Thursday, January 3, 2019

నాయిన (కథ )

నాయిన ( కథ )
°°°°°°°°°°°°°°°°°°✍తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
(ఈ కథ 80 వ దశకంలో  నిజంగా జరిగింది )
           ఎండాకాలం మొదలయ్యింది....
           అప్పుడే ఎండలు  చుర్రు మంటున్నాయి....
       బంకుల్లో కూర్చుని తిరుగలి విసురుకుంటున్నది కాపవ్వ జానకమ్మ. ఆ తిరుగలి ముందు కూర్చుని  ఒక్కో పప్పు గింజను ఉండుండి నోట్లో వేసుకుంటున్నది  ఏడేళ్ళ  నీల . ఆ పిల్ల  మూడో తరగతి చదువుతున్నది.బుట్ట చేతులు వున్న లంగా జాకెట్టు తొడుక్కుని...మొగలి పూల జడ వేసుకుని ...చూడ్డానికి ఎంతో ముద్దుగా  ముచ్చటగా  వున్నది . ఆ పక్కనే సోమిరెడ్డి తాత జనుపనారతో తాళ్ళు అల్లుకుంటున్నాడు.
         ఇంటి వెనకాల కమ్మరి సీతన్న కొలిమి వద్ద నుండి  ఇనుప కడ్డీలను కొడుతున్న శబ్దం ఆగకుండా వినిపిస్తున్నది. దానితో పాటుగా ఇంటి పక్కన చేదుల బావి గిలక శబ్ధం ఉండుండి వినిపిస్తున్నది.ఇంటి ముందు రోడ్డు నిర్మానుష్యంగా ఉన్నది.ఆ స్తబ్దతను తొలగిస్తూ అప్పుడప్పుడు ఒకరిద్దరు పోరగాళ్ళు  సైకిలు టైర్లతో ఆడుకుంటూ పరుగెడుతున్నారు.
        ' మనవరాలు  సాలెకు బోయిలేనట్టుంది  వొదినే.. !? ' కాసేపటి తరువాత అడుగుతూ వచ్చింది ఉప్పరోళ్ళ కొండమ్మ. ఆమె నోట్లో చుట్ట వెలుగుతున్నది. చెవులకు గెంటీలు చెవులను జార్చి వేలాడుతున్నాయి.  నడుస్తుంటే  ఆమె కాళ్ళ మెట్టెలు కూడా శబ్ధం చేస్తున్నయి.
      'ఆ...ఎళ్ళలేదు. వాళ్లమ్మ పెండ్లికి  ఎళ్ళింది. ఎంట పంపలేదని అలిగి ఇంట్ల కూసున్నది...' తిరుగలి విసురుతూనే చెప్పింది జానకమ్మ.
      ' పంపకూడదా మరి పిల్లను...' నీలకు మద్దతు పలుకుతూ వచ్చి బంకులు చివరలో కూర్చుని ...,' పెండ్లి ఎవ్వరిది? '  అడిగింది కొండమ్మ.
     ' అత్తగారి  సుట్టాలది ' తిరుగలి గుంజను ఒకసారి తీసిపెడుతూ చెప్పింది జానకమ్మ.
       ' మరి పిల్లను ఎందుకు పంపలేదు  వొదినే ? పిల్లకు కూడా తమ సుట్టాలు ఎవ్వరనేది తెలుస్తది... ' అంది కొండమ్మ.
      ' ఈ ఎండలను జూస్తుంటే  పెద్దవాళ్ళం మనకే భయమేస్తుంది. సన్నవిల్ల దాన్ని యాడ పంపించేది ?' తిరుగలి చుట్టూ పరుచుకున్న పప్పు గింజలను దగ్గరగా దోసిళ్ళతో జరుపుకుంటూ అంది జానకమ్మ.
      కొండమ్మ కాసేపటి వరకు ఏం మాట్లాడలేదు. కూర్చున్న  చోటు నుండి కొంచం వెనక్కి జరిగి సేద తీరుతున్నట్టుగా అక్కడున్న స్తంభాన్ని ఆసరా చేసుకుంది.
