Showing posts with label పాత తరం - కమ్యూనిస్ట్ యోధులు. Show all posts
Showing posts with label పాత తరం - కమ్యూనిస్ట్ యోధులు. Show all posts

Monday, April 15, 2024

ఎద్దుల ఈశ్వర్ రెడ్డి

ఎద్దుల ఈశ్వర రెడ్డి (1915 - 1986)
( ప్రజల మనిషి - సామాజిక ఉద్యమకారుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ప్రజాసేవకై తపించిన హృదయం
ప్రజోద్యమాల్లో ప్రజ్వరిల్లిన తేజం
మహోన్నత వ్యక్తిత్వ శిఖరం
ఈశ్వరయ్య
అతడే ఎద్దుల ఈశ్వర్ రెడ్డి ! 

 //వివరాల్లోకి వెళ్తే....//

కడప జిల్లా , జమ్మలమడుగు నియోజకవర్గం, పెద్దముడియం మండలం,పెద్దపసపుల గ్రామంలో, 1915లో ఈశ్వర్ రెడ్డి జన్మించారు. వీరి తండ్రి ఎద్దుల చిన్న వెంకట సుబ్బారెడ్డి, తల్లి మల్లమ్మ.
600 ఎకరాల భూమి, 12 కాండ్ల ఎద్దులున్న పేరెన్నికయిన భూస్వామ్య కుటుంబం వీరిది.

నందలూరులో SLC ( స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) వరకు చదివి, అనంతపురంలో బిఎ పూర్తి చేశాడు. కళాశాల రోజుల్లో స్వామి వివేకానందుడి ఆలోచనలతో ప్రభావితుడయ్యాడు. 1936 లో డిగ్రీ తర్వాత స్వగ్రామం చేరుకొని మిత్రులతో కలిసి
"మిత్రమండలి" ఏర్పాటు సంస్థ చేశాడు. ఈ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాడు 

// రాజకీయాల్లో //

▪️కాంగ్రెస్ పార్టీలో : 

భారత స్వాతంత్రం కోసం జరుగుతున్న పోరాటాలు, బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న పాత్ర, దేశంలో అల్లకల్లోల పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో తన వ్యక్తిగత పోరాటంతో కాకుండా రాజకీయ పోరాటంతో ముందుకు నడవాలని సంకల్పిస్తూ.... తన స్నేహితులైన పి ఆర్ సంజీవరెడ్డి నూకల కొండయ్యలతో కలిసి 1937 లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1938 లో DCC సభ్యులు అయ్యారు.

▪️స్తబ్దత : 

 కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పుడే 1939లో రమణ మహర్షి బోధనలకు ఆకర్షితమై, రాజకీయాలకు దూరంగా జరిగి స్తబ్దత
పాటించాడు. " చైతన్యవంతుల స్త బ్దత పోరాటాలకు విఘాతం " అని సూచిస్తూ ....స్తబ్దతను వీడి స్వాతంత్ర సమరంలో పోరాడాల్సిందేనని, స్వాతంత్ర సమరయోధుడు టేకూరు సుబ్బారావు చేసిన అభ్యర్థన మేరకు 1940 లో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 
1941 లో గాంధీజీ పిలుపు మేరకు మద్రాస్ లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని 4 నెలల జైలు శిక్ష అనుభవించారు.

 ▪️భారత కమ్యూనిస్ట్ పార్టీలో :

1945 నాటికి సామాజికంగా రాజకీయంగా మార్పులు చోటుచేసుకున్నాయి. అటు భారతదేశ స్వాతంత్రం కోసం, ఇటు తెలంగాణ ప్రాంతంలో విముక్తి కోసం పోరాటాలు ఉదృతమయ్యాయి. ఈశ్వర్ రెడ్డి వామపక్ష భావజాలం వైపు ఉత్తేజిత అయ్యాడు.
1945 లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు.

కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత కమ్యూనిస్టు పార్టీ తరపున నాలుగు సార్లు ఎన్నికయ్యారు. 
మొదటి లోక్ సభ - 1952-57 
మూడవ లోక్ సభ - 1962-67
నాల్గవ లోక్ సభ, 1967-71
ఐదవ లోక్ సభ 1971-77 

ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా 
1958-62 వరకు కొనసాగాడు.

 //ప్రజోద్యమాలు - నిర్భందాలు //

హరిజన, గిరిజన ప్రజలకోసం, కార్మికుల హక్కులకోసం, రైతుల కోసం జీవితకాల పోరాటాలు పోరాటాలు చేశాడు.

కడప జిల్లాలో ఆకాశవాణి కేంద్రం, మైలవరం రిజర్వాయర్‌, యర్రగుంట్లలో సిమెంట్‌ కర్మాగారం స్థాపనకై అవిశ్రాంత కృషిచేసి విజయం సాధించాడు.

1947 లో తన సొంత గ్రామం పెద్దపసపులలో ద్వితీయ రైతు మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించాడు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది.

1964లో మూడవ పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం భూ ఆదాయం పెంపుదలకు వ్యతిరేకంగా
" కిసాన్ సత్యాగ్రహం " చేపట్టాడు . ఇందుకు అరెస్ట్ కాబడి మూడు వారాల జైలు శిక్ష అనుభవించాడు.

 1970లో నాల్గవ పార్లమెంటు సభ్యుడుగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అటవీ బంజరు భూమి ఆక్రమణకు సంబంధించి అరెస్టు కాబడి జైలు శిక్ష అనుభవించాడు.

// రాజకీయ శిక్షణా తరగతులు- రహస్య జీవితం //

కడప జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలలో భాగంగా.... పంజం నరసింహారెడ్డి,పొన్నతోట వెంకటరెడ్డి, 
సంగమేశ్వరరెడ్డి, కె.వి. నాగిరెడ్డి, వరదారెడ్డి, గజ్జెల మల్లారెడ్డిలతో కలిసి ఈశ్వరరెడ్డి రాజకీయ శిక్షణా శిబిరాలను నిర్వహించాడు. ఈ క్రమంలో ఆనాటి జాతీయోద్యమ పరిస్థితుల్లో, తెలంగాణ సాయుధ పోరాట ఉద్ధృతిలో ఉధృతిలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధాలు కొనసాగాయి. ఈశ్వర్ రెడ్డి రహస్య జీవితాన్ని గడిపాడు.

