Thursday, January 3, 2019

చిన్నకూతురు (కథ )

చిన్నకూతురు (కథ)
°°°°°°°°°°°°° ✍ తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
90 వ దశకం....
పొద్దుట ఆరుగంటలు కావొస్తున్నది....
ఇంటిముందు మందారం  చెట్టు నీడన కూర్చుని చందమామ కథల పుస్తకం చదువుతున్నది పదనాలుగేళ్ళ  లావణ్య. అక్కడే గోడవారగా గుడ్డ తొడిగిన ఆరాం కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతున్నాడు ఆమె తండ్రి నలభై ఐదేళ్ళ వెంకటశేషయ్య.
      మరోపక్కన వాకిలి కసువు ఊడ్చి...సామిడి జల్లేందుకు సిద్దమవుతూ కళాయిలో పేడను కలుపుకుంటున్నది కప్పనాగమ్మ.  కప్పలంటే భయం కాబట్టి ఆమెకు ఆ  పేరు మొదటి నుండి స్థిరపడిపోయింది. ఇప్పుడు కూడా కళాయిలో కప్పలు ఉన్నాయేమోనని ఆగి ఆగి జాగ్రత్తగా పేడను కలుపుతున్నది . తాతల కాలం నుండి ఆ ఇంటి వాకిలి  ఆ నాగమ్మ వంశస్థులే ఊడుస్తూ వస్తున్నారు. అందుకు యాడాదికి ఒక్కసారి పంటమీద రెండు కుండల ధాన్యాన్ని గౌరవ వేతనంగా  తీసుకుంటుంటారు. అట్లాగే నాగమ్మ కొడుకు మబ్బుల గట్టడే ఆ  ఇంటి పెద జీతగాడు.ఇతడి  ఒంటి రంగు కాటుక నలుపులో   ఉంటుంది. కాబట్టే   చిన్నప్పటి నుండే అతడి పేరుకు ముందు 'మబ్బులు ' పదం ' సరాదాగా చేరిపోయి ...చివరకు అదే ఇంటిపేరు అన్నంత బలంగా పాతుకుపోయింది.ఇప్పుడా గట్టన్న ఆ ఇంటికి ఈశాన్యంగా వున్న చేదుల బావి నుండి నీళ్ళు తోడుతూ ఆ పక్కనే ఉన్న సిమెంటు అవుజు నింపుతున్నాడు.ఆ అవుజు చుట్టూ సుద్ద ముక్కలతో రకరకాల రాతలు రాసి ఉన్నారు పిల్లలు.
         ఇక ఇంటిని గమనిస్తే తాతల కాలం నాడు ఎప్పుడో నిర్మించిన గచ్చు ఇల్లు. పూర్తిగా పాతబడి పోయింది. వయసు  అయిపోయినా గాంభీర్యం తగ్గని పెద్దమనిషిలా ...ఆ ఇంటి అణువణువున  ఆ తెలియని కళ తొణికిసలాడుతున్నది. అదే గంభీరత ఆ  ఇంటి యజమానిలోనూ కొట్టిచ్చినట్టుగా కనిపిస్తున్నది.  ఇంట్లో చూస్తే మధ్య తరగతి  జీవితానికి ఆ పరిసరాలు నిలువెత్తు నిదర్శనాలుగా ఉన్నాయి. ఇంటి హాల్లో  ఒక మూలగా చెక్క బల్ల మీద పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ , అక్కడే స్టూలు మీద చేతి రూమాలు కప్పి ఉంచిన టెలిఫోను , వాటికి ఎదురుగా చెక్క మంచం , ఆ మంచం మీద ఇంకా నిదురలోనే తూగుతూ నిండుగా ముసుగేసుకుని పడుకున్నాడు ఆ ఇంటి పుత్రరత్నం కిషోరం. వాడి వయసు పదహారేళ్ళు. ఆ పక్క గూట్లో టేప్ రికార్డరు , ఆ వెనకాల చెక్క బీర్వాలో అమర్చి ఉంచిన పుస్తకాల వరస,  అంతా ఒక పొందికైన అలంకరణ . అట్నుంచి ఎడంగా ఉన్న గదిని కొట్టిల్లు అంటారు. ఆ గది ధన్యం  నిలువ ఉంచడానికి ఉద్దేశించినది.పక్కనే చిన్నగా ఓ చిన్న దేవుడుగది. ఇంక లోపల ఒకటి భోజనాల గది. ఆ తర్వాత ఉన్నదే వంటగది.
