Saturday, April 20, 2024

అలిశెట్టి ప్రభాకర్( కవి -చిత్రకారుడు )

అలిశెట్టి ప్రభాకర్
( కవి -చిత్రకారుడు )
°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

తను వ్రణమై - అక్షర రణమై
తను క్షయమై - కవితలమయమై
తను మృతమై - పదముల కృతమై
అతడు.... అలిశెట్టి ప్రభాకర్!


#వివరాల్లోకి_వెళ్తే.....

చెదిరిన గీతై...మిగిలిన రాతై
అలసిన మాటై...ఆగని పాటై
సాహిత్యంలో పరిచయం అవసరం లేని పుట ! తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో 1954 జనవరి 12 న చినరాజం , లక్ష్మమ్మ దంపతులకు అలిశెట్టి జన్మించాడు. వీరు మొత్తం తొమ్మిది మంది తోబుట్టువులు కాగా వారిలో ఏడుగురు అక్కా చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు.

అలిశెట్టిది నిరుపేద కుటుంబం.తండ్రి చినరాజం కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆకస్మికంగా మృత్యువాత పడ్డాడు. 
అప్పుడు అలిశెట్టి వయసు 11 ఏండ్లు. తండ్రి మరణంతో బాల్యం గాయపడింది.

తల్లి నీడలో కరీంనగర్లో పదవతరగతి వరకు చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ కోసం సిద్దిపేట వెళ్ళాడు. కానీ చదువును కొనసాగించలేక పోయాడు. కుటుంబ కారణాల వలన తిరిగి సొంతూరు జగిత్యాల చేరుకొన్నాడు. కుటుంబ పోషణ కోసం తల్లికి సహకారం అందిస్తూ జీవన పోరాటం ఆరంభించాడు.

#ఫోటో_గ్రాఫర్_గా

చిన్నప్పటినుండి అలిశెట్టికి కళల మీద మక్కువ. అట్లా ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఏర్పడింది. తన అభిరుచి మేరకు సిరిసిల్లలో "రాం ఫోటో స్టూడియో" లో ఫోటోగ్రఫీ నేర్చుకొని, అందులో మెళకువలు ఔపాసన పట్టిన తర్వాత జగిత్యాలలో తన సొంత ఇంట్లో సొంతంగా " పూర్ణిమ ఫోటో స్టూడియో " ప్రారంభించాడు..1975 ప్రాంతంలో ఈ స్టూడియో పురుడు పోసుకుంది. అప్పుడు అలిశెట్టి వయసు 19 ఏండ్లు మాత్రమే.

జగిత్యాలలో స్టూడియో బాగా నడుస్తుంది. అలిశెట్టి ఫోటోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో కరీంనగర్‌లో 1979లో " శిల్పి ఫోటో స్టూడియో " ప్రారంభించాడు.

ఆ తర్వాత 1983 లో హైదరాబాద్లో 
"చిత్రలేఖ ఫోటో స్టూడియో " తెరిచాడు. తనలోని కళకు, తన అభిరుచిని జోడించి మంచి ఫోటో గ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

#చిత్రకారుడిగా -

పెన్సిల్ తో బొమ్మలు గీయడం అనేది అలిశెట్టికి బాల్యం నుండి ఉన్న ఒక అలవాటు. చిన్నప్పుడు దేవుళ్ళ బొమ్మలు, ప్రకృతి, జంతువులు, పక్షులు, 
విపరీతంగా గీసేవాడు. తర్వాత పత్రికల్లో వచ్చే బొమ్మల్ని అచ్చు తీసినట్టుగా చూసి గీసేవాడు. ఆ తర్వాత క్రమంగా సినీ నటులు అలిశెట్టి బొమ్మల్లో కనిపించసాగాయి. మొదట ఒక అభిరుచిగా అలవాటుగా బొమ్మలు గీసిన అలిశెట్టి కళ క్రమంగా జీవం పోసుకుంది. మంచి చిత్రకారుడిగా పదిమందికి ప్రచారం అయ్యింది. అట్లా తెలిసిన కవులు, రచయితలు, తమ కవితలకు కథలకు బొమ్మలు గీయించుకోవడం మొదలెట్టారు. అలిశెట్టి ప్రతిభ క్రమంగా పత్రికా రంగాన్ని తాకింది. పండుగలు పర్వదినాల సమయంలో ఆయా పత్రికలకు బొమ్మలు గీసే అవకాశం వచ్చింది.అట్లా చిత్రకారుడిగా కూడా అలిశెట్టి జీవితాన్ని ప్రారంభించాడు.ఈ జీవితం నుండే అతడి ప్రయాణం మెల్లగా సాహిత్యం వైపుగా సాగింది.

#కవితలకు_ప్రేరణ

అప్పట్లో జగిత్యాల సాహితీ మిత్రదీప్తి ఆయా సందర్భాల్లో కవితల పోటీలు నిర్వహిస్తూ ఔత్సహికులను ప్రోత్సహించేది. ఈ క్రమంలో మిత్రదీప్తి 
 నిర్వహించిన కవితల పోటీలకు వివిధ ప్రాంతాలనుండి కవులు ఉత్తరాల ద్వారా తమ కవితలను పంపేవారు. వచ్చిన వందలాది కవితలను చదివే అవకాశం, కవితల గురించి చర్చించే అవకాశం అలిశెట్టికి దక్కింది. ఇట్లా అలిశెట్టిలో నిక్షిప్తమై ఉన్న కవితా శక్తిని మిత్రదీప్తి తట్టిలేపింది.

#దిక్కారం_తెలిసిన_సంస్కార_కవి 

అలిశెట్టిది ధిక్కార ధోరణి. సంఘంలో పేరుకుంటున్న రుగ్మతలు, సమాజంలో పెట్రేగుతున్న అసమానత, మానవీయతను కాలరాస్తున్న హింస, రాజకీయాల్లో విజృంభిస్తున్న అనైతికం, శోకతప్త జీవితాలు, విధివంచితులు అలిశెట్టి కవిత్వాల్లో కనిపిస్తారు.

1975 లో "పరిష్కారం " శీర్షికతో అలిశెట్టి రాసిన కవిత
ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది.

ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే అలిశెట్టి నైజం. నిజాయితీ నిబ్బరం నిర్భయం అతడి కలంలో సిరాచుక్కలు. తలదించని అక్షరం అతడి ప్రాణం. ఊహా కవిత్వాలకు అభూత కల్పనలకు అలిశెట్టికి ఆమడదూరం. వాస్తవాన్ని
చంతాడంత వివరించకుండా ఒక్క వాక్యంలోనే అనంతమైన అర్థాన్ని అందివ్వడంలో అలిశెట్టి దిట్ట. వీరి భాష ఎంత సరళంగా ఉంటుందో ..... దాని వెనక అర్థం అంత కఠినంగా ఉంటుంది.

ఆర్ద్రతా హృదయాల కన్నీళ్లు తుడవడమే కాదు, వంచకులను దిక్కరించడం కూడా బాగా తెలిసిన కవి అలిశెట్టి.అంతే కాదు ఆయా వృత్తిల్లో బాధ్యతల్ని బలంగా గుర్తుకు చేయగల నేర్పరి కూడా.

"తను శవమై ఒకరికి వశమై
తను పుండై ఒకరికి పండై 
తను ఎడారై ఎందరికో ఒయాసిస్సై"
అంటూ వేశ్యల జీవితంలో వేదనను ఎంతో హృద్యంగా వినిపించగలిగాడు. వేశ్యల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ పదాలు నేటికిని ఉదాహరణలు అవుతున్నాయి. బాగా పరిశీలిస్తే అక్షరాలతో సముద్రాలు సృష్టించడం అలిశెట్టి ప్రత్యేకతగా అర్థం అవుతుంది.

#కవితా_సంకలనాలు 

1) ఎర్ర పావురాలు (1978)

1978 సెప్టెంబరు 9న విప్లవాత్మాకమైన చారిత్రాత్మకమైన సంఘటనకు జగిత్యాల వేదిక అయ్యింది. అది సుమారు అరకోటి ప్రజానీకం భూస్వామ్య వ్యవస్థ మీద విరుచుకుపడిన విప్లవోద్యమ సందర్భం. అనాటి ‘జైత్రయాత్ర’లో
నల్లా ఆదిరెడ్డి,మల్లా రాజిరెడ్డి,గద్దర్,అల్లం నారాయణ,
ముప్పాల లక్ష్మణ్‌రావు [గణపతి] శీలం నరేష్, లలిత, మల్లోజుల కోటేశ్వర్‌రావు [ కిషన్‌జీ] సాహు, కైరి గంగారాం, గజ్జెల గంగారాం, పోశాలు, అంగ ఓదెలు, నారదాసు లక్ష్మణ్‌రావులతో పాటు వేలాది మంది కదం తొక్కారు. జన సైన్యాన్ని ముందుకు నడిపించారు. ఈ జైత్రయాత్ర రష్యా గోడలపైన కూడా నినాదమై చోటు సంపాదించుకుంది.ఈ నేపథ్యంలో అలిశెట్టి తన అక్షరాలను ఎర్ర పావురాలుగా ఎగురవేశాడు. విప్లవ నాదమై ఎందరినో రగిలించాడు.
ఈ సంపుటిలో మొత్తం 46 కవితలు ఉన్నాయి.
బూడిద

సౌందర్య సౌధం కాలిపోయి
మిగిలిపోయిన బూడిద
ఆనాటి చరిత్ర....
ఆ బూడిదలో పొర్లే గాడిదల్లా
మనకెందుకు
ఇంకా అవే జ్ఞాపకాలు.....
వద్దు వద్దు
అది వసూలుకాని పద్దు
దాన్ని అసలే కోరద్దు
వెదురు బొంగుల్లాంటి
ఈ బ్రతుకులకే ఆ రంగు హంగులెందుకు ?
నీ ముందున్న కాలం
ఇనుమును నీ శ్రమతో కరిగించి
చక్కని శైలిలో మలుచుకో
సాధ్యమైనంత వరకూ

2)మంటల జెండాలు (1979)

 ఇది రెండవ కవితా సంపుటి. ఇందులో కవితలు అన్నీ కూడా అగ్ని పతాకలే. ఈ సంపుటిలో మొత్తం 34 కవితలు ఉన్నాయి 

3)చురకలు (1981)

కేవలం 18 పేజీల్లో వేసిన 80 ద్విపదల సంకలనం. వెల ఒక రూపాయి మాత్రమే. సాహిత్యంలో ఒక కొత్త ఒరవడి సృష్టించిన చురకలు తర్వాతి తరం కవులకు మార్గదర్శకం అయ్యింది.

న్యాయాన్ని ఏ కీలుకి ఆ కీలు
విరిచే వాడే వకీలు.....

అనేది చురక. నిజంగా కవిలో ఎంత లౌకికం? మరెంత
లోతైన దృష్టి?! 

4)రక్త రేఖ (1985)

ఈ సంపుటీలో 38 కవితలు ఉన్నాయి.

5)ఎన్నికల ఎండమావి (1989)

▪️ఎన్నికల్లో 
ఓట్లడుక్కునే చిప్ప
టోపీ...

ప్రగతి వెంట్రుకలు
మొలవని బట్టతల
శంకుస్థాపన రాయి....

నాయకుడు
వాడు ముందే వానపాము
మరి ముడ్డెటో మూతెటో

▪️ఐదేళ్లకోసారి అసెంబ్లీలో మొసళ్లూ
పార్లమెంట్​లోకి తిమింగలాలూ
ప్రవేశించడం పెద్ద విశేషం కాదు
జనమే ఓట్ల జలాశయాలై
వాటిని బతికించడం విషాదం'

అంటూ సూటిగా వ్యాంగ్యంగా అక్షర బాకుల్ని
దింపిన కవి అలిశెట్టి.

6)సంక్షోభ గీతం (1990)
14 కవితల సమాహారం.
7)సిటీ లైఫ్ (1992)

1982 లో హైదరాబాదులో అలిశెట్టి కుటుంబం స్థిరపడింది. నగరజీవితాన్ని కళ్లారా చూసి.....అక్కడి కష్టాన్ని సుఖాన్ని మనసారా అనుభవించి....ఆ తర్వాత హైదరాబాద్ నగరంపై మినీ కవిత్వం రాశాడు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ళ పాటు వరుసగా ఈ కవితలు "సిటీ లైఫ్ " శీర్షికతో వచ్చాయి. ఈ సంపుటిలో 417 కవితలు ఉన్నాయి.

కాసుకో కోసుకో రాజకీయమా !
ప్రజలు పనసతొనలు
మీరు కత్తిమొనలు !! 

#విమర్శలు

వాస్తవం చెప్పాలంటే బతికి ఉన్నప్పుడు రాని గుర్తింపు అలిశెట్టికి చనిపోయాకే వచ్చింది. రాయడం వచ్చిన వాళ్ళే కాదు, రాయడం తెలియని వాళ్ళు కూడా అప్పట్లో అలిశెట్టి కవిత్వం గురించి విమర్శలు చేశారు. దీర్ఘ కవితలు రాయలేడని, చిన్న వాక్యాలతో సరిపెట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కానీ సూక్ష్మంలో బ్రహ్మాండాన్ని మోసిన ఆ కవితల విలువ ఆనాడు విమర్శకులు గుర్తించలేక పోయారు. ఏమైతేనేం.....ఎదురుదాడిని ఎదురుకుంటూ దీర్ఘ కవితలు కూడా రాసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు అలిశెట్టి.

#భాగ్యంతో_అనుబంధం 

అలిశెట్టి భార్య భాగ్యలక్ష్మి. ఎంతో ఇష్టపడి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు ధనానికి పేదరాలైనా గుణానికి శ్రీమంతురాలు భాగ్యలక్ష్మి. తాను క్షయ బారిన పడి
మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆమె చేస్తున్న సేవలు తలుచుకుంటూ రాసుకున్న కవితల్లో " నా భాగ్యం " అంటూ ఆ ఇల్లాలు కనిపిస్తుంది. హృద్యమైన ఆ కవితలు వారి అనురాగానికి అనుబంధానికి మధ్యన ఆర్ద్రతను ఆవిష్కరిస్తాయి.

మరణం నా చివరి చరణం కాదని ప్రకటించుకున్న అలిశెట్టి తనను సమీపించిన మృత్యువును పసిగట్టాడు. అయినా భయపడలేదు. ఒకవైపు మృత్యువుతో యుద్ధం చేస్తూనే మరోవైపు చావు ఎప్పుడు తనతో కారచాలనానికి చేయి అందించినా అందుకోవడానికి సిద్దపడి ఉన్నాడు. చివరి చరణం కాదని ఎంత నిర్భయంగా ప్రకటించుకున్నాడో అంతే ధీటుగా మరణం తర్వాత కూడా అక్షరమై శ్వాసించాడు.

మృత్యువు తనతో కొట్లాడుతున్నప్పుడు
 " పర్సనల్ లైఫ్" అంటూ తన హృదయాన్ని ఆవిష్కరణ చేసాడు. తనలో భావాలకు బాధకు అక్షర రూపాన్ని అందిస్తూ తనని తాను ఓదార్చుకున్నాడు. పిరికితనంతో ఏడ్వడం తెలియని కవి, ఏడుపు జీవితాలను ధైర్యంగా ఓదార్చే కవి, కనిపించని కన్నీళ్లతో కన్నీటి వీణ మీటాడు.

తెర వెనక లీలగా
మృత్యువు కదలాడినట్టు
తెరలు తెరలుగా దగ్గొస్తుంది ..
తెగిన తీగెలు
సవరించడానికన్నట్టు
గబగబా పరిగెత్తుకొచ్చి నా భాగ్యం
గ్లాసెడు నీళ్ళందిస్తుంది.....

అంటూ తన చివరి రోజుల్లో పరిస్థితిని చెప్పుకున్న కవి, ఎవ్వరికి చెప్పకుండా ఆతర్వాత కొన్నాళ్ళకు అక్షరాన్ని ఆయుష్షును వదిలి ఒంటరిగా వెళ్ళిపోయాడు.

‘‘కలగా పులగంగా కలసిపోయిన రోజుల్లో
ఇంచుమించు ఒకే కంచంలో
ఇంద్రధనస్సుల్ని తుంచుకుని తిన్న రోజుల్లో
మా గుండెల్లో సమస్యలు మండని రోజుల్లో
సిగరెట్‌ పీకలాంటి నన్ను
సిగలో తరుముకొని
గాజు కుప్పెల్లాంటి నా కళ్ళలోనే
ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్ప
తులతూగే ఐశ్వర్యమో
తులం బంగారమో కావాలని
ఏనాడూ ప్రాధేయ పడలేదు''

అంటూ అనుకూలవతి ఐన తన భాగ్యాన్ని తలుచుకున్న కవిలో వేల వేదనలు కనిపిస్తాయి. ఈ ఒక్క కవిత చాలు భాగ్యం మీద ప్రభాకర్ కు ఉన్న అంతులేని ప్రేమనురాగాలను అర్థం చేసుకోవడానకి.

#వెంటాడిన_పేదరికం

దిక్కార స్వరాన్ని వినిపించిన ధీటైన కవి, పీడితుల కంఠ స్వరమై నినదించిన కవి, ఆర్తుల ఆకలి కేకై దోపిడీ దారుల మీద తిరగబడిన కవి, తన జీవితంలోనూ జీవితం తర్వాత కూడా పేదరికాన్ని అనుభవించాడు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణంలో అలిశెట్టి బొమ్మ చోటు చేసుకోవడం ఎంత భాగ్యమో.....ఆ భాగ్యం ధన రూపేణా తన జీవితానికి నోచుకోక పోవడం బాధాకరం. బతికినంత కాలం నిజాల్ని నిగ్గుతెలుస్తూ సమాజాన్ని మేలుకొలుపుతూ బతికాడే తప్ప ఏనాడు సంపాదన కొరకు ఆరాట పడలేదు.
అలిశెట్టి మరణం తర్వాత జీవిత భాగస్వామి భాగ్యలక్ష్మి జీవితంలో యుద్ధం మొదలయ్యింది.
తెలుగు విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు అటేండర్ గా ఉద్యోగం చేయడమంటే ఆమె ఆర్ధిక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

కుటుంబానికి సరిపడ ఆస్తులు సమకూర్చక పోయినా, తరతరాలు గర్వపడే గౌరవాన్ని గుర్తింపుని సమకూర్చిన అలిశెట్టి ..... ఒక్క తన కుటుంబానికే కాదు, తెలుగు సాహితీ ప్రపంచానికే గర్వ కారణం.

#కుటుంబం

అలిశెట్టికి భార్యా ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల చదువుల కోసం భార్య భాగ్యలక్ష్మి పడిన కష్టాలు అక్షర కోటిశ్వరుడు పై నుండి తిలకించి ఉంటే మాత్రం మళ్ళీ బతకడం కోసం భగవంతుడికి దరఖాస్తు కచ్చితంగా పెట్టుకునే వాడు.

