Showing posts with label పల్లె పదాలు. Show all posts
Showing posts with label పల్లె పదాలు. Show all posts

Tuesday, August 13, 2019

పల్లె పదాలు -4

#పల్లెపదాలు 4
°°°°°°°°°°°°°°#తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
జానపదుల ఆటా పాటా  వైవిధ్యమైనవి.వీరి ప్రతి ఆట అర్థవంతమైనదే. ప్రతి పాట ఒక పరమార్ధంతో కూడినదే. ఈ క్రమంలో తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో  కాముడు పండుగ దినాల్లో మగపిల్లలు #ఎలుగుబంటి వేషం ధరించి ఇళ్లిళ్లూ తిరుగుతూ పడుకునే పదాలు  గమనిస్తే  పదాల ఒరవడిలో జానపదుల తెలివితేటలు అర్థం అవుతాయి. ఒక పదానికి మరొక పదాన్ని లంకె వేస్తూ సాగిపోయే ఈ పదాలు లయబద్దంగా  వినోదాత్మకంగా అర్థవంతంగా అగుపిస్తాయి. పిల్లలు ఈ వేషాన్ని #ఎలగొడ్డు వేషం అంటారు. ఈ విధానంలో చేతిలో #కర్ర  పట్టుకుని, ముఖానికి #మసి పూసుకుని, చుట్టూ #గొంగళి ఒకటి కప్పుకుంటారు. తర్వాత వేషధారి పాడుతుంటే... మిగతా పిల్లలు దరువేస్తూ గోలచేస్తూ హడావిడి చేస్తుంటారు.

#పదాలు

రింగు రింగు బిళ్ళ-- రూపాయదండ
దండగాదురన్నా -- ద్యావరమొగ్గ
మొగ్గగాదురన్నా -- మోదుగ నీడ
నీడ గాదురన్నా -- నిమ్మల బాయి
బాయి గాదురన్నా --- బచ్చన్నకోలా
కోల గాదురన్నా --- కోమటి పండు
పండు తీసుకుని పల్లెకు బోతే
పల్లె కుక్కలన్ని భౌ భౌ మనే
భౌ మన్న కాడ  మల్లెలు రాలే
మల్లెలు గోనబోయి మామకిస్తీ
మామానాకు పిల్లా నిచ్చే
పిల్లా పేరు మల్లెమొగ్గ
నాపేరు #జమిందార్

ఈ పదాల్లో దొర్లిన ద్యావర జానపదుల విశ్వాసాల్లో ఒకటి. మోదుగ అనేది విస్తర్లు కుట్టే చెట్టు. మోదుగకుల్లో దేవరలకు #ఎడ  పేరుతో నైవేద్యం పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం.  ఇక మామ బిడ్డను పెళ్లి చేసుకోవడం అనేది ఒకప్పుడు ఒక హక్కుగా కొనసాగింది. మేనమామ తన బిడ్డని ఇవ్వకపోతే మేనల్లుడు అలిగే సందర్భాలు ఒకప్పుడు కోకొల్లలు. మొత్తానికి పాడేవాడు తానొక #మోతుబరిగా భావిస్తున్నాడు. జమిందారీ వ్యవస్థలో జమిందారీ గిరి ఎంత ప్రతిష్టాత్మకమైనదో పాటలో అర్థం చేసుకోవచ్చు.

పల్లె పదాలు -3

#పల్లెపదాలు -3
°°°°°°°°°°°°°°సేకరణ :#తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

జానపదుల సాహిత్యం  గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.... #పాతాళగరిగె  వేసి వెదికినా మనకు అందకుండా ఇంకా మిగిలిపోయే వున్న పద సంపద.  ఎందుకంటే..  ఒకే కోవకు చెందిన సాహిత్యాన్ని వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా పాడుకుంటారు. కాబట్టి జానపద సాహిత్యంలో పరిశోధనలు ఎన్ని జరిగినప్పటికీ....వెలికి తీయాల్సింది ఇంకా చాలా ఉన్నది అనేది వాస్తవం. ఈ క్రమంలో  ఇద్దరు పిల్లలు చేరి పాడుకునే  #కొక్కొరోకోకో...  పాటను రెండు వేర్వేరు ప్రాంతాల్లో  ఏ విధంగా పాడుకుంటారో ఒకసారి గమనిద్దాం.

