Tuesday, September 17, 2019

గంగసాని తిరుమల్ రెడ్డి ( సాయుధ పోరాటవీరుడు)

#సాయుధవీరుడు #గంగసాని #తిరుమలరెడ్డి
[ రేపు సెప్టెంబర్ 17  సందర్బంగా ప్రత్యేక వ్యాసం ]
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°#తంగెళ్ళశ్రీదేవిరెడ్డి  #సాయుధపోరాటం...
మట్టి మనుషులని మారణాయుధాలుగా మార్చిన మహా పోరాటం. ..
గుండె ధైర్యమే గాండీవమై గడీల అంతుచూసిన పోరాటం...
భూమికొరకు భుక్తికొరకు బందూకులెత్తి గర్జించిన భయానక పోరాటం...
నిజాం మెడలు వంచిన మహోజ్వల  పోరాటం...  అస్తిత్వం కోసం ఆత్మవిశ్వాసమే ఆయుధమై చెలరేగిన పోరాటం...
నెత్తుటి అత్తరులు ఏరులై పారినా...
చీకటి తీతువులు మరణమై కూసినా...
వెనుకడుగు వేయని వీరోచిత పోరాటం...
ఈ పోరాటంలో ఒరిగిన వీరులు ఎందరు? బతుకును ధైర్యంగా చావుకు రాసిచ్చిన ధీరులు ఎందరు? సవాళ్ల ముందు తలెత్తుకు నిలబడి తలలు తెగిపడ్డ యోధులు ఎందరు?
అగ్గిబరాట గంగసాని తిరుమల్ రెడ్డి ! అతడే ఒక సైన్యం ! అతడే ఒక యుద్ధ నినాదం !
అవును ! అతడొక ఉక్కు కవచం! బిగించిన పిడికిలి ! మారణ హోమాలపై తిరగబడి మరణాన్ని దోసిళ్ళ కెత్తుకున్న నికార్సయిన దొరబిడ్డ !!!

🇮🇳 #కన్నవూరు - #కన్నవారు
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
👉వరంగల్ జిల్లా గబ్బెట గ్రామం ! ఆ గ్రామానికి అండ దండ నేనే అన్నట్టుగా ఊరి నడిబొడ్డున ఓ పెద్ద గడి. గడీల చరిత్రలో ఏమున్నది పీడన తప్ప అంటూ అన్నీ గడీలను ఒక గాట కట్టేసి నోరుపారేసుకునే వారి నోర్లు మూయించిన ఆ గడిలో ఓ పెద్దాయన... ! పేరు మంగారెడ్డి !   అతడే ఆ ఊరి దొర ! ప్రజలు ఏక పక్షంగా దేవుడుగా భావించే  ఓ ప్రజాబంధువు ! దొరస్వామ్య వ్యవస్థ ఒక దోపిడీ వ్యవస్థగా చెప్పబడిన కాలంలో  ప్రజల కోసం బతికిన ఓ మానవతా ప్రతిరూపం !  మంగారెడ్డి భార్య అనసూయాదేవి. ఈ దంపతులకు మొత్తం నలుగురు సంతానం. మొదటివాడు మన తిరుమల్ రెడ్డి. 11 ఏప్రిల్ 1931 లో జన్మించాడు. ఆతర్వాత మోహన్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డి లు జన్మించారు.
👉మంగారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి. గబ్బెట గోపాల్ రెడ్డిగా రాజకీయాల్లో చిరపరిచితుడు. జనగామ శాసనసభ్యుడుగా కమ్యూనిస్టు పార్టీ తరుపున పనిచేసారు. వీరి భార్య ఆండాళమ్మ. సాయుధ పోరాట సమయంలో ఆయుధాల సేకరణలో ఆండాళమ్మ సమర్థవంతమైన పాత్ర పోషించింది.