 #సినిమారంగాన్ని_కాదంటూ 

తన కళ సమాజం కోసం, సమాజాన్ని మేల్కొల్పడం కోసం, సమాజాన్ని ఆలోచింపజేయడం కోసం అనే నిబద్ధతకు కట్టుబడిన కవి అలిశెట్టి. వృత్తి ప్రవృత్తి రెండిటిని రెండు భుజాలపై మోసిన కవి, తన కవిత్వాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడలేదు. సినిమా రంగం నుండి పిలుపు వచ్చినప్పుడు సున్నితంగా అవకాశాన్ని తోసిపుచ్చాడు. సినిమా అంటే వ్యాపారం. అక్కడ నిజాయితీకి కట్టుబడి సమాజం కోసం మాత్రమే రచనలు చేసే అవసరం లేదు. వ్యాపార దృష్టికి కట్టుబడి కలానికి సంకెళ్లు వేసి కలను సృజంచాల్సి వస్తుంది. ఇక్కడ మన నైజానికి విలువలేదు. ఏం చెబితే అదే రాయాలి. ఇష్టాఇష్టాలతో పనిలేదు. అందుకే సినిమా రంగాన్ని అనిశెట్టి వదులుకున్నాడు. లేదంటే లక్షలు గడించే వాడు. కానీ
అందరికీ ధనం తీపి అయితే.... అలిశెట్టి మాత్రం ఆ ధనానికి విలువ లేదని నమ్మాడు. అందుకే 
చివరి వరకు చిత్రకారుడిగా, ఫోటో గ్రాఫర్‌గా జీవితాన్ని కొనసాగిస్తూ కవిగా ఎదిగాడు. తన వృత్తి ప్రవృత్తిలను చివరి శ్వాస వరకు ప్రేమించాడు.

#కవితా_సంపుటాలు (మరణం తర్వాత )

ధ్వంసమౌతున్న మానవీయ విలువలు.... మసిబారుతున్న సామజిక విలువలు.....
వీటి గురించి బాధ పడిన విశాల తత్వం , రాజీ ఎరుగని మనస్తత్వం, ఇదే అలిశెట్టి జీవితం. ఇటీవలి కాలంలో వీరి కవితలు మొత్తం రెండు సంపుటాలుగా వెలువడ్డాయి.
1)సిటీ లైఫ్
2)అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం 

#పరలోకాలకు

1993 జనవరి 12న తన 37 వ ఏటా అలిశెట్టి పర లోకానికి ప్రయాణం అయ్యాడు. ఏ రోజైతే జన్మించాడో అదే రోజు మరణించడం యాదృచ్చికం. బతికి వున్నింటే మరిన్ని అద్భుతాలు సృష్టించే వాడు అని సాహితీకులం దుఖిస్తున్నది కానీ... 
కొంచెంలోనే జీవితకాల అద్భుతాన్ని సొంతం చేసుకున్న అనితరసాధ్యం అనిశెట్టి. తనదైన శైలిలో కవితలు రాసి, తనదైన వ్యక్తిత్వాన్ని చివరి వరకు నిలుపుకుని, జనాల్లో ఆలోచనా దృక్పథాన్ని..... సంస్కరణ దృష్టిని ...... విప్లవాగ్నిని..... సామాజిక చైతన్యాన్ని.... సాహిత్యభిలాషను...పరిపూర్ణంగా పెంపొందించిన అతి కొద్ది మంది కవుల్లో అలిశెట్టి ఒకడు. వారి దివ్య స్మృతి చిరస్మరణీయం.

మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు
మనోహరాకాశంలో విలపించే చంద్ర బింబం నా అశ్రుకణం కాదు
సిద్ధాంత గ్రంథ సారమేదీ వడబోయకున్నా 
సిద్ధార్థుడు వదిలి వెళ్లిన ఈ రాజ్యమ్మీద
నెత్తుటి ధారలు కడిగేందుకు
కవిత్వం నాకవసరమై ఆయుధమె నిలిచింది ....!!!!

రంగినేనిసుబ్రహ్మణ్యం ( కవి )


రంగినేనిసుబ్రహ్మణ్యం ( కవి )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

పువ్వు చిన్నదయితేనేం.... అల్లంత దూరాన్ని పరిమళమై పలకరిస్తుంది !
పాట కొంచెమైతేనేం... కొండంత  భావాన్ని సముద్రమై  చిలరిస్తుంది.... 
కొందరు వ్యక్తులు కూడా ఇంతే ! చిన్న జీవితాన్ని సుస్థిరం చేసుకుంటారు.  ఇందుకు నిదర్శనం రంగినేనిసుబ్రహ్మణ్యం !
వీరు బతికింది కొన్నాళ్లే అయినా సాహిత్య విస్తృతిలో  విశేషంగా కృషిచేశారు.  తమ వంశకీర్తిని, తమ ప్రాంతం గౌరవాన్ని, చిరస్థాయిగా నిలుపుకున్నారు.  
#పరిచయం :

ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన  రంగినేని రాజన్న, లక్ష్మీదేవమ్మ దంపతులకు 
1950 లో సుబ్రహ్మణ్యం జన్మించారు. వీరు మొత్తం  పన్నెండు  మంది సంతానం.  వీరిలో  సుబ్రహ్మణ్యం  పెద్ద వాడు, వృత్తి రీత్యా ఉపాద్యాయుడుగా కొనసాగాడు.  ఒకవైపు వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ... కుటుంబ పెద్దగా బాధ్యతను నెరవేరుస్తూ... మరోవైపు ప్రవృత్తిగా సాహితీ సేద్యం గావించాడు. వాగ్దేవీ కృపతో బహుముఖాలుగా తన ప్రఙ్ఞను ప్రదర్శించాడు.  పెద్దన్నగా పెద్దమనసుతో తన పేదరికాన్ని సైతం  ప్రేమతో జయిస్తూ తోబుట్టువులకు పెద్దదిక్కుగా నిలబడ్డాడు. కాబట్టే ఆ తోబుట్టువులు తమ పెద్దన్నను ఇప్పుడు తమ ఆత్మీయ దైవంగా భావిస్తూ
అడుగుజాడల్ని అనుసరిస్తున్నారు. 

ముఖ్యంగా వీరి బాల్యం గురించి చెప్పుకోవాలి. ఇద్దరు తల్లుల ముద్దుల కుమారుడిగా గడిచింది. అమ్మ, పెద్దమ్మల, పెంపకంలో  ""కుటుంబ వ్యవస్థకు"" గట్టి పునాదులే వేసాడు. కాబట్టి ఇప్పటికీ వీరి కుటుంబం సపరివారంగా కలిసి మెలసి జీవిస్తున్నది.  వివరాల్లోకి వెళ్తే బాలకిష్టమ్మ లక్ష్మీదేవమ్మలు అక్కచెల్లెళ్ళు. బాలకిష్టమ్మకు పిల్లలు కలుగనందున లక్ష్మీదేవమ్మను రాజన్న  పెళ్లి చేసుకున్నాడు.  ఆ కుటుంబంలో ఎక్కడా బేధాభిప్రాయాలు లేవు. కుటుంబ విలువలు ఆత్మీయమై కొనసాగాయి. 

#రచనలు : 

"సాహితీ సర్వస్వం_ సాగర మథనం " కవితా సంపుటి  సితపుష్పమాల, జీవనహేల, మనసు గీసిన చిత్రాలు, తూర్పు కన్నెర్రజేస్తే, అనే నాలుగు కవితా మాలికల  సమాహారం. సుబ్రహ్మణ్యం గారి కవితాశక్తికి  ఈ మాలికలు దర్పణం పడుతున్నాయి. 

రచించిన ఈ అన్ని రచనల్ని సంపుటాలుగా  ప్రచురిస్తూ తమ ఋణానుబంధానికి ఒక భాష్యం కూడా పలుకుతున్నారు కుటుంబ సభ్యులు. 

డా. సి. నారాయణరెడ్డి, నాయిని కృష్ణకుమారి, ఎల్లూరి శివారెడ్డి వంటి సాహితీ ఉద్దండులు సుబ్రహ్మణ్యం సాహితీ ఉషస్సును కొల్లాపూర్ యశస్సుగా అభివర్ణించారు.  ఇది వారికి మాత్రమే కాదు, కొల్లాపూర్ ప్రాంతానికి కూడా దక్కిన అపురూప గౌరవం. 

#ప్రతిభకు_గుర్తింపు :

లేత ప్రాయంలోనే పర్వతమంత ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న సుబ్రహ్మణ్యం గారికి సన్మానాలు సత్కారాలు వెదుక్కుంటూ వచ్చాయి. ఈ క్రమంలో వంశీ ఆర్ట్స్ థియేటర్స్ వారు 1977 _1978 సంవత్సరానికి గాను వంశీ అవార్డు విజేతగా ప్రకటించారు. ఆంధ్రపత్రిక యాజమాన్యం వీరి సహాయ సంపాదక సేవల్ని కోరుకున్నది. 

#కవితా_చైతన్యం  :

ఒకప్పుడు బతకలేని వాడు బడిపంతులు  అటువంటి పరిస్థితుల్లో బతుకును నేర్పిస్తూ సామజిక చైతన్యం, సామాజిక రుగ్మతల నిర్మూలన, ప్రధానాంశాలుగా తన ఆలోచనల  తోటల్లో  కవితలు పూయించాడు  రంగినేని.ఆనాటి సమాజంపై తన ప్రభావాన్ని చూపించాడు. ముప్పై ఏండ్లు కూడా నిండకముందే అప్పటికే ప్రముఖులుగా ఉన్న సాహిత్యకారుల వరసలో నిలబడ్డాడు  

"పస్తు "లను ఫలహారమిస్తూ 
"బాధ " లను ఆహారమిస్తూ. 
"గుండె మంటల రగులజేస్తూ 
"ఎండు డొక్కల ఛీదరిస్తూ 
ఎదిగి పోతున్నావు నరుడా 
ఎగిసిపడుతున్నావు జడుడా 

అంటూ సమాజంలో కొందరు శక్తులు ఆర్థిక శిఖరాలకు ఎగబాకుతూ.... శ్రామికుల నెత్తుటి కష్టాన్ని తమ ఇష్టా రాజ్యాలకై ఉపయోగించుకుంటున్న వైనాన్ని కవిగా  చీదరించుకున్నాడు. ఇటువంటి సమాజ శ్రేయస్సుని ఆశించే కవితలు సంపుటి నిండా సందడి చేస్తున్నాయి.వారి ఆశయాలు తరాలకు ప్రేరణ కావాలనే సదుద్దేశ్యంతో వారి వారసులు వారి పుస్తకాలను ప్రచురిస్తున్నారు. 

#కొల్లాపూర్_మామిడి :

కొల్లాపూర్ మామిడి పండ్లు నేడు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. మంచి దిగుబడికి రుచికి మారుపేరైన ఈ మామిడి పండ్ల పేరెన్నిక వెనుక రంగినేని కుటుంబం కృషి ఉన్నది. సుబ్రహ్మణ్యం తండ్రి గారు బట్టల రాజన్న  కుటుంబ పోషణ కోసం మొక్కల వ్యాపారం చేసినప్పటికీ, ఆ వ్యాపారంలో సమాజ హితాన్ని కూడా ఆశించాడు. ఈ క్రమంలో 1970-80 ప్రాంతంలో కొల్లాపూర్ ప్రాంతానికి లాభసాటి రకాలను శ్రమకోర్చి సరఫరా చేసాడు. అంతకు ముందు కొల్లపూర్ బేనిషా రకాలు లేవు. రాజన్న చలవతో నేడు కొల్లాపూర్ మామిడిపండ్లకు ప్రసిద్ధిగా మారింది. తండ్రి బాటలోనే సుబ్రహ్మణ్యం కూడా తన అక్షరాలతో సమాజ హితాన్ని ఆశించడం యాదృచ్చికం.

#రంగినేని_వారి_పాటలతోట

రాగమయి... అనురాగమయి...
త్యాగమయి.... ఆనందమయి....2
కాంతిని నిలిపే శాంతివి నీవై
భ్రాoతిని   వదలిన ఎడదవు నీవై
కలలు పూచిన నయనాల నీవై 2
కనరాని జగతికి కదలితివా  "రాగమయి "
మాయని గాధగా మదిలో నిలచి
మమతా వేణియా మధురిమలొలికి  "మాయని "
కలలో ఇలలో ఛాయాగ నిలిచి2
వలపు సిరుల వెలయించితివే
"రాగమయి "

 రంగినేని సుబ్రహ్మణ్యం గారు రచించిన ఈ పాటను కొల్లాపూర్ ఘంటసాలగా ప్రసిద్ధి చెందిన అల్వాల వెంకట నరసింహారెడ్డి గారు ఇటీవల ఆలపించారు. 

#వెళ్తూ_వెళ్తూ :

ఇంకా 
పచ్చని నా పాదాలనూ 
వెచ్చని గుండెలనూ 
మరులు గొలిపే  నా తనువు విలాసమునూ 
వెర్రిగా తిలకిస్తూ 
మరో లోకంలో ఉంటావా ? 

ఉంటే నీ తరం ఏం కావాలి? 
నీ జాతి ఏం చేయాలి? 
ఆలోచించు కవీ ! 
ప్రియతమ రవీ ! 

అందుకే 
వ్యర్థ సౌందర్యాన్వేషణలో పడక 
సాటి వారి కోసం 
నీ మనుగడను అంకితం చేయ్ 
అప్పుడే నీకు నిజంగా  శాంతి  దొరుకుతుంది 
అప్పుడే నీ సమస్యను పరిష్కరించే  
ఊహాలోచనం తెరచుకుంటుంది ..... 

అంటూ వెళ్తూ వెళ్తూ కవి తన సంకల్పాన్ని విన్నవించుకున్న తీరు ఆర్ద్రమైనది. వారి ఆలోచనలు విశాలమైనవి. కానీ కాలం కఠినమైనది  కవి రెక్కల్ని నిర్ధాక్షిణ్యంగా తుంచివేసింది. 

సద్గతి :

1979 లో రంగినేని సుబ్రహ్మణ్యంగారు శివైక్యం చెందారు. అప్పుడు వారి వయసు 29 సంవత్సరాలు మాత్రమే. 
ఒక అక్షరం ప్రభవిస్తే  వేల భావాలు ప్రజ్వరిల్లును ! 
అతడే రంగినేని !! 
నమస్తే సదావత్సలే మాతృభూమి !

సావిత్రిబాయి పూలే

 సావిత్రిబాయిఫూలే !
(3 జనవరి 1831 – 10 మార్చి 1897)
°°°°°°°°°°°°°°°°°°°°°°

వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

🙏ఒక అడుగు జాడ.... 
    ఒక వెలుగు నీడ... 
    ఒక మమతల మేడ... 
    సావిత్రిబాయిఫూలే !
🙏 కర్తవ్యాన్ని బతికించి, ఆశయాన్ని వెలిగించి, కార్యసాధనలో రాటుదేలిన భారతీయ సంఘ సంస్కర్తగా చరిత్ర సృష్టించి, మహిళా ప్రపంచానికి పతాక శీర్షికగా ఎదిగిన ఒక సాధారణ మహిళ సావిత్రీబాయి ! 

🙏ఉపాధ్యాయినిగా...రచయిత్రిగా... ఆమె జీవన ప్రయాణం ఒక ప్రణాళికాబద్దం ! నిబద్దతకు ఒక అద్దం ! అవిద్య, అంధకారం, స్త్రీ జాతిని నిర్వీర్యం చేస్తున్నప్పుడు రవళించాల్సిన వీణ మూగబోతున్నదేమిటని చిన్నబోయిన చిరస్మరణీయురాలు సావిత్రీబాయి ! అందుకే 
ఆధునిక విద్య స్త్రీజాతికి అత్యవసరం అని భావించింది. అప్పుడే స్త్రీలోకం దాస్య శృంఖలాల నుండి విముక్తి సాధిస్తుందని నమ్మింది. ఆ తర్వాత ఆమె ఇక ఆలస్యం చేయలేదు. తన భర్త జ్యోతిరావుఫూలే సహాయ సహకారాలతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించి..... తొలితరం మహిళా ఉద్యమకారిణిగా తన సత్తా చాటుకుంది !

🙏వర్గం, వర్ణం, అనే తరతమ తేడాలు లేకుండా ఒక స్వచ్ఛమైన సమాజాన్నిఆశించిన సావిత్రీబాయి, మహిళా హక్కుల కోసం పోరాటం చేయటం తన సామాజిక బాధ్యతగా అడుగులు ముందుకు వేసింది. 

🙏సమాజం నిండా మసిలా పేరుకు పోయిన కులతత్వాన్ని, అట్లాగే స్త్రీ మెదడును మనసును అణిచివేస్తున్న పురుషాధిక్యతను సావిత్రీబాయి నిరసించింది !ఈ క్రమంలో స్త్రీ శక్తిని నిరూపించుకుంది. గుండెలోని కసిని నెరవేర్చుకుంది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా స్త్రీ కేతనం ఎగురవేసింది. 

🙏 మహారాష్ట్ర -సతారా జిల్లా -నయాగావ్‌ అనే ఒక పల్లెటూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించిన సావిత్రిబాయి, చిన్నతనం నుండే చురుకైనది. ఏ పనైనా ధృడ సంకల్పంతో మొదలెట్టి సాధించేది. అది వంట కావొచ్చు... అల్లికలు కావొచ్చు...వెనకడుగు వేయడం ఆమెకు తెల్వదు. ఈ క్రమంలో 
చదువుకోవాలని ఎంతో ఆశపడింది. కానీ పుట్టింటిలో ఆమె ఆశ నెరవేరలేదు. 

🙏ఆనాటి సామజిక పరిస్థితుల్లో సావిత్రీబాయికి తొమ్మిదవ యేటనే వివాహం జరిగింది. జ్యోతిరావుఫూలెను ఆమె 1840లో వివాహమాడింది.అప్పుడు జ్యోతిరావుపూలే వయసు పన్నెండేళ్ళు.మొత్తానికి వివాహం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. భర్తే గురువుగా ఇంట్లోనే అక్షరాలు నేర్చుకుంది. తెలివిగా పాఠాలు చదివింది. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఆ తర్వాత మరెందరో జీవితాల్లో వెలుగులు నింపింది. 

🙏సావిత్రిబాయి తన చిన్నతనం నుండే సాటి స్త్రీ జీవిత కోణాల్ని పరిశీలించింది. అక్కడి బాధలు సమస్యలు అవగాహన చేసుకుంది. సమస్యలకు పరిష్కారాలు అన్వేషించింది.

