Sunday, January 27, 2019

వర్ణమాలలో రెడ్డి

రెడ్డి ఆణిముత్యాలు
°°°°°°°°°°°°°°°°°°°°సేకరణ :తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
39: డా.బెజవాడ గోపాలరెడ్డి (7-81907 - 9-3- 1997
అతడు 
నిరాడంబరుడు....!
స్వచ్ఛంగా నిగర్వి..... !
తరతరాలు గుర్తుంచుకునే స్వాతంత్ర్య సమర సేనాని ....!
అడుగుజాడై నిలిచిన సారస్వత వారసత్వం.... !
తిరుగులేని రాజకీయవేత్త.... !
పదకొండు భాషల్లో ప్రావీణ్యం సంపాదించుకున్న ప్రతిభాశాలి ...!
అన్నింటికీ మించి ధీశాలి !!
           రాజకీయం అంటే పదవులు పొంది మిన్నకుండటం కాదు.... అంకిత భావంతో  బాధ్యతలను నిర్వర్తించడమే అని క్రమశిక్షణతో  చాటి చెబుతూ....  పరిపాలనాదక్షుడుగా వివిధ హోదాల్లో  తనదైన ముద్ర వేసిన గోపాలరెడ్డి,
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంగ్రామంలో జన్మించాడు. వీరి తండ్రి పట్టాభిరామిరెడ్డి, తల్లి సీతమ్మ.
          శాంతి నికేతన్ లో  1924-27  ప్రాంతంలో విశ్వకవి  రవీంద్రనాథుడి  కవిత్వానికి ఆకర్షితుడు అయ్యాడు. కవీంద్రుడే ఆదర్శంగా తన కలానికి పదును పెట్టాడు.అప్పటికి దేశంలో జతీయోద్యమ తీవ్రత బలంగా ఉన్నది. ఈ  క్రమంలో
ఒక చేత్తో  జాతీయోద్యమం....రెండో చేత్తో సాహితీసేద్యం  గోపాలరెడ్డిని పరిపూర్ణంగా తీర్చిదిద్ద గలిగాయి.   జాతీయోద్యమంలో పాల్గొని చెరసాల జీవితం  కూడా గడిపాడు. ఇక్కడ జీవిత పాఠాలు బాగా ఒంటబట్టించుకున్నాడు. ఆ తర్వాత చురుకైన యువకుడిగా రాజాజీ మంత్రివర్గంలో సంయుక్త  మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు.
       వీరి వివాహం  తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మతో జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
      పదవులు వీరిని వెదుక్కుంటూ రాగా.... కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్రరాష్టానికి  1955లో ముఖ్యమంత్రిగా అతి పెద్ద బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకున్నారు.  1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా ఉపముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంట గెలిచాక రచ్చ గెలిచిన తీరున  1956  తర్వాత  జవహర్‌లాల్ నెహ్రూ సారధ్యంలో  రెవిన్యూ మంత్రిగా  చేశారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను నిర్వహించారు. ఆ తర్వాత ఐదేళ్ళపాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరించారు. 186 నెలలు నిర్విరామంగా వివిధ రాజకీయ పదవులు నిర్వహించారు.  
         వీరి సాహితీ ప్రస్థానాన్ని గమనిస్తే సాహితీ రంగంలో వీరు ఉద్దండులు . 1946లో  తెలుగుభాషా సమితి అధ్యక్షులుగా  నియమించబడ్డారు. ఇక్కడ అక్షరానికి అదనపు గౌరవం దక్కేలా కృషిచేశారు.  1957 నుండి 1982 వరకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా 25 సంవత్సరాలు  పనిచేశారు. ఇది వీరి జీవితంలో ఒక గొప్ప కీర్తి బావుటా ! 1963 -71వరకు  ఎనిమిదేళ్ళు జ్ఞానపీఠ అధ్యక్షులుగా విశిష్ట సేవలు అందించారు. 1978 నుండి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులుగాను కొనసాగారు.
            రాజకీయం చేతిలో ఖడ్గం అయితే.... సాహిత్యం తలమీద కిరీటంగా బతికిన గోపాల్ రెడ్డి  తన జీవిత కాలంలో రవీంద్రుని గ్రంథాలను తెలుగులోకి అనువదించడం ఒక యజ్ఞంలా సుదీర్ఘంగా కొనసాగింది. అట్లా ఒక అనువాద రచయితగా ముద్ర పడిపోయారు. కాగా అక్షరాలు ఒద్దికగా కూర్చడం అలవాటు అయిన గోపాల్ రెడ్డి, తన
డెబ్బయివ ఏట స్వతంత్ర రచనలు మొదలుపెట్టారు. ఈ  నేపథ్యంలో  1978లో తొలి స్వీయ కవితాసంపుటి వెలువరించారు.
❤ ఆమె/ఆమె జాడలు/ఆమె నీడలు/ఆమె తళుకులు/ ఆమె చెరుకులు/ గా ఆమె పంచకం వెలువరించిన గోపాల్ రెడ్డి సాహిత్యం   అత్యంత సున్నితమైనది  మృదు భావ సహితమైనది.  చెప్పాలంటే వీరి రచన ఒక పూబాల....!      కాలవాహిని/ సాహిత్య సుందరి / వచనకవితా సంపుటాలుకూడా వీరు  ప్రకటించారు. వీరి '' ఆమె నవ్వింది'' రచన ఒక అద్వితీయ ప్రయోగం. 
       ఇట్లా సాహితీ రాజకీయ రంగాలలో తనకంటూ  తిరుగులేని విశిష్ట స్థానాన్ని సంపాదించుకొని 90 వసంతాల   నిండు జీవితాన్ని గడిపిన  ఒక పరిపూర్ణ   వ్యక్తి  మన  గోపాలరెడ్డి!  20 వ శతాబ్ది  మొదటి పాదంలో  జన్మించి చివరి వరకు జరిగిన అన్ని సామజిక సాంకేతిక రాజకీయ ఆర్థిక  నాగరిక పరిణామాలు అన్నిటినీ దర్శించగలిగాడు. తన జీవితాన్ని ముందు తరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుకో గలిగాడు. తానే ఒక పుస్తకంగా తన మస్తిష్కాన్ని పదును పెట్టుకోగలిగాడు.

No comments:

Post a Comment