      ఆ బంకులుకు  నాలుగు మెట్లు ఉంటాయి. మెట్లను మినహాయించి చూస్తే అదొక వెడల్పయిన అరుగులా ఉంటుంది.మూడు పెద్ద స్తంభాలు ఆ బంకులు మొదట్లో ఏర్పాటుచేసి ఉన్నాయి. ఒక్క కొండమ్మే  కాదూ దాదాపుగా ఎవ్వరు అక్కడికి వచ్చినా ....ఆ స్తంభాలను ఆనుకుని  అట్లాగే  సేద తీరుతున్నట్టుగా కూర్చుంటారు.
      ' కొడుకూ కోడలూ  పిల్లలూ కనిపిస్తలేరు...' కొంచం సేపయ్యాక  మెల్లగా  చుట్ట పొగవదులుతూ అడిగింది కొండమ్మ.
     ' బాయికాడికి పోయిండ్రు...' చెప్పింది జానకమ్మ.
     ' ఇప్పుడు ఎందుకో ? ' కొండమ్మకు అర్థం కాలేదు.
     ' మాడి చెట్ల నీడన భోజనాలు చేసుకుంటరంట...' చెప్పింది జానకమ్మ.
      ' మల్ల ఈ పిల్లను కూడా తోలుకపోయింటే బాగుంటుండే గదా ...' అంది కొండమ్మ.
    '  ఆ ! ఆళ్ళకు ఈ పిల్ల మీద అంత ధ్యాసా...?' జానకమ్మ గొంతులో నిష్టూరం ధ్వనించింది.
     'ఏమో !? బలం తక్కువైతే బల్లి పామై కరుస్తది అంటే ఇదే.. ' చెతిలోని చుట్టను నలిపి పడవేసింది కొండమ్మ.
         ' ఆ !  నా బిడ్డ సంసారం సక్కగ ఉంటే నాకు ఇన్ని బాధలు ఉండవు....' వాపోయింది జానకమ్మ.
    ' అల్లుడు యాడ ఉండడో ఏమైనా తెల్సెనా ? ' అడిగింది కొండమ్మ.
     ' వోని మొకంల మన్నుబడ ! వోడు సరైనోడు ఐతే  ఈ తల్లిపిల్లలకు ఇంత కర్మ ఎందుకు ఉంటది ? వోడు సచ్చినోడు గాదు...బతికినోడు గాదు...వోని జన్మ  తగలెయ్యా...' ఆవేశాన్ని ఆవేదనగా ఒలికించింది జానకమ్మ.
     ' ఆ శాపాలు ఎందుకే ? వోడు ఎటువంటోడయినా అల్లుడు. మన పిల్ల ముత్తైదువ తనం....' తాళ్ళు అల్లడం ఆపి  భార్య జానకమ్మని కోపంగా చూసాడు సోమిరెడ్డి తాత.
      ' అల్లుడు ! అట్లాంటి అల్లుండ్లు ఉంటేం పోతేం ? ఒక పూట సచ్చినా నాలుగు రోజులు ఏడ్చి  మర్చిపోతం. కాని ఇట్లా పెండ్లాం పిల్లల్ని వొదిలేసి దేశాలు పట్టుకుని పోతే వాడ్ని కట్టుకున్నందుకు మన బిడ్డ  ఏడవాలే... దాని కడుపుల పుట్టినందుకు ఈ పిల్ల ఏడువాలే....! ఇప్పుడంటే ఇది చిన్నపిల్ల. రేపు పొద్దున పెద్దదైతది...పజనాలు ఏమి ? ప్యారంటాలు ఏమి ? పెండ్లి ఏమి ?'జానకమ్మ మనసు ఉడికి పోయింది.
    ' నీవు జెప్పేది నిజమే  వొదినా ! అన్నకేం మస్తు మాట్లాడ్తడు. అయినా అన్నకు బాధ లేదా ఏందీ ? పోతే పిల్లనిచ్చిన అల్లుడు కాబట్టి...ఇయ్యాల గాకపోయినా రేపయినా బావుండాలనేది అన్న ఆశ ...!' తనదైన బాధను వ్యక్తం చేసుకుంటూనే సోమిరెడ్డిని కూడా సమర్థించింది కొండమ్మ.
     అంతలో మోటర్ సైకిలు శబ్దం  డగ డగ మని అల్లంత దూరం నుండి వినిపించింది. ఆ ఊర్లో మోటర్ సైకిలు ఉన్నది జానకమ్మ సోమిరెడ్డిల కొడుకు వేమారెడ్డి ఒక్కడికే ! మిగతా అందరూ సైకిళ్ళమీద తిరిగే వాళ్ళే ! అందుకే వస్తున్నది వేమారెడ్డే అని అంచనా వేసుకుంటూ ... ' నీ కొడుకు వొచ్చినట్టాయే ...' అంది కొండమ్మ.
