Showing posts with label కవితలు. Show all posts
Showing posts with label కవితలు. Show all posts

Thursday, January 3, 2019

గడి (కవిత )

శిథిల ప్రాభవం....ఆ..గడి...!!!
..............................✍తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి
అదిగో అక్కడే
రాజసపు రతనాలు దొర్లాయి
రాక్షసత్వపు రక్తపు చినుకులు రాలాయి....
కారుణ్యపు సవ్వడులు వినిపించాయి
కాఠిన్యపు కథనాలు కనిపించాయి....
అదే గుడిగా గంటలు మోగాయి
అదే ఠాణాగా నిర్ధేషాలు కొనసాగాయి.....
న్యాయం నినాదమై గళం విప్పింది
అన్యాయం కరవాలమై కంఠం తెంపింది.....
గట్టిమేలు గమ్యమై నిలిచింది
వెట్టిచాకిరి దైన్యమై దహించింది....
****
అదిగో....
'' బత్కరా పేరు జెప్పుకుని '' అక్కడే
'' బాంచన్ కాల్మొక్తా '' అక్కడే...
'' నిన్నేలెటోన్ని '' అక్కడే
'' నీ గులాపోన్నీ '' అక్కడే....
కచ్చడాలు పరుగు తీసింది అక్కడే
కర్కషత్వం నిదుర లేచింది అక్కడే ....
దొరసానుల దర్పం అక్కడే
అడపాపల దౌర్భాగ్యం అక్కడే....
****
అదిగదిగో
అడుగడుగున
ఎదురులేని నాయకత్వపు ఆనవాళ్ళు
తిరుగులేని  దౌర్జన్యపు      సంతకాలు....
అదిగదిగో
ఏమి ఎరుగనట్టు
బాకులు కోలాటమాడిన ప్రాంగణాలు
బందూకులు పేల్చిన పరిసరాలు....
అదిగో
ఊరినిండా
బరిసెలు ఎత్తిన పొగరులు
గడి నిండా శిరసు వంచిన గురుతులు....
దొరతనమా
నీవు నిజాం తొత్తువి
కానీ ధైర్యానికి విత్తువి....
నీ అద్భుతాన్ని నమస్కరిస్తున్నా!!
కానీ నీ అరాచకాల్ని తిరస్కరిస్తున్నా!!!!
(నిశ్శబ్ధం కావలించుకున్న ' గడీ ' లను చూసాక ఈ కవిత)

మాతృభాషకు వందనం (కవిత )

మాతృభాషకు వందనం
--------------------------
             -✍డా.తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
జాతి నుదుటిపై సిందూరం
జగతి వాకిట మందారం
ప్రాచీన చరితల పావన సదనం
సమస్తం రాయగల సుందర వచనం.......
వినుసొంపుకు మారుపేరు వర్ణమాలరా
తీపి చెరుకు గడలు మన ఓనమాలురా
సాహితీ సౌరభాల పూలతోటరా
పాండిత్యపు సారధిగా రాజబాటరా......
నన్నయను ఆదికవిగా మలచిన అక్షరం
రామకథకు వాల్మీకిని రప్పించిన సులక్షణం
వాగ్దేవీ నడయాడే సారస్వత ప్రాంగణం
రతనాలు దొర్లినట్టు చేవ్రాలు రాజసం......
జ్ఞానపీఠమలరించిన సిరాచుక్కరా
శతకధార వొలికించిన సత్యవాక్కురా
నుడికారపు సవ్వడుల సుగుణబాలరా
చమత్కార చమక్కుల సువర్ణధారరా.....
పలుకుబడులు ప్రవహించిన భావకలశము
వెటకారపు సొగసులున్న శబ్దనాదము
చందోరీతి గుణగణాల చందము
వ్యాకరణతీరులో సంధిసూత్ర అందము.....
అమరకోశమైన మన తేనెపలుకురా
ఆధ్యాత్మికశోభకు ఆనవాలురా
మాన్యులు సామాన్యులు ప్రణమిల్లిన పవిత్రతరా
జీవనదుల సాక్షిగా పరఢవిల్లిన జీవభాషరా.....
కన్నతల్లి కన్నవూరు కలగలసిన బంధము
ఏ ప్రాంతమెల్లినా వీడిపోని ఋణము
అమ్మా అనే పిలుపుకు హక్కుదారురా
కడవరకు మనభాషను మొక్కుదామురా
ఘనకీర్తి మన '' తెలుగు '' బ్రతుకుశ్వాసరా.......