🇮🇳 #ఉద్యమాల #ఉగ్గుపాలు
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
👉తిరుమల్ రెడ్డి బాల్యం నుండి కూడా విలక్షణమైన వ్యక్తిత్వం కలవాడు. దొరబిడ్డగా కాచ్చరాల్లో తిరుగుతున్నప్పటికీ, ఇంట్లో పనివాళ్ల పిల్లలతో కలిసిపోయి ఆడిపాడేవాడు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా తిరుమల్ రెడ్డి తీరును వారించలేదు. ఆ ఇంట్లో ఎవ్వరికి ఎక్కువ తక్కువ భావనలు లేవు. కాబట్టే తిరుమల్ రెడ్డి తనకు ఊహ తెలియని వయసు నుండే ప్రజల మనిషిగా అందరివాడుగా అందరి మధ్య పెరిగి పెద్దవాడు అయ్యాడు.
👉తిరుమల్ రెడ్డి విద్యాభ్యాసం విషయానికి ... జనగామలో ప్రిన్స్ టను విద్యాసంస్థల్లో ఆంగ్ల మాధ్యమంలో వీరి ప్రాథమిక విద్య కొనసాగింది. తర్వాత ఉత్తర్ ప్రదేశ్ అలీఘడ్ విశ్వవిద్యాలయంలో గ్రాజువేషన్ కోర్సులో ప్రవేశం పొందారు. ఇదే సమయంలో  సాయుధపోరాటానికి రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి, మఖ్దుమ్ మోహిద్ధిన్ ఆధ్వర్యంలో ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమయ్యారు. ఊర్లకు ఊర్లు ముందుకు కదిలాయి. ఈ పరిస్థితుల్లో ఉత్తర్ ప్రదేశ్ నుండి వెనక్కి వచ్చాడు తిరుమల్ రెడ్డి.
👉తిరుమల్ రెడ్డి ఎందుకు అర్ధాంతరంగా వెనక్కి వచ్చాడు? అక్కడ ఏం జరిగింది?  కళాశాలలో సమస్యా?  ఇవేమీ ఎవ్వరికి అర్థం కాలేదు. ... తనకొడుకు ఉద్యమ జెండా ఎత్తి  పోరుబాటకు సిద్దమై కదిలివచ్చాడని.... తండ్రి మంగారెడ్డి  మాత్రం పసిగట్టాడు.
👉అప్పటికి గ్రామాల్లో పరిస్థితులు అట్టుడుకుతున్నాయి. రజాకార్లు రెచ్చిపోతున్నారు. విచక్షణ మరిచి పైశాచికంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. హత్యలు, దోపిడీలు, మానభంగాలు, సజీవదహనాలు, ఒక్కటేమిటి... తమకు ఏ వికృతం తోస్తే ఆ క్రమంలో రెచ్చిపోతూ తెలంగాణ నేలను రక్తసిక్తం చేస్తున్నారు. రజాకార్ల దాష్టీకానికి సామాన్య ప్రజలు ఒక్కరే కాదు, గ్రామాల్లో కొందరు నిజాం వ్యతిరేక దొరలు భూస్వాములు కూడా బలి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో తన కొడుకు  తిరుమల్ రెడ్డి పోరుబాటకు సన్నద్ధం కావడం మంగారెడ్డిని భయపెట్టలేదు. కొడుకు నిర్ణయానికి గర్వంతో ఉప్పొంగిపోయాడు.
