Tuesday, February 19, 2019

జై జవాన్ తుముకో సలాం

రచన ;తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
సంగీతం ;S.A.ఖుద్దూస్ భయ్యా
😢అమరులైన పుల్వామా భారతవీరుల కన్నీటి స్మృతిలో.... 😢
🇮🇳🌷జై జవాన్ తుముకో సలాం
   ఏ తల్లి నిన్ను గన్నదో
   ఏ తండ్రి నిన్ను పెంచెనో
   ఏ ఊరు నీది? ఏ ఇల్లు నీది??
   ఈ రోజు నీపేరు అమరమయ్యింది...
   దేశానికై నీ జన్మ త్యాగమయ్యింది....
🇮🇳🌷భార్య పిల్లల వొదిలి వెళ్ళావు
      మళ్ళీ వస్తానని మాట ఇచ్చావు
      అయ్యో సైనికుడా......😢
      ఉగ్రదాడిలో కనుమూసినావా !?
      జాతి జెండవై అవనతమైనవా |
      జై జవాన్ తుముకో సలాం 🇮🇳
🇮🇳🌷ఎండనక వాననకా
       రేయనక పగలనక    
       సరిహద్దు పొడవునా కాపలై నిలిచావు    
       మా రక్షణ కవచమై తిరిగావు....
       అయ్యో సైనికుడా....😢
       రక్కసి మూకలు తెగబడినాయా  
       నెత్తుటి చినుకై నేలరాలినావా??
🇮🇳🌷కన్నవారి కడుపు శోకం
       దేశ భక్తుల అశ్రు నయనం
       క్షణం క్షణం ప్రాణభయం
       అయినా చెదరని నీ ధైర్యం...
       అయ్యో సైనికుడా... 😢
       వీరమరణమై వెళ్లిపోయావా
       మా అడుగుజాడవై మిగిలిపోయావా !?
🇮🇳🌷నీవులేనిదే దేశం లేదు
      దేశాన్ని మించిన స్వర్గం లేదు...
      కర్మభూమిలో ధర్మం నీవే
      ధర్మనీతిలో పుణ్యం నీవే....
      శిరస్సు వంచి నిలుచున్నాం....
      అశ్రు ఒక్కటి అర్పిస్తున్నాం 💧
      జై జవాన్...🇮🇳
      జయహో జవాన్... 🇮🇳     

Friday, February 8, 2019

పోరాట వారసత్వం



గంగసాని తిర్మల్ రెడ్డి
°°°°°°°°°°°°°°°°°°°°°°

కమ్యూనిస్టు ఉద్యమ జ్వాల కందిమళ్ల ప్రతాపరెడ్డి చెప్పినట్టు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ఇంకా అసంపూర్ణమే. లిఖించాల్సింది చాలా ఉన్నది. విముక్తి పోరాటంలో ఊర్లకు ఊర్లు పాల్గొన్నాయి. ఇండ్లకు ఇండ్లు తుడిచిపెట్టుకు పోయాయి. కానీ వెలుగులోకి వచ్చిన త్యాగధనులు కొందరే ! చరిత్ర పుటల్లో రక్తాక్షరాలై మిగిలింది కొందరే ! ఎందరో మరెందరో త్యాగాలు అజ్ఞాతంగా మిగిలిపోయాయి. ఈ క్రమంలో కొందరు ఆకాశంలో ఇంద్ర ధనుస్సులై కనిపిస్తుంటే... మరి కొందరు ఎక్కడో ఒక చోటా అరణ్యంలో పూల మొక్కలా కనిపించకుండానే అప్పుడప్పుడు వాసన విరజిమ్ముతుంటారు. అకస్మాత్తుగా అక్షర నక్షత్రమై కంట పడుతుంటారు. ఈ క్రమంలో నా అన్వేషణలో కనిపించిన ఒక వెలుగుతార  గంగసాని తిర్మల్ రెడ్డి. జనగామ జిల్లా గబ్బెట ప్రాంతానికి చెందిన గంగసాని తిర్మల్ రెడ్డి అతి పిన్న వయసులో ఉద్యమంలో వీర మరణం పొందాడు. వీరి గురించి చరిత్ర పుటల్లోనూ చెప్పుకోదగిన సమాచారం లేదు. వీరు దళనాయకుడు. ఇతడిని యూనియన్ సైన్యం పట్టుకొని కాల్చిచంపింది.ఇదే సర్కారు చేసిన మొట్టమొదటి  ఎన్ కౌంటరు. వీరి త్యాగమయ జీవితం గురించి పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉన్నది. కింది చిత్రం యూనియన్ సైన్యం చేతిలో బంధీగా చిక్కిన నవ యువకుడు గంగసాని తిర్మల్ రెడ్డి.

