Saturday, April 2, 2022

నిజాం రాజ్యం - వివరాలు

#నిజాం_రాజ్యం_వివరాలు 

( పరిశోధకులు -  ఔత్సాహికులు కోసం )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
సేకరణ : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

✔️నిజాం  ( అసఫ్ జాహీలు ) రాజ్యంలో   మరాఠ (మహారాష్ట్ర),  కర్ణాటక ప్రాంతాలు కూడా ఉండేవి. తెలుగు కన్నడ మరాఠీ ప్రాంతాల వారీగా  ఉర్దూ కలుపుకుని  నాలుగు  భాషలు  మాట్లాడే ప్రజలు  హైదరాబాద్ సంస్థానంలో ఉండేవారు.  
కన్నడ - మహారాష్ట్ర  - తెలంగాణ  ప్రాంతాలకు చెందిన మొత్తం 4 రెవెన్యూ డివిజన్లు, 16 జిల్లాలు  సంస్థానంలో ఉండేవి.
నిజాం కాలంలో డివిజన్లను సుభాలు అనేవాళ్ళు. జిల్లాలను బందీ లేదా సర్కారు అనేవాళ్ళు. తాలూకాలను పరాగణాలు అనేవాళ్ళు.  సుభాలను మొఘలాయిల పాలనలో ప్రారంభించారు. పరిపాలనా సౌలభ్యం కోసం  సుభాల సంస్కృతిని షేర్షా  మొదలెట్టగా  వాటినే అసఫ్‌ జాహీలు కొనసాగించారు.

✔️ మొత్తం  16 జిల్లాల్లో  8 జిల్లాలు  కర్ణాటక - మహారాష్ట్రలకు సంబంధించినవి. 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి. 
మహారాష్ట్రకు సంబందించి  ఔరంగాబాద్‌ డివిజన్లో - 1)ఔరంగాబాద్‌  (2) బీడ్‌  (3) నాందేడ్‌  (4)పర్భని జిల్లాలు ఉండేవి.
కర్ణాటకకు సంబందించి  గుల్బర్గా డివిజన్లో -
(1) బీదర్‌  (2) గుల్బర్గ  (3)  ఉస్మానాబాద్‌  (4) రాయ్‌చూరు జిల్లాలు ఉండేవి. 

✔️తెలంగాణ ప్రాంతంలో మెదక్‌ - వరంగల్ రెవిన్యూ 
డివిజన్లుగా ఉండేవి. 

*మెదక్ డివిజన్లో - 

(1) మహబూబ్‌నగర్‌  (2)  నల్లగొండ  (3)  నిజామాబాద్‌  (4) మెదక్ జిల్లాలు ఉండేవి.

*వరంగల్ డివిజన్లో - 

(1)ఆదిలాబాద్‌  (2)  కరీంనగర్‌  (3)  వరంగల్‌  (4) ఖమ్మంలోని కొన్నిప్రాంతాలు ఉండేవి.

✔️హైదరాబాద్‌, శివారు ప్రాంతాలను  గుల్షనాబాద్‌ లేదా అత్రాప్‌ బల్ధా  అని పిలిచేవాళ్ళు. . ఇది మొత్తం నిజాం ఆధ్వర్యంలోనే ఉండేది. ఈ శివారు ప్రాంతాల సరిహద్దులు గమనిస్తే.... 
తూర్పున ఏదులాబాద్‌ -దక్షిణాన షాబాద్‌ - పడమర మడమల్‌ - ఉత్తరాన మేడ్చల్‌ వరకు కొనసాగేవి. 

✔️ తాలూకాల వివరాలు గమనిస్తే..... 

మెదక్ సుభాలో 

@ మహబూబ్ నగర్ ప్రాంతానికి  పాలమూరు అనేది పూర్వ నామం. హబూబ్‌నగర్‌ జిల్లాలో మహబూబ్‌నగర్‌ -అమ్రాబాద్‌ -కల్వకుర్తి - మక్తల్‌ - పరిగి - నాగర్‌కర్నూల్‌  తాలూకాలు ఉండేవి

@ నల్లగొండ  పరిధిలో నల్లగొండ -  భువనగిరి -సురయ్యపేట-  హుజూర్‌నగర్‌ - మిర్యాలగూడ -  జనగాం - దేవరకొండ   తాలూకాలు విస్తరించి ఉండేవి.

@  నిజామాబాద్ కు  ఇందూరు అని పిలిచేవారు. ఇందూరు పరిధిలో నిజామాబాద్‌ - కామారెడ్డి - ఎల్లారెడ్డి
బోధన్‌ - ఆర్మూర్‌ -తాలూకాలు ఉండేవి.