ఆమె గొంతుక (కవిత )

ఆమె గొంతుకనై....
.........................
రచన: డా.తంగెళ్ల శ్రీదేవి రెడ్డి
*బంగారు పంజరంలో చిక్కుకున్న
ఉక్కు పిడికిలిని
ఆంక్షల కవచాలు ధరించిన
అక్షర లక్షణాన్ని
నేను
మానవిని....మానవీయతని....
అరణ్యాన్ని మింగుతున్న అతిసుకుమారిని
అగ్ని కీలల్లో కాలుతున్న మంచుశిఖరాన్ని
నేను
బాంధవిని....బాంధవ్యాన్ని...
బానిస సంకెళ్ళు ధరించిన పరాక్రమాన్ని
అణిచివేతను
సహిస్తున్న అద్భుతాన్ని
నేను
సవ్యసాచిని.....సాధికారతని....
ప్రపంచాన్ని నడిపించగల  ప్రతిభాశాలిని
పరాయికరణలో  ఓడుతున్న పాపక్రీడని
నేను
నవీనని.....నవ్యతని....
శిథిలాల్ని కావలించుకున్న సుందరస్వప్నాన్ని
గ్రీష్మాని మోస్తున్న  వ'సంతకాన్ని'
నేను
ఆకాశాన్ని....అనితరసాధ్యాన్ని...
అవును
నేను
వెన్నెల వాకిలిని.....
ఆదరణ కరువైన పొక్కిలిని.....
నిజంగా మిక్కిలిని........

నాన్న (కవిత )

నాన్న.....
----------------------
               ✍ తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
బంధాల కవచం ధరిస్తాడు
బాధ్యతల బరువులు మోస్తాడు
తనెప్పుడూ బయటే వుంటాడు
మనసును మాత్రం ఇంట్లోనే
వదిలి పెడ్తాడు......
కష్టం నష్టం భరిస్తాడు
సాంతం ఇంటికై శ్రమిస్తాడు
తనెప్పుడూ ఖర్చు చేస్తాడు
ఆ జాబితాలో తన పేరును మాత్రం
విస్మరిస్తాడు.....
సరిహద్దులు గీస్తాడు
ఆంక్షలు విధిస్తాడు
తనెప్పుడూ భయపెడ్తాడు
ఆ వెనకాలే నిలిచిన  'బలహీనతని '
బలవంతగా అదిమి పెడ్తాడు.....
తోటమాలై కాపలా కాస్తాడు
మార్గదర్శై దారి చూపుతాడు
తనదెప్పుడూ యుద్ధప్రకటనే
తన గెలుపుకై కాదు
మన  గెలుపును స్వీకరించుటకై.......

మా అమ్మ సుజాత

ఇల్లు ఖాళిచేసి
ఊరు దాటుకుని
ఎక్కడున్నావే....?
మట్టి పరుపుల కింద  మౌనంగా పడుకుని
దు:ఖమై ఎందుకు తిరిగొస్తున్నావే
         మా అమ్మ      సుజాతా???