     ' అది నా కొడుకు బండి శబ్ధం గాదు...' గుర్తుపట్టాడు సోమిరెడ్డి.
     ' అవుతల మా పాలోళ్ళ ఇంట్ల పత్తాలు ఆడుతున్నరు కదా...ఆడనీకే ఎవ్వరో పక్క ఊరునుండి వొచ్చినట్టు ఉండడు...' అంచనా వేసింది జానకమ్మ.
         కానీ సైకిలు మోటరు సరాసరి ఆ ఇంటి ముందుకే వచ్చి ఆగింది. ఎవ్వరు అన్నట్టుగా అందరూ పనులు ఆపి బయటకు చూసారు. వచ్చింది పక్క ఊరి ఈడిగోళ్ళ పిల్లగాడు రాములు గౌడు. అందరి కళ్ళల్లో ' ఎందుకా ' అన్న ప్రశ్న తొణికిసలాడింది.
     ' మొన్న మీ అల్లుడు పట్నంల కనిపించిండు  పెద్ది...' బండి దిగి వస్తూ చెప్పాడు రాములుగౌడు.
    ఆ మాట వినగానే సోమిరెడ్డి చెస్తున్న పనిని ఆపడం కాదు . ఏకంగా పక్కకు పెట్టేసి లేచి నిలబడి...' మాట్లాడినవా ? ' ఆదుర్దాగా అడిగాడు.
     ' లేదు పెదనాయినా ! మనం మాట్లాడితే  తన ఉనికి తెలిసి పోయిందని చెప్పి అక్కడి నుండి తప్పించుకుంటడు...' చెప్తూ వచ్చి తనూ ఒక స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు రాములుగౌడు.
     '  మా అల్లుడే గదా...సరిగ్గా గుర్తు పట్టినవు గదా .. ' సోమిరెడ్డిలో తెలియని అనుమానం.
    ' ఆయనకు తెల్వకుండా ....ఆయన ఊరూ పేరూ అన్నీ ఒకసారి నిర్ధారణ చేసుకునే వొచ్చా ! మరి  రేపు నేను పట్నం బోతుండా...ఏమరెడ్డన్నను నా వెంట రమ్మని జెప్పండి...'  అన్నాడు రాములుగౌడు.
     ' యా అన్న రాడులే గానీ మేమే వొస్తము... ' చెప్పింది జానకమ్మ.
     తర్వాత కాసేపటి వరకు ఆ మాట ఏ మాట మాట్లాడి ...నీల తెచ్చి ఇచ్చిన చెంబులో నీళ్ళు తాగి  ఆ తర్వాత అక్కడి నుండి నెమ్మదిగా బయలుదేరుతూ ' రేఫు నస్కుల ఐదు గంటల వరకు సిద్దంగా ఉండండి...' చెప్పి వెళ్ళిపోయాడు రాములుగౌడు.
       చెప్పాలంటే ఆ ఊరు ఊరంతా  కళమ్మ తలరాత  గురించి బాధ పడుతుంటారు. ఆమె బిడ్డ నీల గురించి జాలి పడుతుంటారు. జానకమ్మ సోమిరెడ్డి దంపతులు ఆ ఊరి మొత్తానికి ఆత్మీయులు.కులమతాలకు అతీతంగా వాళ్ళను ఊరి జనాలు వరసలు కలిపి ప్రేమగా పిలుచుకుంటుంటారు.కానీ ఇంట్లో మాత్రం వాళ్ళకు మనశ్శాంతి లేదు.ఎందుకంటే ఒకవైపు కూతురు కళమ్మ  సంసారం చెడిపోయింది....మరోవైపు కోడలు రాధమ్మ  సాధింపు తారాస్థాయికి చేరింది.