👉 తిరుమల్ రెడ్డి పుట్టిన సమయానికి కొంచం అటుఇటుగా దొరస్వామ్య వ్యవస్థ మీద మెల్లగా వ్యతిరేక పవనాలు వీచాయి. ఈ నేపథ్యంలో తిరుమల్ రెడ్డి బాల్యం నుండే తెలంగాణ పరిస్థితుల్ని ఆకళింపు చేసుకుంటూ బతికాడు . ఆనాటి సామాజిక వ్యవస్థలో వేళ్లూనుకు పోయిన వెట్టి, పేదరికం, అవిద్య, బానిసత్వం, ఇవన్నీ తిరుమల్ రెడ్డిని చిన్ననాటి నుండే కలిచి వేసాయి. ఇందుకు ఉదాహరణగా తిరుమల్ రెడ్డి బాల్యంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు చేసుకుంటే... 👇
మంగారెడ్డి గడి నిత్యం వచ్చిపోయే జనాలతో ఉద్యమకారులతో నిండి ఉండేది. వచ్చిన అందరినీ
పేరు పేరున పలకరించే తత్త్వం మంగారెడ్డిది. పలకరించడం ఒక్కటే కాదు, వచ్చిన అందరికీ భోజనం కూడా చూసుకుంటాడు. ఇటువంటి వాతావరణంలో తిరుమల్ రెడ్డి కూడా చిన్ననాటి నుండే తోటి పేదపిల్లలకు తన సహాయ సహకారాలు అందించేవాడు. ఒకానొక రోజు చిరిగిపోయిన చొక్కా ధరించి గడికి వచ్చిన ఓ పిల్లవాడికి, ఇంట్లో పెట్టెలో ఉన్న తన కొత్త చొక్కాను తీసుకువచ్చి ఇచ్చాడు. ఇక్కడ విషయం ఏమిటంటే ఆ చొక్కా ఇంకా ఒక్కసారి కూడా తొడుక్కోలేదు. అట్లాగే కుటుంబ సభ్యులతో  కలిసి ఓ రోజు కచ్చరంలో వెళ్తున్నప్పుడు దారి మధ్యలో కాళ్లకు చెప్పులు లేకుండా తల్లితో కలిసి నడుస్తున్న ఓ పిల్లవాడు కనిపించాడు. అప్పుడు కచ్చరం ఆపి ఆ తల్లికొడుకుల్ని ఎక్కించుకునే పరిస్థితి లేదు. ఇట్లాగని తల్లోకొడుకుల్ని చూస్తూ బాధ పడుతూ కూర్చోకుండా, తన జోళ్లను తీసి ఆ పిల్లవాడి ముందుకు తొడుక్కోమని విసిరేసాడు.  ఇట్లాంటి ఘటనలు తిరుమల్ రెడ్డి జీవితంలో చాలా ఉన్నాయి అని చెప్పవచ్చు. మొత్తానికి  ఈ చిన్నచిన్న  సంఘటనలు  తిరుమల్ రెడ్డి ఉదార మనస్తత్వానికి పెద్ద ఉదాహరణలే అని చెప్పవచ్చు.

🇮🇳 #ఉద్యమానికి #అంకితం
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
👉తిరుమల్ రెడ్డి అలీఘడ్ విశ్వ విద్యాలయం నుండి తిరిగి రావడానికంటే ముందు, అనుకోని ఒక సంఘటన జరిగింది. ఉద్యమకారుడు నల్లా నరసింహులు మంగారెడ్డితో '' నీ కుమారులు కూడా ఉద్యమంలోకి వస్తే బాగుంటుంది '' అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. అప్పుడు మంగారెడ్డి నరసింహులు ఆహ్వానాన్ని మనసారా ఆహ్వానించాడు. అంతేకాదు తన కుమారుడిని అలీఘడ్ విశ్వవిద్యాలయం నుండి రప్పించి ఉద్యమం తర్వాత మళ్ళీ పంపించాలని నిర్ణయం తీసుకున్నాడు.కానీ ఆ నిర్ణయాన్ని ఇంకా కుమారుడి వరకు తీసుకువెళ్ళనే లేదు  కాని ఆహ్వానం అందినట్టుగా తిరుమల్ రెడ్డి సాయుధపోరాటం ప్రకటన తెలిసి తన వంతు కర్తవ్యం కోసం వెనక్కి వచ్చాడు. తిరుమల్ రెడ్డి అచంచలమైన దేశభక్తికి, నిస్వార్థమైన ప్రజాసేవకు, ఇంతకంటే వేరే నిదర్శనాలు అవసరం లేవు.