అనాథల అరణ్య రోదన (కవిత )

అ...అంటే అమ్మ అని
పలక మీద పంతులమ్మ
పదిలంగా రాసింది....
పలకలేక నా మనసు
వెక్కి వెక్కి ఏడ్చింది..........
ఆ.....అంటే ఆవు అని
ఓనమాల పుస్తకం
ఒద్దికగా చూపింది
ఆవుదూడ ఆబొమ్మను
చూడలేక నా గుండే
తల్లడిల్లి పోయింది..............
ఇ....అంటే ఇల్లు అని
తరగతిలో పిల్లలంతా
గొంతెత్తి చదివితే
ఇల్లు లేని నా బతుకు
దిగులుతో కుమిలింది........
ఈ...అంటే ఈషుడని
అందరికి తండ్రి అని
ప్రతినిత్యం చెబుతుంటే
నాన్న లేని  నా పయనం
నలిగి నలిగి చచ్చింది
నరకమే చూసింది.............
ఉ...అంటే ఉమ అని
అందరికి అమ్మ అని
పదే పదే చెబుతుంటే
అమ్మకై నా లేమి
అణువణువు  వెదికింది
అశ్రువై మిగిలింది..........
ఊ...అంటే ఊయలని
పసిపిల్లల పానుపని
అది - లాలిపాట రాగమని
ఊరిస్తూ వివరిస్తే
జోలలేని నా హృదయం
హృద్యమై పోయింది.......
పెంచలేని అమ్మకు
ఆడతనం ఎందుకు?
కనగలిగిన అమ్మకు
కాఠిన్యం ఎందుకు?
మోహమా మోసమా...
ఇది మాకు శాపమా?
మాతృత్వం వరమైన ఓ అమ్మలారా
ఆలోచించండి...
తలరాతలు మార్చొద్దు....
అనాథలను సృష్టించొద్దు....
                  ✍తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

సిరియా మారణ హోమం (కవిత )

ఇది ఎవ్వరు చేసిన పాపం?
ఎందుకీ నరకం?
.............................  శ్రీదేవి తంగెళ్ళ
వేలవిద్రోహాల  వికృత తాండవం....
వేలాడిన యమపాశాల కరాళ నృత్యం....
నిర్ధయో...నిర్దాక్షిణ్యమో....
ఉలిక్కిపడిన ఉగ్గుపాలు !!
విషన్నమో... విషాదమో...
చావుకేకైన చనుబాలు !!
అర్తనాదమో...ఆక్రందనో...
నేలకొరిగిన మురిపాలు !!
ఎవ్వడు రాసిన రాతలివి?
ఎవ్వడు చెరిపిన గీతలివి?
మరెవ్వడు శాశించిన గాథలివి??
మానవత్వమా తిరిగిచూడు....
విధిని ఒక్కసారి అడిగిచూడు....
దు:ఖం అనివార్యమైన  నేలమీద
కురిసిన రుధిర వాన..
శాపమో పాపమో తెగబడిన వేళ
తెగిన ఆయు: వీణ...
నీవూ నేనూ ..అందరం..
ఇప్పుడు శోకపీడితులమే
*******
అరణ్య రోదనలకు అశ్రువొక్కటి అర్పిద్దాం.....
తీరని వేదనలకు అంజలైనా  ఘటిద్దాం....

ఇదీ వరుస (కవిత )

