Thursday, January 3, 2019

మాతృభాషకు వందనం (కవిత )

మాతృభాషకు వందనం
--------------------------
             -✍డా.తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
జాతి నుదుటిపై సిందూరం
జగతి వాకిట మందారం
ప్రాచీన చరితల పావన సదనం
సమస్తం రాయగల సుందర వచనం.......
వినుసొంపుకు మారుపేరు వర్ణమాలరా
తీపి చెరుకు గడలు మన ఓనమాలురా
సాహితీ సౌరభాల పూలతోటరా
పాండిత్యపు సారధిగా రాజబాటరా......
నన్నయను ఆదికవిగా మలచిన అక్షరం
రామకథకు వాల్మీకిని రప్పించిన సులక్షణం
వాగ్దేవీ నడయాడే సారస్వత ప్రాంగణం
రతనాలు దొర్లినట్టు చేవ్రాలు రాజసం......
జ్ఞానపీఠమలరించిన సిరాచుక్కరా
శతకధార వొలికించిన సత్యవాక్కురా
నుడికారపు సవ్వడుల సుగుణబాలరా
చమత్కార చమక్కుల సువర్ణధారరా.....
పలుకుబడులు ప్రవహించిన భావకలశము
వెటకారపు సొగసులున్న శబ్దనాదము
చందోరీతి గుణగణాల చందము
వ్యాకరణతీరులో సంధిసూత్ర అందము.....
అమరకోశమైన మన తేనెపలుకురా
ఆధ్యాత్మికశోభకు ఆనవాలురా
మాన్యులు సామాన్యులు ప్రణమిల్లిన పవిత్రతరా
జీవనదుల సాక్షిగా పరఢవిల్లిన జీవభాషరా.....
కన్నతల్లి కన్నవూరు కలగలసిన బంధము
ఏ ప్రాంతమెల్లినా వీడిపోని ఋణము
అమ్మా అనే పిలుపుకు హక్కుదారురా
కడవరకు మనభాషను మొక్కుదామురా
ఘనకీర్తి మన '' తెలుగు '' బ్రతుకుశ్వాసరా.......

No comments:

Post a Comment