 1949 సెప్టెంబర్ 27 లో అప్పటి మద్రాస్ ప్రభుత్వం
 ఆంధ్ర కమ్యూనిస్టులపై నిషేధం విధించింది. ఈశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తెలిసిన గ్రామస్తులు పోలీసులపై తిరగబడ్డారు. పరిస్థితి చేయిదాటింది. తిరగబడ్డ ప్రజలపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో లక్కిరెడ్డి కొండారెడ్డి అనే గ్రామస్తులు మరణించాడు. ఈ సంఘటన ఆధారంగా ప్రజా బంధువుగా ప్రజల గుండెల్లో ఈశ్వర్ రెడ్డి అర్థం చేసుకోవచ్చు.

//పార్టీలకు అతీతంగా అభిమానులు //

రాజకీయంగా తాను కొనసాగిన పార్టీ ఏదైనాప్పటికీ నిజాయితీతో కూడిన ఆదర్శ భావజాలం అతడి ప్రత్యేకత.పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిష్కలంకమైన సేవల్ని అందించాడు. తన సొంత ఆస్తిని పేద ప్రజలకోసం ధారపోసాడు.
కడప జిల్లాలో ఒకప్పుడు సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలుకు ఏ కష్టం వచ్చినా ఆదుకునే పెద్దదిక్కుగా , నాయకులకు ఏ సలహా కావలసి వచ్చినా సమర్థవంతంగా సూచించే రాజకీయ కోవిదుడుగా ఈశ్వర్ రెడ్డి ప్రస్థానం తిరుగులేనిది. కాబట్టే పార్టీలకతీతంగా కార్యకర్తల దగ్గర నుండి నాయకుల వరకు ఈశ్వర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రేమించారు ప్రేమిస్తూనే ఉన్నారు.

 //గండికోట ప్రాజెక్ట్ కి ఈశ్వర్ రెడ్డి పేరు //

కాంగ్రెస్ పార్టీ చెందిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు,
 ఈశ్వర్ రెడ్డి గారి మీద అభిమానంతోనూ, తమ కడప జిల్లా మొదటి పార్లమెంట్ సభ్యుడిగా సగౌరవంతోనూ,కమ్యూనిష్టు నేతల అభ్యర్థనను మన్నించి గండికోట ప్రాజెక్టుకు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేయడం రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డి ఒకప్పుడు కమ్యూనిష్టు సానుభూతి పరుడు. ఈ క్రమంలో ఎద్దుల ఈశ్వరరెడ్డి గారికి, రాజారెడ్డి గారికి సత్సంబంధాలు ఉండేవి .

// సాహిత్యాభిలాషి //

సాహిత్యం అంటే వీరికు మొదటి నుండి మక్కువ. ఈ అభిరుచిని తన చివరి దశ వరకు వదులుకోలేదు. పుస్తకాల్ని సేకరించడం చదవడం నిరంతర చైతన్య స్రవంతిగా కొనసాగించాడు . ఈ క్రమంలోనే ఇండో-సోవియట్ కల్చరల్ సొసైటీ కి జీవితకాల సభ్యుడుగా కొనసాగాడు.

సాహిత్య, కళారంగాలకు సంబంధించి ఈశ్వర్ రెడ్డి గారు కడప ప్రాంతానికి చెందిన _గజ్జెల మల్లారెడ్డి,
 రా.రా గా ప్రసిద్ధి చెందిన రాచమల్లు రామచంద్రారెడ్డి , వై.సి.వి. రెడ్డి గా సుప్రసిద్ధులైన యమ్మనూరు చిన వెంకటరెడ్డి ,ఆర్వీయార్‌ ప్రసిద్ధులైన రాళ్లబండి వేంకటేశ్వరరావు, కేతు విశ్వనాథ రెడ్డి, సొదుం సోదరులు [సొదుం జయరాం సొదుం రాంమ్మోహన్] " తదితరులను చాలా ప్రొత్సహించినట్టు కేతు విశ్వనాథరెడ్డి గారు స్వయంగా చెప్పుకున్నారు . సాహితీ మహా పండితుడు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఈశ్వరరెడ్డిని గారిని ‘అన్నా’ అని సంబోధించే వారంటారు. 

 //కుటుంబం //

సామాజిక కార్యకలాపాలు కొనసాగిస్తూ రైతులు రైతులు కూలీల కోసం, వారి హక్కుల కోసం క్రియాశీలకంగా చేసిన ఈశ్వర్ రెడ్డి అవివాహితుడు.
తన ఆస్తులన్నింటిని ఉద్యమాల కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం ధారపోసాడు . కమ్యూనిష్టు పార్టీ ఆఫీసు ‘హోచిమిన్‌భవన్‌’ లో తన చివరి రోజులను గడిపాడు.

//కాలధర్మం //

 తన 71వ ఏట 1986 ఆగస్టు 3న కడపలో పార్టీ కార్యాలయంలో మరణించాడు.

// విగ్రహం ఏర్పాటు//

2008 లో కడప జిల్లా జమ్మలమడుగు సబ్‌జైలు వద్ద ఎద్దుల ఈశ్వరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
 కొన్ని సామాజిక రాజకీయ పరిస్థితుల్లో 2021లో ఆ ఆ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించి పాత బస్టాండు వద్ద పునః ప్రతిష్ఠించారు.

వ్యాసకర్త : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
( ఆగస్టు 3, గారి వర్ధంతి సందర్భంగా వారి స్మృతిలో ఈ వ్యసం )

చల్లా కృష్ణ నారాయణరెడ్డి

చల్లా కృష్ణ నారాయణరెడ్డి
 (1925-2013)
( బడుగు బలహీన వర్గాల ప్రతినిధి - పీలేరు గాంధీ )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
సామాజిక సేవ
హితం కోరే సాహిత్యం 
అతడి ఆలోచన......
అభ్యుదయ దృక్పధం
అట్టడుగు వర్గాల ఉన్నతి
అతడి వివేచన....
చల్లా కృష్ణ నారాయణరెడ్డి ! 
పీకే నారాయణరెడ్డి గా సుపరిచితుడు .
పీలేరు గాంధీగా ప్రసిద్ధుడు
సి. కే. గా పిలవబడ్డాడు...

// వివరాల్లోకి వెళ్తే...//

చిత్తూరు జిల్లా పీలేరు దగ్గర చల్లావారిపల్లిలో నారాయణ రెడ్డి ఆగష్టు 1, 1925 న వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. వీరి తమ్ముడు చల్లా రఘునాథరెడ్డి. 