         వెంకటశేషయ్య భార్య సుశీలమ్మ . వయసు నలభై దాకా ఉన్నది. ప్రస్తుతం వంట గదిలో కట్టెల పొయ్యి ముందు కూర్చుని జొన్నరొట్టెలు చేస్తున్నది.ఆమెకు సమీపంగా ఒక పక్కగా కూర్చుని  ఇలపీట సహాయంతో కూరగాయలు తరుగుతున్నది ఆ ఇంటి రెండవ కూతురు పద్దెనిమిదేళ్ళ  రాణి. ఆమెకు సహాయ పడుతూనే మరోవైపు చేటలో పోసివున్న బియ్యంలో మెరికలు ఏరుతున్నది పిల్లల్లో అందరి కంటే పెద్దదైన ఇరవై ఏళ్ళ దేవి.అట్లా మొత్తంగా ఆ ఇంటి వాతావరణం నిజంగా ఒక బృందావనంలా ఉన్నది.
    ' ట్రింగ్...ట్రింగ్....' ఉన్నట్టుండి బయట టెలిఫోను మోగింది. ఎవ్వరా అన్నట్టుగా వెంటనే లేచి బయటకు నడిచింది దేవి. ఆమె వెళ్ళేసరికే వెంకటశేషయ్య కూడా అక్కడికి చేరి వున్నాడు. అతడికి పోన్ వచ్చింది అంటే ఒక ఆదుర్దా ! పోన్ కోసం ఎప్పుడూ కనిపెట్టుకు వున్నట్టుగా వుంటాడు. పెద్దమ్మాయికి పెళ్ళి  సంబందాలు చూస్తున్నాడు కాబట్టి.....ఆ తాలూకు ఫోన్ కావొచ్చనేది  రింగ్ అయిన ప్రతిసారి అతడి ఒక ఆతృత !ఇప్పుడూ అదే ఆత్రంలో కనిపిస్తున్నాడు.
          'ఆ ! ఆ !  నేనే మాట్లాడుతున్నా....! ఎవ్వరూ ఎవ్వరు మాట్లాడేది ? ' అడిగాఢు వెంకటశేషయ్య.
   ' .....' అవుతల నుండి ఏం మాట్లాడుతున్నారో తెల్వదు కానీ...అవతలి మాటలకు ఇవుతల కనిపిస్తున్న అతడి ముఖకవళికలు కచ్చితంగా  అది  ప్రాముఖ్యం వున్న ఫోనుగా తెలుస్తున్నది. ఆ ప్రాముఖ్యత కచ్చితంగా తన పెళ్ళికి సంబంధించిందేనని దేవికి అర్థమయ్యింది.అయితే అప్పుడే పెళ్ళి చేసుకోవడం దేవికి ఇష్టం లేదు. అందుకే ' దేవుడా ! నాకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. మొన్న వచ్చి వెళ్ళిన సంబంధం అస్సలు ఇష్టం లేదు. నువ్వే కాపాడాలి....' మనసులోనే మొక్కుకుంటూ తిరిగి లోపలికి అడిచి తనదైన పనిలో నిమగ్నం అయ్యింది దేవి.
   ' ఫోన్ ఎక్కడి నుండి ? ' అడిగింది సుశీలమ్మ.
' ఏమో ! ? ' ఉదాసీనంగా సమాధానం ఇచ్చింది దేవి.
    ' మీకు ఇష్టం లేకుండా మీ నాయిన ఏ పని చేయడు.కంగారు ఎందుకు పడుతున్నావు !? ' దేవి మనసును పసిగట్టింది సుశీలమ్మ.
    అంతలో వెంకటశేషయ్య ' మన దేవి గొప్ప అదృష్టవతురాలు ...' గుండెల నిండా ఆనందాన్ని నింపుకుని అంటూ లోపలికి వచ్చాడు వెంకటశేషయ్య.