           వాళ్ళు ఎన్నో కలలు గని బిడ్డ పెండ్లి జేసినా ...అల్లుడు  ఆ  కలల్ని చెరిపేస్తూ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం.... 10 ఎకరాల  సేద్యం అని ,తమ బిడ్డ సుఖ పడుతుందని, ఆశ పడితే తమకు నిరాశ మిగలడం.... వాళ్ళు జీర్ణించుకోలేక పోతున్నారు. అత్తగారింట్లో హాయిగా ఉండాల్సిన తన కూతురు పుట్టింటికి చేరి అందరికీ లోకువ కావడం వాళ్ళను మానసికంగా శారీరకంగా కృంగదీస్తున్నది. అయినప్పటికీ గుండె ధిటువు చేసుకుంటూ కూతురు సంసారం బాగుపడటం కోసం చేయని ప్రయత్నం లేదు.
       అల్లుడు నాగిరెడ్డి చిన్నప్పటి నుండి అల్లరి చిల్లరగా పెరిగి పెద్దవాడయ్యాడు. చదువూ సంధ్య అబ్బలేదు. దొంగతనాలకు మరిగాడు.ఇట్లాంటి వాడి లొసుగుల్ని కప్పిపెట్టి  పెండ్లి జేసారు అతడి తల్లిదండ్రులు. వాళ్ళ ఉద్దేశ్యంలో కూడా తప్పులేదు. పెండ్లి జేస్తే నయినా  కొడుకు దారిలోకి వస్తాడు అనేది వాళ్ళ ఆశ. కాని వాళ్ళ ఆశల్ని ....కట్టుకున్న దాని కలల్ని...నిలువుగా వమ్ము చేస్తూ వాడు చెప్పాపెట్టకుండా  ఒకానొకరోజు  ఎక్కడికో వెళ్ళిపోయాడు. అందరూ కంగారు పడిపోయారు. అన్నిచోట్లా వెదికారు.పొలీసు ఠాణాలో ఫిర్యాదు చేసారు. అప్పటికి కళమ్మ పెళ్ళయి మూణ్ణెళ్ళే అయ్యింది.అయినప్పటికీ మొగుడి కోసం ఎదురు చూస్తూ ఆమె మరో ఆరు నెలల వరకు అత్తింటిలోనే ఉండిపోయింది. ఆ తర్వాత ఒకరోజు ఆకస్మత్తుగా వచ్చాడు నాగిరెడ్డి.  భర్త రాక కళమ్మకు ఆనందాన్ని ఇచ్చింది. అయితే కొడుకు తత్వం తెలిసిన తల్లిదండ్రులు మాత్రం అతడు వెళ్ళిన రోజు నుండి కూడా ' వస్తాడులే ' అనే నింపాందితోనే ఉన్నారు.
      వచ్చిన వాడు మరో మూడునెలలు బుద్దిగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు. అప్పటికి కళమ్మ నెల తప్పింది. ఒకవైపు వేవిళ్ళ వెగటు...మరో వైపు మొగుడి ఆచూకీ మనసును వేధిస్తుంటే అట్లాగే ఆరు నెలల వరకు అత్తగారింట్లోనే ఉండిపోయింది. నాగిరెడ్డి అప్
పటికీ రాలేదు. అట్లాంటి పరిస్థితుల్లోనే ప్రసవం కోసం ఆమె పుట్టింటికి వచ్చింది. పాప పుట్టింది. అయినా నాగిరెడ్డి పత్తాలేడు. మోసం చేసామని తమని అందరూ నిలదీస్తారేమో అనే భయంతో అతడి తల్లిదండ్రులు కూడా తప్పించుకు తిరగడం మొదలెట్టారు.
     అట్లా కాలం గిర్రున తిరిగి ఎనిమిది సంవత్సరాల కాలం గడిచిపోయింది. కళమ్మ బిడ్డ నీలకు ఏడేళ్ళు వచ్చాయి. అప్పటికీ గూడా  తండ్రి ముఖం తెల్వదు. తండ్రి ప్రేమ తెల్వదు. ఇంట్లో అమ్మమ్మ తాతల  అండదండలు  ఉన్నప్పటికీ పరాధీనతలో బతుకు మగ్గిపోతూ ఆ చిట్టి గుండె వేల చిల్లులు పడింది 
   ' మా నాయిన ఎక్కడున్నాడు ? బడికి అందరు నాయినలు వొస్తరు గదా...మా నాయిన గూడా వొస్తే బాగుంటది గదా ' అంటూ  నీల హృదయం చాలాసార్లు తల్లడిల్లుతుంది. కాని బయటకు చెప్పుకోలేదు.
