Monday, January 28, 2019

చరిత్రలో మహిళలు

▪️నాయకురాలు నాగమ్మ...

మంత్రాంగం నడిపిన మహాదేవివ్యూహ ప్రతివ్యూహల ఊటబావి...

సాగిన యుద్దతంత్రం...దూసిన వీరఖడ్గం...

ఎదురులేని రాజనీతి-తిరుగులేని  కలహప్రీతి-

పల్నాటి యుద్దం! మహాభారత కురుక్షేత్రంతో సమానంగా భీకరంగా కొనసాగిన మహాయుద్దం! ఇది జరిగి 900 ఏండ్లు గడుస్తున్నా ఆ పౌరుషాల నెత్తుటి మరకలు ఇంకా తడి ఆరలేదు.యుద్దంలో ప్రధాన భూమికల్ని పోషించిన....బ్రహ్మనాయుడు నాగమ్మల పేర్లు ఇంకా పలనాటి గడ్డలో చెవుల్ని గింగురు మనిపిస్తున్నాయి.ఆ గుర్రపు డెక్కల చప్పుడులు అక్కడి గుండెల్ని ఇంక వణికిస్తున్నాయి. ఆ కత్తుల కోలాటపు శబ్ధాలు అక్కడి మట్టిలో ఇంకా దుమ్ములేపుతూ భయపడుతున్నాయి.