ఇదీ వరస...
.........................
                  ✍  తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి樂
గుడి ముందు అడుక్కుతింటున్న
నా అవ్వను దాటుకుంటూ
గుడిలో నా సాములోరి కోసం
ప్రతి రోజూ పైసల సంచులు పరుగెడుతుంటయి.. ..
బడిలో గోడ కుర్చీ ఏయించిన
పీజులు కట్టని  నా బుడ్డోడిని దాటుకుంటూ
అంబాసిడర్ పేరుమీద మన సానియమ్మకు
చేరిన కోట్లకట్టలు.... యాది మరువని సోపతై
నిత్యం సతాయిస్తుంటయి...
తలుపుల్లేక పరదాలు కట్టుకున్న
బాలికల వసతి గృహాల మరుగుదొడ్లను దాటుకుంటూ
ఇవాంకా'లాంటోళ్ళ కోసం ఇకిలించుకుంటూ పోతున్న
ఖజానా కాఠిన్యం ...పీడకలై వెంటాడుతుంటది..
కనికరంలేని కాలన్ని కన్నీటితో భరిస్తున్న
నా రైతన్నల   అవస్థల్ని దాటుకుంటూ
కమర్షియల్ కాసుల మూటలు
కాంస్యం సాధించినోళ్ళ ఇంటిముందు సాగిలబడిన తీరు
సుఖమెరుగని సుస్తీలా ఇంకా సతాయిస్తూనే వుంది..☹
పోరగాళ్ళ పాలడబ్బాలకు పైసలు కరువై
ఏటీఎం ల చుట్టు  ప్రదక్షిణలు చేస్తున్న
నా సోదరుడి అసహాయతను  దాటుకుంటూ
విజయ్ మాల్య
లలిత్ మోడి
నీరవత్ మోడిల కంటైనర్లు వెళ్తుంటే
భావిభారతం కోసం వరదలవుతున్న ఉపన్యాసాలు
చెవులెంబడి రక్తం కారిస్తున్నయి..
***
ఇప్పుడు మనకు మనమే ఒక ప్రశ్న...!!!?????????????????

శతమానం భవతి (కవిత )

శతమానంభవతి....
-------------------
                     ✍తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
ముసి ముసి నవ్వుల సిరిమల్లి
బుడి బుడి నడకల బుజ్జితల్లి
ఆశల పల్లకి మా జాబిల్లి
మా బతుకున వసంతం వెదజల్లి
నిండు నూరేళ్ళు వర్ధిల్లి....

శతమానం భవతి
ఏలుకో నీవు ఈ జగతి
ఇది కోటిదేవుళ్ళ ఆనతి...
駱
అవ్వయి తువ్వాయి ఆడమ్మా
చిట్టిపొట్టి మాటల చిలుకమ్మా....
కన్నుల పండుగ నువ్వమ్మా
రేపటి కలవై బతుకమ్మా....
పాటను గెలిచిన శారదవి
మా వరమై వచ్చిన రోహనువి..

ఆటలు పాటలు నేర్వంగా
లోకం నిన్ను చూసి మురవంగా....
చామంతి పూబంతి కనువిందు
చినబోయినాయమ్మ నీ ముందు....
మహారాజువై వెలుగమ్మా
మంచికి పేరుగా నడువమ్మా....
(వీడునా కలల రాజకుమారుడు...నా ముద్దుల కొడుకు రోహణ్ రంగారెడ్డి)

వార్ధక్యం (కవిత )

ప్రాయానికి అవతలి తీరం
......................................
                 ✍తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
నా ఊరు..నాఇల్లు..నా గడప..
వీటితో ఏర్పడిన నా అనుబంధం
అమాంతం తెగిపోతుందేమోనని
భయంగా ఉంది....
***
ఆ గడియారం..ఆ బల్ల ..ఆ కుర్చీ..
అన్నీ నావే! వీటన్నీటినీ దాటుకుని
నేను వెళ్ళిపోతానేమోనని
ఆందోళనగా ఉంది...
***
ఎంతదూరం వెళ్ళినా...ఎంత అలసిపోయినా...
రాగానే ఉపశమనం అందించే
నా ఇంటిగోడల్ని వదులుకుని
కనుమరుగై పోతానేమోనని
కంగారుగా ఉంది....
***
అప్పుడెప్పుడో కొనుక్కున్న ఇనుపడబ్బా
చిలుము పట్టుకుపోయింది...
ఇంటివెనకాల చేదులబావి పూడుకుపోయింది...
ఊరించి అలరించిన రేడియో అటక ఎక్కింది....
కాంతివంతమైన నా శరీరం
ముడుతలలో కూరుకుపోయింది.....
***
ఊరు దూరం అవుతున్న గడియలు
దుఖానికి దగ్గరగా లాక్కెలుతున్నాయి...
ఎవ్వరో ఒకరి ఆసరా కోరుతున్న వార్ధక్యం 
నిన్నటి నా పొగరుని ప్రశ్నిస్తున్నది...
దేవ దేవా...!!
జీవితం అంటే ఇంతేనా???
తెలవారని చీకటేనా????☻
( ఎంతో చలాకిగా ఉండే మా అత్తగారిలో వయసు తెచ్చిపెట్టిన నిస్సత్తువని చూసాక ఈ కవిత..)