     ఇంట్లో చూస్తేనా... రాధమ్మ ఒక నియంత. ఆమెకు కళమ్మ పనిదానితో సమానం. నీల వయసు  తన పిల్లలకు సమానమైనా  ఆ బాల్యాన్ని ఆమె గుర్తించదు. ఆ పిల్ల ఆడుకుంటే ఓర్చుకోదు. తన పిల్లలను  ఆడించమంటుంది. తన పిల్లలకు అన్నం తినిపించమంటుంది. ఇదంతా చూస్తూ చాలాసార్లు జానకమ్మ కోడలితో గొడవ పడింది. పడుతూనే ఉన్నది. ఇక కొడుకు వేమారెడ్డి చూస్తేనా పెళ్ళానికి బానిస. ఏ క్రమంలో ఎవ్వరికీ వత్తాసు పలుకడు. ఇంట్లో సమస్యను పట్టించుకోడు.
            ******
        మరుసటి రోజు  రాములుగౌడు వెంట పట్నం బయలుదేరి వెళ్ళారు జానకమ్మ దంపతులు. కళమ్మ తన మొగుడు రాక విషయమై కోటి ఆశల్ని పెంచుకుని  తల్లిదండ్రులు వెళ్ళింది మొదలు ఎదురుచూడ్డం మొదలెట్టింది.అమెకు పుట్టింటి నరకం నుండి తప్పించుకోవాలనేది ఒక  ప్రగాడమైన కోరిక.అందుకే ఆరోజు అనుమాండ్ల గుడికి వెళ్ళింది. పూజ అయ్యక గుడి ముందు వున్న గరుడ స్తంభం తాలూకు  కట్టమీద కూర్చున్నది.
     ' ఏం కళమ్మా...!? ఎట్లుండవు...? ' అంతలో అడుగుతూ వచ్చింది జంగిడి బర్రెలు కాసుకువచ్చే కురుమక్క.
   ' బాగనే ఉన్నా...' చెప్పింది కళమ్మ.
    ' ఏం బాగనో ఏమో తల్లీ...కంటికి పుట్టెడు బోస్తుండవు .మాకు తెల్వంది ఏముంది ? ' అంటూ వచ్చి ఆమె పక్కగా కూర్చుంది కురుమక్క.
    కళమ్మ ఏం మాట్లాడలేదు. కురుమక్కే కల్పించుకుంటూ....' ఒక మాట చెప్తా ఇంటవా బిడ్డా...!? 'మెల్లగా గొంతు తగ్గించి అడిగింది.
    ఏందన్నట్టుగా చూసింది కళమ్మ.
    ' మరేం లేదు బిడ్డా ! నీవు ఏర్పాటయినా ఉండు...లేదంటే అత్తగారింటికైనా బోయి మొగుడు లేకున్నా సరే కాపురం జేసుకో...!  మీ అమ్మనాయినలు ముసలోళ్ళు అయిపోయిండ్రు. వాళ్ళు ఉన్నంత వరకే ఆ ఇంట్ల బుక్కెడు తింటవు. తన్నినా గుద్దినా పడి ఉంటవు. ఆళ్ళు పోయినంక  నిన్ను కుక్క కంటే అద్వాన్నంగా జూస్తరు .తన్ని గూడా గంజి నీళ్ళు బొయ్యరు. నీ గురించేమో గానీ...నీ బిడ్డ గురించయితే ఆలోచన చేయ్ బిడ్డా ! నీవు ఒక్కటే గుర్తు పెట్టుకో....నీ మొగునికి ఉన్న పొలాలు నీ పుట్టంటోళ్ళకు లేవు. అయినా ధనం వొద్ద బెట్టుకుని దప్పి నీళ్ళకు ఏడుస్తున్నట్టుగా ఉంది నీ బాధ. నీ ఈ బాధలు నీ పిల్లకు రావొద్దు.అందుకే నీవు ఎళ్ళిపో ! మీ అన్న పిల్లల్ని రోజు బండిమీద ఇంగిలీసు సదువుకి ఎక్కించుక పోతరు. నీ బిడ్డనేమో సర్కారు సాలెకు ఊర్లనే బోతుంది. ఇదే నీవు గుర్తుపెట్టుకో...! రేపొద్దున ఆ పిల్ల పెండ్లి సంగతి కూడా ఇంతే జేస్తరు. ఒకళ్ళ మీద మనం బరువుగా ఉన్నంత కాలం మన బతుకులు బాగుపడవు....'  ఆగకుండా చెప్పుకుపోతున్న కురుమక్క కళ్ళల్లో కళమ్మ విషయమై కన్నీటి తెర  చిక్కగా పరుచుకుంది.
