Thursday, January 3, 2019

గడి (కవిత )

శిథిల ప్రాభవం....ఆ..గడి...!!!
..............................✍తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి
అదిగో అక్కడే
రాజసపు రతనాలు దొర్లాయి
రాక్షసత్వపు రక్తపు చినుకులు రాలాయి....
కారుణ్యపు సవ్వడులు వినిపించాయి
కాఠిన్యపు కథనాలు కనిపించాయి....
అదే గుడిగా గంటలు మోగాయి
అదే ఠాణాగా నిర్ధేషాలు కొనసాగాయి.....
న్యాయం నినాదమై గళం విప్పింది
అన్యాయం కరవాలమై కంఠం తెంపింది.....
గట్టిమేలు గమ్యమై నిలిచింది
వెట్టిచాకిరి దైన్యమై దహించింది....
****
అదిగో....
'' బత్కరా పేరు జెప్పుకుని '' అక్కడే
'' బాంచన్ కాల్మొక్తా '' అక్కడే...
'' నిన్నేలెటోన్ని '' అక్కడే
'' నీ గులాపోన్నీ '' అక్కడే....
కచ్చడాలు పరుగు తీసింది అక్కడే
కర్కషత్వం నిదుర లేచింది అక్కడే ....
దొరసానుల దర్పం అక్కడే
అడపాపల దౌర్భాగ్యం అక్కడే....
****
అదిగదిగో
అడుగడుగున
ఎదురులేని నాయకత్వపు ఆనవాళ్ళు
తిరుగులేని  దౌర్జన్యపు      సంతకాలు....
అదిగదిగో
ఏమి ఎరుగనట్టు
బాకులు కోలాటమాడిన ప్రాంగణాలు
బందూకులు పేల్చిన పరిసరాలు....
అదిగో
ఊరినిండా
బరిసెలు ఎత్తిన పొగరులు
గడి నిండా శిరసు వంచిన గురుతులు....
దొరతనమా
నీవు నిజాం తొత్తువి
కానీ ధైర్యానికి విత్తువి....
నీ అద్భుతాన్ని నమస్కరిస్తున్నా!!
కానీ నీ అరాచకాల్ని తిరస్కరిస్తున్నా!!!!
(నిశ్శబ్ధం కావలించుకున్న ' గడీ ' లను చూసాక ఈ కవిత)

No comments:

Post a Comment