#పాలమూరు ప్రాంతంలో

కొక్కొరొకోకో .....
ఎవ్వరమ్మా -----సాదు బిడ్డలం
ఎందుకొచ్చిండ్రు? -----గుడ్డు పెట్ట
ఏం గుడ్డు? -----కోడి గుడ్డు
ఏం కోడి? ----- నల్ల కోడి
ఏం నల్ల? ----- మసి నల్ల
ఏం మసి? ---- పెంకు మసి
ఏం పెంకు ----- రొట్టె పెంకు
ఏం రొట్టె ----- శనగ రొట్టె
ఏం శనగ?  ----- చెర్ల శనగ
ఏం చెర్ల ---- వరి చెర్ల
ఏం వరి?  ----- సన్న వరి
ఏం సన్న ----- ఆకు సన్న
ఏమాకు? ----- మందాకు
ఏం మందు?  ----తేలు మందు
ఏం తేలు? ---- ఎర్ర తేలు?
ఏం ఎర్ర? ---- #నీమూతి #ఎర్ర

#ఖమ్మం పరిసర ప్రాంతాల్లో
( రచయిత్రి #సమ్మెటఉమాదేవి సౌజన్యం )

క్కోక్కోరోకోకో ------ కోడి కూసె
ఏం కోడి ---- బాతుకోడి
ఏం బాతు ----అడవి బాతు
ఏం అడవి ------ ఆకులడవి
ఏం ఆకు ---- తమల పాకు
ఏం తమల ----- గుండె తమల
ఏం గుండె ----- మనిషి గుండె
ఏం మనిషి ----- వంటమనిషి
ఏం వంట ------ పిండివంట
ఏం పిండి ----- శనగపిండి
ఏం శనగ ----- వేరుశనగ
ఏం వేరు ----- మండవేరు
ఏం మండ ---- #నీమొహం #మండ

పల్లె పదాలు -2

#పల్లెపదాలు 2
°°°°°°°°°సేకరణ :#తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

పల్లెల్లో ఆయా పండుగల  సందర్భాల్లో జానపదులు పాడుకునే పాటలు పల్లె జీవనానికి, జీవితంలో అంతర్భాగమైన కొన్ని పద్ధతులకు  అద్దం పడుతుంటాయి. దక్షిణ తెలంగాణ వనపర్తి పరిసర ప్రాంతాల్లో కాముని పండుగ దినాల్లో, సంప్రదాయాన్ని అనుసరిస్తూ పిల్లలు పాడుకునే పాటలు ఈ సందర్బంగా గమనిస్తే అవి ఎంతో అర్థాన్ని వినోదాన్ని  అందిస్తూనే... పల్లె #అనుబంధాల మధ్య #పటిష్టతను తెలియజేస్తుంటాయి.

🌿కాముడు పండుగ రోజులు కొందరు పిల్లలకు మంచి ఆటవిడుపు. ఈ క్రమంలో  ఒక #కొత్తకుండ తీసుకుని, దానికి చుట్టూ జాగ్రత్తగా #చిల్లులు కొడుతారు. చిల్లుల కుండ లోపల ఒక దీపం పెట్టి, ఎవరో ఒకరు #చుట్టకుదురు సహాయంతో ఎత్తుకుంటారు. తర్వాత గుంపులుగా ఇళ్లిళ్లూ తిరుగుతూ పాటలు పాడుతారు.

🌿#పాట

సిక్కు దీసీ  కొప్పుగట్టి....
సిరిగందం బొట్టుబెట్టి...
సిరిమంతుడే మా కాముడు...

సన్నంచు పంచగట్టి
సన్నజాజులు చేయి జుట్టి...
సందమామనే మా కాముడు....