    ఏమిటా అదృష్టం అన్నట్టుగా సుశీలమ్మ ...రాణి...ఇద్దరూ అతడి వైపు చూసారు. దేవి మాత్రం చూడలేదు. ఎందుకంటే ...మొన్నటి సంబంధం ఒప్పుకున్నారేమో...అదే తన అదృష్టంగా తన తండ్రి మాట్లాడుతున్నాడేమో అనుకుంటూ...నిర్లక్ష్యంగా కూర్చుండి పోయింది.
   ' జానకిరామయ్య ఉన్నాడు కదా....అదే మన ఊరి సర్పంచు చుట్టం..!  ఇంతకు ముందు ఒకసారి  వాళ్ళబ్బాయి ఇంజనీరింగు చదివాడని పూణేలో ఉద్యోగం చేస్తున్నాడని మాట్లాడుకున్నాం.మన  దేవికి ఆ అబ్బాయిని  అడుగుదామనుకుని కూడా.... కట్నం ఎక్కువ అడుగొచ్చని ....అడిగి బాధ పడొద్దని వెనకడుగు వేసాం. వాళ్ళే ఇప్పుడు మన దేవి కోసం ఎవ్వరో మధ్యవర్తితో ఫోన్ చేయించారు....' ప్రపంచాన్ని జయించినట్టుగా చెప్పుకుపోయాడు వెంకటశేషయ్య.
    ఆ మాటలు పూర్తి కాక ముందే దేవి కళ్ళు విప్పారాయి. ఆ సంబంధం ఆమె మనసుకు నచ్చింది.ఇపుడు నచ్చడం కాదు...ఎప్పుడో ఆ అబ్బాయి గురించి విన్నప్పుడే నచ్చింది. కాని అదంతా కలలో మాట అనుకుంది. ఆ కల ఇప్పుడు సాకారం అవ్వుతుంటే ఆనందం కలగనిది ఎవ్వరికి ? అందుకే దేవి మనసు కేరింతలు కొట్టింది.
      మంచి సంబంధం. గొప్ప సంబంధం. ఇంట్లో ఆ విషయమై అందరి ఆనందానికి అవధులు లేవు. అయితే  చిన్నకూతురు లావణ్య  మాత్రం  ఒక అడుగు ముందుకు వేసి ' బావ గారొస్తే ఎక్కడ చూసినా శుభ్రంగా కనబడాలి ' అంటూ అందరికంటే రెండు రెట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆరోజునుండే ఇంటిని ఎక్కడికక్కడ స్వయంగా శుభ్రం చేయడం మొదలెట్టింది.
      మరో వారం రోజుల తర్వాత పెళ్ళి వాళ్ళు వచ్చారు. అప్పుడు అందరిదీ హడావుడి అయితే ...లావణ్యది మాత్రం కలుపుగోలుతనం కూడా ! అట్లా ఆ పిల్ల వచ్చిన వాళ్ళు అందరికి మంచి చుట్టమై పోయింది. అంతే కాదు ప్రత్యేకించి కాబోయే బావగారికి ప్రియమైన చిట్టి మరదలై పోయింది.
        అదే రోజు ముహుర్తాలు మాట్లాడుకున్నారు. కట్నకానుకలు గురించి పెద్దంగా డిమాండ్లు లేవు కాబట్టి వెంకటశేషయ్య సుశీలమ్మలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా వెళ్తూ వెళ్తూ ' మా కోడలు పుట్టింటి నుండి తీసుకు రావల్సింది సారె కాదండి.పరువు మర్యాదలు ! అవి మీ వద్ద మాకు పుష్కలంగా ఉన్నాయి అది చాలు మాకు...' అన్న వాళ్ళ మాటలు ఆ ఇంటిలో వేల సంతోషాలను పూయించాయి.అట్లా ఆ ఇల్లు ఒక ఒక బృందావనం కాదు...సాక్షాత్తు బృందావనమే అయ్యింది.
     చూస్తుండగానే మాఘ మాసం వచ్చేసింది. దేవి పెళ్ళి వైభవంగా జరిగింది. అక్క పెళ్ళి గురించి తన చదువును సైతం నిర్లక్ష్యం చేస్తూ కష్టపడిన లావణ్య .....పెళ్ళి తర్వాత కూడా అదే ధోరణి అవలంబించింది. బావ రేపు వస్తున్నాడంటే ఆ రోజే అన్నీ సిద్దం చేయడం....ఒక బాద్యతగా కొనసాగించడం మొదలెట్టింది.  'అన్నీ చూసుకోడానికి  మేము  వున్నాము గదనే నీకెందుకు ? ' అంటూ సుశీలమ్మ  గదమాయించినా లావణ్య పట్టించు కోలేదు.
