Thursday, January 3, 2019

నాన్న రాసిన ఉత్తరం '' కవిత

నాన్న రాసిన ఉత్తరం...
°°°°°°°°°°°°°°°°°°°°°°✍🏿తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
చిట్టితల్లీ...!
గుండెల నిండా నిన్ను మోస్తున్నాను...
కనుపాపల్లో నిన్ను పొదుపుకున్నాను...
నిన్ను నా ప్రపంచంగా మలుచుకుని
ఏ దిగ్విజయాన్నో ఆశిస్తున్నాను...!
అవును...
ఇందుకోసమే కదా
విరుగుతున్న నా రెక్కల్ని
అదేపనిగా అతికించుకుంటూ
రేయింబవళ్ళు  సంపాదనకై
ఎగబడుతుంటాను...!
నీ అత్తరు పరిమళాల కోసం
నా స్వేదాన్ని అసాంతం ఖర్చుపెడుతుంటాను..!
నీకు వెలుగుల దారి చూపడం కోసం
వేల చీకట్లను సహిస్తుంటాను..
వేళ తప్పి నిదురిస్తుంటాను..
దూరం ఎంతయినా కానీ
నా మనసును నీ దగ్గర వదిలి
బయలుదేరుతుంటాను...
నీకోసమే..
నిన్ను గెలిపించడం కోసమే...
నేను ఎన్ని సార్లో ఓడిపోతుంటాను..
ఇక్కడ నువ్వు
తల ఎత్తుకు తిరగడం కోసం
నేను ఎక్కడో ఎవ్వడి ముందో తలదించుకుంటాను...!
ఎవ్వడో కాండ్రిస్తాడు-
మరెవ్వడో బెదిరిస్తాడు-
ఇంకెవ్వడో నాపై కక్ష గడుతాడు-
అయినా భరించుకుంటాను...!
బాధలను అదిమి పెట్టుకుంటాను...!
నేనే నీ బలమైనప్పుడు
నేను బలహీనుడినైతే
నీ సుందర స్వప్నాలు కూలిపోతాయని
నా దుస్వప్నాలను దాచేసుకుంటాను...!
నిజం తల్లీ..!
కాలానికి ఎదురీదుతూ
ఎన్నెన్నో  విషాదాలను దిగమింగుకుంటాను
ఎవ్వడో నాపై కక్కే విషాలను
నీకు తెల్వకుండా కడిగేసుకుంటాను...
నాన్నను కదా
నీ కలల సౌధానికి పునాది రాళ్ళను
మోస్తుంటాను..
నీవు ఎదగాలని...
నా ఆశలకు ఆకృతి ఇవ్వాలని..
నేను భరించిన బాధలను
నీ విజయం తుడిచెయ్యాలని..
పడుతూ లేస్తూ పరుగెడుతూనే వున్నాను తల్లీ...!
బరువో భారమో ఇవేమీ నాకు తెల్వదు
అవును మరి..
ఇష్టం ఉన్న చోట కష్టం ఊసు ఉండదు కదా....!
ఇదిగో తల్లీ..
నా శ్వాస నిండా నువ్వు నిండి ఉన్నావు
అందుకే  గుట్టలు మోస్తున్నా కూడా
గుంభనంగా ఉన్నాను....
ఏ ఒడిదుడుకుల దాడులో జరుగుతున్నా
ధైర్యంగా ఉన్నాను...!
నీకు ఓ  భవిష్యత్తును అందించాకా..,
నీ భావి కిరీటానికి
నా శక్తి మేరా మెరుగులు దిద్దాక..,
నా బాగోగుల్ని నీ చేతుల్లో పెట్టాలని
కోరుకోవడం లేదు తల్లీ...
అదిగో
మనకంటూ ఒక సమాజం ఉన్నది కదా -
నేను కూలిపోతే చూసి నవ్వడానికి
సిద్దంగా ఉన్నది కదా -
నేను దు;ఖిస్తే పరవశించడానికి
ఎదురు చూస్తున్నది కదా -
అందుకే తల్లీ
నా దేవతవు నువ్వే కాబట్టి
చేతులు జోడించి వేడుకుంటున్నా...
నీవు గీత దాటవద్దు...!
ఆ అవసరం అవకాశం రానివ్వొద్దు...!
నాన్నని కదా
నీకోసం బతకాలని ఉంది...!!!
నీ కారణంగా నా గౌరవం
పెరిగితే గర్వపడాలని ఉంది...!!!

No comments:

Post a Comment