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

Monday, February 4, 2019

దువ్వెనలు.. సమాచారం

దువ్వెన వెనుక చాలా కథనే ఉన్నది
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°సేకరణ :తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

నా  తల నీ వశం... ఓహో ఎంత పరవశం !?
నీ ప్రవేశంతో నా  కేశం...ఆహా  ఎంత వివశం !?
దువ్వేనా...
ఓ నా ఈర్పెనా ...
నువ్వు లేకుండా నేనుండగలనా?
నీ స్పర్శ తగలనిదే నే గడప దాటగలనా?
నాది బట్ట తలైతేనేం?
నా జుట్టు అరణ్యమైతేనేం?
నీవు
నా సంస్కారానికి సూత్రానివి
నా సౌందర్యానికి సాధనానివి !!
అవును !
నిత్యావసరాల్లో దువ్వెన ప్రాముఖ్యం కీలకమైనది.సిగ  కట్టులో   ఈ దువ్వెన అవసరాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. లింగ  భేదం  లేకుండా దువ్వెన వినియోగం కొనసాగుతున్నది. ముఖ్యంగా పురుషుల జేబుల్లో అవసరమైతే డబ్బు ఉండక పోవచ్చేమోగాని .... దువ్వెన లేకుండా ఉండదు అనేది వాస్తవం !
        👉 దువ్వెనలో  మరో రకం  ఈర్పెన.గ్రామీణులు దీనిని ఈర్వాన. ఈర్వేన, అని పిలుస్తుంటారు.
చిక్కంటి,చిక్కోల,పన్నె, కేశమార్జకము,ప్రసాధని   
అనేవి దువ్వెన పర్యాయ పదాలు.
*బహుజనపల్లి సీతారామచార్యుల వారు తమ
శబ్దరత్నాకరంలో దువ్వెన పదానికి అర్థంగా
' కంకతము ' ' కంకతిక ' శబ్దాలను ప్రయోగించారు.
' కంకతి ' కూడా దువ్వెన పర్యాయ పదమే. ఇక్కడ  'కంకతిక'  ' కంకతి ' స్త్రీ విశేషాలు . అంటే దువ్వెన స్త్రీ జీవనశైలిలో ఒక ముఖ్య భాగంగా మనం గ్రహించవచ్చును.
      👉 5000 సంవత్సరాలనుండే దువ్వెనలను మనిషి  ఉపయోగిస్తున్నట్టు  వివిధ కథనాలు ఆధారంగా తెలుస్తున్నది.  చారిత్రక,  శాస్త్రీయ ,గ్రంథాలలోను... ప్రాచీన జానపద కథల్లోనూ  దువ్వెనల గురించిన ప్రస్తావన ఉన్నది. చరిత్ర పుటల్లో రాణులు , మహారాణులు తమ శిరోజాలను దువ్వుకున్నట్టుగా కథనాలు ఉన్నాయి.చాలా జానపద కథలు దువ్వెన చుట్టూ తిరిగి ఉన్నాయి.
     👉'దువ్వెన బెండ' అనేది ఒక ప్రాచీనమైన మొక్క. దీనిని తుత్తురు బెండ అనికూడా అంటారు. వీటి కాయల్ని  దువ్వెన కాయలు లేదా తుత్తురుకాయలు  అని  అంటారు.ఇవి దువ్వెన మొనలను పోలి ఉంటాయి.  ఇది మాల్వేసి కుటుంబానికి చెందిన ఒక ఔషధ మొక్క.  శాస్త్రీయగా  ఈ మొక్కను అబులాటిన్ ఇండికం అంటారు. చెట్టు కాయను  బట్టి 'దువ్వెన ' పేరు స్థిరపడి ఉండొచ్చు అనేది కూడా  ఒక అంచనా.
     👉 ఆది మానవుడికి దువ్వెన గురించి తెల్వదు. కాగా నాగరికత ఆరంభంలో  మన ఆది మానవులు  తమ కేశాలను నీళ్ళల్లో ముంచి కడుక్కుని, అడవుల్లో దొరికే సుగంధ ఆకుల పుష్పాల  రసాలను పూసుకునేవాళ్లుగా చెప్పబడుతున్నది.అట్లాగే  పురాతన ఈజిప్టులో మానవులు   తమ  కేశాలను ఔషదాలు కలిపిన  నీటితో శుభ్రం చేసుకునే వారుగా తెలుస్తున్నది. ఆ తర్వాతి కాలంలో   తైలాలు, సుగంధ్ వస్తువులను  కేశాలకు పూసుకుని సంస్కరించుకునడం తెలుసుకున్నారు.
     👉 కాలక్రమంలో ఆది మానవుడు  జుట్టుని  చేతి వేళ్ళతో, రంపపు టంచు ఆకులతో,  రాళ్లతో, ముళ్ళతో , కర్ర పుల్లలతో, చేపల అస్థిపంజరాలతో దువ్వుకునడం అలవర్చుకున్నాడు. 
        ఈ క్రమంలో తొలిసారిగా  దువ్వెనలు జంతువుల ఎముకలు, కొమ్ములు, ఏనుగు దంతాలు,  తాబేలు డిప్పలు, కర్రలతో  తయారుచేయబడ్డాయి.
       నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత వజ్రాలు, నవరత్నాలు,  వెండి, బంగారం, ఇత్తడి, రాగి, పంచలోహం, అల్యూమినియం, గాజు, తగరము వంటి లోహాలతో  దువ్వెనలు తయారు చేసారు. రాణులు మహారాణులు ఖరీదైన వజ్రం,  నవరత్నాలు, బంగారు దువ్వెనలు ఉపయోగించినట్టు జానపద కథలు తెలియ జెప్తున్నాయి.
       18,19, శతాబ్దాల్లో సంపన్న కుటుంబాలు సైతం వజ్రాలు నవరత్నాలు పొదిగిన  బంగారు దువ్వెనలు....గంధపు చెక్కలతో  చేసిన దువ్వెనలు, లేదా ఏనుగు దంతపు దువ్వెనలను ఉపయోగించిన దాఖలాలు వంశ చరితల ఆధారంగా తెలుస్తున్నది.   వారి ఇండ్లల్లో  ఈ దువ్వెనలు ప్రముఖ స్థానంలో ప్రత్యేకంగా  వుంచబడేవి . ఆయా కుటుంబాలు ఎంత ధనవంతమైనవో  ఈ  దువ్వెనలు  ఒక  సంకేతంగా తెలియజెప్పేవి. ముఖ్యంగా ఖరీదైన దువ్వెనలు ఆ కాలంలో ఒక హోదా, ఒక గౌరవం, ఒక ప్రతిష్ట.
         18వ శతాబ్దంలో  ఐరోపాలో దువ్వెన కేవలం స్త్రీ అలంకరణ సామగ్రిలో భాగంగా గుర్తింపబడింది .ఈ దువ్వెనలను వారు  కృత్రిమ కేశాలలో గ్రుచ్చి భద్ర పరిచేవారు. ఇదే శతాబ్దంలో  స్పెయిన్‌లో స్త్రీలు  తాబేటి చిప్పలతో చేసిన దువ్వెనలు ఉపయోగించేవారు
       ఆధునిక కాలంలో దువ్వెనలను ప్లాస్టిక్ లేదా సంబంధిత పాలిమర్లను ఉపయోగించి తయారు చేస్తున్నారు. వీటినే అన్ని రకాల ప్రజలు ఉపయోగిస్తున్నారు.
     👉పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనలు ఒక చిత్ర మైన సంగతిని తెలియ జెప్తున్నాయి. అది ఏంటంటే  మధ్య యుగాలలో భారత్ ఇంగ్లాండ్, స్పెయిన్, రష్యాలలో సాంప్రదాయ ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు తమ జుట్టును ఇతరులు చూడకుండా  దాచుకునేవారు. భారతదేశంలోకొన్ని కుటుంబాలు స్త్రీ  కేశాలు కనిపించడం అంటే ఒక తప్పుగా భావించేవి.వాటిని దువ్వుకోవడం ఒక నేరంగా పరిగణించేవి.
       👉  ప్రాచీన కాలం నాటి ఎముక దువ్వెనలు ప్రస్తుతం రష్యాలో చిత్రప్రదర్శనశాలలో జాగ్రత్తపరచబడ్డాయి.
      👉19వ శతాబ్ది చివరార్ధంలో   దువ్వెన ఒక బహిరంగ అలంకార సామగ్రిగా గుర్తించబడింది. క్రమంగా అన్నిరకాల ప్రజలు దువ్వెన అవసరానికి చేరువ కావడం మొదలెట్టారు.
     ☺ ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో దువ్వెనను పలు రకాల  పేర్ల తో పిలుస్తారు. 👇
        1) వివిధ భారతీయ భాషల్లో....
            *తమిళం-షిక్కు,
            *బెంగాలీ -చిరుణి,
            *గుజరాతి -కనస్క,
            *కన్నడ -బాకణిగే,
            *హిందీ ••••ఖంగి.
       2) వివిధ ఏషియన్ భాషల్లో గమనిస్తే....
            *నేపాళీ -కోర్న్,
            *చైనీస్ -షూ,(shu),
            *కొరియన్ -బిస్(bis ),
            *మంగోలియన్ -క్యాం (cam )
       3)వివిధ యూరోపియన్ భాషల్లో...
              *ప్రెంచి -పియనే (peigne )
              *జర్మన్, డచ్, డానిష్ లలో -కమ్ (kam )
              *స్పానిష్ -పియనే (peine )
              * రష్యన్ - రస్చెస్క (rascheska)
              *ఇటాలియన్ -పెట్టినే ( pettine )
              *పోర్చుగీస్ - పెంటే (pente)
         4)మిడిల్ ఈస్టర్న్ భాషల్లో....
              * తుర్కీష్ - తరక్
              * అరబిక్ - మిషత్ ( mishat )
         5)ఆఫ్రికన్ భాషల్లో......
              *సోమాలి - షన్లో ( shanlo )
              *జులు -ఇకాము (ikamu)