       ఏమో !అమ్మానాన్నలు పొరపాటుగా ...
బావకు ఏదైనా మర్యాద తక్కువ చేస్తారేమోనని.., అందువల్ల అక్క నొచ్చుకుంటుందేమోనని .., లావణ్య తనలో తనే ఊహించుకుని మర్యాదల గురించి ఆచి తూచి ప్రవర్తించడం కాదు , మోతాదుకు మించి మందులు వాడుతున్న చందాన హడావిడి మొదలెట్టింది.
         వాస్తవానికి    ఆ  చిన్న వయసు ...పెద్ద  ఆలోచనతో అట్లా ప్రవర్తిస్తుంటే లోలోపల ఇంటిల్లిపాది మురిసిపోయారు. బయటకు మాత్రం ...' ఈ పిల్ల ఏందస్సలు ? తీపి ఎక్కువేసి చేదు చేస్తుందా ? కోతి పుండు బ్రహ్మాండం చేస్తుందా ? లేకా అతి వినయం దూర్త లక్షణమా!? ' అంటూ ఎదురుగానే ముక్కున వేలు వేసుకున్నారు. అయినా ఆపిల్ల వినలేదు. బావ ఉన్న వారం రోజులు బడి మానేసి సేవలకు దిగింది.
     ఇంకేముంది ?! బావైతే ....' మంచి మరదలు ! అందరికీ అక్క కావల్సింది ...పొరపాటున చెల్లెలై పుట్టింది ' అంటూ కితాబు ఇచ్చాడు. ఒక మంచి డ్రెస్సు కూడా కానుకగా ఇచ్చాడు. మా ఇంట్లో కూడా ఇట్లాంటి ఒక చెల్లె ఉండాలంటూ పొగిడాడు. అంతా బాగుంది. కానీ వారం రోజులు బడికి  వెళ్ళక పోవడంపై  పెద్ద శిక్షనే ఎదుర్కోవాల్సి వచ్చింది.
      ' లావణ్యా ! గో అవుట్....! మీ నాన్నగారిని తీసుకునిరా ! అండ్ ఫైవ్ హండ్రెడ్  రూపీస్ ఫైన్ కట్టాల్సిందే...' అంటూ ప్రధానోపాద్యాయురాలు ఉగ్రరూపం చూపించింది
     అందుకు లావణ్య కన్నీటి పర్యంతం అయ్యింది. ఇంట్లో మాత్రం రోగం కుదిరిందని గుస గుస లాడుకున్నప్పటికీ ..' పాపం లావణ్య.. ' అంటూ జాలి పడ్డారు.
***********
    చూస్తుండగానే ఏడాదిన్నరకాలం గడిచింది. దేవికి పాప పుట్టింది. అప్పటికి లావణ్య పదవతరగతికి వచ్చింది. అయినప్పటికీ అక్క కూతురులో ప్రపంచాన్ని చూసింది. తనదైన ప్రపంచాన్ని మరిచిపోయింది.అప్పుడు మాత్రం వెంకటశేషయ్య ఊరుకోలేదు. లావణ్యను గట్టిగా భయపెట్టాడు. దీంతో మనసు మెత్తగా బడికి వెళ్తున్నప్పటికీ సాయంకాలం కాగానే చిన్నారి పాపతో ఆడుకోవడం మొదలెట్టింది. అక్క మళ్ళీ అత్తింటికి వెళ్ళిపోతుంది కాబట్టి ...చిన్నారి తనకు దూరంగా వెళ్తుంది కాబట్టి ...ఉన్నన్ని రోజులు తనివితీరా పాపతో గడపాలనేది లావణ్య కోరిక. అంతే కాదు పాప ఊరెళ్ళిపోతే తను ఎట్లా గడపాలనేది కూడా ఆ పిల్ల తీవ్రమైన బాధ !