    ' ఆలోచిస్తాను.. ! ఈ రోజు ఏదో ఒకటి తెలిసాకా ' చెప్పింది కళమ్మ.
     ' ఈరోజు ఏం తెలుస్తుంది బిడ్డా ? ' అడిగింది కురుమక్క.
  విషయం చెప్పింది కళమ్మ. అంతలో అటుగా అన్న  వేమారెడ్డి వచ్చాడు.
    ' సర్పంచు ఇంటికి పోను వచ్చింది కళమ్మ.అమ్మానాయిన వొస్తున్నరంట. మనమైతే మీ ఊరికి పోదాం ...' బండి దిగకుండానే చెప్పాడు అతడు.
    కళమ్మకు  ఏమీ అర్థం కాలేదు. కనుబొమ్మలు ముడిచి ప్రశ్నార్థకంగా చూసింది. వేమారెడ్డి విషయాన్ని ఇంక నాంచలేదు. నేరుగా చెప్పినా బలపడిన  అనుబంధాల దృష్ట్యా గుండె ఆగిపోయే పరిస్థితులు కూడా ఏమీ లేవు కాబట్టి ...' బావ సచ్చిపోయిండంట. అమ్మా నాయినను జూసి తప్పించుకోబోయి .. చూసుకోకుండా లారికింద పడిపోయాడంట...' ఎట్లాంటి బాధ లేకుండా సహజంగా చెప్పుకు పోయాడు అతడు.
     కానీ విషయం విని కళమ్మ మనసు ఒక్కసారిగా కుదేలైపోయింది. తన అన్న అనుకున్నంత సులువుగా తన మనసు లేదు. తన మొగుడు ఏదో ఒకరోజు వస్తాడని...తనని తన బిడ్డనూ చూసుకుంటాడని...మనసు మూలల్లో ఏదో చిన్న ఆశ ఇన్నాళ్ళూ కొట్టు మిట్టాడింది. ఆ వున్న ఆశ కూడా ఇప్పుడు సడలిపోయింది.
    ' దేవుడా ! ఎందుకు నామీద నీకు ఇంత కోపం !? ' నిస్సహాయురాలిగా మనసులోనే మదనపడిపోయిందామే. అందుకు ఆమెకు తెలియ కుండానే ఓ వెచ్చని కన్నీటి చుక్క ఆమె చెక్కిళ్ళను తడిపింది.
      ******
మూడు నెలలు గడిచి పోయాయి. కళమ్మ పూర్తిగా కళ తప్పిపోయింది. మొగుడి తర్వాత  ఆస్తిలో భాగం అడిగితే 5 ఎకరాలు కాదనకుండా రాసిచ్చారు. మిగతా ఐదెకరాలు తమ తదనంతరం నీలకే అని కూడా భరోసా ఇచ్చారు.
    వేమారెడ్డి తన కుటుంబాన్ని పిల్లల చదువుకోసం పక్కటౌనుకు మార్చాడు. వెంటే నీలను కూడా తీసుకు వెళ్ళాడు.
కాని అక్కడ కూడా నీలకు సర్కారు బడినే దిక్కయింది. అయునప్పటికీ అందరూ వేమారెడ్డిలోనూ రాధమ్మలోనూ కొంత మార్పు వచ్చిందని భ్రమ పడ్డారు. కానీ నీలను తమ వెంట తీసుకు వెళ్ళిది తమ ఇంట్లో పనికోసం అని ఎవ్వరూ గుర్తించలేదు. చివరకు ఎవ్వరైనా ఈ పాప ఎవ్వరని అడిగితే...' పనిపిల్ల ' అని రాధమ్మ చెప్పుకుంటుందనే సంగతిని కూడా  వేమారెడ్డితో సహా ఎవ్వరూ పసిగట్టలేదు. కానీ ఆ చిన్ని గుండె మాత్రం ...పనులు చేయలేకా...మాటలు పడలేకా.. బాధను ఎవ్వరితో చెప్పుకోలేకా.  లోలోపలే నిర్వీర్యం అయిపోయింది.