మదనపల్లెలో 1915లో డాక్టర్ అన్నీబిసెంట్ స్థాపించిన
బీసెంట్‌ థియొసాఫికల్‌ సంస్థలో బి.ఎ వరకు చదువుకున్నాడు. . విద్యార్థి దశ నుండే ఆదర్శభావాలు కలిగిన నారాయణరెడ్డి, తోటి నిరుపేద విద్యార్థుల సామాజిక ఆర్థిక అవస్థలకు చలించి పోయాడు. ఈ నేపథ్యంలో బిఎ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడే పేద విద్యార్థుల కోసం వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని ఒక వసతి గృహాన్ని స్థాపించాడు..

 వీరి వ్యక్తిత్వం, జీవితం, నిండుదనం నిరాడంబరతకి మారుపేరుగా కొనసాగింది .నారాయణరెడ్డి
నిత్యం ఖద్దరు ధరించేవాడు. తాను జీవితంలో ఎంత ఎదిగినా ఆడంబరాలకు పోకుండా ఎక్కడికైనా వెళ్లినప్పుడు బస్సులో వెళ్లేవాడు. దగ్గరికి ప్రాంతాలకు కాలినడకన వెళ్లేవాడు.

హాకీ క్రీడాకారుడుగా - 
క్విట్ ఇండియా ఉద్యమకారుడుగా -
గాంధీయవాదిగా -
బడుగు బలహీన వర్గాల పెన్నిధిగా -
ఆదర్శవంతమైన రాజకీయాలు నడిపిన అజాతశత్రువుగా నారాయణ రెడ్డి జీవితం ఎందరికో ఆదర్శం! 

 //రాజకీయం - ఉద్యమ జీవితం //

 విద్యార్థి దశలో ఉన్నప్పుడు గాంధీయవాదిగా ఉన్నాడు.
జాతీయ ఉద్యమ ప్రభావంతో స్వాతంత్ర సమరయోధుడిగా కొనసాగాడు. స్వాతంత్రం అనంతరం

1953లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరాడు.

1962- 1967 కమ్యూనిస్టు పార్టీ తరపున పీలేరు ఎమ్మెల్యేగా పనిచేశాడు.

1967 తర్వాత చారు మజుందార్ నేతృత్వంలోని సిపిఐ (ఎంఎల్)లో చేరాడు. సమకాలీన సమస్యలపై ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ 1970లో అరెస్టయ్యాడు.

ఎమర్జెన్సీ సమయంలో మళ్లీ అరెస్టు చేయబడి రెండేళ్లపాటు జైలులో ఉన్నాడు. 1977లో జైలు నుంచి విడుదలయ్యాక, సంఘసేవే దృక్పతంగా జీవితాన్ని ఆరంభించాడు.

 ▪️జీవకారుణ్యం ఉద్యమాలు :

వీధి కుక్కలను చంపకూడదని ఉద్యమం నిర్వహించారు. ఫ్లోరోసిస్‌ సమస్యపై ఉద్యమాలు 

//సంఘసేవ //

 సమస్య ఉన్నచోట కచ్చితంగా నారాయణరెడ్డి ఉంటాడు అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించిన సి కె నారాయణ రెడ్డి గారు తన జీవితకాలం మొత్తం ప్రజోద్యమాలలో గడిపాడు. సంఘసేవ కోసం తన అమూల్యమైన కాలాన్ని వెచ్చించాడు.

▪️ఆర్థులలు అన్నార్తుల కోసం :

 కరువు ప్రాంతాల్లో గంజి కేంద్రాలు నిర్వహించాడు. ఈ కేంద్రాల్లో నిర్వాసితులైన నిరాశ్రయులైన ప్రజలు ఆశ్రయం పొందారు. రాయలసీమ ప్రాంతంలోనూ , సమీప తెలంగాణ పాలమూరు ప్రాంతంలోనూ, ఒకప్పుడు గజ్జి కేంద్రాలు ఎక్కువగా కనబడేవి. 

▪️దళిత పిల్లల కోసం వసతి గృహాలు : 

 సమాజంలో వెనకబాటుతనాన్ని అనుభవిస్తూ , అవమానాలని అస్పృశ్యతని ఎదుర్కొంటున్న దళితుల పిల్లలు చదువుకొని, భవిష్యత్తులో తమ తరాలను ఉద్ధరించుకోవాలనే సంకల్పంతో దళిత విద్యార్థుల కోసం బాకారావు పేట, వాయలపాడు, యెర్రవారిపాలెం, నేలబైలు, పీలేరు, మదనపల్లె మొదలగు ప్రాంతాల్లో వసతి గృహాలను ఏర్పాటు చేశాడు...
 మునివెంకటప్ప, అబ్బన్న వంటి ఐఎఎస్‌ అధికారులు ఈ వసతి గృహాల నుండి వచ్చినవారే .

//ప్రచురణ సంస్థలు - గ్రంథాలయాలు //

స్వతహాగా సాహిత్యాభిలాషి అయిన సి కె నారాయణ రెడ్డి, 1977లో జనతా ప్రచురణలు, తర్వాత అనుపమ ప్రచురణలు ప్రారంభించి పరివర్తనాత్మక సాహిత్యాన్ని ప్రచురించాడు.
 ది స్కాల్పెల్, ది స్వోర్డ్ (రిచర్డ్ అలెన్, టెడ్ గోర్డాన్), ఫాన్‌షెన్ (విలియం హింటన్), మై ఇయర్స్ ఇన్ ఇండియన్ ప్రిజన్ (మేరీ టైలర్), రెడ్ స్టార్ ఓవర్ చైనా (ఎడ్గార్ స్నో) వంటి అంతర్జాతీయ పుస్తకాలు కూడా ఈ ప్రచరణ సంస్థలు ప్రచురించాయి 

 ▪️హైదరాబాద్ బుక్ ట్రస్ట్ స్థాపన :

1980 లో హైదరాబాదు కేంద్రంగా ":హైదరాబాద్ బుక్ ట్రస్ట్" స్థాపించాడు.ఇది పరిమిత ఖర్చులతో కూడుకున్న పుస్తక ప్రచురణ సంస్థ. ఎం. కె. ఖాన్, జి. మనోహర్, శాంతా సిన్హా, గీతా రామస్వామి వంటి సభ్యుల సహకారతో సంస్థ నడుస్తున్నది. ప్రతి సంవత్సరం విభిన్న అంశాలపై పరిమిత ప్రామాణిక పుస్తకాలు ఈ సంస్థ ప్రకటిస్తున్నది.