🙏సమాజంలో ఎదురైన అవమానాలను సావిత్రీబాయి పట్టించుకోలేదు. ధైర్యంగా ముందుకి నడిచింది. పట్టుదలగా పనిచేసింది. కృషిని గెలిపిస్తూ కేవలం నాలుగు సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇరవైకి పైగా పాఠశాలలను ప్రారంభించి అందరికీ ఉచిత విద్యనందింది. 
సమస్యలను ఛేదించుకుంటూ స్త్రీ విద్యా వ్యాప్తి కోసం ఆమె నడుం బిగించిన సమయానికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వయసు చిన్నదైనా ఆశయం పెద్దది కాబట్టి, ఆమె ప్రయత్నాలను అడ్డుకోగలిగారే గానీ, ఆమె సంకల్పాన్ని ఎవ్వరూ కూడా తుడుపలేక పోయారు. ఈ క్రమంలో ఆమె జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. 

🙏 
◾️మహిళల హక్కులే మానవ హక్కులుగా నినదిస్తూ
#1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది సావిత్రిబాయి.  
◾️ వితంతువులకు శిరోముండనం చేయడాన్ని ఖండిస్తూ.... వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత #1860లో పెద్దఎత్తున సమ్మె చేయించింది. 
◾️1868 నుంచి అంటరానితనానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటానికి పిలుపునిచ్చింది. 
◾️1870 - 1896 సంవత్సరాల్లో దేశంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు కరువు రక్కసి కాటేసిన కుటుంబాలలోని దాదాపు 2,000 మంది అభాగ్యులకు ఆపన్న హస్తం అందించడం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే తమ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు
◾️ఆ తర్వాత1873 లో తన "సత్యశోధక్ సమాజ్ "ను ప్రారంభించింది. ఈ సమాజ్ ద్వారా బాల్యవివాహలను వ్యతిరేకించింది.వితంతు ఆచారాలను ప్రశ్నించింది. మూడనమ్మకాలను నిరసించింది. స్త్రీ సమాజాన్ని వణికించిన సతీసహగమనాన్ని మెడబట్టి గెంటే ప్రయత్నం చేసింది. పెండ్లిళ్లు పేరంటాలు వంటి అన్ని శుభకార్యాలు పురోహితులు లేకుండా చేయవచ్చు అంటూ ఈ సమాజం ద్వారా సగటు సమాజానికి చాటి చెప్పింది. 
కాగా ఆమె ఈ మొత్తం ప్రయత్నాల వెనుక భర్త జ్యోతిరావుపూలే ఉండటం గమనించాల్సిన విషయం. అట్లాగే ఈ సమాజ్ లో ఒక వితంతువుకు పుట్టిన సంతానమే వీరి కుమారుడుగా 
పెరిగి పెద్దవాడయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..... 
👉అన్ని విధాలుగా పరిణతి చెందిన సావిత్రీబాయి జ్యోతీరావు దంపతులకు సంతానం లేదు. తమ సమాజ్ లో వితంతువులకు ఆశ్రయం కల్పిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన సంతానాన్ని దత్తత తీసుకున్నారు.అతడి పేరు యశ్వంతరావు. పూలే దంపతుల సంతానంగా అల్లారు ముద్దుగా పెరిగాడు. 

🙏1854లో #కావ్యఫూలే పేరుతో ఆమె తను రచించిన కవితలను సంపుటిగా ప్రచురించింది.
 #పావన #కాశీ #సుభోధ్‌ #రత్నాకర్‌’ అనే రెండవ కవితా సంపుటిని 1891లో ప్రచురించింది. సావిత్రీబాయి మంచి వక్త. వీరి విలువైన ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తకరూపంలో ప్రచురింపబడ్డాయి. 

🙏 1890 నవంబరు 28న జ్యోతిరావుపూలే కాలం చేసాడు. ఈ దుఃఖ పరిస్థితుల్లో భర్త చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి.... కొత్త ఆదర్శానికి నాంది పలికారు.

🙏 1897 సంవత్సరంలో పూణే నగరాన్ని ప్లేగు వ్యాధి వణికించింది.ఈ విపరీత పరిస్థితుల్లో జనాలు నగరాన్ని వదిలి పారిపోతుంటే.... సావిత్రీబాయి మాత్రం ధైర్యంగా రోగానికి ఎదురు నిలిచింది. కొడుకు యశ్వంత్ తో కలిసి ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవలు అందించింది. రోగులను ఆదరించింది. వైద్య శిబిరాలు ప్రారంభించింది. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెను నిర్దయగా కాటేసింది. ఫలితంగా మార్చి 10, 1897 లో ఒక మానవీయ చరిత్రకు ముగింపు ఇస్తూ సావిత్రీబాయి మరణించింది.  

🙏ప్రస్తుతం సావిత్రిబాయి జయంతిని #భారతదేశమహిళా #ఉపాధ్యాయులదినోత్సవంగా జరుపుకుంటున్నాము. భారత ప్రభుత్వం ఆమె సేవలను గుర్తిస్తూ..... 1997లో ఆమె జ్ఞాపకార్థంగా తపాలా స్టాంపును విడుదల చేసి గౌరవం అందించింది.   

🙏 మహిళల్ని గుర్తించండి.... గౌరవించండి.. ఆదరించండి....వెన్నంటి నడవండి.. 
...ఆమె శక్తిని ఈ ప్రపంచానికి చాటండి ! జయహో మహిళా !!

ఆధారం : సావిత్రిబాయి జీవిత చరిత్ర

బాబూ దేవీదాసు

పాండిత్యం... వేదప్రవాహం...బాబూ దేవీదాసు
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
సమర్పణం : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

విద్వత్తు నిండిన మస్తిష్కం పద్యాన్ని ఒలుకుతూనే ఉంటుంది....
వైదష్యం నిండిన గంటం స్తోత్రం ఒకటి  రాస్తూనే ఉంటుంది....
పాండిత్యం నిండిన  పలుకు  పాటై పరిమళిస్తూనే ఉంటుంది....
జ్ఞానానికి మిత్రుడిగా
ద్వైత అద్వైత ద్వజముగా 
సారస్వత ప్రాంగణంలో వికసించిన 
బ్రహ్మ తేజస్సు
ఆర్హ విద్యా నిష్ణాత 
శ్రీ రాచలపల్లి బాబు దేవీదాసులవారు !
 
▪️పరిచయం :

ఒక వంక నెలవంక
ఒక వంక సురగంగ
శిరమున చలగంగ
శివుడునంగా.....

అంటూ దేవదేవుడిని వర్ణించిన బాబు దేవిదాసుల వారు ఒక  వేద ప్రవాహం.
వీరు 1/5/ 1952 లో పాలమూరు జిల్లా మిడ్జిల్ మండలం, రాచాలపల్లి గ్రామంలో జన్మించారు.3. వీరి తల్లిదండ్రులు కీ - శే మనోరమాబాయి కీ శే రామారావు  గార్లు.

సాంస్కృతిక వికాసానికి, సాహిత్య పోషణకు కళా విస్తృతికి, ఆత్మకూరు సంస్థానం  పెట్టింది పేరు. తిరుపతి  వెంకటకవులు  ఇక్కడ  తమ  పాండిత్యాన్ని ప్రదర్శించారు. ఆస్థానకవిగా  బుక్కపట్నం శ్రీనివాసచార్యులు వారు  అఖండ అక్షర  దీప సమూహాలను  సృష్టించారు. ఇక్కడి నేలపై  నడయాడిన ఆ సాహితీ వెలుగులను స్పృషించాలానే తపనతో  బాబు దేవీదాసులవారు  1980 వ  దశకంలో ఆత్మకూరు వైపు  నడిచారు.అక్కడే స్థిరపడ్డారు.

▪️ప్రేరణ

దేవిదాసుల వారు తన బాల్యం నుండి తన 20 ప్రాయం వరకు పూర్వ  నిజామాబాద్ జిల్లా కందుకూర్తి
గ్రామానికి వెళ్ళేవారు. ఈ గ్రామం గోదావరి తీరంలో  ఉన్నది.. ఆ గ్రామ పురాతన రామాలయం ఉన్నది.  క్షేత్రపాలకుడు ( ఇక్కడ కామ  (, ) పెట్టలేదని  రాద్దాంతం చేసిన  మేతావులకు   ఈ పోస్టు అంకితం). రామచంద్రమూర్తి స్వయంభూగా వెలిసాడు. దేవీదాసుల వారు శ్రీరాముడి సన్నిధిలో 20 సం ॥ వయస్సులోనే భాస్కర రామాయణం , శ్రీ మద్రామాయణ కల్పవృక్షం సంపూర్ణంగ పెక్కుమార్లు పారాయణం చేశారు . వీరి తండ్రిగారు పరమ రామభక్తుడు.... సంకీర్తనకారులు....!  వారి సొంత ఊరు  రాచాలపల్లిలో హనుమదాలయంలో 
కార్తీకాలు , విరాటపర్వం చదవడం భజనలు చేయడం చేసేవారు . వీరి తండ్రి గారితో  పాటుగా ఆ ఊరిలో చాలమంది కీర్తనకారులు , భజనపరులు ఉండేవారు .
దేవీ దాసులవారు ఈ కార్యక్రమాల్లో  పాల్గొనేవారు . అందులో పద్యాలు పఠించే వారు.. ఆ కీర్తనలన్నీ రాములవారిచుట్టే  పరిభ్రమించేవి .ఆ విధంగా  దేవీదాసుల వారి సాహిత్యాధ్యయనమునకు రాములవారి  పద్యాలె రాచబాట వేసినాయి . వీటన్నిటి ప్రభావమే ఇప్పుడు ఒక  గొప్ప పండితుడిని  తయారు చేసింది. 

▪️వృత్తి - ప్రవృత్తి 

కవిగా, పండితుడిగా,రచయితగా, వ్యాఖ్యాతగా,వ్యాసకర్తగా పరిశోధకుడిగా, ఉపన్యాసకుడిగా, విమర్శకుడిగా, బహుముఖీయ ప్రజ్ఞతో  తన  పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్న బాబు దేవిదాసులవారు
 M.A , B.O.L, చదివారు. తెలుగు గ్రేడ్ 1 ఉపాధ్యాయుడుగా పదవి  విరమణ పొందారు.

ఆంధ్ర సంస్కృత , మహారాష్ట్ర , హిందీ , భాషలందు వీరికి ప్రావీణ్యం ఉన్నది. జ్యోతిషం, సాముద్రికములు,  
ఆయుర్వేదములందు వీరికి ప్రవేశము ఉన్నది .

ఆత్మకూరు  నందు  వీరి స్వగృహం ఒక వేదనిలయం. ఒక  గ్రంధాలయం. నిత్యం యజ్ఞ యాగాలతో , కవితా పవనాలతో, గృహం  శోభళ్ళుతుంటుంది.

▪️పాండిత్యమే ఊపిరిగా

కావ్య పరిమళాల  కవన  చంద్రికలు వీరి పాళీ  సమున్నత ప్రవాహాలు. వీరి సృజనలు వేదంలా ఘోషిస్తుంటాయి. స్వర్ణంలా భాషిస్తుంటాయి. వీరి రచనా కలశంలో  అక్షర జ్ఞాన సింధువులను గమనిస్తే 
బాల గేయ పద్య సాహిత్యాలు వీరి ప్రస్థానంలో  కనిపిస్తాయి. 1970-71 ప్రాంతంలో వీరి రచనా కాలం  ప్రారంభం అయ్యింది.ఇప్పటి  వరకు  89 - 90 వరకు  పుస్తకాలు ముద్రించారు. 

👉బాల సాహిత్యం :

*  వచనం - రచనం 
 * నెహ్రు కథలు 

👉పరిశోధక విద్యార్థుల కోసం  :

* భారతీయ విజ్ఞానవేత్తలు,
*  సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సమగ్ర జీవిత చరిత్ర. ( తెలుగురాష్ట్రాల్లో  ఏకైక సమగ్ర గ్రంథం ) .
*  పాలమూరు పురా చరిత్ర ,

👉ఆధ్యాత్మిక  రచనలు :

* శ్రీ రాఘవేంద్రులు ( అనుగ్రహ సందేశం )
* ప్రశ్నోత్తర రత్నమాలిక ( వివరణాత్మక పుస్తకం )
* నిర్వాణ షట్కం = తాత్పర్య వివరణ )
* బ్రహ్మజిజ్ఞాస ( చతు సూత్రీ అనువాదం. )
* బ్రహ్మ విద్య 
* వేదవిజ్ఞానం ( పరిశోధన గ్రంథం ) 
* శ్రీచిద్గగనచంద్రిక ( ప్రౌఢ పద్యరచన)
* శంకరా  సద్గురూ ( శతకము )
* శ్రీ రామచంద్రుడా  ( శతకం )
* భజగోవిందం  ( సంగ్రహ  వ్యాఖ్య )
* మద్వాచార్య సిద్ధాంతము. 
* వసంతం - సత్యభామ ( పద్యకావ్యం )
* ఊర్వశి ( ఖండకావ్యము )
* అచ్చులో ఆర్ష సంస్కృతీ,
* శంకరభగవత్పాదుల రచనలు -వివరణ ,
* వేదభారతి ,
* వేదము విద్యుచ్ఛక్తి,
* జీవన సాఫల్యము ,
* నా కులదేవత ( పద్యాత్మికము ),
* శ్రీ విష్ణు సహస్రనామార్థసంగ్రహము
మొదలగునవి.

వైదిక సాహిత్యంలో 
అముద్రితాలు 10 వరకు ఉన్నాయి.

👉కరపత్రాలు :

సుమారు 500 కరపత్రాలద్వారా హైందవ సంస్కృతిని ప్రచారం  చేయడం జరిగింది.

👉ఉపన్యాసాలు :

తెలుగు ఉభయ రాష్ట్రాల్లో, అమెరికా దేశంలో, వేదము ఉపనిషద్ ఇతిహాసాల పైన అద్వైతం పైన ఉపన్యాసాలు  ఇవ్వడం  జరిగింది.

👉ఇతరములు : 

వేద ఉపనిషద్ లపై సుమారు 200 వ్యాసాలూ 
శతకాలు అద్వైత భావనతో రచింపబడ్డాయి. 
ఆదిశంకరులపై  రచనలు ప్రచురించబడ్డాయి. భారతీయ సంస్కృతిపై 
వందలాది వ్యాసాలు , పీఠికలు, అనేక పత్రికలందు సాహిత్య ఆధ్యాత్మిక వ్యాసాలు, విద్యా విషయాత్మక వ్యాసంగాలు,పద్యాలు , గేయాలు, అమవాదాలు  వివిధ ప్రక్రియలపై  విశ్లేషనాత్మక రచనలు  .
 ప్రచురితం అయ్యాయి. పలు  అధ్యాత్మిక గ్రంధాలకు  సంపదకత్వం  వహించారు. 

▪️రచనాశైలికి  ఉదాహరణలు

*గేయసాహిత్యం

నా పాటలో నీవు 
నాట్యమాడేవనుచు 
నీపాటలోనేను 
నిలిచాను దేవా !
నాచూపులో నీవు వేచియున్నాడవని 
నీ చూపులో నేను 
కాచుంటి దేవా !
నాగుండెలో నీవు 
నగ్నసుఖమైతంచు 
నీగుండెలోనేను 
దాగుందు దేవా !
నావీణలోనీవు 
భావమైనావంచు 
నీవేణులో నేను 
నిండుదును దేవా !

* అనువాద సాహిత్యం

గాథా సప్తశతి అనువాదం

హృదయ హరుడగు ప్రియుడు నాయెదుటనిలువ 
కర యుగమ్మున కన్నుల గప్పుకొందు 
కడిమి మొగ్గ విధంబున పులకరించు 
తనువు నెవ్విధంబున దాచుకొందు ?

* కృతులు

వేవేల కృతులను వేంకటేశుని కిచ్చి 
ఆనంద మందడే అన్నమయ్య 
శృంగార పథములో చేరడే క్షేత్రయ్య 
పదములు మువ్వ గోపాలబాలు 
ఆపాత మధురమౌ అపురూప గీతాల
రాముని గొలువడే రామదాసు 
హరికథా స్తపతియై ఆదిభట్ల మును న 
ర్తించడే నిన్నెంచి మించు వేడ్క 

* శతకం

నేరక నేనొర్చినయనేకదురాగత దుష్ట చేష్టలే
పేరిచి పెద్దపెట్టునను భీతిల జేయుచు నున్న వయ్యనా నేరము లెల్లసైచి కడు నెయ్యము నన్గరుణించి కావే తారక రామ దాసజన తాపనివారక రామచంద్రుడా !

▪️సన్మానాలు

పండిత సన్మానాలు   జరిగాయి. పురస్కారాలు లభించాయి.
ప్రభుత్వం నుండి 1995 సంవత్సరంలో 
పాలమూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగ  అవార్డు అందుకున్నారు.
 శ్రీశ్రీశ్రీ పుష్ప గిరి శంకరాచార్యల వేదశాస్త్ర రక్షణ పరిషత్ ద్వార సన్మానాలు  పొందారు.
 కొండాలక్ష్మణ బాపుజీ  అవార్డు పొందారు .

" కవిపరమేశ్వర  " " ఆర్హ విద్యా నిష్ణాత " 
మొదలగు  విశిష్ట బిరుదులు  లభించాయి.

సాహితీ స్రష్ట.... పాండిత్యంలో దిట్ట... దేవిదాసుల వారికి గౌరవ డాక్టరేటు ఇవ్వవలసిన  అవసరం  ఉన్నది.

▪️కాశీ  విశ్వేశ్వరుడి సేవలో

శ్రీoకార రూపిణిని , మఱి 
ఓంకారాత్మకునిసమధికోజ్వల సుకలా 
లంకృత ' మృత్యుంజయ ' బిరు  
దాంకితు - బర శివను, శివుని ధ్యానింతు మదిన్. 

తన శ్లోకమే  నైవేద్యంగా  ---
తన  భక్తే అభిషేకంగా ----
దేవదేవుడికి  తన అక్షరసుమ మాలలు అర్పించిన ఘనత  దేవిదాసుల వారికి  దక్కింది. ఫలితంగా.... కాశీ పుణ్యక్షేత్రంలో  ప్రతి నిత్యం దేవదేవుడి  సన్నిధిలో      దేవిదాసుల వారిచే  రచించబడిన శ్లోకములు వేద పండితుల చేత  పఠించబడుతున్నాయి.
ఇది కైలాసవాసుడి  కృప.

▪️దేవీదాసులవారి రచనలు-  కవిపండితుల  అభిప్రాయాలు

👉శంకరా సద్గురు
బాబుదేవీదాస్ రావు గారిని  చూసినపుడు నాకామూర్తిలో సదాచార సంపన్నుడైన ఒక వేద పురుషుడు దర్శనిమిచ్చాడు .
 -డా ॥ కపిలవాయి లింగమూర్తి డి.లిట్

* శంకరా ! సద్గురూ !
 ఒక పద్యకవిగా , శాస్త్రకవిగా , పండితకవిగా , విమర్శకునిగా , భావునిగా , ఆధ్యాత్మిక వేత్తగా , నవ్య సంప్రదాయకర్తగా , బహు పురాణజ్ఞునిగా , ఆశుకవిగా , ఉత్తమ సభానిర్వాహకులుగా , వేదధర్మాభిమానిగా భారతీనిరుక్తికి శిష్యులుగా , ద్వైతాద్వైత
సిద్దాంతాల తత్త్వాహగాహకులుగా , జాతీయవాదిగ , ముఖ్యంగా ఆధ్యాత్మిక జాతీయవాదిగా ప్రఖ్యాతిగాంచిన పరమ మిత్రులు శ్రీరాచాలపల్లి బాబుదేవీదాస్ రావు గారినికూడా శంకరా ! సద్గురూ ! అంటూ పిలుచుకుందాం . ఇంత గొప్ప శతకాన్ని అందించినందుకు సత్కరిద్దాం .