👉 తిరుమల్ రెడ్డి ఉత్తర్ ప్రదేశ్ నుండి తిరిగివచ్చిన కొన్నాళ్ళకు కమ్యూనిస్టుల  సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మంగారెడ్డి
తన కుమారుడిని సాయుధపోరాటానికి అంకితం చేస్తూ వేదిక మీద నుండి ప్రకటన చేసాడు. సభ హర్షధ్వానాలు చేసింది. అందరి ఆశీస్సులు అందుకుంటూ తిరుమల్ రెడ్డి చేయి పిడికిలెత్తి పైకి లేచింది. అదే క్షణంలో  #పోరాటంలో #చావు #ఎదురైతే #నిర్భయంగా
#స్వీకరిస్తాను #తప్ప #శత్రువు #ముందు #మోకరిల్లను అంటూ  ఆత్మవిశ్వాసంతో అతడి గుండె నినదించింది. అప్పుడు అతడి వయసు 16-17 సంవత్సరాలు మాత్రమే.

🇮🇳#దళకమాండర్ గా...
°°°°°°°°°°°°°°°°°°°°°°°°
👉 తిరుమల్ రెడ్డి చురుకుదనం, పరిపక్వత,  చతురత, అంకితభావం,లోతైన ఆలోచనాశక్తి, లౌకికం, తార్కికం అవగాహన, అబ్బురపరిచే  వ్యవహారశైలి , ఇవన్నీ ఆంధ్రమహాసభ అగ్ర నాయకత్వాన్ని బాగా ఆకట్టుకున్నాయి. అందుకే  పోరాటంలో చేరిన కొద్దికాలానికే దేవరుప్పుల ప్రాంతానికి దళ కమాండర్ గా తిరుమల్ రెడ్డి నియమించబడ్డాడు.
👉తిరుమల్ రెడ్డి రచించే వ్యూహ ప్రతివ్యూహాలు, పన్నాగాలు, ఎత్తులు పై ఎత్తులు, రజాకార్లకు నిజాం పోలీసులకు మాత్రమే కాదు నిజాం సానుకూల కొందరు దొరలకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేయసాగాయి. తిరుమల్ రెడ్డి వ్యూహారచన ఎంత పకడ్భందిగా ఉంటుందో గమనిస్తే... అప్పట్లో రజాకార్లలో కొందరు హిందువులు కూడా అనివార్యంగా కొనసాగారు. వీళ్ళలో కొందరు దొరల సానుకులస్థులు కాగా, మరి కొందరు బలవంతంగా కొనసాగిన వాళ్ళు. ఈ క్రమంలో తిరుమల్ రెడ్డి తన నమ్మకస్థుల్ని రజాకార్లలోకి పథకం ప్రకారం పంపించాడు. ఒక రకంగా వీళ్ళు తిరుమల్ రెడ్డికి కోవర్టులు. ఈ కారణంగా రజాకార్ల కదలికల మీద తిరుమల్ రెడ్డికి ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం ఉండేది. అందుకే రజాకార్లు వస్తున్న దారుల్లో గోతులు తవ్వించి నిలువరించేవాడు.
ఈ క్రమంలోనే ఒకసారి నిజాం పోలీసులు ఒక రాత్రివేళ  దేవరుప్పుల ప్రాంతం మీదకు దాడులు నిర్వహించబోతున్నారనే సమాచారం తెలుసుకుని, ఆ పోలీసులను దారి మళ్లించడం కోసం  సమీపంగా ఉన్న అడవుల్లో దివిటీలు పెట్టించాడు. దివిటీలు చూసి అక్కడ సంగపోళ్లు సమావేశం అయ్యారనుకుని పోలీసులు అడవుల్లోకి బయలుదేరారు. ఇంకేముంది... దారెంబడి తవ్వి పెట్టిన గోతుల్లో పోలీసుల వాహనాలు పడిపోయాయి. అట్లాగే విస్నూరు దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి కుమారుడు బాబుదొరను కూడా తిరుమల్ రెడ్డి బోల్తా కొట్టించాడు. వివరాల్లోకి వెళ్తే... 👇