          *******
     ఇట్లా ఉండగా ఒకరోజు....
     రాధమ్మ తండ్రి చనిపోయినట్టుగా వార్త వచ్చింది.అది విని రాధమ్మ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యింది.
    ' నాయినా...యాడుండవు నాయినా ....ఒక్క మాట చెప్పకుండ పోయావా నాయినా ! ఇప్పుడు నా బాధలు...కష్టాలు ఎవ్వరికి చెప్పుకోవాలి నాయినా ..! నీవుంటేనే నాకు గుండె ధైర్యం కదా నాయినా...' అంటూ  శోకించసాగింది. అక్కడే వున్న నీల ఆమె దుఖాన్ని చూస్తూ కరిగి పోలేదు కానీ...ఆమె మాటల్లో  వ్యకమౌతున్న ' నాయినా అనే ఒక బలమైన శక్తిని ' తెలిసీ తెలియకుండానే గ్రహించగలిగింది.
      ఆ తర్వాత మరో నెలరోజులకు...
       వేమారెడ్డి పెద్ద కొడుక్కు ఆకస్మత్తుగా అనారోగ్యం పొడచూపింది.రాత్రికి  రాత్రి ఒక్కసారిగా వాంతులు విరేచనాలు జ్వరము తీవ్రస్థాయిలో చెలరేగాయి. ఆ పరిస్థితిలో రాధమ్మ  ' చిన్నా ...చిన్నా...' అంటూ కలవరపడిపోసాగింది. వేమారెడ్డి మాత్రం ధైర్యంగా ఉన్నాడు.
' నీవు వెంటనే పిల్లవాడిని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళు.నేను నా తలకాయ కుదవబెట్టయినా సరే అప్పు తీసుకు వస్తా...' కొండంత నమ్మకాన్ని అందిస్తూ చెప్పాడు.
    అంతా చూస్తున్న నీలకు పిల్లవాడి ఆరోగ్యం విషయమై తెలియని బాధ ఏదో మనసును ఆవహించింది. అంతకు మించి వేమారెడ్డి ఇచ్చిన భరోసాలో ' నాయిన అనే శక్తి ' మరొక్కమారు  తెలిసీ తెలియక అర్థమయ్యింది.
     అట్లా ఒక వారం గడిచింది. పిల్లవాడి ఆరోగ్యం కుదుటపడింది. అందరూ కలిసి వాతావరణం మార్పు కోసం పల్లెకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళీ వెళ్ళగానే ఊరు ఊరంతా పరామర్శలతో ఇంటిని చుట్టుముట్టారు. అట్లాంటి పరిస్థితిలో దొడ్లో కుండీల్లో పెంచుకున్న చామంతి చెట్లకు నీళ్ళు పోస్తూ ధీర్ఘంగా ఆలోచిస్తున్నది కళమ్మ.
    ' తనకు తన అన్న నీడ లేకపోతే సామాజిక భద్రతలేదు. ధైర్యం చేసి బయటకు వెళ్దామన్న ఆర్థిక భరోసా లేదు.ఊర్లో తన పాలికి వచ్చిన పొలాలను అమ్ముకుందామన్నా కొనేవాడు లేడు. కౌలుకు ఇచ్చుకుందామన్నా బావులు ఎండి వున్నాయి.కరువు కాపురం చేస్తున్నది. మరి ఇట్లాంటప్పుడు తనేం నిర్ణయం తీసుకోవాలే? తన పిల్లా పెద్దది అవ్వుతుంది. అవసరాలు పెరుగుతున్నాయి....! నాయినేమో నా మాట కాదనొద్దు బిడ్డా ...అంటున్నాడు. తనకేమో ఇష్టం లేదు...'
    ' కళమ్మా...' కొంచెం సేపు తర్వాత పిలుస్తూ వచ్చాడు సోమిరెడ్డి.
     ' నాయినా...' ఆలోచనల్లోంచి తేరుకుంటూ పలికింది కళమ్మ.
    ' నేను చెప్పిన సంగతి ఏం ఆలోచిస్తివి బిడ్డా....' అక్కడే వున్న గడ్డివాము  నుండి గడ్డిని ఎద్దుల కోసం తీస్తూ గుర్తుచేసాడు సోమిరెడ్డి.