         సరిగ్గ ఇట్లాంటి సమయంలోనే రాణి కాలుకు పెద్ద గాయం అయ్యింది.కళాశాల ఆటల పోటీల్లో ఆడుతూ కింద పడిపోయిన రాణికి కొన్ని నెలల పాటు విశ్రాంతి అవసరం అయ్యింది. రాణి పరిస్థితికి ఇంట్లో అందరూ కంగారు పడిపోయారు. ముఖ్యంగా ఏనాడూ ఏ పెద్ద కష్టం వచ్చినా చలించని వెంకటశేషయ్య ...రాణి పరిస్థికి మాత్రం విల విల లాడిపోయాడు.' ఇదేం ఖర్మరా భగవంతుడా ...' అంటూ దాదాపుగా కన్నీళ్ళ పర్యంతం అయ్యాడు కూడా ! ఇక లావణ్య పరిస్థితి చూస్తే నిజంగా అగమ్యగోచరం. తన అక్కకు ఏం జరిగి పోతుందో ఏమోనని  ఆకలి దప్పులు మానేసింది. బడికి కూడా సరిగ్గా వెళ్ళలేకపోయింది. అక్కకు సేవలు చేస్తూ ...ఆమె వీలైనంత తొందరగా కోలుకోవాలని తన గురించి తాను మరిచిపోయి రేయింబవళ్ళు కష్టపడింది. ఇంట్లో అమ్మ వద్దంటున్నా...నాన్న  ' నీకెందుకు చిట్టితల్లీ ! మేము ఉన్నాం కదా !? ' అని వారిస్తున్నా లావణ్య వినిపించుకోలేదు. ఇంట్లో పరిస్థితి రిత్యా మునుపటిలా లావణ్య చదువు గురించి ముఖ్యంగా ఎవ్వరూ పెద్దగా పట్టించు కోలేదు. దీంతో పదవతరగతి బొటాబొటి గా గట్టెక్కింది . ఈ విషయం గురించి లావణ్య బాధ పడలేదు.. చాలా సంతోషంగా ఉండిపోయింది .ఎందుకంటే అప్పటికి రాణి బాగా కోలుకుని ఎప్పటిలా కళాశాలకు మెల్లగా వెళ్ళడం మొదలెట్టింది.
       ******
     లావణ్య డిగ్రీకి వచ్చేసింది. అదే సమయంలో రాణికి పెళ్ళి కుదిరింది. విదేశీ సంబంధం. ఊరు వాడా ఆ సంబంధం గురించి గొప్పగా చెప్పుకున్నారు.లావణ్య మాత్రం ఇష్ట పడలేదు. ఎందుకంటే...పెద్దక్కే ఎక్కడో పరాయి రాష్ట్రంలో ఉంటుందనిఏది తనకు ఓ పెద్ద బాధ. అట్లాంట్ది ఇప్పుడు చిన్నక్క ఏకంగా పరాయి దేశానికే వెళ్ళబోతుంటే బాధ పెరగ కుండా ఎలా ఉంటుంది !? అయినప్పటికీ కిమ్మనలేదు లావణ్య. ఎందుకంటే...తన తండ్రి మధ్యతరగతి వాడు. అయినప్పటికీ పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నవాడు. కాబట్టే పరిచయాల ద్వారా అందని సంబంధాలు అందుతున్నాయి. అందుకే మనసులో బధ ఉన్నా ...తన అక్క ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని బలవంతంగా తనను తాను ఊరడించుకుంది.
        రాణి పెళ్ళి వైభవంగా జరిగింది.  లావణ్య హడావిడి షరా మామూలుగా కొనసాగింది. అట్లా ఒక  ఏడాది కాలం  ఎంతో ఆనందంగా గడిచిపోయింది.. ఆ తర్వాతే ఆ కుటుంబంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.