రాకాసికోర (మహాశ్వేతాదేవి అనువాదం సూరంపూడి సీతారామ్), గ్రహణాల కథ - మహీధర నళినీమోహన్), వేమన మనవాదం - (ఎన్. గోపి ), బతుకుపోరు (బి.ఎస్.రాములు) మొదలగునవి ఈ సంస్థ నుండి వెలువడినవే.నది పుట్టిన గొంతుక (బొజ్జా తారకం,కల్లోల లోయ (కె.బాలగోపాల్) మూగవాని పిల్లనగ్రోవి (కేశవరెడ్డి )
 మొదలగు పుస్తకాలు ఈ సంస్థ నుండి ప్రకటించబడినవే.

▪️గ్రంధాలయం :

ఉత్తేజకరమైన పాటలను రాసిన రచయిత, యువజన, కార్మికోద్యమనేత పులుపుల వెంకటశివయ్య గారి స్వస్థలమైన రొంపిచెర్లలో నారాయణరెడ్డి గ్రంథాలయాన్ని నెలకొల్పారు

//కుటుంబం //

నారాయణరెడ్డి భార్య జయప్రద, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గా పనిచేసారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు డాక్టర్ అరుణ, న్యాయవాది శైలజ. ఇతను ఉస్మానియా యూనివర్సిటీ లెజెండరీ స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డికి వీరు చిన్నాయన. 

 //కాల ధర్మం //

2003 నుండి నారాయణరెడ్డి సంగారెడ్డిలో నివసించాడు.
88 సంవత్సరాల వయస్సులో కింద పడిపోవడంతో సెప్టెంబర్ 5 2013 న నిమ్స్‌లో మరణించాడు. ఆయన ఆఖరి కోరిక మేరకు మృతదేహాన్ని గాంధీ వైద్య కళాశాలకు దానం చేశారు.

 వ్యాసకర్త : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి 
 ( ఆగస్టు 1 సి.కే.నారాయణరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ వ్యాసం)

గుజ్జుల యలమందారెడ్డి

గుజ్జుల యలమందారెడ్డి
(1921 - 1997 )
( అవిశ్రాంతపోరాట యోధుడు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ప్రజా ఉద్యమాల్లో రాటుతేలిన నాయకుడు ...
ఉద్యమాలే ఊపిరిగా ఆరితేరిన
కార్యదక్షుడు....
అతడు
గుజ్జుల యలమందారెడ్డి !!

// బాల్యం - చదువు//

ప్రకాశం జిల్లా, పెదచెర్లోపల్లి మండలం నేరెడుపల్లి గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో
గుజ్జుల చిన్నకోటిరెడ్డి.తల్లి గురువమ్మ. దంపతులకు 
1921 జూలై 22 న మొదటి సంతానంగా యలమందారెడ్డి జన్మించారు.వీరికి ఇద్దరు తమ్ముల్లు - వారు చినయలమందారెడ్డి, బాలకోటిరెడ్డి.

వీరి తండ్రి చిన్నకోటిరెడ్డి రాజకీయ సామాజిక చైతన్యం తమ పల్లె ప్రాంతాల్లో ఏమాత్రం లేని రోజుల్లోనే తమ బిడ్డలను చదివించి ప్రయోజకులని చేయాలని కలలుగన్నాడు. ఈ క్రమంలో పెద్ద కొడుకు యలమందారెడ్డిని నేరేడుపల్లి ఎయిడెడ్ స్కూల్లో చేర్పించాడు.

అక్కడ యలమందారెడ్డి 5 వ తరగతి వరకు చదివాడు. తర్వాత 1936-38 సంవత్సరాల్లో పెద్ద చెర్లోపల్లి మండలం రామ గోవిందపురం ఎయిడెడ్ స్కూల్లో ఎనిమిదవ తరగతి వరకు చదవడం జరిగింది. 1939 - 43 లో తన సొంత చిన్నాయన గుజ్జుల నాగిరెడ్డి గారి సహకారంతో ఒంగోలు ఏ.బి.యం. హైస్కూలో పదవతరగతి వరకు చదివి ఎస్ఎస్ఎల్సి( SSLC) సర్టిఫికెట్ పొందడం జరిగింది .

[ SSLC అంటే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ . ప్రస్తుతం SSLCని ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణాలో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ( SSC) అని కూడా పిలుస్తారు, మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌లో హై స్కూల్ సర్టిఫికేట్ (HSC) అని పిలుస్తారు.]

ఒంగోలులో చదివే సమయంలో చిన్నాయన ఇంట్లో ఉంటున్నాడు కానీ ఆర్థిక అవసరాల కోసం చిన్నాయనపై ఆధారపడలేక ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. ఒకవైపు ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంటి నుండి ఎలాంటి సహాయ సహకారం అందలేదు . ఈ పరిస్థితుల్లో యలమందారెడ్డికి పుస్తకాలు ఇతర విషయాల్లో సహకారం అదించిన వ్యక్తి చాగంరెడ్డి నరసింహరెడ్డి .

తర్వాత ఉన్నత విద్యను నెల్లూరు VR కాలేజీలో అభ్యసించారు.

// విద్యార్థి ఉద్యమాల్లో//

 ఒంగోలు ఏబీయం స్కూల్లో చదివేటప్పుడు అక్కడ బాలుర హాస్టల్ పరిస్థితి అధ్వానంగా ఉండేది.కనీస సౌకర్యాలు కూడా లేనందువల్ల విద్యార్థుల అవస్థలు అంతా ఇంతా కాదు. ఈ పరిస్థితుల్లో యాజమాన్యానికి విజ్ఞాపన పత్రం ఒకటి అందజేశారు. యాజమాన్యం పట్టించుకోలేదు దాంతో హాస్టల్ పిల్లలు సమ్మెకు దిగారు. నెల రోజులు సమ్మె జరిగిన యాజమాన్యం దిగి రాలేదు. అప్పుడు యలమందారెడ్డి వీరనరసింహారెడ్డి తో కలిసి ఒంగోలు హిందూ హైస్కూల్ విద్యార్థుల మద్దతును కూడగట్టడంలో సఫలమయ్యారు. ఆ విధంగా పాఠశాలలు ఏకం కావడంతో యాజమాన్యం దిగివచ్చి హాస్టల్లో సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఈ విధంగా మొదటి ప్రయత్నంలోనే యలమందారెడ్డి తనలోని నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు.