---ఆచార్య కసిరెడ్డి

👉బ్రహ్మజిజ్ఞాన
ఈ గ్రంథం సరళమగు భాషలో వివరించబడింది . చక్కని తెలుగుభాషలో రచింపబడిన ఈ గ్రంథం ఆధ్యాత్మిక రంగమున అడుగిడువారలకు అత్యంతముగ ఉపయోగపడును .

--శ్రీ పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ మదభినవోద్దండ శ్రీ విద్యానృసింహ భారతీస్వామి

👉శ్రీరాంఘవేంద్రులు
తెలుగునందు విద్వాంసులు డి.ఎల్ . బాబుదేవీదాస్ రావు గారిచే రచింపబడిన పుస్తకములోని శ్రీరాఘవేంద్ర స్వామివారి చరిత్రను మరియు వారిమహిమతో వ్రాసిన ప్రతిలో కొన్ని భాగాలను మాపాఠశాలకు చెందిన పండితులద్వార చదివించి చూడడమైనది . ' వారు ఈపుస్తకముద్వారా శ్రీరాఘవేంద్రులజీవిత చరిత్రను , మహిమలను చక్కని సరళమైన రచనతో పాఠకులకు అందించుటంలో కృతకత్యులైనారు .

--108 శ్రీశ్రీశ్రీ సుశమీంద్రతీర్ధ పాదులవారు పీఠాధిపతులు శ్రీరాఘవేంద్రస్వామి మఠం , మంత్రాలయం

ఇంకా గుంటూరు శేషంద్రశర్మ,
బ్రహ్మశ్రీ హరిలక్ష్మినరసింహశర్మ, ఆచార్య ఎస్ వి రామారావు, మాడుగుల నాగఫణిశర్మ  తదితరులు తమ  అభిప్రాయాలను తెలియపరిచి  ఉన్నారు.

▪️శాసన పరిష్కర్త

 వ్యయ ప్రయాసలకు  ఓర్చి పెద కడుమూరు శాసనాన్ని  పరిష్కరించారు. చరిత్రకు ఎక్కని గ్రామ నామాల మర్మాన్ని బహిర్గత పరిచారు.

▪️నిరంతర సాహితీ సేద్యం

ప్రస్తుతం బాబుదేవీదాసుల  వారి వయసు  70 సంవత్సరాలు. ఇప్పటికీ వారి కలం  చురుకుగా  రాస్తున్నది.  అక్షరమే  వారి ఆహారం, సంపూర్ణ రచనే  వారి  పానీయం !  నేటికిని ఆత్మకూరులో  పండిత సభలు నిర్వహించడం పలువురిని  సన్మానించడం  నిరంతరాయంగా  కొనసాగుతున్నది. నిరాడంబర జీవితం , ఉన్నత వ్యక్తిత్వం, వీరి సొంతం. 

ఎందరో మహానుభావులు  అందరికీ  వందనాలు 🙏🏼

గురువర్యుల చరవాణి సంఖ్య - 9701271906

ఎస్వీ .సత్యనారాయణ

 ఎస్వీ .సత్యనారాయణ
( అభ్యుదయ రచయిత - ఉద్యమశీలి )
~~~~~~~~~~~~~~~~

మట్టిలో మాణిక్యం....
శ్రమయేవ జయతే....
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది....
కోటికో నూటికో ఒక్కరు....
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు....
వంటి చైతన్య రూపాలకు నమూనా చిత్రం ఎస్ వి సత్యనారాయణ.
పేదరికం నుండి నుండి పొట్టి శ్రీరాములు తెలుగు తెలుగు విశ్వవిద్యాలయం  ఉపకులపతి వరకు  ఎదిగిన ఎస్వి.సత్యనారాయణ జీవితం   తన శిల్పాన్ని తానే చెక్కుకున్న  నిరంతర యుద్ధం  !

//వివరాల్లోకి వెళ్తే...//

1954 ఆగస్టు 16వ తేదీన హైదరాబాద్ పాత నగరం ఒంటెల బస్తీ ( గౌలిపురం ) లో రాధాబాయి విఠల్రావు దంపతులకు ఎస్పీ జన్మించాడు.  వీరిది  నిరుపేద కుటుంబం. తండ్రి  గౌలిగూడ లోని సారాయి దుకాణంలో పని చేసేవాడు. పెంకుటింట్లో  నివసించేవారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఒక పూట తింటే మరొక పూట కష్టంగా ఉండేది. చిన్నప్పటినుండి పఠనాసక్తి ఉన్న ఎస్వీ.., రాత్రి ఒంటిగంట వరకు వీధి అరుగులపై కూర్చుని వీధి దీపాల వెలుతురులో చదువుకునేవాడు. పాఠశాల సమయం అయిపోయాక ఇంట్లో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా  మిల్లులో బాల కార్మికుడిగా కూడా కొన్నాళ్ళు పనిచేశాడు. ఉద్యోగం వచ్చాక తన మొదటి జీతంతో  తమ ఇంట్లో విద్యుత్ సౌకర్యం సమకూర్చాడు. 

//16 ఏళ్లకే పదునెక్కిన కవిత్వం //

1939 లో గుండురావ్ హర్కారే, తన దత్తపుత్రుడు వెంకట్రావు  స్మారకార్థం స్థాపించిన లాల్ దర్వాజా సమీపంలోని వెంకటరావు స్మారక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఈ సమయంలోనే RSS శాఖకు వెళ్లేవాడు. అక్కడ దేశభక్తి గీతాలు క్రమశిక్షణ అదనంగా అలవర్చుకున్నాడు.
 ఎస్వి పదవ తరగతిలో ఉన్నప్పుడు  అభ్యుదయ రచయిత శ్రీపతి గారు  ఎస్వీ నోట్ బుక్ లో కవితల్ని గమనించి , కవిత శైలికి ఆశ్చర్యపోయాడు.

మానవత్వపు అమృతాన్ని ప్రపంచానికి రుచి చూపించటమే....
విశ్వ మానవుడు కోరేదీ, పోరాడేదీ ఈ అమృతం కోసమే....
నర పిశాచాల బాకుపోట్లకు
నరాలన్నీ తెగిపోయినా
ఓటమిని అంగీకరించకు.....
" రక్షించుకుందాం " శీర్షికతో ఎస్వి రాసిన ఈ కవిత్వాన్ని స్వయంగా శ్రీపతి గారే కరీంనగర్ నుండి వెలువడుతున్న విద్యుల్లత సాహితీ మాస పత్రిక కి ప్రచురణ కోసం పంపించడం జరిగింది. ఆ విధంగా గురువు శ్రీపతి గారి సహకారంతో ఎస్వీ తొలి కవిత 1970 మే నెల "విద్యుల్లత " సంచికలో ప్రచురితమయింది. అప్పుడు ఎస్వీ వయసు అక్షరాల 16 ఏళ్లు..

// 17 ఏళ్లకే అనువాదకుడు //

నాంపల్లి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. అక్కడ కవి, రచయిత, సామాజికవేత్త డాక్టర్ టీవీ నారాయణ జూనియర్ లెక్చరర్ గా పని చేస్తున్నాడు. సిడ్నీ హారీస్ రాసిన work work work పద్యాన్ని బోర్డుపై రాసి విద్యార్థులందరినీ తెలుగులోకి అనువదించమని చెప్పాడు. అత్యుత్తమంగా అనువదించిన వాళ్లలో ఎస్వీ ఒకరు 
 
// 18 ఏళ్లకే  అరసం వేదికపై ప్రసంగాలు  //

సిటీ కాలేజీలో  బియస్సి  సైన్స్ డిగ్రీ చదువుకున్నాడు. స్టూడెంట్ అయినప్పటికీ తెలుగు భాషా సాహిత్యాలపై గట్టిపట్టు ఉండేది.  ప్రముఖ తెలుగు కథా రచయిత్రి డాక్టర్ పరిమళా సోమేశ్వర్ దంపతులు ఇరువురు  డిగ్రీలో ఎస్వికి ఇక్కడ గురువులు.

 1972లో హైదరాబాద్లో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం మహాసభల వేదికపై పరిమళ సోమేశ్వర్ కథా సాహిత్య మీద, దాశరథి రంగాచార్య నవలా సాహిత్యం మీద ప్రసంగపత్రాల సమర్పించినట్టు ఈ దంపతులు పేర్కొంటున్నారు.

//18 ఏళ్లకే యువజన సంఘం స్థాపకుడు //

 ఎస్వీ కుటుంబం నివాసం ఉంటున్న బస్తీలో ఇంటి చుట్టుముట్టు కల్తీసారా కల్తీ కల్లు దుకాణాలు ఉండేవి.  ఈ కారణంగా అర్ధరాత్రి దాకా తాగుబోతులు వీధుల్లో తిరుగుతూ జనజీవనానికి ఆటంకం కలిగించే వారు. ఈ పరిస్థితుల్లో  సమాజం పట్ల బాధ్యత గల పౌరుడిగా బస్తీలోని యువకులను సమీకరించి  " మహోదయ యువజన సంఘం " నెలకొల్పాడు. అప్పుడు ఎస్వి డిగ్రీ మొదటి సంవత్సరం మాత్రమే చదువుతున్నాడు.  అయినప్పటికీ సామాజిక పరిపక్వతతో  మొండి ధైర్యంతో ఉండేవాడు సంఘం తరఫున సమస్యలను స్థానిక ప్రతినిధుల దృష్టికి తీసుకు వెళ్లేవాడు.   ఇందుకు తాగుబోతులు వెనక్కి తగ్గలేదు సరి కదా ....వీధుల్లో గొడవలు మరి ఇంత పెరిగాయి ఎస్వి కుటుంబం మీద దాడులు జరిగాయి. ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఎస్వి కూడా వెనక్కి తగ్గలేదు. అవకాశం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉన్నాడు.

//1969 తొలి తెలంగాణ ఉద్యమకారుడిగా //

 ▪️ప్రభాత భేరి

1969 తొలి తెలంగాణ ఉద్యమంలో  15 సంవత్సరాల బాలుడిగా ఎస్వీ నిర్వహించిన పాత్ర
అద్వితీయమైనది.
 ఆనాటి ఉద్యమ నేపథ్యంలో తోటి యువకులతో కలిసి పాతబస్తీలో" ప్రభాతభేరి " నిర్వహించేవాడు . అప్పట్లో ప్రఖ్యాతమైన సినిమా పాటల బాణీల్లో ఉద్యమ గీతాలు రాసుకుని  ప్రభాత దీనిలో పాడుతూ   వీధుల వెంట తిరిగేవారు.

▪️ఎవరో  - విప్లవఢంక

ఉద్యమ ఉద్ధృత దశలో ఉన్నప్పుడు  రుక్మిద్దీన్, గుండోజు యాదగిరి Yadagiri Gundoju ల విప్లవఢంకా వెలువడింది. ఆ తర్వాత  ఎస్పీ సత్యనారాయణ, జగదీశ్వర స్వామి, అనుముల శ్రీహరి,  "విప్లవ శంఖం "  వెలువరించారు. ఆనాటి ప్రభుత్వ నిషేధాలు కట్టడీలు దృష్టిలో పెట్టుకొని విప్లవ శంఖంలో గీతాల కింద  రచయితలుగా
 " ఎవరో " అని రాసుకోవడం అప్పట్లో ఒక సంచలనంగా మారింది. ఈ ఎవరో అనే రచయిత ఎవరు అని ఉద్యమకారుల్లో రచయితల్లో అనేక చర్చలు జరిగాయి.

"ఇది నా తెలంగాణ సంజీవదీవిరా
ఇది నా తెలంగాణ పుణ్యాల దేవిరా
ఇచటి మాగాణాలు స్వర్ణ కేదారాలు ఇచటి ప్రోతస్వినులు మధుర సుధా సుధారలు
ఇచటి పర్వతపంక్తి కోహినూరుల మాల
ఇచటి శీతోష్ణస్థితి అమ్మకౌగిలి లీల
- ఎస్వి (విప్లవ శంఖం-1969)

▪️లిఖిత పత్రికల నిర్వహణ

 1969లో " నవ సాహితీ"  లిఖిత మాసపత్రిక
1970 లో  "ఉషస్సు" లిఖిత మాస పత్రిక
1971 లో " వేదిక " లిఖిత మాస పత్రిక
 స్నేహితుల సహకారంతో నిర్వహించడం జరిగింది.
 1970 ఆగస్టులో "'ఉషస్సు " సంచిక తొలిసారిగా ప్రచురణ కాబడింది.ఈ ప్రచురణ సంచికలో 
"  ఈ క్షణం ఏమి కానున్నదో " శీర్షికతో
 ఎస్వి రాసిన కవిత్వం మచ్చ అయింది.

 1969 లో తెలంగాణ విద్యార్థి సంఘం, 
1971లో పాతనగర రచయితల సంఘం ఏర్పాటు చేశారు.

 //అగ్గి చిగుళ్ళు పూయిస్తూ //

1973 లో  తన 19 ఏళ్ల వయసులో 1969 తెలంగాణ ఉద్యమ గీతాలను సమీకరించి  సంపాదకత్వం వహించి " అగ్గిచిగుళ్ళు" పేరుతో  వెలువరించాడు  ఎస్వి.

"మన తెలంగాణనే కబళించుచున్నారు రక్కసులదాసులై కుక్క బతుకుకన్న
ఈ విషయములోన వీర మరణంమిన్న
పన్నెండు వర్షాల బానిసత్వము చాలు జై తెలంగాణమో సమరాన మరణమో”
అంటూ ఎస్వి  విశాలాంధ్ర అవతరణము పేరుతో ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగి అప్పటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ  ధర్మాగ్రహం వ్యక్తం చేశాడు

// కుటుంబం //

 ఎస్వి కుటుంబం సమసమాజ స్థాపనకు నాంది పలికింది. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు కందిమళ్ళ ప్రతాపరెడ్డి కూతురు కందిమళ్ళ భారతితో  ఎస్వి వివాహం నిరాడంబరంగా జరిగింది.
 ఎస్వి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. తల్లిదండ్రుల బాటలోనే ఈ అమ్మాయిలు కూడా సృజన శీలురు 

//ఉద్యమ గీతాల  అమ్ముల పొది //

  ఉస్మానియా యూనివర్సిటీలో ఎం ఎ తెలుగు, అక్కడే ." అబ్బూరి రామకృష్ణారావు కవిత్వం " మీద  పరిశోధన  చేసి  ఎం.ఫిల్ పట్టా  పొందాడు.  " తెలుగులో ఉద్యమ గేయాలు " పై  ఆచార్య ఎన్ గోపి పర్యవేక్షకుడుగా  పిహెచ్. డి పట్టా పొందారు. ఆచార్య ఎన్ గోపి గారికి ఎస్వి సత్యనారాయణ తొలి పర్యవేక్షణ విద్యార్థి  కావడం విశేషం.
 " తెలుగులో ఉద్యమ గీతాలు" తెలుగు సాహిత్యంలో  అత్యుత్తమ గ్రంధాల్లో ఒకటిగా  అంగీకరిస్తున్నారు. ఉద్యమ గీతాలు గ్రంథం కోసం  వేలాది పాటలు సేకరించాడు. తెలంగాణ సాయుధ పోరాట గీతాలు, జాతీయోద్యమ  గీతాలు, ఆంధ్రోద్యమ గీతాలు, జై ఆంధ్ర గీతాలు, విశాలాంధ్ర గీతాలు, తెలంగాణ గీతాలు, కార్మిక గీతాలు ఎర్రజెండా గీతాలు, కర్షక గీతాలు, మద్యపాన నిషేధ గీతాలు, మరెన్నో గీతాలు ఉన్నాయి. 

 // వృత్తిలో  బుద్దిజీవి - ప్రవృత్తిలో ఉద్యమశీలి //

 ▪️వృత్తిలో

మొదట ప్రైవేట్ లెక్చరర్ గా ఉద్యోగం ప్రారంభించి తర్వాత  ప్రభుత్వ అంబేద్కర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా జీవితాన్ని ఆరంభించి, ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. ప్రొఫెసర్ స్థాయికి ఎదిగాడు.  ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా, ఆర్ట్స్ కాలేజీ డీన్ గా,  ప్రిన్సిపల్ గా, బాధ్యతాయుతమైన ప్రామాణికమైన తనదైన ముద్ర చూపించాడు.
 పదవి విరమణ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా సంస్కరణలు తీసుకువచ్చాడు.

 12 మంది పీహెచ్డీ విద్యార్థులకు పర్యవేక్షకుడుగా పనిచేశారు.
 ముగ్గురికి ఎం.ఫీల్ పర్యవేక్షకుడిగా పని చేశారు.

▪️ప్రవృత్తిలో

కవిగా ,  కథకుడిగా , వ్యాసకర్తగా, విమర్శకుడిగా,వక్తగా, ఉద్యమ కారుడుగా, పరిశోధకుడిగా తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియల్ని విజయవంతంగా సృజించిన ఎస్వి సామాజిక స్పృహ అస్థిత్వ చైతన్యం సమసమాజ దృక్పథంతో ముందుకు నడుస్తున్న నిరంతర చైతన్య జీవజ్వాల.
కవిత, విమర్శ,  చరిత్ర, వ్యాసం, తదితర ప్రక్రియల్లో 22 గ్రంధాలను రచించాడు. 27 గ్రంధాలకు  సంపాదకత్వం వహించాడు. " వీరి జీవితం ఒక ఉద్యమం"  రచన హిందీ కన్నడ భాషల్లోకి అనువదించబడింది 

అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం  అధ్యక్ష వర్గ సభ్యుడుగా, విశాలాంధ్ర ప్రచురణాలయం సంపాదకవర్గ సభ్యుడిగా, కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా తదితర ప్రతిష్టాత్మకమైన   పదవుల్ని నిర్వహించారు.

 సుంకర సాహిత్య పురస్కారం, దాశరథి సాహిత్య పురస్కారం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ పురస్కారం, స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కారం, వంటి  మొత్తం 30 పురస్కారాలు సత్కారాలు  అందుకున్నారు.
 ప్రస్తుతం విశ్రాంత దశలో అభ్యుదయ రచయితల అధ్యక్ష వర్గ హోదాలో కొనసాగుతూ తనదైన సాహితీసేద్యాన్ని అన్ని కొనసాగిస్తున్నారు...

గుండోజు యాదగిరి


 గుండోజు యాదగిరి 
( కవి, రచయిత, ఉద్యమకారుడు)
~~~~~~~~~~~~~~~~~~~~~~

భాగవతమ్ములో భక్తిచిందించిన పోతన్నవెలసిన పుణ్యభూమి
 దుష్టులన్‌ యుద్ధాన దునిమిన రాణి రుద్రమ యేలిన రాజభూమి
రాజనీతిజ్ఞుడై రాణకెక్కిన యుగం ధరుడు జన్మించిన ధర్మభూమి
శిల్పకళతపస్వియనెడి పేర్గొన్న రామప్ప నెగడిన రమ్యభూమి
యిట్టి ఔన్నత్య సంపదకిక్కయైన ఈ తెలంగాణ భూమితోనేది సాటి?
కనుక భయమేల సోదరా!
కంఠమెత్తి గానమొనరింపరా ! ‘తెలంగాణ ఘనత’ !