ఆకస్మత్తుగా సుశీలమ్మ మరణించింది. విధి రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెను బలి తీసుకుంది.పిల్లలు...పెళ్ళిళ్ళు...వచ్చిపోయే అథితులు...వేడుకలు ...సంబరాలు ...ఇట్లా ఆనందానికి మారుపేరుగా కొనసాగుతున్న క్షణాలు ఒక్కసారిగా విషాదంలో  కూరుకుపోయాయి.వెంకటశేషయ్య పరిస్థితి దీనంగా మారిపోయింది. పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ లోలోపల పూర్తిగా కృంగిపోయాడు. మానసికంగా  బలహీనపడిపోయాడు.అయినప్పటికీ ఇంకా ఇద్దరు పిల్లల బాధ్యత తన మీద ఉన్నది కాబట్టి దు;ఖాన్ని దిగమింగుకునే ప్రయత్నం చేసాడు. విఫలం అవుతూనే ప్రయత్నించాడు. బయట తను ఎన్ని పెద్ద వ్యవహారాలు చేసినా ...కుటుంబమే తనకు అతి పెద్ద అండ కాబట్టి...ఆ కుటుంబంలో ఏర్పడిన వెలితి అతడిని రోజురోజుకు నిర్వీర్యం చేయడం మొదలెట్టింది. ఇట్లాంటి   కష్ట కాలంలో లావణ్య నిజంగా తన గుండెను గట్టి చేసుకుంది.కన్నీళ్ళను తుడుచుకుంది. దు;ఖాన్ని జీర్ణిచుకునే   ప్రయత్నం  చేసింది. ఇంట్లో చూస్తే   అక్కలు ఇద్దరూ పెళ్ళిళ్ళయి వెళ్ళిపోయారు. మిగిలింది ఇంక ముగ్గురే కాబట్టి....ఆ ముగ్గురూ విషాదంలో కూరుకుపోయి ఉంటే భవిష్యత్తు గందరగోళం అయిపోతుంది కాబట్టి...వయసుకు మించి ఆలోచించి ఆ దిశగా అందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేసింది.అప్పటి లావణ్య వయసు ఇరవై ఏళ్ళు. అయితే నేం....మొదటి నుండి ఆమెలో ఉన్న  ముందుండి నడిపించే తత్వం , ఆ విపత్కర పరిస్థితుల్లోనూ అనివార్యమే అయ్యింది.
            ******
      చూస్తుండగానే నాలుగేళ్ళు గడిచిపోయాయి. మిలీనియం సంవత్సరం ఆరంభమయ్యింది.అప్పటికి అందరి చదువులు పూర్తయ్యాయి. అమ్మ లేని ఇంట్లో లావణ్య  చేసిన  అమ్మను మరిపించే ప్రయత్నాలు సంపూర్ణంగా కాకపోయినా కొంతవరకు ఫలించాయి. దేవి...రాణి...ఇద్దరికి  ఇద్దరేసి చొప్పున పిల్లలు కలిగారు. ఆ ఇంట్లో అదొక గొప్ప ఆనందం.కాగా ఆ ఇంటికి ఒక ఆడ దిక్కు కావాలనేది వెంకటశేషయ్య కోరిక. దీంతో కొడుకు కిషోరానికి  దగ్గరి వాళ్ళ సంబంధం ఒకటి ఉంటే మాట్లాడి ఖాయం చేసి పెళ్ళి జరిపించాడు.
      పెళ్ళయ్యక కిషోరం తన బావమరిదితో కలిసి కాంటాక్టు పనులు చేసుకోవడం కోసం మహారాష్ట వెళ్ళిపోయాడు. ఇంట్లో తండ్రి ..కూతురు ..ఇద్దరే మిగిలారు. లావణ్యకు కూడా సంబందస్లు చూస్తున్నాడు వెంకటశేషయ్య.అదే సమయంలో అతడి మనసులో అలజడి మొదలయ్యింది. 
      ' చిన్నది గూడా పెండ్లి జేసుకుని వెళ్ళిపోతే...నేను ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఆ ఒంటరితనాన్ని ఎట్లా భరించాలి !? ఇన్ని రోజులు లావణ్య నాకు  పక్కలో ఉన్నది కాబట్టే వాస్తవానికి  బతకగలిగాడు. మరి లావణ్య వెళ్ళిపోతే  అస్సలు బతుకుతాడా !? కిషోరానికి  నా  మీద ఎంతో ప్రేమ ఉన్నది.కాని వాడు ఆడపిల్లలా ఎప్పుడూ దగ్గరగా ఉండలేదు. నిజంగా ఆడపిల్ల బిడ్డ మాత్రమే కాదు తల్లి కూడా...'