// రాజకీయ ప్రవేశం //

 1940 ప్రాంతం నాటికే కమ్యూనిస్టులు ప్రజా ఉద్యమాలు జరుగుతూ యువజనులని ఆకర్షిస్తున్నారు . ప్రజా చైతన్యాన్ని కల్పిస్తున్నారు. ఈ క్రమంలో సామ్యవాద భావజాలం వైపు మొగ్గు చూపిన ఎలమందారెడ్డి విద్యార్థి దశలో ఉన్నప్పుడే 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు.

1943 SSLC తర్వాత నెల్లూరు విఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే కమ్యూనిస్టు కార్యకలాపాలలో పాల్గొనడం జరిగింది. ఇంటర్మీడియట్ తర్వాత కనిగిరి వచ్చి అక్కడ మిత్రులు నరసింహారెడ్డి, గురు స్వామి రెడ్డి, ఓబుల్ రెడ్డి, మస్తాన్ బాలు తదితరులతో కలిసి " విద్యార్థి సంఘం " ఏర్పాటు చేయడం జరిగింది.
1944 లో విద్యార్థి సంఘం తరఫున యువజన మహాసభను కూడా నిర్వహించడం జరిగింది.

 // రాజకీయ తొలిదశలో ఉద్యమాలు//

1945 నాటికి కమ్యూనిస్టు అగ్రనాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్టు పార్టీ జరిపే కార్యకలాపాల్లో పాల్గొనడం యధావిధిగా జరిగిపోతున్నది. ఇదే క్రమంలో కనిగిరి ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీని విస్తరింప చేయాలని ప్రణాళిక రూపొందించుకుని కార్యకలాపాలకు శ్రీకారం చుట్టడం జరిగింది.

1946లో పార్టీ ఆధ్వర్యంలో రైతు ఈనాము పద్ధతి రద్దు కోసం ఉద్యమించడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామ గ్రామాన సభలు నిర్వహించడం జరిగింది. గ్రామాల్లో ఉన్న రైతులందరినీ సంఘటితం చేసి , రెండు వేలకు పైగా రైతులను ఒక దండుగా కదిలించి ఆనాటి రాజధాని మద్రాస్ వరకు ఉద్యమ సెగల్ని వినిపించారు. ప్రభుత్వంతో చర్చించి ఈనాము పద్దతి రద్దు అయ్యేవరకు పోరాటం చేశారు.

1947లో జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామాల్లో సభలు నిర్వహించి, ప్రజా కళారూపాలైన బుర్రకథలు చెప్పించి ప్రజల్ని చైతన్యవంతం చేయడం జరిగింది. ఈ క్రమంలో ముందడుగు పోతుగడ్డ వంటి గ్రామాల్లో బహిరంగ సభల్ని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమాన్ని కేవలం తమ కనిగిరి తాలూకా పరిధి వరకే పరిమితం చేయకుండా, సమీప కందుకూరు ఉదయగిరి తాలూకాలో కూడా ఉద్యమాన్ని విస్తరింప చేయడం జరిగింది.

 //తెలంగాణ సాయుధ పోరాటం - రహస్య జీవితం//

 1946 - 47 ప్రాంతంలో తెలంగాణలో సాయుధ పోరాటం ఉదృతంగా జరుగుతున్నది. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య వ్యవస్థ,రజాకర్ల అరాచకాలు, తెలంగాణ ప్రాంతాన్ని అట్టుడికి వస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా సాయిధ పోరాటానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. తెలంగాణ నాయకులు ఆంధ్ర ప్రాంతంలో ఆయుధ శిక్షణ కూడా తీసుకుని ఉన్నారు.. ఆంధ్ర ప్రాంత వామపక్ష నాయకులు తెలంగాణ సాయుధ పోరాటంలో తమ వంతు పాత్ర నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి విపరీత పరిస్థితుల్లో యలమందారెడ్డి
 1948 ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటానికి సంఘీభావంగా రహస్యంగా నల్లమల్ల అడవిలోకి ప్రవేశించాడు. నాయకులతో ఉన్న అదివరకే ఉన్న పరిచయాల ద్వారా, ముందస్తు సమాచారం ప్రకారం
యలమందారెడ్డిని సాయిధ పోరాట నాయకుడు అడవుల్లో రహస్య స్థావరాల్లోకి ఆహ్వానించారు.

 1948లో సైనిక చర్య తర్వాత నిజాం లొంగిపోయినప్పటికీ వాయిదా పోరాటం సంపూర్ణంగా విరమించబడలేదు. పోరాటానికి కొనసాగిస్తూ సాయుధ పోరాట నాయకులు తిరిగి అడవుల్లోకి వెళ్లిపోయారు అప్పుడు యలమందారెడ్డి కూడా సాయుధ పోరాట నాయకులతో కలిసి 1951 వరకు రహస్య జీవితాన్ని
 గడపడం జరిగింది 

// సంపూర్ణ రాజకీయ జీవితం //

▪️శాసనసభ్యులుగా 

 1952లో ఉమ్మడి మద్రాస్ రాష్టంలో కనిగిరి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. కనిగిరి మొదటి శాసన సభ్యుడిగా చరిత్రను అలరించాడు.1955లో తిరిగి అదే నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.

శాసనసభ్యుడుగా గ్రామసమస్యల్ని రైతులు, కార్మికులూ ఎదుర్కొంటున్న సమస్యల్ని అసెంబ్లీలో వరుసగా వినిపించేవాడు. శాసనసభకు యలమందారెడ్డి వస్తున్నాడు అంటే ప్రజా సమస్యలను పట్టుకుని రావడమే. . కాబట్టి అతడి గొంతుకను ప్రజా గొంతుకగా కవులు రచయితలు వ్యాసకర్తలు అభివర్ణించారు .

▪️లోక్ సభ సభ్యులుగా:

 1962లో మార్కాపురం లోక్ సభకు ఎన్నికయ్యాడు.

1966 లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజీనామా చేసిన సిపిఐ లోక్ సభ సభ్యులలో 
వీరమాచనేని విమలాదేవి (ఏలూరు), గుజ్జుల యలమందారెడ్డి( మార్కాపూర్), ఎద్దుల ఈశ్వర్ రెడ్డి(కడప), రావి నారాయణరెడ్డి (నల్గొండ) ఉన్నారు 

// సంపూర్ణ రాజకీయ నాయకుడిగా పోరాటాలు - ప్రజోద్యమాలు //

▪️ నాగార్జునసాగర్, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణాల కోసం పోరాటం చేసిన నాయకుల్లో మందపాటి నాగిరెడ్డి గారితో పాటు యలమందారెడ్డి ఒకరు..