నా....గ...మ్మ....!
పలనాడు మరిచిపోని  పేరు !
కదన రంగం కోరుకునే పౌరుషత్వపు సెలయేరు !
ప్రపంచ  స్థాయిలో  తన  సమర్థతను అప్రతిహతంగా చాటుకున్న  ధీశాలి ! రాజ్యమో... రణరంగమో..రక్తపాతమో...   పౌరుశత్వమే ప్రాణవాయువుగా చెలరేగిన శక్తిశాలి ! రాజ్యపాలనలో వ్యక్తిగా కాదు.. వ్యవస్థగా తనదైన ముద్రను వేసిన అమర ఖ్యాతి ! యుక్తికి పర్యాయపదంగా మిగిలి పోయిన తొలి మహిళా మంత్రి.
       బాల వితంతువు. అయినా ఆత్మస్థయిర్యం కొరవడని నిప్పుల కొలిమి. స్వశక్తితో అత్యున్నత స్థాయికి ఎదిగిన ధీరోదాత్త .చండ ప్రచండమై చరిత్రను అలరించిన సమరభేరి!
            నాగమ్మ   మహా మంత్రిగా రాజ్యాన్ని, రాజును, ప్రతిభావంతగా నడిపించింది.యుద్దానికి సారధ్యం వహించి ప్రత్యర్థి వర్గాన్ని హడలెత్తింది. గెలుపు సింహాసనాన్ని  సాధించిపెట్టి  దిగ్విజయ పతాకై రెపరెపలాడింది. అపర చాణక్య మేధా సంపన్నురాలుగా రణస్థలిలో  సైనిక బలగానికి తానే దివిటీ అయ్యింది.
         11వ శతాబ్ధకాలంలో స్త్రీ జాతి పరిస్థితి అస్తవ్యస్తంగా వున్న ఆనాటి సామాజిక పరిస్థితుల్లో  ఆమె తెగువగా చొరవ చూపింది. సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఒక సాధారణ స్త్రీ.... రాజ్యపాలన అవగాహనలేని  కుటుంబం... పైగా బాల వితంతువు....ఇట్లాంటి  పరిస్థితుల్ని ఎత్తుగడలతో జయించి  మంత్రిస్థాయికి ఎదగడం  అనేది అంత ఆషామషి కాదు.కలలు  నిజం చేసుకోవడం అంటే  అదొక నిర్విరామ యజ్జం. కాబట్టే  స్త్రీజాతికే మణిదీపంలా బాసించింది.
        తెలివైన   నాగమ్మను గుర్తించిన మంత్రి గోపన్న తన పర్యవేక్షణలో నాగమ్మ చదివించాడు. చదువుతో పాటుగా సాముగరిడీలు, ధనుర్విద్య, అశ్వ శిక్షణలో ప్రావీణ్యం పొందింది.  సంగీత  పరిజ్జానాన్ని సంపాదించుకుంది.సంస్కృతాంధ్ర, కన్నడ, తమిళ భాషలలో పాండిత్యం సాధించింది. రాజనీతి, తత్వశాస్త్రాలని కూడా అధ్యయనం చేసింది.
        నాగమ్మ  బాల్య జీవితాన్ని గమనిస్తే .... నాగమ్మ తండ్రి రామిరెడ్డి .కరీంనగర్‌ జిల్లా, పెగడపల్లి మండలం, అరవెల్లి గ్రామం వీరి స్వస్థలం.అయితే  ఇతడు తన    కుటుంబంతో సహా ఆ ప్రాంతంలో నెలకొన్న కరువు కాటకాలు...మశూచి మహమ్మారి కారణంగా  కాలక్రమంలో  తనబావమరిది మేకపోతుల జగ్గారెడ్డి వుంటోన్న పల్నాడులోని జిట్టగామాలపాడు గ్రామానికి వలస  వచ్చాడని చరిత్ర చెబుతుంది. అక్కడే  స్వంత అత్త కొడుకు బావ సింగారెడ్డితో చిన్న తనంలోనే ఆమెకు వివాహం జరిగింది. అప్పడు వయసు 7 ఏండ్లు. తండ్రి  రామిరెడ్డి  సోదరి కొడుకే ఈ  సింగారెడ్డి.  వివాహమైన మూడు రోజులకే సింగారెడ్డి మరణించడంతో నాగమ్మ జీవితం కన్నీటిమయం అవుతుంది.
         కూతురు బతుకు  రామిరెడ్డిని కృంగదీస్తుంది.అయినా జీవన సమరంలో రామిరెడ్డి  రాజీ పడుతూ తనదైన జీవితాన్ని భారంగా   గడుపుతున్న తరుణంలో ...  రామిరెడ్డి భూమిలో చెరువు తవ్వించే ప్రయత్నం చేస్తుంది బ్రహ్మనాయుడి రాజ్యం . ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు రామిరెడ్డి. ఇందుకు బ్రహ్మనాయుడు ఆగ్రహిస్తాడు. అదును చూసి తన మనుషుల చేత ఒకానొక రోజు నిద్రలో ఉన్న రామిరెడ్డిని తాళ్ళతో మంచానికి కట్టివేయించి  పొందుగుల అడవుల్లోకి తీసికెళ్ళి హత్య చేయిస్తాడు.ఇట్లా  యుక్తవయస్సు నాటికే తండ్రినీ, బాల్యంలోనే భర్తను  కోల్పోయిన నాగమ్మ గుండెను రాయి అవుతుంది. సుకుమారం ఆమె నుండి వీడిపోతుంది. కటువుతనంతో రాటు తేలుతుంది.
          ఒంటరిదైన నాగమ్మ  ప్రజల మద్య తిరుగుతూ ....వారి మధ్య తగాదాలు పరిష్కరిస్తూ ....అనతి కాలంలోనే  ప్రజల మనిషిగా గుర్తింపు పొందుతుంది. ఇట్లా ఉండగా  ఓ రోజు నల్లమల అడవుల్లో వేటకు వెళ్లిన బ్రహ్మనాయుడు అనుచరుడు  అనుగురాజు, ఆయన సేన, పరివారం తిరుగు పయనమై అలసిపోతారు. నాగమ్మ వారికి స్వయంగా జిట్టగామాలపాడులో సేద దీరేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తుంది. తాగునీరు, భోజన వసతి కల్పిస్తుంది.నాగమ్మ సేవలకు  రారాజు ఆనందించి, ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు.  ప్రజా బంధువుగా  ' ప్రజలకు  మేలు తలపెట్టాలనే ఉద్దేశ్యం’తో... తనకు      ఏడు ఘడియలపాటు మంత్రి పదవి ఇమ్మని’ అడుగుతుంది.అందుకు  సమ్మతించిన  అనుగురాజు నాగమ్మకు ఇష్టమైన సమయంలో మంత్రి పదవి స్వీకరించే అవకాశం కల్పిస్తూ ‘రాజపత్రం’ రాసి ఇచ్చి వెళ్తాడు.ఆ విధంగా నాగమ్మ రాజ్యపాలనలో  భాగస్వామ్యం అయ్యి తన వీరత్వాన్ని చాటుకుంటుంది. బ్రహ్మనాయుడి మీది ద్వేషంతో...ప్రతీకారంతో.. కయ్యానికి కాలుదువ్వుంది. యుద్దంలో బ్రహ్మనాయుడిని చిత్తగా ఓడిస్తుంది.ఓటమి పాలైన బ్రహ్మనాయుడు గుత్తి  దగ్గరున్న కొండ బిళంలోకి వెళ్ళిపోయాడని.....నేటికినీ అతడు సజీవంగా వున్నాడని....తపస్సు చేసుకుంటున్నాడని వదంతులు వున్నాయి. కాగా నాగమ్మ మాత్రం యుద్దం తర్వత తిరిగి తన స్వగ్రామైన కరీంనగర్ జిల్లా వచ్చింది.అక్కడే తన ప్రజాసేవ కొనసాగిస్తూ తనువు చాలించింది

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

No comments:

Post a Comment