Tuesday, August 13, 2019

పల్లె పదాలు -4

#పల్లెపదాలు 4
°°°°°°°°°°°°°°#తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
జానపదుల ఆటా పాటా  వైవిధ్యమైనవి.వీరి ప్రతి ఆట అర్థవంతమైనదే. ప్రతి పాట ఒక పరమార్ధంతో కూడినదే. ఈ క్రమంలో తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో  కాముడు పండుగ దినాల్లో మగపిల్లలు #ఎలుగుబంటి వేషం ధరించి ఇళ్లిళ్లూ తిరుగుతూ పడుకునే పదాలు  గమనిస్తే  పదాల ఒరవడిలో జానపదుల తెలివితేటలు అర్థం అవుతాయి. ఒక పదానికి మరొక పదాన్ని లంకె వేస్తూ సాగిపోయే ఈ పదాలు లయబద్దంగా  వినోదాత్మకంగా అర్థవంతంగా అగుపిస్తాయి. పిల్లలు ఈ వేషాన్ని #ఎలగొడ్డు వేషం అంటారు. ఈ విధానంలో చేతిలో #కర్ర  పట్టుకుని, ముఖానికి #మసి పూసుకుని, చుట్టూ #గొంగళి ఒకటి కప్పుకుంటారు. తర్వాత వేషధారి పాడుతుంటే... మిగతా పిల్లలు దరువేస్తూ గోలచేస్తూ హడావిడి చేస్తుంటారు.

#పదాలు

రింగు రింగు బిళ్ళ-- రూపాయదండ
దండగాదురన్నా -- ద్యావరమొగ్గ
మొగ్గగాదురన్నా -- మోదుగ నీడ
నీడ గాదురన్నా -- నిమ్మల బాయి
బాయి గాదురన్నా --- బచ్చన్నకోలా
కోల గాదురన్నా --- కోమటి పండు
పండు తీసుకుని పల్లెకు బోతే
పల్లె కుక్కలన్ని భౌ భౌ మనే
భౌ మన్న కాడ  మల్లెలు రాలే
మల్లెలు గోనబోయి మామకిస్తీ
మామానాకు పిల్లా నిచ్చే
పిల్లా పేరు మల్లెమొగ్గ
నాపేరు #జమిందార్

ఈ పదాల్లో దొర్లిన ద్యావర జానపదుల విశ్వాసాల్లో ఒకటి. మోదుగ అనేది విస్తర్లు కుట్టే చెట్టు. మోదుగకుల్లో దేవరలకు #ఎడ  పేరుతో నైవేద్యం పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం.  ఇక మామ బిడ్డను పెళ్లి చేసుకోవడం అనేది ఒకప్పుడు ఒక హక్కుగా కొనసాగింది. మేనమామ తన బిడ్డని ఇవ్వకపోతే మేనల్లుడు అలిగే సందర్భాలు ఒకప్పుడు కోకొల్లలు. మొత్తానికి పాడేవాడు తానొక #మోతుబరిగా భావిస్తున్నాడు. జమిందారీ వ్యవస్థలో జమిందారీ గిరి ఎంత ప్రతిష్టాత్మకమైనదో పాటలో అర్థం చేసుకోవచ్చు.

No comments:

Post a Comment