దొరా (కవిత )

దొరా...!!!
       -✍ తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి 
                                                                            ........దొర ఏందిరో వాడి పీకుడేందిరో....!?
దొరోడి గోచి మన బూచా..!?
పాడుబడ్డ దొరగాడి గడి..!!
ఇంకానా దొరతనం...??
ఆ నా దొరగాడు...!
దొరగాడి గడి...!
అంటూ...
దొరల వ్యవస్థపై విరుచుకుపడిన/పడుతున్న
ఆక్రోషపు కంఠధ్వనులు...
నినాదాలై....
నిప్పుకణికలై...!!!
తిరుగుబాటు చైతన్యం కొత్త వసంతాలు పూయించింది...
ప్రతిఘటనా శౌర్యం నవశకాన్ని సృష్టించింది...
విముక్తి పోరాటం పాఠ్యాంశమై అలరిస్తున్నది...
亂
కానీ...మరి...
మా వూరిలో అవ్వ
తన మనవడ్ని
'దొరలా బతుకు బిడ్డా 'అని ఆశీర్వదిస్తున్నది駱駱駱
అంతరార్థమేమిటో అర్థం కావడం లేదు....!!!!樂

సగం - సగం (కవిత )

సగం సగం☘
..........................✍ తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి
ఆకాశంలో సగం....అవనిలో సగం....
నీవు చినుకువై రాలినప్పుడు
నేను తడుపునై పులకరిస్తుంటాను 
మనసులో సగం...మనువులో సగం....
నీవు వెలుగువై ప్రసరించినప్పుడు
నేను కిరణమై ప్రజ్వరిల్లుతుంటాను ☺
గాయంలో సగం...కాయంలో సగం....
నీవు చీకటివై చిన్నబోయినప్పుడు
నేను మబ్బునై తోడుగా నిలుస్తుంటాను 
పోరాటంలో సగం...ఆరాటంలో సగం....
నీవు గమ్యానికై సాగుతున్నప్పుడు
నేను నీడనై కదులుతుంటాను ‍⚕️
బతుకులో సగం...బాధలో సగం...
నీవు సముద్రుడివై పొంగినప్పుడు
నేను నదీ నాదమై పెనవేసుకుంటాను ☺
ఆశలో సగం...ఘోషలో సగం....
నీవు దారివై సాగినప్పుడు
నేను నడకనై వెంబడిస్తాను 
మాటలో సగం...పాటలో సగం...
నీవు యుగళానివై గళం విప్పినప్పుడు
నేను బాణీనై స్వరాలు సమకూరుస్తుంటాను 
ప్రకృతిలో సగం...ఆకృతిలో సగం...
నీవు పున్నమివై పులకించినప్పుడు
నేను ధవళమై జాలువారుతుంటాను. 欄
వర్తింపులో సగం...గుర్తింపులో సగం...
నీవు దిశగా నిర్దేశమైనప్పుడు
నేను దశగా నిర్ణయమౌతుంటాను ✌
భరణంలో సగం...మరణంలో సగం....
నీవు క్షిపణివై కూలినప్పుడు
నేను శకలమై కాలుతుంటాను
పయనం లో సగం...ప్రాణంలో సగం...
నీవు సుమమై రేకులు విప్పుకున్నప్పుడు
నేను పరిమళమై వ్యాపిస్తుంటాను 
రాసిలో సగం ....వాసిలో సగం...
రాతవై నీవు దొర్లినప్పుడు
గీతనై నేను తరిస్తుంటాను ✏
ప్రణయంలో సగం.... ప్రళయంలో సగం...
నీవు విఫలమైన శాంతివైనప్పుడు
నేను సఫలం కోసం యుద్ధమౌతుంటాను鷺
అవును!
నువ్వు అతిథివి నేను ఆతిథ్యాన్ని....
నువ్వు మేఘానివి నేను గర్జనని...⛈⛅
నువ్వు హృదయానివి నేను ఆ స్పందనని....
卵✊