అంటూ గళమెత్తి గర్జించిన తెలంగాణ ఉద్యమకారుడు ...ఉద్యమ కవి...
గుండోజు యాదగిరి
//వివరాల్లోకి వెళ్తే....//

 కవిగా రచయితగా విమర్శకుడిగా  ఉద్యమకారుడిగా   చిత్రకారుడిగా బహుముఖి ప్రజ్ఞ కలిగిన విశ్రాంత అధ్యాపకుడు  గుండోజు యాదగిరి గారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపురం గ్రామం వీరి స్వగ్రామం. వీరు 1945 ఆగస్టు 21న జన్మించారు.బాలకిష్టమ్మ  లక్ష్మయ్య దంపతులు వీరి తల్లిదండ్రులు.

 ప్రాథమిక విద్యను ఎల్లమ్మ రంగాపురంలో, హెచ్ ఎస్ సి  కల్వకుర్తిలో, వెంకటేశ్వర ఓరియంటల్ కాలేజ్ పాలెంలో  తెలుగు డిప్లమా  బిఓఎల్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంవోఎల్ చదివారు. 2003లో పదవీ విరమణ పొందారు

//1969 తెలంగాణ ఉద్యమంలో//

 1969 తొలి తెలంగాణ ఉద్యమం వీరు బిఓఎల్ చదువుతున్నారు. ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సి నారాయణ రెడ్డి,  దాశరథి, సమైక్యాంధ్రను సమర్తిస్తూ కవిత్వాలు రాయడంపై యాదగిరి నిరసన వ్యక్తం చేశాడు . తెలంగాణ ఆత్మగౌరవంతో రుక్ముద్దీన్ తో 
 కలిసి కలిసి విప్లవఢంకా వినిపించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉత్తేజపరిచారు

 //సాహిత్య నేపథ్యం //

 యాదగిరి గారి తండ్రి లక్ష్మయ్య గారు పెద్దగా చదువుకోలేక  పోయినా, యక్షగానాలను కంఠస్తం చేసి  ఉండేవారు. అనేక లోక  వ్యవహారాలను , గ్రామ సమాచారాలను, తెలిసి ఉండేవారు. తండ్రి ప్రభావంతో లోక, సాహిత్య, అంశాలపై యాదగిరి గారికి చిన్నప్పటి నుండి ఆసక్తి కలిగింది.

 అంతేకాకుండా  ఎల్లమ్మ రంగాపురం  పట్వారి గోపాలరావు మంచి సాహితీవేత్తగా ఉండేవాడు. సురవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ కవుల సంచిక గురించి తదితర సాహిత్య విషయాల గురించి చర్చించేవాడు. ఆ విధంగా కూడా యాదగిరి గారికి సాహిత్యంపై  ఆసక్తి పెరిగింది.

 1951 ప్రాంతంలో ఎల్లమ్మ రంగాపురం గ్రామంలో బాలవాణి గ్రంథాలయం ఏర్పాటు చేశారు. 2000 పైగా పుస్తకాలు గ్రంథాలయంలో ఉండేవి.  గోల్కొండ కవుల సంచిక కూడా ఉన్నది. విప్లవ అభ్యుదయ సాహిత్యాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా యాదగిరి గారికి సాహిత్యంపై మక్కువ పెరిగింది 

//రచనలు//

 తెలంగాణ సాహిత్యం ఉద్యమంపై వీరు ప్రామాణిక గ్రంథాలు రచించారు.

1- ఉద్యమ కవితా  సంకలనం 

🔸జై తెలంగాణ విప్లవఢంకా 
1969 తెలంగాణ ఉద్యమంలో ఆచార్య రుక్ముద్దీన్  తో కలిసి విప్లవఢంక కవితాసంకలనం తీసుకువచ్చి ఉద్యమ వాతావరణం లో వేడి రగిలించాడు   

2- సంక్షిప్త వ్యాస గ్రంధాలు

🔸తెలంగాణ సోయి
అసామాన్య సామాన్యమాన్యులుగా ఈ గ్రంథం  రెండు భాగాలుగా  రూపొందించబడింది. రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, జానపద, శిల్పకళ, చిత్రకళ,విప్లవ, అభ్యుదయ, ఉద్యమ, సామాజిక సేవ, మొదలగు పది 
 విభిన్న రంగాల్లో పోరాటాల్ని  ఉద్యమాల్ని కృషిని  కొనసాగించిన  విశిష్ట వ్యక్తుల విజయ గాథల  సంక్షిప్త సమాచారాన్ని తెలంగాణ సోయి  రెండు భాగాల్లో ప్రకటించాడు. ప్రతి వ్యాసానికి తానే స్వయంగా చిత్రం గీశాడు. 

భారత దేశ స్వాతంత్ర్యం కొరకు ఆంగ్లేయులపై తొలి పోరాటం జరిపి మరుగునపడిన పోరాటయోధుడు
రాంజీ గోండు, మలి తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన కావలి సువర్ణ, మలి దశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత్ ఆచారి  పల్లెటూరి పిల్లగాడా పసుల కాసే మొనగాడా అంటూ గొంతేత్తి పాడిన మాభూమి సంధ్యక్క,
తెలంగాణలో తొలి రామాయణం బతుకమ్మ పాట రాసిన ఎల్లమ్మ రంగాపురం ప్రజాకవి
బుక్క సిద్ధాంతి, 80 ఏళ్ల కిందటి బాలకృష్ణుడి బొమ్మను దాచిపెట్టిన సురవరం సరోజమ్మ, ప్రతిజ్ఞ రచించిన పైడిమర్రి వెంకట సుబ్బారావు, జానపద కళాకారుడు కిన్నెర మొగులయ్య,
 హైదరాబాద్ లో తొలి పర్ఫ్యూజనిస్ట్ కేశవరం మధుసూదన్ రావు, (పర్ఫ్యూజనిస్ట్ అంటే, హృదయానికి శస్త్ర చికిత్స చేస్తున్నప్పుడు గుండెను, ఊపిరితిత్తులను సజీవంగా ఉంచే ప్రక్రియను పర్యవేక్షించే నిపుణులు)
చిత్ర కళలో అసమానమైన ప్రతిభ కనబరిచిన లగుసాని గోపి, అలుపెరుగని ఉద్యమ బాటసారి గూల్యం అంపయ్య,
 తెలంగాణ ఊర్ల పేర్లపై తొలి పరిశోధకుడు కపిలవాయి కిషోర్ బాబు తదితరుల సంక్షిప్త సమాచారాలు పొందుపరచబడి ఉన్నాయి 

3 - పద్య కావ్యాలు 

🔸శిల్పిఖండకావ్యం
భారతదేశం అద్భుతమైన శిల్ప సంపదకు పుట్టినిల్లు. చెక్కించిన రాజుల పేర్లు చరిత్రను అలరించాయి కానీ చెక్కిన శిల్పుల పేర్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ పరిస్థితికి వాపోతూ శిల్ప కారుల నైపుణ్యాన్ని శ్రమని ప్రతిభను కీర్తిస్తూ  " శిల్పి ఖండ కావ్యం" 1969 లో రచించారు. 101 మంది  తెలంగాణ చిత్రకారులను పరిచయం చేశారు.ఇందులో ఒక పద్యాన్ని గమనిస్తే....

అల వేయి స్తంభాల ఆలయనిర్మాణ
చతురిమ గరిమకు శత వినతులు!
శ్రీకాళహస్తి విశిష్టశైలీ స్తంభ
విలసనమునకు వేవేల నుతులు!
బేలూరు హలెబీడు ఆలయ శివ్వాళి
కల్పన కిదె నమస్కారశతము !
జలధి దరిని మహాబలిపుర శిల్పవై
భవమునకు సహస్రువందనములు!

రాత్రి పగలనిఅనక, విరామ మనక,
ఆలు బిడ్డలనక, మరి ఆశలనక,
రాళ్ళు తొలువంగ,మలువ నీరక్తసిక్త
హస్తములు కడుగగనిదె అందుకొనుము
స్తపతి వర్యుడ ! మాఅశ్రుతర్పణములు

🔸 ఫేస్బుక్ శతకం
 ఫేస్బుక్ వేదికగా  సామాజిక సాంస్కృతిక సాహిత్య రంగాల్లో విశేషమైన కృషి చేస్తున్న వ్యక్తుల వ్యక్తిత్వ చిత్రణగా  100 మంది వివరాలను సమీకరించి,వారిపై తేటగీతి పద్యాలు అల్లి, ఒక శతకంగా రూపొందించడం జరిగింది. తెలుగు సాహిత్య చరిత్రలో ఇటువంటి ప్రయత్నం జరగడం ఇదే ప్రథమం.

4 -  సంపాదక రచనలు

🔸తెలంగాణలో తొలి రామాయణం బతుకమ్మ పాట
  ఎల్లమ్మ రంగాపురం ప్రజాకవి
   బుక్క సిద్ధాంతి
ఈ గ్రంథానికి సంపాదకత్వం వహించారు 
బుక్క సిద్ధాంతి జానపద  రామాయణ కథను తెలంగాణ మాండలికంలో 90 సంవత్సరాల కిందట 90 పేజీల్లో రచించి ప్రచురించాడు . వాల్మీకి రామాయణంలో లేని రంగనాథ రామాయణంలో ఉన్న గాథలను ఇందుట్లో పొందుపరిచాడు. ఉయ్యాలో వలలో అనే వంతలు ఉన్నాయి.

🔸 నార్ల కంటి బుచ్చయ్య కవితలు, అంపశయ్య కవితలకు  సంపాదకత్వం  వహించారు

🔸అమరాబాద్ నారాయణ డైరీ గ్రంధానికి సంపాదకత్వం వహించారు.

5 - చరిత్ర రచన

 🔸రంగాపురం గ్రామ చరిత్ర
తన సొంత ఊరు రంగాపురం గ్రామ చరిత్రను రచించి ప్రకటించారు.ఈ గ్రంధంలో తన సొంత గ్రామానికి చెందిన 15 మంది మరుగున పడిన కవులను వెలికి తీసి పరిచయం చేయడం జరిగింది.వీరిలో ప్రజా కవి బుక్క సిద్ధాంతి, సురవరం ప్రతాపరెడ్డి ప్రకటించిన గోల్కొండ కవుల చరిత్రలో  స్థానం సంపాదించుకున్న వాడాల నరసింహ కవి , ముడుంబై నరసింహాచార్యులు తదితరులు  ఉన్నారు.

6. గేయ రచనలు

🔸బతుకమ్మ పాట
 సమ్మక్క సారమ్మ ల స్మరిస్తూ బతుకమ్మ గేయ కావ్యం  రచించారు.

7. విశ్లేషణ - పరిచయ గ్రంధాలు

🔸డాక్టర్ ముకురాల రామిరెడ్డి సాహితీ సమీక్ష

🔸మార్చాలా రామాచార్యుల జీవిత చరిత్ర తెలంగాణ తొలి తరం చిత్రకారుడు మార్చాల రామాచార్యులు జీవితాన్ని , శిల్పకళా నైపుణ్యాన్ని పరిచయం చేస్తూ గ్రంథం రూపొందించారు.

 🔸అజ్ఞాత విప్లవ వీరుడు అమరుడు కొండన్న

8.పరిశోధనగ్రంధాలు

🔸వరవరరావు జీవితం.. సాహిత్యం పై పరిశోధన

9. వీధి బాగోతం నాటిక కూడా రచించారు.

 //పురస్కారాలు సత్కారాలు //

 సామాజికవేత్తగా పలు సమాజ సేవా కార్యక్రమాల్లో
 పాల్గొంటూ వస్తున్న గుంటూరు యాదగిరి గారికి 2015లో తెలుగు విశ్వవిద్యాలయం వారు కీర్తి పురస్కారం అందజేశారు.

//చిత్రకారుడిగా //

 కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ,  పుట్టపర్తి నారాయణాచార్యులు, తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక, ప్రముఖ చరిత్రకారుడు  భిన్నూరి నరసింహ శాస్త్రి, ప్రముఖ సాహితీకారుడు  రంగినేని సుబ్రహ్మణ్యం, యువ శిల్పి శివ రామాచారి, నిజాం విమోచన పోరాటయోధుడు    మందముల నర్సింగ్ రావు, వందేమాతరం రామచంద్రారావు, తదితరుల చిత్రాలను తన పెన్సిల్ తో గీసి ప్రాణం పోశారు   

//అభివందనాలతో //

తెలంగాణలో, ప్రత్యేకించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో,  తన రచనలతో ప్రజోద్యమాలను ప్రభావితంచేసిన గుండోజు యాదగిరి గారు 
ఆయురారోగ్యాలతో శతాధిక వసంతాలు జీవించాలని మనసారా ఆశిద్దాం .....

వ్యాసకర్త : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

Tuesday, April 16, 2024

ప్రొ. మారెడ్డి రంగారెడ్డి( శాస్త్రవేత్త - పత్తి వంగడాల సృష్టికర్త )


ప్రొ.  మారెడ్డి రంగారెడ్డి
( శాస్త్రవేత్త - పత్తి వంగడాల సృష్టికర్త )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ప్రస్తుతం మన  పత్తి రైతులు పండిస్తున్న పంట  రకాలు
వీరి సృష్టి

క్రమశిక్షణ.... 
అంకితభావం.... 
కష్టపడే తత్త్వం.... 
వెరసి - 
వ్యవసాయక శాస్తవేత్త  మారెడ్డి రంగారెడ్డి.

వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో  శాస్త్రవేత్తగా  తన బాధ్యతలు కొనసాగిస్తూ  రైతుల మనిషిగా పేరుపొందాడు . ముఖ్యంగా కుటుంబం, ఉద్యోగం,  ఇది మాత్రమే తన జీవితంగా కాకుండా.... రైతుల కోసం  ఏదో చేయాలని  తపిస్తూ, రైతులతోనే ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడిన  అరుదైన ఉత్తమ ఉద్యోగి రంగారెడ్డి. 
▪️పరిచయం :

ప్రకాశం జిల్లా కంభంలో 1936 ఏప్రిల్ ఒకటవ తేదీన
సాధారణ రైతు కుటుంబంలో రంగారెడ్డి జన్మించారు. 
మారెడ్డి బాలరంగారెడ్డి - కాశమ్మ దంపతులు వీరి తల్లిదండ్రులు. వీరి సోదరుడు  కోటిరెడ్డి.  

చిన్నతనం నుండే  వ్యవసాయం మీద ఆసక్తి ఉండటంతో  పాఠశాల మీద పెద్దగా ఆసక్తి కనబర్చలేదు రంగారెడ్డి. తన సోదరుడు పాఠశాలకు వెళ్తుంటే, తాను మాత్రం వ్యవసాయ పొలాలు , పంటలు, పాడి, వీటి మీద అమితమైన ప్రేమ వాత్సల్యాలు కనబరుస్తూ.... .తోటి పిల్లలతో ఆడుకుంటూ....  ఉండేవాడు. ఈ క్రమంలో 
బాగా పెద్దవాడయ్యాక ఆలస్యంగా పాఠశాలలో చేరాడు.   

అగ్రికల్చర్ బిఎస్సి తర్వాత  1960 -1966 లలో వ్యవసాయ కళాశాల బాపట్ల నుండి  జన్యుశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఆ తర్వాత  పిహెచ్‌.డి  అవార్డు పొందారు.  1980 లో ఉమ్మడి   ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో   రీసెర్చ్ అసిస్టెంట్‌గా తన వృత్తిని ప్రారంభించి  అనతి కాలంనే 
అనూహ్య విజయాలు సాధించి పై మెట్టు చేరుకున్నాడు. అత్యుత్తమ పత్తి బ్రీడర్‌గా తనని తాను నిరూపించుకున్నాడు. 

ముఖ్యంగా రంగారెడ్డి  మొదట ఫారెస్ట్ విభాగంలో ఉద్యోగంలో చేరినప్పటికీ, తర్వాత తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయం కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంచుకున్నాడు. 

▪️వృత్తిధర్మంలో  :

కాటన్ స్పెషలిస్ట్, కాటన్ బ్రీడర్ వంటి వివిధ పదవులకు ఎదిగిన రంగారెడ్డి, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయవిశ్వవిద్యాలయం నంద్యాల శాఖలో సీనియర్ సైంటిస్టుగా  చాలా కాలం పనిచేసారు. ఇక్కడి నుండే వ్యవసాయాధారితమైన భావి భారతానికి  కొత్త వంగడాలను సృష్టించారు.ఈ క్రమంలో  పత్తి , నూనె గింజలు , జొన్న, మొక్కజొన్న ,రకాల్లో దిగుబడిని పెంచే రకాలకు వీరు ప్రాణం పోసారు.
దర్శి,  తెనాలి,  మాధోల్, ఆదిలాబాద్,  నంద్యాల్ వంటి పరిశోధనా స్టేషన్లలో పనిచేశాడు.  R.A.R.S. నంద్యాలకు ఒక గౌరవప్రదమైన స్థానం  దక్కడంలో రంగారెడ్డి కృషి ప్రముఖమైనది. వీరి జీవితం ఎక్కువ కాలం  ఈ నంద్యాలలోనే కొనసాగింది.

▪️కనుగొన్న వంగడాలు :

పత్తి ప్రాజెక్టుకు ఇన్‌చార్జిగా, పత్తి రకాలు  సంకరజాతుల అభివృద్ధిలో వీరి కృషి గణనీయమైనది. 
వీరు కనుగొన్న పత్తి రకాలు ప్రస్తుతం రైతుల ఆదరాభిమానాలను చూరగొంటున్నాయి. వాటి వివరాలు...👇

  NA  - 1280 (తెల్ల పురుగు నివారిణి  )
  NA  -  1325 ( నరసింహ్మ)
  NA  -  920   (ప్రియ )
  HYPS - 152 
 మహాలక్ష్మి ,విజయలక్ష్మి , దేశవాళి రకాలైన  శ్రీశైలం , అరవింద , కనుగొన్నారు. 

పత్తి సంకరాల్లో    NHH 390,   NCA 212 ,భాగ్యలక్ష్మి  (ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడ్)మొదలగుణవి. 

దేశీ సంకరాల్లో  NCA 176, NCA 205, NCA 212. మొదలగునవి. 