      లోలోపలే తల్లడిల్లుతున్న వెంకటశేషయ్య బయటకు మాత్రం తనదైన గంభీరం వహించాడు. కానీ తండ్రి మనసు లావణ్యకు తెలియంది కాదు. చెప్పాలంటే తను వెళ్ళిపోతుందేమోనని తండ్రి బాధ పడటం కాదు....తండ్రికి దూరంగా వెళ్ళాల్సి వస్తుందేమోనని తనే భయపడటం మొదలెట్టింది. దీంతో పెళ్ళి చేసుకోవద్దనే నిర్ణయానికి వచ్చేసింది.
     కూతురు మనసును తండ్రి కూడా పసిగట్టాడు. ఆమెకు అన్నివిధాలా నచ్చజెప్పాడు. ఇట్లా ఉండగా ఒకానొక రోజు లావణ్య తండ్రితో ఒక నిర్ణయానికి వస్తూ మాట్లాడింది.
     ' సరే నాయినా ! నేను పెండ్లి జేసుకుంట.మరి నీవు నా వెంటే నా ఇంటికి రావాలి.ఎట్లా వస్తాను ? బాగుండదు....రాకూడదు...నా ఇల్లే నాకు ప్రపంచం...నా ఇంటిని వదిలి ఎక్కడికీ రాను...నా ఊరును వదిలి రాలేను...ఇట్లాంటి చెప్పిన మాటలే మల్లా మల్లా జెప్పొద్దు....'
      ' నన్ను ఇబ్బంది పెట్టొద్దు బిడ్డా ! నా ఆరోగ్యం కూడా పాడై పోతుంది.నేను బాగున్నప్పుడే నీకు పెండ్లి జేస్తే...నేను తృప్తిగా చచ్చి పోతా ! ' లావణ్యను అభ్యర్థించాడు వెంకటశేషయ్య.
    ' అయితే ఒక విషయం నాయినా ! నిన్ను కూడా చూసుకునే వాడినే నేను పెండ్లి జేసుకోవాలను కుంటున్నాను కదా...!? పోనీ ఒకర్ని మనం అడుక్కోవద్దు అనుకుంటే...కనీసం మన ఇంటికి వచ్చేవాడినే నేను పెండ్లి జేసుకుంటా ! వాడు బీదవాడైనా ఫరవాలేదు.ఏట్లాగు నీవు కొంత పొలం రాసి ఇస్తున్నావు. దానిమీదే ఆధారపడి బతుకుతాం....'చెప్పుకొచ్చింది లావణ్య.
    అందుకు వెంకటశేషయ్య మనసు ఒప్పుకోలేదు. తన పిల్లలు అందరూ గొప్పింటి సంబందాలనే చేసుకోవాలని సగటు తండ్రిలాగే ఆలోచిస్తూ మరు మాట్లాడలేదు.
            *****
    కొంతకాలం గడిచింది. ఒకానొక రోజు లావణ్య తన స్నేహితురాలి పెళ్ళి నిమిత్తం పక్క ఊరికి బయలుదేరింది.
మనిషైతే బయలు దేరింది గానీ ఆమె మనసు మాత్రం ఇంట్లోనే ఉన్నది.
     ' తొందరగా బిడ్డా...' అని చెప్పిన తండ్రి మాటలే  ఆమె చెవుల్లో  ఆగకుండా మార్మోగుతున్నాయి. పెళ్ళికి వెళ్ళ బుద్ది కాలేదు. వెను తిరిగి రావాలనిపించింది.అంతే కాదు - ఒకప్పటి ఇంట్లో పరిస్థితులు...ఇప్పటి పరిస్థితులు...అప్రయత్నంగా గుర్తుకు వస్తూ  దు;ఖం కట్టలు తెంచుకుంటుంటే  బోరున బస్సులోనే విలపించాలనిపించింది.