అమ్మా నాన్నలకో ఉత్తరం -కవిత

అమ్మానాన్నలకో ఉత్తరం
``````````````````````````````````✍ తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
పిల్లల చుట్టూ ఆశల వలయాలు నిర్మించుకోండి
కానీ....
ఆంక్షల కోటల్లో వాళ్ళను బంధించకండి...!
ఆశయాల పూలతోటల్లో వాళ్ళను పరుగెత్తించండి
కానీ....
పువ్వుల కింది ముళ్ళులై వాళ్ళను బాధించకండి....!
భావిభారతికై వాళ్ళను పునర్నిర్మించండి
కానీ....
బలహీనమైన పునాదులతో వాళ్ళను కూలదోయకండి....!
చతురంగబలమై వాళ్ళను వెన్నంటి నడవండి
కానీ....
ఆత్మస్థయిర్యపు ఆయుధాలను సమకూర్చడంలో విఫలం కావొద్దండి....!
అవును!
వాళ్ళకై కలల సామ్రాజ్యాన్ని సృష్టించుకోండి
కానీ...
వాటిని నిజం చేసుకోవడంలో
మీ అభిప్రాయాలను వాళ్ళమీద బలవంతంగా రుద్దకండి.....!!

బిడ్డా ఎరుకేనా... (కవిత )

✍తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
°°°°°°°°°°°°°°°°°°°°
బిడ్డా ! నీకు ఎరుకే కదా...!?
ఇక్కడొక  'ప్రణయ' కావ్యం చిరిగిపోయింది...
ఓ 'అమృత' హృదయం అతలాకుతలమయ్యిది...
మనం అగ్ర వర్ణమో...అట్టడుగు వర్గమో ...!? ఏమో !?
రాజ్యాంగం మాత్రం మనకు కులం సూచీని అందించింది....
కులం పేరుతో బతకమని పురమాయించింది....
కులాలు వద్దు మహాప్రభో అంటూ
మానవతా మూర్తులో
అభ్యుదయ వాదులో
నెత్తి నోరూ బాదుకుంటున్నా
' కులాలు అనివార్యం ' అంటూ సర్కారే 
కెటాయింపులు కొనసాగిస్తున్నది...
మరి బిడ్డా నువ్వెంత? నేనెంత ?
నియంత్రణ వేళ్ళూనుకు పోయిన చోట
మన కులం వెంబడి మనం సాగిపోతామో
సమసమాజం కోసం కొట్లాడుతామో
ఏమో !?
ఇదంతా చూస్తూ ఎవ్వరో  ఏదో
నిర్ణయించాలనుకుంటారు ..
గీసుకుని ఉన్న  హద్దులు సరిహద్దులను
చెరిపేయాలనుకుంటారు... 
అంతలోపే ...
ఓ తండ్రి తళారిగా మారవచ్చు...
అందుకే బిడ్డా...
నేను చూపిన రంగుల ప్రపంచాన్ని
నేను తొడిగిన రెక్కలను
నేను పరిచయం చేసిన జీవితాన్ని
మరిచిపోవద్దు...!
నీవు ప్రేమవైపు మొగ్గక ముందే
ఇదిగో...నీకోసమో నీలాంటి వాళ్ళ కోసమో
కులాల మరకల్ని తొలగించమని
సర్కారుకు ఆర్జి పెట్టుకుంటాను....
అప్పుడు అందరూ సమానమే కదా
నేనే నీ పెళ్ళికి ముహుర్తాలు నిర్ణయిస్తాను...