న్యూక్లియస్ &  ఫౌండేషన్ సీడ్ ప్రొడక్షన్, మంచి నాణ్యమైన న్యూక్లియస్ & బ్రీడర్ సీడ్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా వీరు దేశానికి సహాయం చేసిన శాస్త్రవేత్తల వరసలో నిలబడ్డాడు. 

వీరి కృషి పట్టుదలకు నిదర్శనాలు.వీరి పరిశోధనా ఫలితాలు రైతుల పాలిట వరమే అయ్యాయి. వీరు సృష్టించిన  రకాలు అధిక దిగుబడికి లాభాలకు ఆమోదయోగ్యంగా ప్రయోగశాలల నుండి నాణ్యతా గుర్తింపును సంపాదించుకున్నాయి. 

RARS నంద్యాల్లో రంగారెడ్డి కృషి ఫలితంగా  ఉద్భవించిన .... 
1) HYPS - 152  ( Big Boll & Good Staple Length ) 
2) NA 1325 (నరసింహ) 
ఈ రెండు రకాలు కాటన్ హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్‌లో తల్లిదండ్రులుగా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. 
విత్తన పరిశ్రమల చేత కాటన్ హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో నోటిఫై చేయని HYPS152 పేరెంట్‌గా విస్తృతంగా ఉపయోగించబడుతున్న  పరిస్థితుల్లో   జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పత్తి పండించే రైతులు వీటి కారణంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. 

 ▪️జాతీయ స్థాయిలో కథనాలు :

జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో  రంగారెడ్డి గారి  శాస్త్రీయ కథనాలు ప్రచురించబడ్డాయి.  వీరి  వ్యాసాలు సంబంధిత పరిశోధనా సంస్థలకు  , విత్తన పరిశ్రమలకు, వ్యవసాయ సంఘాలకు,  తద్వారా దేశవ్యాప్త రైతులకు మార్గదర్శకత్వం వహించాయి. 

▪️కల్తీ విత్తనాల్ని అరికడుతూ.. :

పత్తి రకాలలో  లాభదాయకమైన సంకరజాతులను  ఉత్పత్తి చేసి  పత్తి రైతులకు  వారు చేసిన సేవ   ప్రస్తుతం ఫలితాల రూపంలో కనిపిస్తుంది. కాగా ఈ ఫలితాలను కాలరాసే ప్రయత్నంగా కొన్ని నకిలీ విత్తనాల పరిశ్రమలు బయలుదేరి  రైతుల్ని నిలువునా ముంచే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాయి. 
ఈ క్రమంలో విత్తన  జన్యు స్వచ్ఛతను గుర్తించడంలో అగ్రగామిగా ఉన్న రంగారెడ్డిని  ఈ పరిశ్రమల పేరిట కొందరు అక్రమార్కులు ఆశ్రయించారు. నకిలీ విత్తనాలను శుద్ధి విత్తనాలుగా ప్రచారం చేస్తూ రంగారెడ్డి సంతకాన్ని ఆశించారు. . లక్షల లంచం ఎరజూపారు . కానీ ఒక రైతుగా రైతు పక్షపాతిగా ఈ మోసాన్ని వ్యతిరేకించాడు  రంగారెడ్డి. లక్షల రూపాయలని తిప్పి పంపించాడు. 

రోజు రోజుకు పెరుగుతున్న నకిలీ విత్తనాల విషయంలో  రంగారెడ్డి తీవ్రంగా స్పందించాడు. ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా స్వచ్ఛందంగా
రైతుల కోసం తన విజ్ఞానాన్ని ధారపోయడం మొదలెట్టాడు. కుటుంబాన్ని కూడా కలుసుకోకుండా 
గ్రామాలు పర్యటించడం మొదలెట్టాడు.  అవగాహనా పాఠాల నిమిత్తం రైతులకు శిక్షణా  తరగతులు నిర్వహించాడు. ఇవన్నీ ఉద్యోగ ధర్మంలో భాగంగా కాదు, వ్యక్తిగతంగా కొనసాగించాడు. 

అక్రమంగా సంపాదించుకునే మార్గాలను నిస్వార్థంగా మూసివేసిన రంగారెడ్డి వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే..... తాను మరణించే వరకు తనకు ఉన్నది ఐదు చొక్కాలు మాత్రమే. ప్రభుత్వం  కేటాయించిన అద్దె ఇల్లు మాత్రమే. దీన్ని బట్టి రంగారెడ్డి గారి  నిజాయితీ నిరాడంబరతలు  అర్థం చేసుకోవచ్చు.

▪️అవార్డులు :

ఉత్తమ శాస్త్రవేత్తగా ఎ.పి. వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రమే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా ఆయనకు అవార్డులు  లభించాయి.     

సెప్టెంబర్ 30, 2009 న సీడ్స్‌మెన్ అసోసియేషన్ హైదరాబాద్ -  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వారు తమ 14 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో  రంగారెడ్డి సేవలను గుర్తిస్తూ జీవిత కాల సాఫల్య పత్రాన్ని ప్రకటించారు  

▪️ధర్మ గుణం 

స్వతహాగా ధర్మ గుణం కూడా ఎక్కువగా ఉన్న రంగారెడ్డి, తన పర్యటనల్లో  పేద రైతులను గుర్తించి 
తన శక్తిమేర ఆదరించేవాడు. 
తన వద్ద పనిచేసే కాంట్రాక్టు సిబ్బందిని పర్మనెంటు ఉద్యోగులుగా మార్చడంలోను తనదైన చొరవ చూపించాడు. వీరి వల్ల ఉద్యోగాలు పొందిన కుటుంబాలు ఇప్పటికీ వీరిని గుర్తుకు చేసుకుంటున్నాయి. 

రెడ్లు ప్రకటించే విరాళాలతో అఖిల భారత రెడ్ల సంఘం శ్రీశైలం వారు నిర్మించే భవన సముదాయాల్లో 
కూడా వీరి వితరణ ఉన్నది. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో  ఉన్న రెడ్ల బాలికల వసతి  గృహంలో  ఒక గది  రంగారెడ్డి పేరున ఉన్నది.

▪️కుటుంబం 

రంగారెడ్డి వివాహం 1960 లో రాజకుమారితో జరిగింది.ఈ దంపతులకు ఒక కుమారుడు 
ఇద్దరు కుమార్తెలు, ఉన్నారు. 

▪️మరణం    

1990 అక్టోబర్ 3 న తన 54 వ ఏట రంగారెడ్డి మరణించారు. అప్పటికి వారు ఉద్యోగ నిర్వహణలో ఉన్నారు. నేల స్వభావాన్ని, పంటరకాలను పరిశీలిస్తూ పొలాల్లో తిరుగుతున్న సమయంలో కేవలం మేకు గుచ్చుకుని గాయం విషమించడం ద్వారా రంగారెడ్డిగారి  ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. లేదంటే మరిన్ని వంగడాలను సృష్టించి రైతు లోకానికి మరిన్ని సేవలు అందించేవారు. 
మొత్తానికి  నిజాయితీకి మారుపేరుగా బతికారు.  ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని  తనదైన  సామాన్య జీవితం ద్వారా నిరూపించారు.

Note : వీరు స్వయానా మా మామగారు. వీరి ఏకైక కుమారుడే నా జీవిత భాగస్వామి.

మార్చాలా రామాచారి ( చిత్రకారుడు )

మార్చాల రామాచారి
(కవి , సజీవ చిత్రాల చిత్రకారుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాస కూర్పు : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

వెయ్యేళ్ళు వర్ధిల్లడం అంటే ఇదే....
కళ....కలకాలం నిలవడం అంటే ఇదే....
ప్రతిభ....పది కాలాలు పట్టం కట్టు కోవడం అంటే ఇదే.....
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ మార్చాల రామాచారి !
అద్భుత అద్వితీయ చిత్రకారుడు..! 
తన బొమ్మలతో దిగ్గజాలను మెప్పించిన చరితార్థుడు!
మీసాల కృష్ణుడి కుంచెకారుడు

▪️వివరాల్లోకి వెళ్తే.....

పూర్వ పాలమూరు కల్వకూర్తి దగ్గర మార్చాలా గ్రామ వాస్తవ్యులు రామాచారి. వీరు 1899 ప్రాంతంలో జన్మించారు. శ్రీనివాసాచార్యులు సోమిదేవమ్మ వీరి తల్లిదండ్రులు. వీరు కారంపూడి వంశస్తులు. కానీ గ్రామ నామంతో ప్రసిద్దులు అయ్యారు. రామాచారి పూర్వికులు తమిళనాడులోని గండికోట నుండి 300 సంవత్సరాల క్రితం పాలమూరు ప్రాంతానిమికి వలస వచ్చారు. మొదట తిమ్మాజిపేటలో నివాసం ఉన్నారు.తర్వాత వారి తాతగారు రంగాచార్యుల హయాంలోనే మార్చాలకు వచ్చి , అక్కడ ఆలయ పూజారులుగా స్థిరపడ్డారు.

▪️సకల కళాకోవిదుడు రామాచారి

పుట్టుకతో రామాచారి వారు బ్రాహ్మణులు. అయినప్పటికీ రామాచారి వారు వివిధ పనుల్లో నైపుణ్యం సాధించారు. కుల వృత్తుల వారికి ఏమాత్రం తీసిపోకుండా సకల వృత్తి పనుల్లో ఆరితేరారు. కమ్మరి పని , కుమ్మరి పని , తీవాచిలు అల్లడం, సిరిచాపలు అల్లడం , మగ్గం పని, చెప్పులు కుట్టడం, వ్యవసాయం వంటి మొదలగు పనుల్లో తన పనితనాన్ని నిరూపించుకున్నారు. తన చెప్పులు తానే కుట్టుకోవడం , తన బట్టలు తానే నేసుకోవడం, చేసేవాడు. వీరు వాస్తుశిల్పి కూడా. తాను నివసించాల్సిన ఇంటికి తానే రూపకల్పన చేసుకుని ఇల్లు కట్టించుకున్నాడు. 

ఈ అన్నీ పనులతో పాటుగా చిత్రలేఖనం కొనసాగించాడు. అసాధారణ ప్రతిభ కనబర్చాడు.

తీవాచిలు అల్లడంలో మంచి నేర్పరిగా ఉన్న రమాచారి గారు, వరంగల్ సెంట్రల్ జైలులో ఖైదీలకు తీవాచిలు తయారుచేయడంలో మెళకువలు నేర్పించాడు.

చిత్రాలు గీయడంలోనే కాదు తీయడంలో కూడా రామాచారి గారు మంచి నిపుణులు. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే బెస్ట్ ఫోటో గ్రాఫర్. ఈ కళను తన జీవనోపాధికి ఉపయోగించుకుంటూ పాలమూరులో కొన్నాళ్ళు ఫోటో స్టూడియో నడిపారు. ఈ క్రమంలో రామాచారిలో అత్యంత అరుదైన కళ గురించి మాట్లాడితే.... ఫోటోలు తీయడం కోసం అతడు స్వయంగా కెమెరా ఒకటి తయారు చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు.

▪️సురవరం వారి సహచరుడుగా.....
     బాపిరాజు సహభ్యాసకుడిగా......

సురవరం ప్రతాపరెడ్డితో రామాచారి గారికి మంచి స్నేహపూర్వక సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. రామాచారిలో ఉన్న కళ తో పాటుగా, అణుకువ సౌమ్యత సురవరం వారిని బాగా ఆకట్టుకున్నాయి.అందుకే రామాచారిలో ఉన్న చిత్రకళకు మరింత పదును పెట్టాలని సంకల్పిస్తూ..... రామాచారిని బందరు ఆర్ట్స్ కళాశాలలో చేరడానికి ప్రోత్సాహం అందించారు.

బందరు కళాశాలలో చిత్రకారులు అడవి బాపురాజు, గుర్రం మల్లయ్య గార్లు తోటి విద్యార్థులుగా వున్నారు 

▪️మీసాల కృష్ణుడి రూపశిల్పి

సురవరం వారి గోలుకొండ పత్రికాఫీసులో మీసాల కృష్ణుడి చిత్రం ఒకటి వేలాడదీసి ఉండేది.ఈ చిత్రం చరిత్రలో భాగంగా కొనసాగుతున్నది. రామాచారి ప్రతిభ తెలిసిన సురవరం వారు , ఆ చిత్రాన్ని ప్రత్యేకంగా రామాచారి చేత గీయించారు. సురవరం వారి ఆలోచన ప్రకారం మీసాలు లేకుడా కృష్ణుడు కనబడటం ఇష్టం లేదు. పౌరుషానికి యుద్ధతాంత్రానికి ప్రతీక అయిన కృష్ణుడు మీసాలతో ఉండాలి అనేది సురవరం వారి తలంపు. అందుకే రామాచారి చేత తనకు నచ్చిన విధంగా గీయించుకున్నాడు.

▪️గోలుకొండ కవుల సంచికలో

సురవరం ప్రతాపరెడ్డి వారు 1934 వ సంవత్సరంలో 354 మంది కవులతో ప్రకటించిన గోలుకొండ కవుల సంచికలో రామాచారి వారి కవిత 39 వ స్థానంలో ప్రార్థనము శీర్షిక కింద ప్రచురింపబడింది.

శా . శ్రీమంతంబున జెన్ను మీరుధరణీ సీమంతినీభూషణ గ్రామంబౌ మధురాపురంబున దివౌకవ్యూహ సంప్రార్థనన్ భూమేల్ జూప జనించినట్టి కరుణాభూషుండు కృష్ణుండొగిన్ ధామైశ్వర్య సుఖాదికంబొసగి ప్రోచున్ గాత నెల్లప్పుడున్

గీ .భవ్యబృందావనారణ్య భూరుహాళి సాంద్రతరునీడలందు సుశ్రావ్యమహిత
నవసుధారస కలిత మాధుర్య వేణు
గాన మొనరించ గోవులు గ్రాసముడిగి
యే మహాదివ్యమూర్తిని నెలమిగాంచు
నట్టికృష్ణుని సేవింతు ననుదినంబు

మ.కడుమౌగ్యంబున నివ్వటిల్లుపడతుల్ గాసిల్లి నిద్రించగా నడురేయొయ్యన వారి జేరికినుకన్ దద్వేణిబంధంబులన్ వడిలే దూడల దోకలన్ బిగిచి యాహ్లాదించి మోదించు నా తడుగృష్ణుండుకృపామతిన్ గనుటకై ధ్యానింతునశ్రాంతమున్

ఇవి రామాచార్యులుగారి పద్యములు. వీరి కవితలు ఇంకా ఎన్నో ఆముద్రితములుగా మిగిలిపోవడం బాధాకరం.

▪️పత్రికలు ఆదరించిన చిత్రాలు : 

సుజాత , గోలుకొండ పత్రికలో చాలా వరకు వీరి చిత్రాలు ప్రచురింపబడ్డాయి.

▪️రామాచారి గారి ప్రముఖ చిత్రాలు : 
     దివిటపల్లి ఆలయంలో చిత్రాలు : 

రామాచారి చిత్రాలు అన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతాయి. భక్తి , పురాణ పరిజ్ఞానం , వీరిలో జీవనదిలా ప్రవహిస్తూ సజీవ చిత్ర రాజాలకు ఊతం అందించింది. వివరాలు ---

సురవరం ప్రతాపరెడ్డి గారి గోలుకొండ కవుల సంచిక ముఖచిత్రం " వీణాపాణి సరస్వతి " అమ్మవారి చిత్రం

గోలుకొండ పత్రికా కార్యాలయానికి వన్నె తెచ్చిన చారిత్రక మీసాలకృష్ణుడు చిత్రం.

శ్రీరామ పట్టాభిషేకం చిత్రం
విష్ణుమూర్తి లక్ష్మీదేవి చిత్రాలు

దివిటిపల్లి గ్రామంలో బీంసేన్ రావు అనే ఒక భక్తుడు 1940 - 50 ప్రాంతంలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించాడు. ఈ దేవాలయంలో బీంసేన్ రావు ఆహ్వానం మేరకి రామాచారి గీసిన చిత్రాలు ఆ తరం భక్తులను అలరించాయి. వీటిలో మీరాబాయి, గీతోపదేశం, సీతారాముల పర్ణశాల, పార్వతి పరమేశ్వరులు, బ్రహ్మదేవుడు ఉన్నారు. కాగా కాలక్రమంలో వర్ణ చిత్రాలు రంగు వెలసిపోయాయి. అంజనేయ భక్తులు 1990 వ సంవత్సరంలో పాత చిత్రాల స్థానంలో కొత్త చిత్రాలు గీయించారు. ఈ కారణంగా రామాచారి చిత్రాలు కనుమరుగు అయ్యాయి. ఒక్క సీతారాముల పర్ణశాల మాత్రం నేటికిని ఉన్నట్టుగా తెలుస్తున్నది.

▪️పరిశోధకుల నిర్లక్ష్యం

సురవరం వారి గురించి , వారి గోలుకొండ పత్రిక గురించి చాలా పరిశోధకులు వెలువడ్డాయి. సురవరం వారి సమగ్ర వివరాలు అందించిన పరిశోధకులు, రామాచారి గురించి మాత్రం నిర్లక్ష్యం వహించారు అని చెప్పవచ్చు. గోలుకొండ పత్రికకు తన చిత్రాలతో ప్రాణం పోసిన రామాచారి చిరస్మరణీయుడు.

▪️చారిత్రక పొరపాటు

సురవరం 
▪️రామాచారి కుటుంబం

రామాచారి గారి సతీమణి కృష్ణవేణి. వీరికి మొత్తం 10 మంది సంతానం. ఆరుగురు కూతుళ్లు, ఐదుగురు
కుమారులు.
----రంగనాయకమ్మ, వెంకటలక్ష్మమ్మ, జానకమ్మ, సుజాత, సౌభాగ్యలక్ష్మి, లీలమ్మ.
----- శ్రీనివాసాచారి, నరసింహాచారి, రాఘవాచారి, శేషాచారి.

▪️సురవరం కూతురు సరోజనమ్మ ఔన్నత్యం

సురవరం ప్రతాపరెడ్డి గారి కూతురు సరోజనమ్మ. రామాచారి గీసిన మీసాల కృష్ణుడు బొమ్మను, తండ్రి తదనంతరం జాగ్రత్తగా భద్రపరిచి చరిత్రకు అపురూప అద్వితీయ ఆనవాలు అందించింది. వీరి స్వంత గ్రామం గంగపురం. సరోజనమ్మ అక్కడే నివసించేది. మీసాల కృష్ణుడిని ఇంట్లో దేవుడి పటాల మధ్య ఉంచి నిత్యం పూజించేది. ప్రస్తుతం ప్రస్తుతం వీరు కాలం చేశారు. కాబట్టి వీరి కూతురు ప్రవీణ మీసాల కృష్ణుడిని తనదైన బాధ్యతగా తన తాతగారి గుర్తుగా భద్రపరిచి ఉన్నది.