▪️వెనుకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించేందుకు రిటైర్డ్‌ ఇంజనీర్లతో వెలుగొండ ప్రాజెక్టు ప్లాను తయారుచేసి ప్రభుత్వానికి అందించి శంకుస్థాపన చేయించేవరకు పోరాటం ఆపలేదు.

 ▪️భారతదేశంలోని అతిపెద్ద ట్రేడ్ యూనియన్‌కు ఛైర్మన్‌గా పనిచేసాడు.

▪️వ్యవసాయంలో రోజువారీ వేతన కార్మికుల సంక్షేమం కోసం అవిశ్రాంత పోరాటం చేసాడు.. వ్యవసాయంలో సంస్కరణల కోసం అలుపు లేకుండా కృషి చేసాడు.

 ▪️ దున్నేవాడికే భూమి దక్కాలనీ, రైతులకోసం జరిగిన పోరాటాల్లో కీలకపాత్ర వహించాడు.
సీ.పీ.ఐ జాతీయ సమితి సభ్యునిగా, కేంద్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు.

//పుల్లరి పన్నుకు వ్యతిరేక పోరాటం//

వీరి జీవితంలో ఈ పోరాటం ప్రత్యేకమైనది. 1953 లో వీరు పుల్లరి విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసాడు..
ప్రజలు తమ వద్ద పశువుల్ని కలిగి ఉండటం, వాటిని పచ్చికమైదానాల్లో మేపుకోవడానికి వెళ్లడం, వంటి జీవనవిధానం పై కూడా బ్రిటిష్ ప్రభుత్వం పన్ను విధించేది . ఈ విధానాన్ని " పుల్లరి "అని పిలిచేవారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం పై కన్నెగంటి హనుమంతు తిరుగుబాటు పోరాటం చేశాడు. హనుమంతు బాటలో 
 యలమందారెడ్డి ఈ విధానాన్ని నిరసించాడు.   
పుల్లరి పన్ను విధించే నిబంధనకు వ్యతిరేకంగా పోరాటం జరిపాడు.
విజయనగర రాజులు కూడా పుల్లరి పన్ను విధించేవారు, అలాగే కాటమరాజు జానపద కథలో యుద్ధాలుకు పుల్లరి పన్ను కారణం అయ్యింది.

 //వివాహం //

వీరి వివాహం భద్రాచలం దగ్గర తూర్పాక వాస్తవ్యులు డా.మందపాటి పేరిరెడ్డి,లక్ష్మీదేవమ్మల కుమార్తె సరళాదేవి గారితో 1953 లో జరిగింది. డా.పేరిరెడ్డి గారిది మొదట గుంటూరు జిల్లా దాచేపల్లి 
వద్ద. ఇరికేపల్లి గ్రామం. బ్రిటిష్ గవర్నమెంట్ లో హెల్త్ ఇన్స్పెక్టర్ గా పనిచేసారు. నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో అక్కడ నిర్మాణ బృందానికి ప్రత్యేక వైద్య పర్యవేక్షకులుగా పనిచేసారు. నాగార్జున సాగర్ నిర్మాణం పూర్తయ్యాక భద్రాచలం జిల్లాలో స్థిరపడ్డారు. ప్రజా నాయకుడు గురజాల మాజీ ఎమ్మెల్యే మందపాటి నాగిరెడ్డి వీరికి స్వయానా తమ్ముడు.

//కుటుంబం //

యలమందారెడ్డి సరళదేవి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు భారతి. కుమారుడు రవీంద్రారెడ్డి. కూతురు లేత ప్రాయంలోనే కాలధర్మం చెందడంతో రవీంద్రారెడ్డి ఏకైక కుమారుడుగా మిగిలిపోయాడు.
గుజ్జుల రవీంద్రరెడ్డి కార్డియాలజీ డాక్టర్. తండ్రి బాటలోనే పేదల పెన్నిధి. యువకుడుగా వామపక్ష ప్రజా పోరాటాల్లో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారు జర్మనీ దేశంలో . ‘పనిచేసే వాడే పాలకుడు’ నినాదంతో పాతకేళ్లుగా తిరుగులేని NRI కమ్యూనిస్టు నాయకుడుగా కొనసాగుతున్నాడు 
జర్మనీ బ్రాండెన్‌బర్గ్ రాష్ట్ర పార్లమెంటు సభ్యుడుగా ఆల్ట్‌లాండ్స్‌బర్గ్ మేయర్ గా కొంతకాలం పనిచేసారు. తల్లిదండ్రుల బాటలో నడుస్తూ జర్మనీ నుండి నిధులు రాబడుతూ భారతదేశంలో అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

 //యలమందారెడ్డి పై ప్రజల పాటలు //

 ప.అమరుడా గుజ్జుల యలమందారెడ్డన్న
 అందుకో మా అరుణారుణ వందనం...
 నింగికెగిసిన కెరటమా నేలకొరిగిన నేస్తమా
 ఎర్ర జెండాకు ఎదురులేని చాటి చెప్పిన సత్యమా

చ 1 : ఉద్యమాలకు ఊపిరైన నేరేడుపల్లిలో పుట్టినావు
యువతి యువకుల కూడగట్టి బుద్ధులెన్నో చెప్పినావు...
నిన్ను నమ్మిన ప్రజల కొరకు వెన్నుదన్నుగా నిలిచినావు
నీ జీవితాన్ని ఎర్ర జెండాకు పూలదండగా వేసినావు...

చ 2: బడుగు జీవుల బాధలెన్నో కన్నులారా చూసినావు
చీకటైనా పేద బతుకుల్లో వెలుగు బాట నీవు వేసినావు.....
 రైతు కూలీలు ఒకటి చేసి రణము చేయ కదిలినావు
 కష్టజీవుల కంటి పాప పై కన్ను నీవు మూసినావు....

రచన, గానం : గుండాల ప్రేమ్ కుమార్

 ఇటువంటి పాటలు యలమందారెడ్డి ఉద్యమ జీవితంపై వ్యక్తిత్వం పై ఎన్నో వెలువడ్డాయి 

//సామ్యవాద స్వప్నికుడి మహాప్రస్థానం//

 యల్లమందారెడ్డి ఏప్రిల్ 27,1997 లో తన 74 వ ఏట తుది శ్వాస విడిచారు .

//విగ్రహాలు - కాలనీలు ఏర్పాటు//

 కనిగిరి ప్రాంతానికి గుజ్జుల యెల్లమందారెడ్డి సరళాదేవి దంపతులు చేసిన సేవలకు గుర్తుగా పామూరు బస్ స్టాండులో వీరిద్దరి విగ్రహాలను ఏర్పాటుచేశారు.

