనం స్త్రీల సమాజం ' పేరిట ఒక స్త్రీ సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇదే తెలుగు ప్రాంతంలో తొలి స్త్రీ సంఘం. తర్వాత వివిధ ప్రాంతాలు తిరిగి చాలా చోట్ల సంఘాలను ఏర్పాటు చేసి, స్త్రీ చైతన్యానికి తన వంతు కృషి సలిపింది.
👉 సవతి కూతురు మీనాక్షికి కూడా 10 ఏండ్లకే పెండ్లి అయ్యింది.కానీ  ఆ పిల్లకు  ఆవెంటనే మొగుడి చనిపోయాడు.అస్థితిలో మీనాక్షి పరిస్థితి అచ్చమాంబని తీవ్రంగా కలిచి వేసింది.ఓదార్పుతో పాటుగా ఆ పిల్లకు ఆత్మ విశ్వాసాన్ని నూరిపోసింది. అప్పటికి అచ్చమాంబకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు. 
👉 ఈ దశలోనే ఒకటి రెండు సంవత్సరాల కాలంలోనే ఆమె తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించింది. ఆమె రాసిన కథలు గమనిస్తే.... 👇

1)  ధనత్రయోదశి  ( హిందూసుందరి పత్రిక, 1902)
2)  గుణవతియగు స్త్రీ (తెలుగుజనానా పత్రిక )
3)  లలితా శారదులు
4)   జానకమ్మ   (తెలుగు జనానా, 1902 మే)
5)  దంపతుల ప్రథమ కలహము (హిందూసుందరి, 1902   
                                                  జూన్)
6)   సత్పాత్ర దానము   (హిందూసుందరి, 1902)
7)   స్త్రీవిద్య (హిందూసుందరి, 1902)
8 )   భార్యా భర్తల సంవాదము (హిందూసుందరిపత్రిక1903
                                               జూలై)
9)     అద్దమును సత్యవతియును  (హిందూసుందరి 1903)
10)    బీద కుటుంబము (సావిత్రి పత్రిక 1904)
11)    ప్రేమా పరీక్షణము
12)   ఎఱువుల సొమ్ము బఱువుల చేటు
                 &
13)   ప్రేమ పరీక్షణము (1898 - అలభ్యం)
14)    ఎరువుసొమ్ము పరువు చేటు (1898 - అలభ్యం)
15)    క్రోషో అల్లిక మీద పుస్తకం (అలభ్యం)
16)    ఊలు అల్లిక మీద పుస్తకం (అలభ్యం
అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు) (చారిత్రక మహిళల జీవితాలు మృధుమధుర శైలిలో వర్ణితాలు ఇందులో ఉన్నాయి.)
17)ఒక శతకం  (అలభ్యం)
                  &
   అబలా సచ్చరిత్ర రత్నమాల (రెండు భాగాలు)
        తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు  సమాచారాన్ని  సేకరించి సహకారం అందివ్వగా  అచ్చమాంబ ఈ అబలా సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంథాన్ని తీర్చిదిద్దగలిగింది.
  ఈ  1000 సంవత్సరాల కాలంలో ప్రసిద్ధికెక్కిన భారత స్త్రీల కథలు ఉన్నాయి. . ఈ గ్రంథాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు తమ చింతామణి ముద్రణాలయంలో ప్రచురించాడు.
👉అచ్చమాంబ స్త్రీల కోసం పాటుపడినప్పటికీ ఆమెది తిరుగుబాటు మనస్తత్వం కాదు. భర్త చాటున నిలబడి, భర్త ప్రోత్సాహంతో ముందుకు నడిచింది. భర్త కూడా ఆమెను  ప్రాణ స్నేహితుడిగా అర్థం చేసుకున్నాడు. తమ్ముడి అండదండలు ఆమె సాహిత్య ప్రస్థానాన్ని పరిపుష్టం చేసాయి.
👉జీవితం అందంగా  ఆనందంగా సాగుతున్న సమయంలో ఆమె ఇద్దరు పిల్లలు మరణించారు.ఆ దుఃఖం ఆమెను కలిచి వేసింది. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఆమె అనాధ పిల్లలను చేరదీసింది.
👉1902లో కాంగ్రేస్ సమావేశాలు అచ్చమాంబలో స్వాతంత్ర భావజాలాన్ని రేకెత్తించాయి. జాతీయతను ప్రేరేపించాయి.ఆ సమావేశాల్లో పాల్గొనాలని ఉవ్విళ్లూరింది. అప్పుడు ఆమె మధ్యప్రదేశ్ లోని  బిలాస్పూర్ లో ఉన్నది. సరిగ్గా ఇదే సమయంలో అక్కడ ప్లేగు వ్యాధి ప్రబలింది. ఆ వ్యాధి గ్రస్తులకు ఆమె భర్త ఉద్యోగ ధర్మంలో భాగంగా సేవా కార్యక్రమాలను చేపట్టాడు. వద్దన్నా వినిపించుకోకుండా ఆ సేవల్లో ఆమె స్వచ్ఛందంగా పాలు పంచుకునే ప్రయత్నం చేసింది. కాని దురదృష్టవశాత్తు అదే ప్లేగు ఆమెకు సోకింది.
👉 ప్లేగు వ్యాధితో బాధ పడుతున్న అచ్చమాంబ కాళ్లకు  మేజోళ్ళు వాడాల్సి వచ్చింది. వాడకపోతే ప్రమాదం ప్రమాదం పెరిగే పరిస్థితి. ఆ కఠిన సమయంలోనూ  ఆమె తన వ్యక్తిత్వాన్ని అభిమానాన్ని కోల్పోలేదు. తాను  ధరించబోయిన మేజోళ్ళ మీద విదేశీ గుర్తులు ప్రాణం పోయినా పరవాలేదు అంటూ తన దేశభక్తిని చాటుకుంది. చివరకు ప్లేగు ముదిరి 1905 జనవరి 18న  బిలాస్పూర్ లో తన 31వ ఏట మరణించింది. బతికింది కొన్నాళ్లే అయినా జన్మకు సార్థకత సాధించుకున్న అచ్చమాంబ 1901 -1905 మధ్య కాలంలో అంటే కేవలం నాలుగేళ్ళ కాలంలోనే తరతరాల చరితలో మిగిలిపోయే ఘనతను సాధించగలిగింది.
👉 తెలుగు సాహిత్యంలో 'కొమర్రాజు అచ్చమాంబ' అనే మరొక పేరు కూడా వినబడుతుంది. ఈమె మన భండారు అచ్చమాంబ కాదు. మన అచ్చమాంబ మరణించిన సంవత్సరానికి కొమర్రాజు లక్షణారావుకు జన్మించిన మరొక ఆణిముత్యం. అంటే మన అచ్చమాంబకు మేనకోడలు అన్నమాట !

No comments:

Post a Comment