     అప్పుడు నిజంగా ఎట్లా ఉండేది ? కప్ప నాగమ్మ ...గట్టన్న ..పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళెవ్వరూ లేరు. అమ్మ చనిపోయిన రెండేళ్ళలోనే వాళ్ళూ వెళ్ళిపోయారు.ఇంటికి అమ్మమ్మ వాళ్ళు అస్తమానం వచ్చే వాళ్ళు. అమ్మ తర్వాత వాళ్ళ రాక మృగ్యం అయ్యింది. ఏదో కాలం ఒక్కసారిగా కక్ష కట్టినట్టు అమ్మ తర్వాత పరిస్థితులు ఒక్కొక్కటి మారుకుంటూ వచ్చాయి. చివరకు తన వరకు వచ్చేసరికి ఆనందాలన్నీ దాదాపుగా అడుగంటిపోయాయి. చిన్న కూతురు అంటే...అందరి కంటే చిన్నదని గారాబం చేస్తారు. కానీ ఆ చిన్నది పెద్దయ్యక సంతోషాలను అందరికి మల్లే అందుకోవడంలో  వెనకబడి పోవాల్సి వస్తుంది. చిన్నదై పుట్టే కంటే ఊరిబయట చింత చెట్టై పుట్టినా బాగుంటుందేమో !? అయినా అందరికీ ఇట్లా ఎందుకు ఉంటుంది !? అది కొందరి దురదృష్టం...' ఆలోచిస్తున్న లావణ్య మనసు పూర్తిగా బరువెక్కిపోయింది.
    ఇక వెళ్ళలేక పోయింది. ' నాయిన బతికి ఉన్నంత కాలం నేను అదృష్టవంతురాలినే ! నాకు నాయిన ఒక్కడు చాలు...' అనుకుంటూ బస్సు దిగేసింది. ఒక అర్ధ గంట వేచి చూసాక వచ్చిన మరో బస్సులో తిరిగి ఇంటికి బయలు దేరింది. వెళ్ళే సరికి ఇల్లు తాళం వేసి వున్నది.
    ' నాయిన సర్కారు దవఖానల ఉన్నడు బుజ్జి...'  లావణ్య అట్లా వెళ్ళగానే ఇట్లా పరుగున వచ్చి చెప్పింది ఎదురింటి  జయమ్మ.
   ' నాయినకు ఏమైంది ? ' లావణ్య గొంతు వణికింది.
   ' ఏం గాలేదు. దైర్నంగ ఉండు. ఏదో గుండెల నొప్పిలాగ వొచ్చింది. మమ్మల్ని పిలిచిండు. మీ అంకులు స్కూటరు మీద ఎక్కించుకుని తోలుకపాయే...! ' చెప్పింది జయమ్మ.
    అంతే ! లావణ్య నిలువెత్తున వణికిపోయింది. పెరిగిన గుండె దడ....తెలియకుండానే కారిపోతున్న కన్నీళ్ళు....చీకటిగా తోస్తున్న ప్రపంచం....అన్నీ ఒక్కుమ్మడిగా చుట్టుముట్టి  చిత్రవధ చేస్తుంటే .....వేగంగా ఆసుపత్రి దిశగా పరుగు తీసింది .
    అంతటి నిస్సహాయ...నిర్లిప్త..నిస్తేజ...నిశ్శబ్ధ ...సమయంలోనూ ఆమెకు తండ్రి చెప్పిన ...' చిట్టితల్లీ ! ఒకవేళ నేను చనిపోయినా నీవు అధైర్య పడొద్దు. నీ ధైర్యాన్ని వదులుకోవద్దు....' మాటలు గుర్తుకు వస్తూ ఏడుపును రెట్టింపు చేస్తున్నాయి. అట్లాగే...' నేను వాళ్ళ ఇంటికి రాలేనని - వాళ్ళు మన ఇంటికి రాలేరని చిన్నక్క  వాళ్ళ చుట్టాల సంబంధాన్ని వద్దనుకున్నావు కదా ! ఆ పిల్లోడికి నువ్వంటే ఇష్టం. వాడిని పెళ్ళిచేసుకో ' మాటలు కూడా గుర్తుకు వస్తూ ఎదలోతులను పిండసాగాయి.
     లావణ్య ఆసుపత్రి చేరుకుంది. అప్పటికే తెలిసిన వాళ్ళు చాలా మంది అక్కడ గుమిగూడి ఉన్నారు.
    ' దేవుడా మా నాయినకు ఏం కాకూడదు....' తడబడుతున్న గొంతుకతో కోటిదేవుళ్ళకు మొక్కుకుంటూ ఆసుపత్రి లోపలికి అడుగు పెట్టింది లావణ్య.
     ఏమో మరి !? నాన్న క్షేమమో  కాదో !!!???

No comments:

Post a Comment