శింగరాయకొండ మండలంలో పేదలకు స్థలాలు ఇచ్చి గుజ్జల యలమందారెడ్డి నగర్‌ గా నామకరణం చేశారు.
వ్యాసకర్త : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
( జులై 22 యలమంద రెడ్డి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ)


మందపాటి నాగిరెడ్డి

మందపాటి నాగిరెడ్డి ( 1918 - 2005)
( ఉద్యమనాయకుడు - ప్రజల మనిషి )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

అసాధ్యం అనేదే ఉండకూడదు...
వాయిదా పద్దతులు అస్సలు ఉండకూడదు...
పనిచేస్తే పదికాలాలు గుర్తుండి పోవాలి....
సహాయం అందిస్తే తరతరాలు బాగుపడాలి....
అని అలోచించి అడుగేసి అందరి మనసులో ముద్రించుకుపోయిన నాయకుడు మందపాటి నాగిరెడ్డి!

👉వివరాల్లోకి వెళ్తే.....

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం ఇరికేపల్లి
వాస్తవ్యులు మందపాటి వెంకటరెడ్డి,అక్కమ్మ దంపతులకు జూన్ 1, 1918లో జన్మించారు. వీరు మొత్తం 7 మంది సంతానం. ఐదు మంది అన్నాదమ్ముళ్లు, ఇద్దరు అక్కాచెల్లెల్లు.
పేరిరెడ్డి, కోటిరెడ్డి, ఈశ్వర్ రెడ్డి, నాగిరెడ్డి, అప్పిరెడ్డి, అన్నాదమ్ముళ్లు.

చిన్నప్పుడే తండ్రి వెంకటరెడ్డి చనిపోవడంతో సోదరుడు డా.పేరిరెడ్డి నీడలో తోబుట్టువులు అందరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు 

మొదటి నుండి ప్రజా పోరాటాలు , ఉద్యమాలు, వ్యవసాయం , వీటిపై ఆసక్తి ఉన్న నాగిరెడ్డి పెద్దగా చదువుకోలేక పోయాడు. యువకుడిగా ఆనాటి ఉద్యమాల్లో పాల్గొంటూ మెట్రిక్యులేషన్ వరకు మాత్రమే చదువుకున్నాడు.

👉భారత స్వతంత్ర పోరాటంలో

భారత జాతీయోద్యమ చరిత్రలో కాంగ్రెస్ వాదుల పోరాటమే ప్రముఖంగా కనిపిస్తుంది. ఆనాటి కమ్యూనిస్టు దేశభక్తుల పోరాటం గురించి సమాజానికి తెలిసింది తక్కువే. తెలంగాణ సాయుధ పోరాటం కేవలం కమ్యూనిస్టుల పోరాటం కాదు అన్నట్టుగా, భారత స్వతంత్ర పోరాటం కూడా ఒక్క కాంగ్రెస్ సొంతం కాదు. 
నాగిరెడ్డి విద్యార్థి దశలో జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని అక్కడి నుండి కమ్యూనిస్టు భావజాలం వైపు శాశ్వతంగా ఆకర్షించబడ్డాడు.సుశిక్షితుడైన సైనికుడిగా అంకితభావంతో పనిచేస్తూ.....తనతో పాటు గ్రామాల్లో అనేక మంది యువకులను పార్టీ కోసం సమీకరించగలిగాడు.

పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి ,చలసాని వాసుదేవరావు, కంభంపాటి సత్యనారాయణ, వంటి కమ్యూనిస్టు నాయకులు కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి బలమైన పునాదుల్ని వేస్తున్న సమయంలో , నాగిరెడ్డి గ్రామస్థాయిలో ప్రజలతో కలిసి పనిచేసాడు.

నాగిరెడ్డి అన్న డా. పేరిరెడ్డి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉద్యోగి. అయినప్పటికీ నాగిరెడ్డి బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. 
క్షేత్రస్థాయిలో పనిచేస్తూ తన పరిధిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించే నాటికి చుట్టుపక్కల గ్రామాల్లో
ప్రజలమనిషిగా పేరు సంపాదించుకున్నాడు నాగిరెడ్డి.

👉నాగార్జున సాగర్ నిర్మాణంలో

తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఆంధ్రలో గుంటూరు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన...
దేశంలోనే జలాశయాలలో రెండవ స్థానంలో ఉన్న.....
నాగార్జున సాగర్ నిర్మాణం వెనుక నాగిరెడ్డి
చేసిన చారిత్రాత్మక పోరాటాలు చరిత్రకు ఎక్కక పోవడం బాధాకరం. 1955 - 1967 మధ్య కాలంలో నిర్మిచబడిన నాగార్జున సాగర్ కోసం నాగిరెడ్డి అహర్నిశలు తపించాడు. గుంటూరు ప్రకాశం నల్లగొండ జిల్లాల్లో వేలాది ఎకరాల సాగుకోసం, ప్రజల దాహర్తి కోసం, ఆనాటి గురజాల శాసనసభ్యుడు స్థాయిలో నాగిరెడ్డి ఉద్యమ స్థాయిలో ప్రయత్నాలు చేసాడు. 
1903 లోనే నాగార్జున సాగర్ నిర్మాణానికి 
అటు బ్రిటిష్ పాలకులు, ఇటు నిజాం సర్కారు, ఆలోచన చేసింది. ఆ ఆలోచన సాకారం కోసం నాగిరెడ్డి
చేసిన పోరాటం ప్రజల హృదయాల్లో మాత్రం రికార్డు చేయబడింది. 

👉 మాచర్ల -గురజాల నియోజకవర్గాలు

1952 సాధారణ ఎన్నికలు తర్వాత, 1955 లో మాచర్ల మధ్యంతర ఎన్నికల్లో మందపాటి నాగిరెడ్డి
కమ్యూనిస్టు సిపిఐ పార్టీ నుండి గెలుపొందాడు.

1972 లో గురజాల శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు.

తన జీవితంలో మొత్తం 13 సంవత్సరాలు శాసనసభ్యుడుగా పనిచేసిన నాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకుడుగా, వివిధ ప్రజా సంఘాల గౌరవ సలహాదారుడుగా అంకిత భావంతో పనిచేశారు.

👉ప్రజల మనిషిగా

▪️నడికుడి గ్రామ సర్పంచుగా పనిచేశాడు. గ్రామాన్ని ఏకత్రాటి మీద ముందుకు నడిపించాడు. నాగిరెడ్డి సర్పంచుగా పనిచేసినంత కాలం గ్రామంలో రాజకీయాలు లేవు. అందరిదీ నాగిరెడ్డి బాటే.