నాన్న రాసిన ఉత్తరం '' కవిత

నాన్న రాసిన ఉత్తరం...
°°°°°°°°°°°°°°°°°°°°°°✍🏿తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
చిట్టితల్లీ...!
గుండెల నిండా నిన్ను మోస్తున్నాను...
కనుపాపల్లో నిన్ను పొదుపుకున్నాను...
నిన్ను నా ప్రపంచంగా మలుచుకుని
ఏ దిగ్విజయాన్నో ఆశిస్తున్నాను...!
అవును...
ఇందుకోసమే కదా
విరుగుతున్న నా రెక్కల్ని
అదేపనిగా అతికించుకుంటూ
రేయింబవళ్ళు  సంపాదనకై
ఎగబడుతుంటాను...!
నీ అత్తరు పరిమళాల కోసం
నా స్వేదాన్ని అసాంతం ఖర్చుపెడుతుంటాను..!
నీకు వెలుగుల దారి చూపడం కోసం
వేల చీకట్లను సహిస్తుంటాను..
వేళ తప్పి నిదురిస్తుంటాను..
దూరం ఎంతయినా కానీ
నా మనసును నీ దగ్గర వదిలి
బయలుదేరుతుంటాను...
నీకోసమే..
నిన్ను గెలిపించడం కోసమే...
నేను ఎన్ని సార్లో ఓడిపోతుంటాను..
ఇక్కడ నువ్వు
తల ఎత్తుకు తిరగడం కోసం
నేను ఎక్కడో ఎవ్వడి ముందో తలదించుకుంటాను...!
ఎవ్వడో కాండ్రిస్తాడు-
మరెవ్వడో బెదిరిస్తాడు-
ఇంకెవ్వడో నాపై కక్ష గడుతాడు-
అయినా భరించుకుంటాను...!
బాధలను అదిమి పెట్టుకుంటాను...!
నేనే నీ బలమైనప్పుడు
నేను బలహీనుడినైతే
నీ సుందర స్వప్నాలు కూలిపోతాయని
నా దుస్వప్నాలను దాచేసుకుంటాను...!
నిజం తల్లీ..!
కాలానికి ఎదురీదుతూ
ఎన్నెన్నో  విషాదాలను దిగమింగుకుంటాను
ఎవ్వడో నాపై కక్కే విషాలను
నీకు తెల్వకుండా కడిగేసుకుంటాను...
నాన్నను కదా
నీ కలల సౌధానికి పునాది రాళ్ళను
మోస్తుంటాను..
నీవు ఎదగాలని...
నా ఆశలకు ఆకృతి ఇవ్వాలని..
నేను భరించిన బాధలను
నీ విజయం తుడిచెయ్యాలని..
పడుతూ లేస్తూ పరుగెడుతూనే వున్నాను తల్లీ...!
బరువో భారమో ఇవేమీ నాకు తెల్వదు
అవును మరి..
ఇష్టం ఉన్న చోట కష్టం ఊసు ఉండదు కదా....!
ఇదిగో తల్లీ..
నా శ్వాస నిండా నువ్వు నిండి ఉన్నావు
అందుకే  గుట్టలు మోస్తున్నా కూడా
గుంభనంగా ఉన్నాను....
ఏ ఒడిదుడుకుల దాడులో జరుగుతున్నా
ధైర్యంగా ఉన్నాను...!
నీకు ఓ  భవిష్యత్తును అందించాకా..,
నీ భావి కిరీటానికి
నా శక్తి మేరా మెరుగులు దిద్దాక..,
నా బాగోగుల్ని నీ చేతుల్లో పెట్టాలని
కోరుకోవడం లేదు తల్లీ...
అదిగో
మనకంటూ ఒక సమాజం ఉన్నది కదా -
