Sunday, January 27, 2019

స్మరణీయులు

▪️బుడ్డా వెంగళరెడ్డి :(1822_1900)

పేద ప్రజల ఆశాజ్యోతి. ధర్మానికి మారు పేరు.  దాన గుణానికి నిజం పేరు. అపర అన్నపూర్ణగా  పేరు గడించిన కాపోళ్ళ ముద్దుబిడ్డ !వీరి గురించిన అనేక జానపద గాథలు అనేకం రాయలసీమ ప్రాంతంలో ప్రచారంలో ఉన్నాయి.1866 లో కర్నూలు ప్రాంతంలో సంభవించిన ' డొక్కల కరువు ' జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. ప్రజలను  జీవకళేబరాలుగా మార్చిన ఈ కరువు రక్కసి వెంగళ్ రెడ్డిని తీవ్రంగా కలిచివేసింది.  తినడానికి తిండిలేక...తాగడానికి నీళ్ళులేక ...ప్రజలు అల్లల్లాడిపోతున్న ఈ పరిస్థితిలో వెంగళ్ రెడ్డి ఆపన్న హస్తమయ్యాడు. బతకాలన్న ఆశతో మట్టిని జల్లించుకు తింటున్న ప్రజలకు ఆపద్భాందవుడై తోడుగా నిలిచాడు.కండ కరిగి ఎముకల గూడుల్లా మరుతున్న ప్రజల కోసం తన సర్వస్వాన్ని ధారపోసాడు. ఎక్కడివాళ్ళక్కడ శవాల గుట్టలై పేరుకుపోతుంటే...ఆ దుస్థితిని తప్పించేందుకు తన ఆస్థి అంతా కరిగిపోగా అప్పుల చేయడం మొదలెట్టాడు. అట్లా మూడునెలలకు కరువు ప్రాంతాన్ని ఆదుకునే ప్రయత్నాన్ని నిష్కల్మషంగా కొనసాగించాడు.వీరి త్యాగనిరతిని గమనించిన అధికారులు విక్టోరియారాణి నేతృత్వంలో వెంగళ్ రెడ్డిని ప్రశంసిస్తూ 20 తులాల బగారు పథకాన్ని  బహుకరించారు. ఈ పథకం ముందు భాగంలో ఆంగ్లం లోనూ...వెనక భాగంలో తెలుగులోనూ...వీరి గొప్పతనం గురించి రాయబడి వున్నది.వీరి స్వస్థలం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పక్కలో ఉన్న ఉయ్యాలవాడ గ్రామం. వీరి తండ్రి నల్లపరెడ్డి.తల్లి వెంకమ్మ.


▪️ఉయ్యాలవాడ నరసింహ్మారెడ్డి : (వీరి జననం గురించి ఇతమిద్దమైన కాలం తెలియదు.మరణం 1847 )

1857  మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై  తెగువతో ఆత్మాభిమానంతో అచంచలమైన దేశభక్తితో ఎదిరించి తిరుగుబాటు చేసిన అచ్చ తెలుగు  రెడ్డి బిడ్డ ! 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. వీరి మరణం ఉరి ! దేశం కోసం...తనను నమ్మిన ప్రజల కోసం పోరాటం ప్రాణత్యాగం చేసిన ఉయ్యాలవాడను కొందరు వ్యతిరేకులు దొంగగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాని వేలాది ప్రజల క్షేమం కోసం మేల్కొన్న ఈ వీరుడు భారతమాత ముద్దుబిడ్డ.! భారతీయుల సొమ్మును  ఆంగ్లదొరల నుండి లాక్కుని తిరిగి భారతీయులకే పంచి పెట్టిన ఘనాపాటి !రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగార్ లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు.స్థానికంగా వీళ్ళు అధికారాల్ని కలిగి ఉండేవాళ్ళు. సంఘంలో వీరిది గౌరవ స్థానం. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకరు. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందిన రెడ్డి జాతి వజ్రకిరీటం.. ఈయన పాలెగార్ మనవడు.వీరిగురించిన అనేక జానపద కథలు...పాటలు ...రాయలసీమ ప్రాంతంలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. వీరి స్వస్థలం కర్నూలు జిల్లా రూపనగుడి. వీరి తండ్రి పెద మల్లారెడ్డి

▪️గోన గన్నారెడ్డి (1262-1296)

తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకువచ్చే పౌరుషాగ్ని కాకతీయ రుద్రమ ! ఈ రుద్రమ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే   సింహగర్జన  గోన గన్నారెడ్డి.శక్తికి మారుపేరు.యుక్తికి అస్సలు పేరు. యుద్ద తంత్రం తెలిసిన వీర ఖడ్గం. పాలనా మంత్రాంగం తెలిసిన రాజకీయ రథచక్రం. ఇతడి చూపులే నిఘా నేత్రాలు. ఇతడి మెదడే మహా నిఘంటువు. వీరి తండ్రి గోన బుద్దారెడ్డి.ఇతడు రుద్రమదేవి తాతగారు రుద్రదేవుడికి సామంతరాజు.వివరాల్లోకి వెళ్తే రుద్రదేవుడు పాలమూరు పాలిస్తున్న  'కందూరు ' చోడులను ఓడించి  అక్కడ బుద్దారెడ్డిని  రాజుగా నియమించాడు. అతడు వర్తమానపురం బుద్దాపురంలను  జనరంజకంగా పాలించాడు. అయితే సంతానం లేని బుద్దారెడ్డి కి 50 ఏండ్ల వయసులో సంతానం కలుగుతుంది. వీళ్ళే తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక....గోన గన్నారెడ్డి...విఠల్ రెడ్డి. కాని వయసు పైబడటంతో పిల్లల భవిష్యత్తు అతడ్ని భయపెడుతుంది.అప్పుడు తన తమ్ముడు లకుమారెడ్డి కి పిల్లల భాద్యత అప్పగించి తృప్తిగా కళ్ళు మూస్తాడు. దుర్మార్గుడైన లకుమారెడ్డి  సింహాసనం మీద కన్నేస్తాడు.కాలక్రమంలో గణపతిదేవుడు రాజ్యాన్ని రుద్రమకు అప్పగించినప్పుడు....విద్యాభ్యాసానికై  ఓరుగల్లు చేరిన గన్నారెడ్డి , ఆమెకు నమ్మిన బంటుగా మారుతాడు.ఆమె చేసిన ఎన్నో యుద్ధాల్లో తనదైన పాత్రను పోషించి ఆమె గెలుపుకు కారకుడవుతాడు. రుద్రమతో సమానమైన తెలివితేటలకు ....యుద్దనైపుణ్యానికి...అపర చాణిక్యానికి... గన్నారెడ్డి తిరుగులేని సారథి.రుద్రమ చొరవతో తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్న  రాజనీతిజ్ఞుడు. వీరి రాజ్యం వర్థమానపురం.... ప్రస్తుతం నాగర్ కర్నూల్ పక్కన వున్న నందివడ్డేమాన్. ఒకప్పటి వర్థమానపురమైన  ఈ నందివడ్డేమాన్ చరిత్ర ఈ విధంగా ఘనమైనది.

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

No comments:

Post a Comment