▪️బ్రిటిష్ పాలకులు 1934లో పార్టీని నిషేధించారు.
కమ్యూనిస్టుల మీద నిర్బంధం కొనసాగుతున్నప్పుడు
నాగిరెడ్డి అరెస్ట్ అయ్యి కొన్నాళ్ళు జైలు జీవితం గడిపాడు.

▪️తాను శాసనసభ్యుడుగా కొనసాగుతున్నప్పుడు ప్రభుత్వం నుండి భూములు సేకరించి పిడుగురాళ్ళ నుండి గురజాల వరకు మొత్తం 5000 వేల ఎకరాలు పేదలకు పంపిణి చేసాడు.

▪️భూపోరాటం నేపథ్యంలో సీలింగ్ యాక్ట్ ప్రకారం జామిందారుల నుండి ఇష్టపూర్వకంగా భూములు సేకరించి, ఆ భూములు దుర్వినియోగం కాకుండా సన్నకారు రైతులకు పంచి ఇచ్చాడు.

▪️దాచేపల్లి వద్ద దుర్గాసిమెంట్స్ ఫ్యాక్టరీ
ఏర్పాటులో విశేష కృషి చేసాడు.ఎందరో పేదలకు నిరుద్యోగులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాడు.

▪️గురజాల షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కృషి చేసాడు.

▪️దుర్గా సిమెంట్స్, కేసీపీ సిమెంట్స్, కారంపూడి శ్రీచక్ర సిమెంట్స్, కార్మికుల హక్కుల కోసం పెద్దఎత్తున పోరాటాలు, ఆమరణ నిరాహార దీక్ష చేసి కార్మికుల హక్కులను సాధించాడు.

▪️నడికుడి - బీబీ నగర్ రైల్వే మార్గాన్ని సాధించడంలో నాగిరెడ్డి కీలక పాత్ర వహించాడు.

▪️నడికుడిని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్ధి, వేలాది మందికి ఉపాధి కల్పించడంలో నాగిరెడ్డి నికార్సయిన నాయకుడుగా విజయం సాధించాడు.

▪️నడికుడిలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయించడంలో కీలకంగా వ్యవరించాడు.

▪️నాగిరెడ్డి కృషి ఫలితంగా తెలంగాణ - ఆంధ్రప్రదేశ్
పొందుగల బ్రిడ్జి నిర్మాణం మధ్య జరిగింది.

▪️గుంటూరు జిల్లా సీపీఐ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో రైతుల, కార్మికుల హక్కుల కోసం పోరాటాలు నిర్వహించాడు.

▪️ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడుగా రైతు హక్కులను సాధించాడు.

▪️విద్య, వైద్యం, ఆరోగ్యం, రైతులకు గిట్టుబాటు ధరలు కలిగించడం, వంటి ప్రజాసేవల్లో నాగిరెడ్డి ఎక్కడా వెనకడుగు వేయలేదు.

👉మార్గదర్శకుడు

నాగిరెడ్డి పెద్దగా చదువుకోకపోయినా గొప్ప రాజకీయ చతురత కలిగి ఉన్నాడు. లోక వ్యవహారం తెలిసి వ్యూహత్మకంగా ఆలోచించేవాడు. అనర్గళంగా ఆంగ్లం మాట్లాడేవాడు. చాలా విషయాల్లో కమ్యూనిస్టు (సిపిఐ) పార్టీకి కీలక విషయాల్లో మార్గదర్శకం చేశాడు కూడా.

నాగిరెడ్డి కమ్యూనిస్టు పార్టీ అయినప్పటికీ ఇతర పార్టీ నాయకులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండేవాడు. కొత్తతరం నాయకులు నాగిరెడ్డి ఆశీర్వాదం కోసం వచ్చేవాళ్ళు. తమ భవిష్యత్తు కోసం మార్గదర్శకాలుగా సలహాలు సూచనలు తీసుకునేవాళ్ళు.

👉కుటుంబంలో ప్రముఖులు

వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నాగిరెడ్డి కుటుంబం ప్రజల కోసం సేవలు అందించింది.

▪️నాగిరెడ్డి సోదరుడు అప్పిరెడ్డి కార్మిక నాయకుడిగా పనిచేసి, కార్మికుల హక్కులను సాధించాడు.

▪️ప్రముఖ మహిళా ఉద్యమ నాయకురాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళా కమ్యూనిస్టు నాయకురాలు గుజ్జుల సరళాదేవి....వీరి సోదరుడి డా. పేరిరెడ్డి కుమార్తె.
▪️జమీందారి నిరంకుశ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడ్డ కనిగిరి ఎమ్మెల్యే గుజ్జుల ఎలమందా రెడ్డి వీరి సోదరుడి అల్లుడు.
▪️ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, వ్యూహాకర్త, సలహాదారుడు, నాగార్జునరెడ్డి CA.... వీరి తమ్ముడు డా. ఈశ్వర్ రెడ్డి కుమారుడు.

👉కుటుంబం

నాగిరెడ్డి భార్య నాగమ్మ. ఈ దంపతులకు నలుగురు ఆడపిల్లలు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కృష్ణారెడ్డి. చిన్న కుమారుడు హుస్సేన్ రెడ్డి. కృష్ణారెడ్డి తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ మరణించాడు. ప్రస్తుతం కృష్ణారెడ్డి కుమారుడు రమణారెడ్డి ఇరికెపల్లిలోనే నివసిస్తూ తండ్రి తాతల బాటలో పయనిస్తూ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు.నాగిరెడ్డి ఇద్దరు కుమార్తెలు కూడా ఇరికెపల్లిలోనే నివసిస్తున్నారు.
 
👉 స్మారకార్థం 

అధికారంలో ఉన్నప్పుడు... అధికారం కోల్పోయిన తర్వాత తన శక్తిమేరా ప్రజా సేవలో జీవితం కొనసాగిస్తూ..... అతి సాధారణ ఇంట్లో నివసించిన నాగిరెడ్డి, 11 / 3 / 2005 న శాశ్వతంగా ఈ ప్రపంచం నుండి నిష్క్రమించారు.

వారి మరణం తర్వాత ఇరికేపల్లి రహదారి మీద వారి స్మారక స్తూపం ఏర్పర్చారు. ఇరికేపల్లిలో వీరి పేరు మీద " మందపాటి నాగిరెడ్డి నగర్ " ఉన్నది
____________________________________________