👉దేవరుప్పులలో ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో పాటుగా ఎర్ర జెండాలు ఎగిరాయి. ఎర్ర జెండాలు పీకి తగలబెట్టించే ఉద్దేశ్యంతో కడవెండి నుండి  బాబుదొర తన అనుచరులతో దేవరుప్పుల వచ్చాడు. ఆ గ్రామం  తమ అధీనంలో ఉన్నది కాబట్టి దొరవారి ఆజ్ఞగా ఇండ్ల మీద ఎగిరిన
ఎర్ర జెండాలు దింపాల్సిందిగా అధికారికంగా చాటింపు వేయించాడు. విషయం తెలిసిన తిరుమల్ రెడ్డి అప్రమత్తుడయ్యాడు. ఆ ఊరు మొత్తం సంగపోళ్ల పక్షాన ఉన్నాదనే నిజాన్ని ప్రత్యక్షంగా బాబుదొరకు అర్థం అయ్యేలా తెలియజెప్పాలనుకున్నాడు.ఇక ఆలస్యం చేయలేదు రాత్రికి రాత్రే  ఊరు మొత్తం దారుల వెంబడి ఎర్ర జెండాలు కట్టించాడు. బాబుదొర   అదే ఊర్లో మల్లు స్వరాజ్యం మేనమామ.... తమ సానుకులస్థుడు ఐన భేతి కృష్ణారెడ్డి ఇంట్లో ఆ రాత్రికి బస చేసాడు. . తెల్లవారే సరికి ఇండ్ల మీద  ఏ ఒక్క జెండా తొలగలేదు సరి కదా.... దారుల వెంబడి ఎర్ర జెండాలు చూసి ఒక్కసారిగా ఉడికిపోయాడు. ఇట్లా తిరుమల్ రెడ్డి తనదైన చతురతను తన పోరాట జీవితం పొడవునా ప్రదర్శించాడు.
👉తిరుమల్ రెడ్డికి వైద్యం తెలుసు. తన దళంలో ఎవ్వరికి ఏ అనారోగ్యం సోకినా గుర్తించి మందులు రాసిచ్చేవాడు. అత్యవసరం అనుకుంటే మారువేషం ధరించి, దళ సభ్యుల్ని ఆసుపత్రికి స్వయంగా తీసుకు వెళ్ళేవాడు. అంతే కాదు, మారు వేషం ధరించి గ్రామాల్లో సంచరించడం తిరుమల్ రెడ్డికి ఒక అలవాటు.
👉 దళ కమాండర్ గా ఉన్నప్పుడే తమకు సంబందించిన పొలాల్ని చాలా వరకు పేదలకు పంచి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో నిజాం ప్రభుత్వం తిరుమల్ రెడ్డిపై ఓ కన్నేసింది. అతడిపై, అతడి కుటుంబంపై కనిపిస్తే కాల్చివేత ఆజ్ఞలను జారీ చేసింది. అప్పటికి తిరుమల్ రెడ్డి పెద్ద తమ్ముళ్లు  మోహన్ రెడ్డి, సత్యపాల్ రెడ్డిలు కూడా ఉద్యమబాటలోనే ఉన్నారు. . ప్రభుత్వ నిషేదాజ్ఞలు నేపథ్యంలో అందరూ అజ్ఞాతంలోకి వెళ్లారు.
👉ధర్మానికి, న్యాయానికి, త్యాగాలకు, మారుపేరైన తిరుమల్ రెడ్డి కుటుంబం.... అజ్ఞాతంలోకి వెళ్లే ముందు తమ ఫోటోల  ఆధారంగా నిజాం సర్కారు తమను గుర్తించే అవకాశం ఉన్నది కాబట్టి... ఫోటోలను  సమూలంగా తగులబెట్టేసింది. తమ ఆనవాళ్లు లేకుండా అపురూప జ్ఞాపకాలను నిర్ధాక్షిన్యంగా దూరం చేసుకుంది. కాబట్టే ప్రస్తుతం తిరుమల్ రెడ్డి కుటుంబానికి సంబందించిన చిత్రాలు ఎక్కువగా లభ్యం కావడం లేదు. బంధువులు... మిత్రులతో.. కలిసి దిగిన చిత్రాలు, కళాశాలలో ప్రవేశం.. పరీక్షలు... కోసం దిగిన చిత్రాలు, అరుదుగా ఇప్పుడు లభ్యం అవుతున్నాయి. అట్లాగే తర్వాతి కాలంలో గబ్బెటలో శిథిలావస్థకు చేరిన గడిని అవకాశం ఉండి కూడా ఈ కుటుంబం పునరుద్దరించలేదు. పెత్తందారీ వ్యవస్థకు ప్రతి రూపమైన గడిని సైతం ఆనవాళ్లు లేకుండా కూల్చివేయించారు. సామాన్యుల్లో ఒకరిగా జీవిస్తూనే  ప్రజాసేవ చేసుకుంటూ  సాధారణ జీవితం గడపాలని ప్రతిక్షణం పరితపించారు.