నేను కూలిపోతే చూసి నవ్వడానికి
సిద్దంగా ఉన్నది కదా -
నేను దు;ఖిస్తే పరవశించడానికి
ఎదురు చూస్తున్నది కదా -
అందుకే తల్లీ
నా దేవతవు నువ్వే కాబట్టి
చేతులు జోడించి వేడుకుంటున్నా...
నీవు గీత దాటవద్దు...!
ఆ అవసరం అవకాశం రానివ్వొద్దు...!
నాన్నని కదా
నీకోసం బతకాలని ఉంది...!!!
నీ కారణంగా నా గౌరవం
పెరిగితే గర్వపడాలని ఉంది...!!!

రైతు కవిత

రైతు కన్నీళ్ళకు దోసిలి పట్టేది ఎవ్వరు?
-----------------------------------
 రచన: శ్రీదేవి రెడ్డి తంగెళ్ళ

రైతు అంటే రాజు అంటారు
           రైతు రాజ్యం మనది అంటారు
అన్నదాత దేవుడంటారు
జే కొడుతూ జయము అంటారు
పట్టుగొమ్మలు  మీరే అంటారు
శిరసు వంచి శరణు అంటారు.........

మనదిగాని రాజ్యమాయే
దళారీల భోజ్యమాయే
మెతుకులేని బతుకులాయే
బతుకునిండా  గతుకులాయే
కట్టుకథల సేద్యమాయే
కలల పంట ఎండిపాయే.........

ఊటబావి ఊరకున్నది
బోరుబావి పూడివున్నది
    వానదేవుడు     అయిపు లేడు
నేలతల్లికి తడుపు లేదు
పంట భూములు దుక్కిపాలు
బతుకులేమో నవ్వుల పాలు.......

 కడుపు మంటలు నిత్యమాయే
కలుపు మొక్కల రాజ్యమాయే
అప్పులేమో పెరిగిపాయే
ఆశలన్నీ ఆవిరాయే
రాకాసి కరువు చీడా
ఆదుకునే నాథుడు లేడా.......

 కల్తీ ఎరువుల మోసమాయే
బతుకు దెరువు గాసమాయే
వ్యవసాయం దండగాయే
మీ సావుల పండుగాయే
పురుగుమందే పరమాన్నం
పిల్లపాపలు ఆగమాగం.......

వెంటాడిన వెతలకోసం
ప్రాణమే ఖరీదాయే
బొందలగడ్డ సుట్టమాయే
గొర్రుకొయ్యల గురుతులాయే
బీడువారిన ఆశలు
ఇనుప గజ్జెల గోసలు.........

ఒట్టి మాటల మూటలతో
బతక నేర్చిన చేతలతో
గుడ్డి రాజుల పాలనాయే
గడ్డిపోసలు కరువాయే
డొక్కలెండిన పాడి జూడు
బొక్కదేలిన మీ పయ్యి జూడు......

వాడు వస్తడు  వీడు వస్తడు
ఎవ్వడో వచ్చి ఏదో జేస్తడు
ఓ రైతన్నలారా
సలుపుతున్న గాయాల వేదనల్లారా
ఎవ్వడో వచ్చి చేసేదేముంది?
ఓటు భిక్షకుల తరిమివేయండి........

చెదలు బట్టిన నాగలి
          మండుతున్నది    ఆకలి   
      సమయమిదేరా భూమిపుత్రా
ధరించు ధైర్యాన్ని...
త్యజించు దైన్యాన్ని...
సాముజెయ్యరా రైతుబిడ్డా...
మాయమాటల ప్రభుత్వాల్ని మట్టుబెట్టరా దొరబిడ్డా...
ఉద్యమించరా  వీరబిడ్డా......