    వాస్తవానికి అతడికి కూతురుకు మళ్ళీ పెండ్లి చేయాలని ఉన్నది. తమ ఇంటి సంప్రదాయాన్ని కట్టుబాట్లని పక్కకు పెట్టి కూతురుకు ఒక కొత్త జీవితాన్ని అందివ్వాలని ఉన్నది. అందుకు తన  చెల్లెలి  కొడుకు బూసిరెడ్డిని  ఎంచుకున్నాడు.అతడి పెళ్ళాం రెండెండ్ల కిందట  అనారోగ్యంతో చనిపోయింది. నీల వయసులో ఒక్క కొడుకు ఉన్నాడు.ఏ బాదర బందీలు లేవు. అత్త కొడుకే కదా అని మొదటి పెళ్ళప్పుడే అడిగితే....పేదోళ్ళని కళమ్మను వద్దనుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పేదదయినా సరే కళమ్మను చేసుకోడానికి సిద్దంగా ఉన్నాడు. ఆస్తులు అంతస్తులకు కొదవలేదు. కానీ కళమ్మే ఆత్మాభిమానం కొద్ది లోలోపలే తిరస్కరిస్తున్నది. కాబట్టి తండ్రికి సమాధానం చెప్పలేదు.
    ఇట్లాగని సోమిరెడ్డి ఆమెను వదిలెయ్యలేదు....వెంటనే ఆమె వద్దకు వచ్చి ఆమె  రెండు చేతులను బిగ్గరగా పట్టుకుని...' నీ కాలు మొక్కుతా బిడ్డా ! మేము ముసలోళ్ళం అయిపోయినం బిడ్డా ! మేము సస్తే నీకూ నీ బిడ్డకూ ఆదెరువు లేదు బిడ్డా...! మేము బతికి వున్నప్పుడే పాముల మధ్యన వున్నట్టు ఉంది నీ బతుకు...కాదనొద్దు...నీ బిడ్డ కోసమైనా.. ' అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
    సరిగ్గా అప్పుడే అటుగా వచ్చింది నీల. తాత కళ్ళల్లో నీళ్ళను స్పష్టంగా చూసింది. కాని తాత ఎందుకు ఏడుస్తున్నాడో ఆ పసి హృదయానికి తెల్వలేదు. కాపోతే అతడి కన్నీటికి చలించిపోతూ కళమ్మ...' నాయినా మా బతుకుకు వున్న నీడవు నువ్వొక్కడివే ! నువ్వు ఇట్లా ఏడుస్తే మేము గుండె పగులుతం...' దీనంగా అన్నది. ఆ మాటలను విన్న నీలకు అందలి మర్మం అర్థం కాలేదు గానీ ' నాయినకు వున్న శక్తి ' మరోసారి కూడా తెలిసీ తెలియక అర్థం అయ్యింది.
    అంతే ! నీల మనసు చెదిరింది. వెళ్ళి మెద్దె మీద కూర్చుని వెక్కి వెక్కి ఏడ్వడం మొదలెట్టింది. గమనించిన కళమ్మకు ఏమీ అర్థం కాలేదు.
   ' ఎందుకు ఏడుస్తున్నావే ? ' ఆదుర్దాగా అడిగింది.
     నీల ఏం మాటాడలేదు.
  ' చెప్పే.. నిన్ను ఎవ్వరైనా కొట్టారా ? ' ఆమెలో అదే అదుర్దా.
    ఈసారి తల అడ్డంగా ఊపింది నీల.
   ' మరి నీకేం కావాలనే ?' ఆమెలో ఆదుర్దా తగ్గనే లేదు.
    ' నా.. యి...న....కావాలీ ..' వెక్కిళ్ళ మద్య చెప్పింది నీల.
  ఆ మాట కళమ్మకు పిడుగు పాటులా వచ్చి తగిలింది. ఆ పిల్ల ఎందుకు అట్లా అడుగుతుందో తెలియక ....ఏం సమాధానం చెప్పాలో తెలియక...కళమ్మ ప్రతిమలా నిలబడిపోయింది.
    కింద ఆమె నిర్ణయం కోసం తల్లి దండ్రులు ఎదురుచూస్తున్నారు. మరి ...ఏమో..!? ఆమె అవునో...కాదో...!?)

No comments:

Post a Comment