🇮🇳 వివాహ ప్రయత్నం
°°°°°°°°°°°°°°°°°°°°°°°°
👉పోరుబాటలో ఉన్నప్పుడే తిరుమల్ రెడ్డికి సంబంధం  కుదిరింది. ఒకరిని ఒకరు మనసారా నచ్చుకున్నారు. కానీ వివాహం జరుగలేదు. పోరాట ఉధృతి, అంతలోనే అజ్ఞాతం, ఈ కారణాల చేత వివాహం తర్వాత జరిపించాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా తిరుమలరెడ్డి కుటుంబం అజ్ఞాతంలో ఉన్నప్పుడు #చండ్రరాజేశ్వర్ రావు #విజయవాడలో ఆశ్రయం ఇచ్చాడు. ఈ విషయం తెల్వని నిజాం సర్కార్... ఆ కుటుంబం కోసం విమోచనం   వరకు  కూడా గాలించింది. అంటే..... సర్కారు తిరుమలరెడ్డి  కుటుంబం లక్ష్యంగా ఎన్ని దాడులు నిర్వహించి ఉంటుందో  అర్థం చేసుకోవచ్చు.

🇮🇳నెత్తురోడిన వీరుడి దేహం
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
👉మర్చి 9, 1948...సముద్రాల ప్రాంతం !
గత నాలుగు రోజుల నుండి తిరుమల్ రెడ్డిని జ్వరం సతాయిస్తున్నది. అయినప్పటికీ  భరించుకున్నాడు. కానీ ఆరోజు పూర్తిగా లేవలేని పరిస్థితి దాపురించడంతో విశ్రాంతి కోసం మొక్కజొన్న చేనులో ఓ చెట్టునీడన నడుం వాల్చాడు. పక్కనే 303 రైఫిల్ ఉన్నది. మనిషి పూర్తిగా నిరసించి ఉన్నాడు. అయినప్పటికీ ఎప్పుడెప్పుడు లేచి పోరుబాటలో ఉరకాలా అని అతడి మనసు ఆతృత పడుతున్నది. మెదడు రేపటి పన్నాగాలను ఆలోచిస్తున్నది. . కానీ మృత్యువు మాత్రం అతడిని మింగేయాలని మాటేసి ఉన్నది. 
👉ఇంతలో చేనులో ఏదో అలికిడి అయ్యింది. అంత జ్వరంలోనూ ఆతడు ఒక్కసారిగా అప్రమత్తుడు అయ్యాడు. ఎవరా అన్నట్టుగా చేనులోకి గుచ్చి చూసాడు. అలికిడి శబ్దం దగ్గరవుతున్నది. వచ్చింది శత్రువులా... ఉద్యమకారులా... కూలీలా... పశువులా... మరేమైనా అడవి జంతువులా... ఇవేమీ అతడికి అర్థం కాలేదు. అయినప్పటికీ ఆత్మరక్షణగా తుపాకిని చేతిలోకి తీసుకుంటూ లేచి నిలబడ్డాడు. అటూ ఇటూ చూసాడు. అంతలోనే అతడికి తనను నలువైపులా నుండి చుట్టుముడుతున్న శత్రుసేన కనిపించింది. ముందు వరసలో అమ్మాయిలు ఉన్నారు. వెనుక పోలీసులు ఉన్నారు. అందరూ తుపాకులు ఎక్కుపెట్టి ఉన్నారు. ఇక తప్పించుకునే మార్గం లేదు.