▪️రామాచారి వైకుంఠాధన

అతిసామాన్య జీవితం గడిపిన రామాచారి గారి 1974 లో తన 75 వ ఏటా కాల ధర్మం చెందారు. వారు లేకపోయినా వారి చిత్రాల ద్వారా తరతరాలు ఖ్యాతియై వర్ధిల్లుతూనే ఉన్నాడు.

ఎందరో మహానుభావులు
అందరికి వందనాలు
---------------------------------------------------------------------
ఆధారం : పాలమూరు పత్రిక 
              వ్యాసకర్త :గుండోజు యాదగిరి

జయధీర్ తిరుమలరావ్ ( జానపద పరిశోధకుడు )


జయధీర్ తిరుమలరావు
( జానపద పరిశోధకుడు, )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

రేపల్లె తిరుమలరావు.....
అతడే 
జయధీర్ తిరుమలరావు

జానపద సాహిత్యాన్ని గుండె చప్పుడై వినిపిస్తున్నాడు ....
జానపదాల సేకరణ కోసం చెమటలు చిందిస్తున్నాడు.....
జానపదాలు....
జానపద వాయిద్యాలు....
జానపదుల సంస్కృతి....
వీటిని కాపాడటం కోసం తన జీవితాన్నే ధారపోస్తున్నాడు.
▪️నాలుగు దశాబ్దాల కృషి

జానపదం మౌలిక పరిశోధన కోసం అతను తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో,గిరిజన ప్రాంతాల్లో, కొండల్లో కోనల్లో, తండాల్లో పెంటల్లో గూడాల్లో అవిశ్రాంతంగా తిరుగుతున్నాడు. భావి తరాలకు ప్రాచీన పరిజ్ఞానాన్ని సేకరించి పెడుతున్నాడు. వీరి శ్రమకు పట్టుదలకు స్వయంకృషికి పద్మశ్రీ ఎప్పుడో రావలసింది. కానీ
వీరి కష్టం పద్మశ్రీ కమిటీలకి కనిపించకపోవడం శోచనీయం అనుకుందామా? నిర్లక్ష్యం అనివార్యం అనుకుందామా?

వెనుకబడిన కులాలు, ఉపకులాలు,నిర్లక్ష్యానికి గురైన వారి బతుకులు, ఎవ్వరూ పట్టించుకోని వారి సంస్కృతి సాహిత్యం కళలు, వీటి ఆనవాళ్ళను తిరుమలరావు శ్రమకోర్చి సేకరించాడు. భద్రపరిచాడు. ప్రాచీన గిరిజన సంగీత వాద్యాల సేకరణ కోసం, వారి సామజిక జీవితంలో భాగమైన విశ్వాసాలు ఆచార వ్యవహారాలు రికార్డు చేయడం కోసం, గత నలభై ఏండ్ల నుండి అలుపెరుగని పర్యటనలు చేస్తున్నాడు..

ఈ క్రమంలో అట్టడుగు ఉపకులాల నుంచి తాను కష్టపడి సేకరించిన సామాజిక సాంస్కృతిక కళాఖండాలతో 2017 లో ఒక ప్రదర్శన నిర్వహించారు.

అట్లాగే తన కృషి ఫలించి మరుగున పడిపోతున్న వాద్యలను 2000 వరకు సేకరించి, వాటితో 2020లో ' ఆదిధ్వని - ఆద్యకళ ' పేరుతో గిరిజన జానపద సంగీత వాద్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు.


 అంతేకాదు , నిజాం పరిపాలనా కాలంలో నిషేధానికి గురైన సాహిత్యం మీద పరిశోధన గ్రంథాన్ని రాయడం కోసం ఢిల్లీ , చెన్నై, పాండిచ్చేరి మొదలగు ప్రాంతాల్లో ప్రాచీన గ్రంధాలయాలు పర్యటించాడు. 

▪️కిన్నెర చరిత్ర -
తిరుమలరావు పరిశోధన

కిన్నెర ఎవ్వరిది?
దళితులదా ?
ఆదివాసీలదా?

ఈ అంశంపై విస్తృతంగా పరిశోధనలు అనంతరం ‘‘ఆదివాసీల నుంచి దళితులకు అందిన వాయిద్యం... కిన్నెర... " అని తేల్చి చెప్పారు.

ప్రస్తుతం గోండు ఆదివాసీలు ' జతుర్ ' పేరుతో కిన్నెర వాయిస్తున్నారు.చెంచులు వద్ద కూడా కిన్నెర ఉంది. కానీ ప్రస్తుతం చెంచుల నుంచి కిన్నెర పూర్తిగా దూరం అయింది.
మాదిగల్లో ఆశ్రిత కులం డక్కలి కులస్తులు కిన్నెర వాయిస్తున్నారు.

కిన్నెర 4 వ శతాబ్ది నుండి మనుగడలో ఉన్నది. ఇందుకు స్పష్టమైన ఆధారాలున్నాయి. కిన్నెర మెట్ల మీద చెంచులు మల్హరీ రాగం వాయిస్తారు. అ చెంచులు 13 మెట్ల కిన్నెర వాయిస్తారు.

జోలెపాళ్యం మంగమ్మ(ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్‌రీడర్‌....

జోలెపాళ్యం మంగమ్మ
(ఆలిండియా రేడియో తొలి తెలుగు మహిళా న్యూస్‌రీడర్‌.... ఫిబ్రవరి 13 ప్రపంచ రేడియో దినోత్సవ సందర్భంగా ప్రత్యేక వ్యాసం
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

స్వరమే వరమైన వేళ...
వరమే వార్తయిన వేళ....

"ఆకాశవాణి.. వార్తలు చదువుతున్నది జోలిపాళ్యం మంగమ్మ” అంటూ ఆనాటి తెలుగు శ్రోతలకు వార్తలు వినిపించిన సుపరిచిత స్వర నీరాజనం జోలిపాళ్యం మంగమ్మ..! వ్యాఖ్యాతగా రచయితగా పరిశోధకురాలిగా సమాజ సేవకురాలిగా ప్రతిభావంతమైన ఆమె జీవన ప్రస్థానం స్ఫూర్తిదాయకమైనది..

▪️వివరాల్లోకి వెళ్తే....

//జననం :

ఆల్ ఇండియా రేడియోలో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ గా ప్రసిద్ధురాలయిన జోలెపాళ్యం మంగమ్మ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపురి అని పిలువబడే మదనపల్లెలో జే లక్ష్మమ్మ, సుబ్బయ్య దంపతులకు ఆరుమంది సంతానంలో రెండవ సంతానంగా 
1925 సెప్టెంబర్‌ 12న జన్మించారు.

// విద్యాభ్యాసం :

ఓనమాలు నేర్చుకునే వయసులో అమ్మినేని వీధిలో గుడి దగ్గర వున్న వీధి బడికి అన్నతో బాటు వెళ్లటం నేర్చుకుంది..
ఇండియన్ బ్రిటిష్ ప్రెసిడెన్షి పాఠశాల హోప్ హైస్కూల్ లో, థియోసాఫికల్ స్కూల్ లో 
పదవ తరగతి వరకు చదువుకున్నారు.
స్థానిక బి.టి.కళాశాలలో ఇంటర్, డిగ్రీ, చదివారు. తర్వాత గుంటూరు బ్రాడీపేటలో హాస్టల్ లో వుంటూ సెయింట్ జోసెఫ్ కళాశాలలో బి.ఎడ్ పూర్తి చేసారు.best student of the year’ పతకం తీసుకున్నారు...బి.ఎడ్ పూర్తి అయిన వెంటనే మంగమ్మ ప్రతిభను గుర్తించిన కళాశాల యాజమాన్యం గుంటూరులోని “ secondary grade training school “ లో హెడ్ మిస్ట్రెస్ గా ఉద్యోగం ఇచ్చారు. అప్పుడు మంగమ్మ వయసు 22 ఏళ్ళు మాత్రమే. వయసుకు మించిన తెలివితేటలతో
 తన బాధ్యతని విజయవంతంగా కానించింది. తర్వాత మద్రాసు రాష్ట్రం తిరువూరు ఇండియన్ బెనారస్ విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తిచేశారు.1963లో న్యూఢిల్లీ విశ్వవిద్యాలయంలో బర్ ప్రింటింగ్ ఇన్ ఇండియా అనే అంశంపై పరిశోధన
చేసి డాక్టరేట్ పట్టాను పొందారు .

//క్రీడాస్ఫూర్తి :

 బీటీ కళాశాలలో చదువుకునే సమయంలో పురుషులతో సమానంగా క్రికెట్ క్రీడాకారణిగా
 అందరి మన్ననలు అందుకుంది.

//భాషాప్రావీణ్యం//

తెలుగు, ఇంగ్లీషు, తమిళ, హిందీ భాషలతో పాటుగా ఫ్రెంచ్, ఎస్పెరాంటో భాషల్లో ప్రావీణ్యం ఉంది.
ఎస్పెరాంటో అనేది అంతర్జాతీయ భాష.ఈ భాషలో 28 అక్షరాలుంటాయి. దీనిని 1887 లో లుడ్విగ్ లజారస్ జామెన్ హాఫ్ కనుగొన్నారు . ప్రస్తుతము 20 లక్షల మందికి పైగా ఈ భాషను మాట్లాడుతున్నారు. ఇది అన్ని భాషలకన్నా సులభంగా ఉంటుంది. ఈ భాషను మాట్లాడేవారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్నారు. ఈ భాష రాయటానికి ఆల్ఫాబెట్స్ వాడుతారు.

▪️బోధనా రంగంలో 

విద్యావేత్త జి.వి. సుబ్బారావు , జిడ్డు కృష్ణమూర్తి గార్లు ‘రిషి వాలీ స్కూల్’ ప్రారంభించారు.1948- 49 సంవత్సరాల్లో మంగమ్మ ఈ పాఠశాలలో పనిచేసింది .

తర్వాత మద్రాస్ లో జి.వి. సుబ్బారావు కొంతమంది టీచర్స్ కలిసి ‘బాలభారత్’ స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఈ స్కూల్లో మంగమ్మ మొత్తం సబ్జెక్టులు చెప్పే టీచర్గా కొంతకాలం పని చేసింది..
రిషి వాలీ స్కూల్’ స్కూల్లో పనిచేస్తున్న సమయంలో హిందీ ‘మధ్యమ’ పరీక్ష ఉత్తీర్ణత సాధించింది. బాల భారత్ పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు తమిళం నేర్చుకుంది.

పల్లెల్లోనే పని చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో 
గాంధీజీ ప్రవేశపెట్టిన '‘వార్ధా బేసిక్ ఎడుకేషన్ ట్రైనింగ్ స్కూల్స్ " అప్పట్లో అంకితభావంతో పనిచేసేవి. ఖమ్మం దగ్గర ‘తిరువూరు’ లో ప్రారంభమైన ఈ ట్రైనింగ్ స్కూల్లో టీచర్ గా చేరి హాస్టల్ ఇంచార్జ్ గా కూడా కొంత కాలం పనిచేసారు. ఇక్కడ సుమారు పదేళ్లు పనిచేశారు మంగమ్మ.

▪️ స్వాతంత్రోద్యమ సమరంలో..

 మద్రాస్ బాలభారతి పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో స్త్రీ ఆర్థిక ఆవలంబన, కష్టపడే తత్వం , శ్రమైక జీవనం, స్వయం ఉపాధిపై పేదలలో చైతన్యం
కల్పించారు. అదే సమయంలో దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్ముడి పిలుపు అందుకుని స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నది. స్వాతంత్రం ఆవశ్యకతను వివరించి, తోటి స్త్రీలను జాతీయ భావాల వైపు మళ్ళించి తన వెంట నడిపించుకున్నది.

▪️రచనలు - 

రచనలు పరిశోధనలు ఆమెకు వ్యాపకం మాత్రమే కాదు.. ఒక జిజ్ఞాస కూడా.ఆసక్తితో తీరని దాహంతో
ఇంగ్లీషు, తెలుగు భాషలలో పలు పుస్తకాలను రచించారు. తన రచనలతో సమాజాన్ని ప్రభావితం చేశారు.

//తెలుగు రచనలు//

1 )ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, మొదలగు వారపత్రికల్లో వ్యాసాలు రాశారు
బద్రినాథ్, హిమాలయాల గురించి kood3 వ్యాసాలు
రాసారు 

2).శ్రీ అరవిందులు; నేషనల్ బుక్ ట్రస్ట్; న్యూఢిల్లీ; 1973

3).భారత పార్లమెంటు (సమాచార మంత్రిత్వ శాఖ)

4).విప్లవవీరుడు అల్లూరిసీతారామరాజు
(Telugu version) ; విశాలాంధ్ర పుబ్లిషింగ్ హౌస్ హైదరాబాదు; 1985

5).ఆంధ్రదేశంలో క్రైస్తవ మిషనరీల సేవ; తెలుగు అకాడమి, 1992.

 6)తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు
 (1746-1856)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం; హైదరాబాదు; 2001

7)ఆంధ్రగీర్వాణఛ్ఛందము – సి. పి. బ్రౌన్ తెలుగు భాషాకు చేసిన సేవ; పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం; హైదరాబాదు, 2007.

8)పాలెగాళ్లు 
 తెలుగు అకాడమి ప్రచురణ ; 2012

9)అనిబీసెంట్‌

10 )పందొమ్మిది వందల యాబది యేడు

11 ) స్టేషనుకు రండి ( కథ )
 మదనపల్లె రచయితల కథా సంకలనంలో ఈ కథ ప్రచురించబడింది.

//ఇంగ్లీషు రచనలు //

1) Book printing in India:with special reference to the contribution of European scholars to Telugu, 1746-1857

2 ) Alluri Sitarama Raju; A.P. State Archives, Hyderabad; 1983

3)Technical and agricultural education : a study of Madras Presidency; Kumar Publishing House; Delhi; 1990.

4. Last Palegar Encounter with the British in the Seeded Districts of Andhra Pradesh, 1846-1847

5. The Rate Schools 
( Thomas Munro మద్రాస్‍కు గవర్నర్ గా ఉన్నప్పుడు , సెకండరీ ఎడ్యుకేషన్ మొదలుపెట్టినారు. వాళ్ళు స్కూల్లో కొన్ని ప్రింటెడ్ పుస్తకాలు బోధన కోసం ఉపయోగించే వాళ్ళు . ఆ ప్రింటెడ్ పుస్తకాలు ఎప్పుడు మొదలయ్యాయి అనే ఆసక్తితో రిసర్చ్ చేసి, Book printing in India అనే పుస్తకం తయారుచేశారు.. ఆ విధంగా రేట్ స్కూల్స్ పుస్తకం రాసింది )

6. The Historical Papers (Sekhar Pathippagam), Chennai 2009.

7) 1857

▪️పరిశోధనలు :

చరిత్ర పరిశోధనలు అంటే ఆమెకు అత్యంత మక్కువ. చరిత్ర ఆమెకు హృదయ స్పందన వంటిది. 1962 నుండి నేషనల్ ఆర్కీవ్స్, ఢిల్లీలో పరిశోధనలు చేశారు . తన పరిశోధనల్లో భాగంగా దేశంలో అనేక గ్రంథాలయాలను సందర్శించారు అనేక శాసనాలను పరిశీలించారు.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పరిశోధన చేస్తున్నప్పుడు క్షేత్ర పర్యటనలు చేసింది. సంబంధిత ప్రాంతాలు పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడింది చారిత్రక ప్రదేశాలను పరిశీలించింది.
చరిత్ర పరిశోధనలకు సంబందించి రూపొందించిన 30 వ్యాసాలను ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో సమర్పణ చేసింది.. 

▪️ తన పరిశోధన గురించి తన మాటల్లోనే....

 ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మా బులిటెన్ పొద్దున్న ఏడింటికి. అందుకని పొద్దున ఐదుకల్లా వెళ్ళాలి. ఐదుకు వెళ్ళాలంటే, ఏ నాలుక్కో లేచి, తయారై బయలుదేరేదాన్ని. కార్ వచ్చేది, మా కోసం. వెళ్ళగానే మెటిరియల్ ఇచ్చేవారు. దాన్ని చూసుకొని వార్తలు రాసుకోవాలి. ఇలా రాసుకోడానికి రెండు గంటలు పడుతుంది. ఏడింటికి స్టూడియోకి వెళ్ళి, వార్తలు చదవటం. 7:15 కల్లా అయ్యిపోతుది. మళ్ళీ పన్నెండింటి వరకూ పని లేదు. అంటే, ఏడున్నర నుండి పన్నెండున్నర లేక ఒంటిగంట వరకూ నేను ఖాళీయే.

ఆ లీజరు టైమ్‍లో నేను నేషనల్ ఆర్కైవ్స్ కు వెళ్ళేదాన్ని. అది దారిలోనే ఉండేది. అందుకే నడిచే వెళ్ళేదాన్ని. ఢిల్లీలో అంతా, వీథుల్లో నడిచేది ఎవరూ అంటే నన్ను చూపిస్తారు. (నవ్వుతూ) ప్రతీ రోజూ ఉదయం 8:45 కల్లా ఆర్కైవ్స్ కు వెళ్ళేదాన్ని, అప్పటికి అక్కడ వాళ్ళు తుడుస్తూ, ఊడుస్తూ ఉంటారు. వాళ్ళకి తెల్సు, నేను ముందే వచ్చేస్తాననీ, నా రిసెర్చి వర్క్ మొదలెడతాననీ! కనుక రిసర్చ్ రూం తెరిచి పెట్టేవారు. నేను వెళ్ళి కూర్చుంటాను. రికార్డ్స్ అన్నీ ఉంటాయి. టేబుల్ మీద ఆ పక్కన కొన్ని రికార్డ్స్ పెట్టేస్తాను, ఈ సైడ్ నేను వర్క్ చేస్తూ ఉంటాను. అక్కడెందుకు పెడతానంటే, ఇంకొకరు వచ్చి కూర్చుంటారు కద? ఇంకెవ్వరూ రాకూడదు. ఎందుకంటే disturbance.. “hello, how’re you?” అని ఏమో మాట్లాడాలి , అందుకని నా పుస్తకాలు, ఆ రికార్డ్స్ కొన్ని ఆ పక్క పెట్టేస్తాను, అపుడు ఎవరో ఉన్నారనుకొని ఆ టేబుల్ దగ్గరికి ఎవరు రారు… సో, అలా ఒంటిగంట వరకూ పనిజేసి, మళ్ళీ అక్కడ నుండి హాస్టల్ కు.. హాస్టల్ దగ్గరే.. అదే వుమన్ హు వాక్స్ గద? మళ్ళీ అక్కడ నుండి నడిచివెళ్ళి భోజనం చేసేసి, మళ్ళీ మూడున్నరకు రెడీ అయ్యి, మళ్ళీ రేడియో స్టేషన్‍కు ఈవినింగ్ బులిటెన్ కోసం వచ్చేదాన్ని..