గునుగాకు ఉడకబెట్టి...
గురువిందల జతగట్టి 
గుణవంతుడే మా కాముడు...

పంటసేను గొర్రు కొట్టి...
పంచవన్నెల సెల్ల జుట్టి...
పంచతీర్థుడే మా కాముడు...

పాటలో రాగం మొత్తం ఒకే బాణీలో కొనసాగుతుంది. #సిక్కుదీసి కొప్పు గట్టడంలో కాముడు అలంకారం ప్రియుడు అని, సన్నజాజులు చేయి జుట్టడంలో #శృంగారపురుషుడని, #గురువిందల జతకట్టడంలో సహజంగా లోపాలు కూడా ఉన్నాయని, పంటచేను గొర్రు కొట్టడంలో శ్రమజీవి అని, పంచాతీర్ధుడు అనడంలో తియ్యని గుణగణాలు ఉన్నాయని, అర్థం అవుతుంది.  ముఖ్యంగా గునుగాకు తింటే గుణవంతుడవుతాడు అనే నమ్మకం కూడా పాటలో కనిపించింది.

పల్లె పదాలు -1

పల్లె పదాలు... 1
°°°°°°°°°°✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

మన పల్లె పదాలే జనపదాలు...జానపదాలు...ఇవే మన మూలాలు..! ఈ క్రమంలో తెలంగాణ గ్రామీణ
సంస్కృతి సంప్రదాయాలు...యాస భాష...ఇవన్ని పామరం అనిపించినా అందులో గొప్ప తాత్వికత...తర్కం...నిబీడీకృతమైవుంటాయి.కొన్నిసార్లు వాళ్లపాట మనకు అర్థం కాదు.కాని అర్థవంతమైనదై ఉంటుంది.ఇలాంటి జానపదాన్ని దృష్టిలో పెట్టుకుని , తెలంగాణలో మతాలకు అతీతంగా గ్రామీణులు జరుపుకునే
సంప్రదాయ పండుగల్లో ఒకటైన #కందూరు అనుభవంతో  నేను రాసిన ఈ క్రింది పల్లె పాట ఎంతమందికి అర్థమౌతుంది???

#సాకి --
ఆ.. ఆ... మడికట్ల ఉన్నది మస్మాన్ల దర్గా...  మా  మల్లారెడ్డి తాత మాలీజా చేసి,  పాతాలెక్కించి పదిమందిని పిలుస్తాడు. ఏళ్ళొద్దాం రావే నా ఎంకటమ్మా...

#పదం

#అందరికోసం అస్సలోడొచ్చే
ఆరు వేల రూపాయల్ అప్పుగ దెచ్చే....
పొద్దుగాల బోయి పొట్టేల్ దెచ్చే
కందూరు పేరా కంకణం గట్టే.....

#సంతకు బోయి సౌదల్ దెచ్చే
బజార్ల బోయి బోగాన్లు దెచ్చే....
యాట గోయనీకే యాకూబొచ్చే
కూరగొట్టనీకే కటికన్నొచ్చే....

#సుట్టు ముట్టోల్లు సుట్టాలైరి
పిల్లలు జెల్లల్ పీక్కోనొచ్చిరి....
తాగుబోతోల్లకు తలకాయ కూర
నా లాంటోళ్ళకు నల్లకూర...

#తునుకల్ బొక్కల్ తీరుగ తిండ్రి
కుక్కలకేమో కాట్లాట బెట్టిరి....
ఆశగొంటోళ్ళకు ఆనక బాయే
మిగిలిన కూర మూటళ్ళ  బాయే....

#అందరు బోయినంక అస్సలోడొచ్చే
ఆకలితోన ఆవురావుమనే...
అడుగు బొడుగున మాడి శెక్కలు
సర్వల్ల మిగిలిన సోర్వ సుక్కలు....

#అంతెత్తు ఎగిరే ఆలి మీద
అలిగి గూసునే అరుగు మీద....
అప్పుగూసునే నెత్తి మీద
వడ్డి గూసునే గుండె మీద....2