అయినా తిరుమల్ రెడ్డి కళ్లల్లో భయం లేదు...
శరీరంలో వణుకు లేదు...
చెదరని ఆత్మవిశ్వాసం... తొణకని ఆత్మస్థయిర్యం... అతడి నిలువెత్తున కవచమై అలరిస్తుంటే ఠీవిగా అట్లాగే నిలబడిపోయాడు.
👉పోలీసులు తిరుమల్ రెడ్డిని చుట్టుముట్టారు. కాళ్ళుచేతులు వెనక్కి విరిచి తాళ్లతో కట్టేశారు. బండబూతులు తిడుతూ... తుపాకులతో శరీరం మీద ఇష్టం వచ్చినట్టుగా మోదుతూ... మొక్కజొన్న చేనులోంచి బయటకు ఈడ్చుకు వచ్చారు. ఆ తాకిడికి దెబ్బలకు వీరుడి శరీరం నెత్తురోడింది. అయినప్పటికీ అతడిలో మార్పులేదు. అదే ఆత్మస్థయిర్యం ఆణువణువూ తొణికిసలాడింది.
👉 సముద్రాల గ్రామం వెలుపలికి తిరుమల్ రెడ్డిని పట్టి ఈడ్చుకు రాగానే, అప్పటికే వార్త దావానలంలా ఊరంతా పాకింది. జనాలు తండోపదండలుగా అక్కడికి పరుగెత్తుకొస్తున్నారు. వాళ్లిప్పుడు పోలీసులకు భయపడటం లేదు. తమ వీరుడి కోసం కన్నీరు మున్నీరు అవుతూ రోదిస్తున్నారు. పోలీసులు ఎవ్వరిని దగ్గరకు రానివ్వడం లేదు. దగ్గరగా వస్తే కాల్చేస్తామని బండ బూతులతో భయపెట్టడం మొదలెట్టారు. అయినాగానీ జనాలు వెనక్కి తగ్గలేదు. తమ వీరుడిని వదిలి పెట్టమని, అతడికి బదులుగా తమ ప్రాణాలు తీసుకోమని, దూరం నుండే ఏడుస్తూ వేడుకోవడం మొదలెట్టారు. జనాల అభిమానానికి తిరుమల్ రెడ్డి ఒక్కసారిగా చలించిపోయాడు. అందరినీ చూస్తూ... '' ఆంధ్రమహాసభకు జై '' అంటూ బిగ్గరగా నినదించాడు.
పొలీసులకు కోపం వచ్చింది. తిరుమల్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం మొదలెట్టారు.  కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలని, ప్రజలచేత కూడా చేయించాలని, క్షణం క్షణానికి దెబ్బల ధాటిని పెంచసాగారు. అందుకు తిరుమల్ రెడ్డి '' ఆంధ్రమహాసభకు జై '' అంటూ పెద్ద పెట్టున అరవడం మొదలెట్టాడు.
👉అవల్దార్ ఆదేశం మేరకు పొలీసులు ఇక తిరుమల్ రెడ్డిని అక్కడి నుండి  ముందుకు లాక్కెళుతూ... కొడుతూ... సముద్రాల గ్రామం మొత్తం ఊరేగించారు. ఆ తర్వాత  గబ్బెట ఇప్పగూడెం, అక్కపల్లి గూడెం వంటి మొత్తం పది గ్రామాల్లో తిరుమల్ రెడ్డిని కొడుతూ ఊరేగించారు  చివరకు తమ క్యాంపు కార్యాలయం ఉన్న కాంచనపల్లి వద్దకు తీసుకెళ్లారు. అప్పటికి పది గ్రామాల జనాలతో పాటుగా, చుట్టుపక్కల అన్నీ గ్రామాల జనాలు పోగయ్యారు. ఊరేగింపు వెనకాలే పరుగెడుతూ గుండెలు బాదుకోవడం మొదలెట్టారు. వాతావరణం భయానకంగా మారిపోయింది. ప్రజల దుఃఖంతో పరిసరాల్లో ప్రతిధ్వనించడం మొదలెట్టింది.