అలా ఆర్కైవ్స్ లో చాలా సమయం గడిపేదాన్ని. మధ్యాహ్నాలు వెళ్ళేది లేదు.. కాని ఉదయాలు మాత్రం తొమ్మిందింటి నుండి ఒంటిగంట వరకూ.. continuousగా… లేచేదే లేదు.. అందరూ టీకనీ, దీనికనీ, దానికనీ లేస్తారు, ఎక్కడికీ లేచేది లేదు, అత్తుక్కుపోవడమే.. గమ్ వేసుకొని, ఫెవికాల్ అంటించుకున్నట్టు.. కూర్చొని ఈ రికార్డ్స్ అన్నీ చూసేదాన్ని.

ఈ రికార్డ్స్ అన్నీ చూడడం కూడా according to the subjects I’ve selected.. అన్ని రికార్డ్స్ చూసేదాన్ని, నోట్సులు రాసుకునేదాన్ని.. ఆ రాసుకున్న నోట్స్ అన్నీ ఫైల్స్ ఆ రూంలో పడున్నాయి (గది చూపిస్తూ). Then, I used to do the work. అట్ల చేశానన్న మాట నా రిసర్చ్ వర్క్. నాకెవ్వరూ ఒకరిని ఆదర్శంగా పెట్టుకొని, చేయలేదు నేను. On my own, self made..
▪️వివిధ హోదాల్లో :

కేంద్ర సమాచారశాఖ, విదేశాంగ శాఖల్లో మంగమ్మ
కీలక పదవులను నిర్వహించారు.
//ఆలిండియా రేడియో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై, 10 సంవత్సరాలు రేడియో తొలి మహిళా న్యూస్‌రీడర్‌గా పనిచేశారు.
// బి.టి.కళాశాల పాలకవర్గ సభ్యురాలిగా, రుషీవ్యాలీ పాఠశాలలో పరీక్షల విభాగంలో పని చేశారు.
//ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌లో , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో జీవిత సభ్యురాలుగా కొనసాగారు.
//అనిబీసెంట్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఉపాధ్యక్షురాలిగా కొనసాగారు.
//గాంధీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అధ్యక్షురాలిగా సేవలు అందించారు., 
//లోక్‌అదాలత్‌లో సభ్యురాలిగా సేవలందించారు.
//బోధనా రంగంలో సుమారు పాతిక సంవత్సరాల అనుభవం సంపాదించింది.

.▪️ పురస్కారాలు

న్యూఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి 2002లో ఉగాది పురస్కారం..
2002లో కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం..
సిద్ధార్థ కళాపీఠం విజయవాడ వారి విశిష్ట అవార్డు... మొదలైన సత్కారాలను పొందింది.

▪️విశిష్టతలు

//భారతకోకిల సరోజినీనాయుడుకు మంగమ్మ సన్నిహితురాలు .. ఈ క్రమంలో ఆంధ్రానైటింగేల్ బిరుదును సంపాదించింది.
// సాహిత్యం సమాజ శ్రేయస్సు కాబట్టి మదనపల్లె రచయితల సంఘం ఏర్పాటులో కీలక పాత్ర వహించారు.
// అంకితభావం, క్రమశిక్షణలతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన మంగమ్మను ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్గా ఏడాది కాలం పొడిగించారు. ఇది నిబద్ధత కలిగిన ఉద్యోగ జీవితానికి నిదర్శనం.
// పదవీ విరమణ పొందిన తరువాత ఆమె ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోలేదు. శరీరంలో శక్తి ఉన్నంత వరకు కష్టపడాలి అనే తనదైన సంకల్పంతో మదనపల్లెలో ఉపాధ్యాయ వృత్తి కొనసాగించారు.
.
▪️జ్ఞానోదయ పాఠశాల నిర్వహణ

84లో రిటైర్మెంట్ తరువాత మదనపల్లి వచ్చేసింది.
1984 నుండి 89 వరకు రిషి వ్యాలికి వెళ్లి అక్కడ పన్నెండో తరగతి హిస్టరీ బోధించేది. తర్వాత . 1989లో జ్ఞానోదయ పాఠశాల కమిటీ ప్రెసిడెంట్గా ఉంటూ.. . పాఠశాలలో ఇంగ్లీష్ బోధించడం మొదలెట్టింది.

▪️ జీవితం మొత్తం అవివాహితగానే 

 మంగమ్మ తమ్ముడు కృష్ణమూర్తి దురదృష్టవశాత్తు చిన్నవయసులో కాలధర్మం చెందారు . అప్పటికి అతడి ముగ్గురు పిల్లలు చాలా చిన్న వయసులో ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. తండ్రిని కోల్పోవడంతో ఆ పిల్లల భవిష్యత్తు అందాకారంలో పడింది. అప్పటికి ఆ పిల్లల నాయనమ్మ తాతలు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తన తమ్ముడి పిల్లల భవిష్యత్తు కోసం మంగమ్మ 
 పెద్ద నిర్ణయమే తీసుకుంది . పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయం తీసుకొని ఆ పిల్లల బాధ్యతని తన భుజస్కందాలపై వేసుకుంది. అనుకున్న ప్రకారం తన తమ్ముడి పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించి తన జీవితాన్ని త్యాగం చేసింది.

▪️శివైక్యం
చిత్తూరు జిల్లా మదనపల్లె తన స్వగృహంలో తన 92 వ ఏట 2017, ఫిబ్రవరి 1వ తేదీన అనారోగ్యంతో కాలధర్మం చెందారు.
____________________________________________
ఆధారం :
1. పుస్తకం. నెట్
2. " మహిళా న్యూస్ రీడర్ మంగమ్మ కన్నుమూత "
సాక్షి వ్యాసం, ఫిబ్రవరి 1 2017
3. మాలిక సాహిత్య మాస పత్రిక
ధీర - 4
 రచన : లక్ష్మీ రాఘవ

కెప్టెన్ రాపోలు వీరరాజారెడ్డి( దేశ సేవలో తన ప్రాణాలను అర్పించిన వీరుడు

కెప్టెన్ రాపోలు వీరరాజారెడ్డి(1977-2002)
( దేశ సేవలో తన ప్రాణాలను అర్పించిన వీరుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
వ్యాసకర్త : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

కంచెలు దాటిన శత్రువుపై కండ్లెర్ర జేసిన సాహసం నీది.... 
పరిధి దాటిన పగోడిపై విరుచుకు పడిన పోరాటం నీది.... 

దేశం తొలిపొద్దులో మెరిసిన సూర్య తేజానివి.... 
త్యాగం మలిసంధ్యలో ఒరిగిన సంకల్ప బీజానివి..... 

రాలిన నెత్తుటి చినుకుల్లో తడిసిన ఓ త్రివర్ణ పతాకమా... 
కూలిన ప్రాణం వంతెనపై మిగిలిన ఓ భరత ప్రతాపమా 

ఆశయల అమ్ముల పొది నుండి ....
కన్నతల్లి కమ్మని ఎద నుండి....
యుద్దమై దూసుకొచ్చిన 
వీరుడా.... 
అందుకో మా గౌరవ వందనాలు !

కెప్టెన్ రాపోలు వీరరాజారెడ్డి
భారతమాత ముద్దుబిడ్డ....
సార్థక నామధ్యేయుడు...
వీరత్వపు సంతకం... 
నిన్నటి నిగ్రహం...నేటి విగ్రహం...వీరరాజారెడ్డిపై నిర్లక్ష్యం నీడలు ఎందుకు కమ్ముకున్నాయి? వీరుడి ప్రాణత్యాగం చుట్టూ ఎందుకు అలసత్వపు పొరలు పేరుకున్నాయి? ఇవి ఉద్దేశ్య పూర్వక పగ? పొగ? 

"మనిషిగా పుట్టింది మనకోసం బతకడానికి కాదు, ప్రజా ప్రయోజనం కోసం...! ఈ క్రమంలో చావు ఎదురొచ్చినా ధైర్యంగా స్వీకరించాలి.పిరికితనాన్ని మోసాన్ని మొదటి శతృవుగా భావించినప్పుడే అంకితభావం మన అస్సలు పేరు అవ్వుతుంది "అని అక్షరాలా భావించి ఆ క్రమంలోనే జీవించి మరణించిన అమరకిషోరం రాజారెడ్డిని సర్కారు ఎందుకు చిన్నచూపు చూసింది? కాల గర్భంలో అతడి ఎందుకు తొక్కి పెట్టింది? 

పనికిమాలిన చిన్న విషయాన్నే పదే పదే చూపెట్టే మీడియా... ఈ విషయంలో ఎందుకు నోరు మూసుకుంది? 
దేశభక్తులం అని మాట్లాడే వాళ్ళు సైతం దేశభక్తుడి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? కారణాలు ఏమిటీ? 
సామాజిక వర్గమా?  

ఒక వీరుడి మరణం చుట్టూ వేల ప్రశ్నలు 
తచ్చర్లాడుతున్నాయి. ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా తల్లిదండ్రుల ఘోషను పట్టించుకునే పరిస్థితి లేదు. సమాధానం చెప్పాల్సింది ఎవ్వరు? 
సర్కారే ! 

#వీరుడి_ఆశయం 

హైదరాబాద్ అరవిందో ఇంటర్ నేషనల్ స్కూల్...తక్షశిల స్కూల్ లో పాఠశాల విద్యను , హబ్సిగూడ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో ఇంటర్ మీడియట్ విద్యను పూర్తిచేసాడు. తర్వాత , బిట్స్ పిలానిలో గాని ట్రిపుల్ ఐటి లో గానీ , చేరాలనుకున్నాడు. ఓ గొప్ప ఇంజనీరుగా భావితరాలకు మార్గదర్శకం కావాలని కలలు కన్నాడు.ఎంచుకున్న రంగం ఏదైనా సేవాదృక్పథమే ఊపిరిగా భావించిన రాజారెడ్డి ఆలోచనలు క్రమంగా దేశసేవ వైపు అడుగులు వేసాయి. 

ఆలోచనను ఆచరణలో పెడుతూ వెంటనే నేషనల్ డిఫెన్స్ అకాడమి పరీక్ష వ్రాసి అనూహ్య విజయం సాధించాడు.అప్పుడు ఇతడి వయసు 17 ఏళ్ళు మాత్రమే ! దేశ వ్యాప్తంగా 300 మందిని మాత్రమే ఈ అకాడమికి ఎంపిక చేస్తారు. ఈ 300 మందిలో రాజారెడ్డి ఒకడుగా ఎంపిక కావడం అనేది నిజంగా గర్వకారణం.

#మిలటరీ_కెరీర్  
 
1998 డిసెంబర్లో ఇతడి మిలటరీ కేరీర్ ప్రారంభమయ్యింది. అప్పుడు రాజారెడ్డి వయసు 18 ఏండ్లు. 

తమ పిల్లలు సైన్యంలో చేరడాన్ని మనలో చాలా మంది తల్లిదండ్రులు ఒప్పుకోరు.తమ బిడ్డలు తమ కళ్ళెదుట ఉండాలని....సురక్షితమైన ఉద్యోగాలు చేసుకోవాలని ఆశ పడ్తారు.కాని వీరరాజారెడ్డి తల్లి దండ్రులు మాత్రం తమ కొడుకు ఎంచుకున్న రంగానికి అడ్డుచెప్పకుండా గౌరవించారు.దేశానికి సేవ చేసే భాగ్యం తమ బిడ్డకు రావడం గొప్ప అదృష్టంగా వారు భావించారు. దేశసేవలో బిడ్డను చూసుకుని ఉప్పొంగిపోయారు. 

#పాకిస్తాన్_మూకల_దాడి 

తన ప్రతిభ పాటవాలతో కెరీర్ లో వేగంగా ఎదిగాడు రాజారెడ్డి. ఈ క్రమంలో జమ్మూ కశ్మిర్ లో కెప్టెన్ గా పనిచేస్తున్నప్పుడు రాజొరీ జిల్లా వద్ద జూలై 31,2002న పాకిస్తాన్ శత్రు మూకలు దేశంలోకి జొరబడి దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేసాయి. 
ఆపద పసిగట్టిన రాజారెడ్డి అప్రమత్తం అయ్యాడు. నిర్భయంగా ఎదురుతిరిగాడు.పోరాట సూరీడై చండప్రచండంగా చెలరేగిపోయాడు.50 తుటాలు తన శరీరాన్ని చిదిమేసినా ఆత్మస్థయిర్యాన్ని వీడక చివరి శ్వాసవరకు పోరుసలిపాడు. నెత్తుటి చినుకులు శరీరాన్ని తడిపిన ఆ ఉద్రిక్త క్షణాల్లో భారతమాత ఒడిలో అజేయమై ఒదిగిపోతూ...అమరమై నేలకు ఒరిగాడు.  

#పెళ్లయి_మూడు_నెలలు_మాత్రమే 

వీరుడు మరణించేనాటికి పెళ్ళయి 3 నెలలు మాత్రమే అయ్యింది. మళ్ళీ వస్తానని ప్రేమగా చెప్పి వెళ్ళిన తన సహచరుడు తన పారాణి ఆరక ముందే పాడె మీద పడుకున్న ఆ కన్నీటి సంధర్బం ఆ మగువ బతుకులో ఓ చీకటి స్వప్నం ! 

#ప్రభుత్వం_నిర్లక్ష్యం 

రాజారెడ్డి మరణించి 18 ఏండ్లు అవుతుంది. 
ప్రభుత్వం రజారెడ్డి త్యాగాన్ని పెద్దగా గుర్తించలేదు.కాబట్టే మొదట్లో అతడి విగ్రహానికి అనుమతి ఇవ్వడంలో విముఖత చూపింది. నిర్లక్ష్యం వహించింది.కాని తల్లిదండ్రులు తమ కొడుకు త్యాగం వృధా కాకూడదని...తమ కొడుకు పేరు మాసి పోకూడదని...తమ పేగుబంధం తెగిపోయినా తమ కొడుక్కి దేశంతో వున్న అనుబంధాన్ని ఈ ప్రపంచం మరిచి పోకూడదని...ప్రభుత్వంతో గొడవపడి అనుమతి సాధించుకున్నారు.తమ స్వంత ఖర్చులతో కొడుకు విగ్రహాన్ని స్ట్రీట్ నం 8 హబ్సీగూడాలో ప్రతిష్టించుకున్నారు.

ఇది నిర్లక్ష్యం అనేకంటే కచ్చితంగా ఈ దేశం దౌర్భాగ్యం అనడమే సరైన మాట !
ఎక్కడో ప్రేమ వ్యవహారంలో చనిపోయిన ప్రేమికుల కోసం విగ్రహాలు కట్టాలని అడిగే ప్రజా సంఘాలు వీరుడి గురించి నోరు మెదపడం లేదు. పనికిమాలిన ప్రేమ ఎవ్వరి కోసం? వాళ్ళ శరీరాల కోసం... వాళ్ళ వ్యక్తిగత జీవితం కోసం ! కానీ వీరుల త్యాగం దేశం కోసం ! ఇక్కడ కులం లేదు... మతం లేదు. ఒక కులం కోసం వీరుడు మరణించలేదు.యావత్తు జాతి కోసం ప్రాణం అంకితం ఇచ్చాడు. ఈ విచక్షణ ప్రజా సంఘాలకు ఎందుకు లేదు? 
ప్రభుత్వానికి ఎందుకు లేదు? 

 ఒక వీరుడిని గుర్తించలేని ప్రభుత్వాలు...ఒక వీరుడి కుటుంబానికి సముచిత న్యాయం చేయలేని ప్రభుత్వాలు...ఒక వీరుడి విగ్రహం ఏర్పాటుకు సరైన తోడ్పాటు అందివ్వని ప్రభుత్వాలు...ఓట్ల కోసం సీట్ల కోసం కులాలను ఎంచుకుని ఆయా కులాల్లో ' గొప్పోళ్ళు ' ఎవ్వరా అని గాలించి...వాళ్ళ మెప్పుకోసం విగ్రహాలను ఏర్పాటు చేసే ఈ స్వార్థ అసమర్థ ప్రభుత్వాలు..కళ్ళెదురుగా కనిపిస్తున్న త్యాగధనుడిని విస్మరించడం నిజంగా బాధాకరం.

#తల్లిదండ్రుల_వేదన 
"ఉన్న ఒక్కగా నొక్క కొడుకుని కొల్పోయి .... ప్రభుత్వ సహకారం లేకున్నా కష్టపడి మేము బతుకుతున్నాం.ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదో ప్రభుత్వాలకే తెలియాలి. ఒక వీరుడు మరణిస్తే ఆ త్యాగం చుట్టూ ఇన్ని ఆటంకాలా? ఈ ప్రభుత్వాలకు ఎందుకు ఇంత వివక్ష ? మాలాంటి పరిస్థితి పేదవాళ్ళకు
ఎదురైతే వాళ్ళ జీవితాలు ఏం కావాలి ? '" అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నడు రాజారెడ్డి తండ్రి కొండల్ రెడ్డి. ప్రస్తుతం తన కుటుంబం కోసం పదవీ విరమణ తర్వాత సైతం వీరు ఉద్యోగం చేసుకుంటున్నారు. 

#త్యాగధనుల_కుటుంబం 

వీర రాజారెడ్డి కుటుంబం మొదటి నుండి పోరాటాలకు పెట్టింది పేరు. రాజారెడ్డి ముత్తాత కొండల్ రెడ్డి సాయుధ పోరాట వీరుడు. వీరి స్వగ్రామం నల్లగొండ జిల్లా సైదాపురం గ్రామం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కదం తొక్కిన కొండల్ రెడ్డి, గ్రామస్తులను సంఘటితం చేసాడు. ప్రజలకు పోరాటం పాఠాలు నేర్పించి తాను ముందుండి గ్రామ దళాన్ని నడిపించాడు. ఇందుకు నిజాం ముష్కర సేన రాజాకార్ కొండల్ రెడ్డి మీద కక్ష్య గట్టింది. 28-1-1948 నాడు కొండల్ రెడ్డిని కొలనుపాక వద్ద గడ్డివాములో వేసి సజీవంగా తగులబెట్టింది. దేశం కోసం తరతరాలుగా ప్రాణత్యాగం చేస్తూ వస్తున్న రాజారెడ్డి కుటుంబం సదా స్మరణీయం. కానీ సర్కారు అలక్ష్యం మాత్రం శోచనీయం. ఇప్పటికయినా తెలంగాణ ప్రభుత్వం రాజారెడ్డి కుటుంబాన్ని గుర్తించాలి. 

#స్మారకం  
 హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 వీరరాజారెడ్డి మార్గ్ గా పిలవబడుతున్నది 
రామాంతాపూర్ లో రాజారెడ్డి స్మారక గ్రంధాలయం వున్నది.వీరి తల్లిదండ్రులు కొండల్ రెడ్డి దంపతులు హబ్సిగుడాలో నివాసం వుంటున్నారు. కొడుకు పేరిట తమ శక్తి మేర సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. 

వీరుడి త్యాగం వెయ్యేళ్ళు వర్దిల్లనీ.....