👉 పోలీసులు కాంచనపల్లి వాగు వద్దకు తిరుమల్ రెడ్డిని తీసుకువెళ్లి, అక్కడ ఒక మోటురాయికి కట్టేశారు. గుండు గీశారు. తమ దెబ్బల తాకిడికి అప్పటికే అతడి దుస్తులు చిరిగి ఉన్నాయి. రక్త సిక్తమై ఉన్నాయి. తెల్లని పంచెకట్టు, చొక్కా, పూర్తిగా ఎరుపు రంగులోకి మారి ఉన్నాయి అంటే అతడి శరీరం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ స్థితిలో అతడి శరీరం  పూర్తిగా ఒరిగి ఉన్నది. చావు అంచుల్లో నిలబడి ఏ క్షణంలోనో మరణాన్ని స్వీకరించడానికి నిర్భయంగా సిద్దమై కనిపిస్తున్నది. కర్కశ పొలీసులు ఇక ఆగలేదు.
ప్రజల సాక్షిగా...
ప్రకృతి సాక్షిగా...
తిరుమల్ రెడ్డిపై కాల్పుల వర్షం కురిపించారు.
' ఆంధ్రమహాసభ వర్ధిల్లాలి... ' మరణానికి ముందు కూడా అతడి పెదవులు అస్పష్టంగా పలికాయి.
ఆ తర్వాత అంతా నిశ్శబ్దం...
వీరుడు మరణించాడు...
అతడి రక్తం నేల ఇంకింది...
వేల రోదనలు నింగికి ఎగిశాయి...
అతడి ఆశయం మాత్రం  ప్రజల గుండెల్లోకి బలంగా చొచ్చుకు పోయింది.

🇮🇳 #ద్రోహులు #ఎవ్వరు?
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
👉దొరోరి కిష్టడు అనే ఒక విద్రోహి సర్కారు నజరానాకు ఆశపడి, తిరుమల్ రెడ్డి ఆచూకీ తెలియ జెప్పిన సంగతి ఎట్టకేలకు బయట పడింది. కిష్టడు ఉద్యమంలో మనిషి. అతడి నమ్మకద్రోహాన్ని కమ్యూనిస్టు పార్టీ క్షమించలేక పోయింది. పరిస్థితి గమనించి కిష్టడు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. అంతేకాదు, ఆ తర్వాత స్వేచ్ఛా జీవితానికి... కుటుంబానికి... దూరమై అనేక ఇబ్బందులు పడ్డాడు.తన స్వార్థం కోసం నిండు నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసిన కిష్టడు చేసిన తప్పు నిజంగా అమానవీయం.

🇮🇳 వీరుడిని చరిత్ర లేదా?  విగ్రహం లేదా?
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
సాయుధపోరాటం వక్రీకరించబడింది. వీరులు కానీ వాళ్ళు విగ్రహాలు అయ్యారు. నిజమైన వీరులు మాత్రం మరుగున పడిపోయారు. ఒక్క తిరుమల్ రెడ్డి మాత్రమే కాదు, వందలాది వీరుల త్యాగానికి చరిత్రలో చోటు దక్కలేదు. ఇందుకు కమ్యూనిస్టుల స్వయంకృతాపరాధం... స్వార్థం.. ముమ్మాటికీ కారణం.రాపాక వంటి దొరలను కమ్యూనిస్టులు వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవడం మూలానా, నిజమైన వీరుల చరిత్రకు ప్రాధాన్యత లేకుండా పోయింది. అబద్దాల చరిత్రలను అందలం ఎక్కించడం జరిగింది. ఇది శోచనీయం. తిరుమల్ రెడ్డి వంటి త్యాగధనులనులను ప్రభుత్వం గుర్తించాలి. వారి చరిత్రను పాఠ్యాంశాలుగా ముద్రించాలి. వర్గ, వర్ణ, వివక్షలోంచి కాకుండా త్యాగాల చరితలోంచి నిజాల్ని ఒడిసి పట్టి చరిత్రలను తిరగరాయాలి.

No comments:

Post a Comment