 
✔️వరంగల్‌  సుభాలో - 

@ ఆదిలాబాద్‌ పరిధిలో లో భాగంగా ఆదిలాబాద్‌ -  ఆసిఫాబాద్‌ - చెన్నూర్‌ - నిర్మల్‌ - రజురా -లక్సెట్టిపేట - కన్నూట్‌ - సిర్పూర్‌ - ఉట్నూర్‌ -  బోథ్‌ తాలూకాలు ఉండేవి. 
 
 @ కరీంనగర్‌ ప్రాంతాన్ని అప్పట్లో ఎలగందుల అని పిలిచేవారు. ఎలిగందల పరిధిలో  కరీంనగర్‌ జగిత్యాల - హుజురాబాద్‌ - మహదేవ్‌పూర్‌ - పర్కాల్‌ - సిరిసిల్ల ఉస్మాన్‌సాగర్‌ -తాలూకాలు ఉండేవి.

@ వరంగల్‌ - ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలు - ములుగు
మహబూబాబాద్‌ -  మధిర -  పాకాల -  పాల్వంచ -   - ఇల్లెందు తాలూకాలు ఉండేవి. 

✔️ గుల్షనాబాద్‌ జిల్లా పరిధిలో -

మెదక్‌ -   భగత  - ఆందోల్‌ - సిద్దిపేట - 
కల్బ్‌సగూర్‌  తాలూకాలు విస్తరించి ఉండేవి.

 నిజాం సొంత జాగీర్‌లో మేడ్చల్‌ - అంబర్‌పేట్‌ -  శంషాబాద్‌ -  ఆసి్‌ఫనగర్‌ - పొట్లూరు  తాలూకాలుగా ఉండేవి. ఇక్కడ పొట్లూరు అనేది పఠాన్ చెరువు ప్రాంతం. 

#పునఃవ్యవస్థీకరణ 

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాలను పునఃవ్యవస్థికరించినట్టు 1919లో ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలాఖాన్‌  పరిపాలనాసౌలభ్యం కోసం కొన్ని ప్రాంతాల్లో మార్పులు చేర్పులు అనివార్యంగా కొనసాగించారు. 

#దొరలు_దేశ్ముఖ్_లు 

తాలూకా ప్రాంతాల్లో పల్లెల్ని అధీనంలో ఉంచుకుంటూ దొరలు దేశ్ముఖ్ లు ఉండేవాళ్ళు. దొరలకు కేటాయించే పల్లెల విషయాల్లో నిజాం జోక్యం ఉండేది.దొరతనం అనేది ఒక పదవి.  అర్హత ఉన్నవాళ్లకు మాత్రమే దొరతనం  
కేటాయించబడేది. పాలించే సామర్థ్యం, పన్నులు వసూలు చేసి రాజు ఖజానాకు తోడ్పడే  శక్తి, ఎవ్వరికైతే ఉంటుందో వాళ్ళకు దొరతనం కట్టబెట్టబడేది. ఒక్కసారి దొరతనం దక్కింది అంటే అది శాశ్వత పదవిగా ఉండేది.  

దొరల్లో కూడా రకాలు ఉండేవి. పెద్దదొరలు, చిన్న దొరలు, వుండేవాళ్ళు. నిజాం రాజ్యంలో పెద్ద దొరలు నలుగురు మాత్రమే. 
1) జన్నారెడ్డి ప్రతాపరెడ్డి 
ఇతడిది మొదటి స్థానం. నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా ఎర్రపాడు దొర. ఇతడికి 20 గ్రామాల్లో లక్షా యాభై వేల ఎకరాలు పొలం  ఉండేది.  

2)రెండవ స్థానం ఖమ్మం జిల్లా మధిర తాలూకా కల్లూరు దొర. ఇతడికి లక్ష ఎకరాలు పొలం ఉండేది. 

3) రాపాక  వెంకట రామచంద్రారెడ్డి 
వీరిది  మూడవ స్థానం . ఇతడు విసునూరు దేశ్ముఖ్.  ఇతడికి 60 గ్రామాల్లో 45 వేల ఎకురాలు పొలం ఉండేది. 
స్థానం మూడవది అయినా నిజాం వద్ద పెద్ద పలుకుబడి ఉండేది. 

4) నాల్గవ స్థానం సూర్యాపేట దొర. ఇతడికి 20 వేల ఎకరాలు పొలం ఉన్నది.

@ ఈ నలుగురు దొరలు కాకుండా గ్రామాల్లో చిన్నదొరలు  చాలా మంది ఉన్నారు. చిన్నదొరల్లో మళ్ళీ రెండు రకాలు. ఒకటి రెండు గ్రామాలను ఏలే దొరలు కొందరు. పది పన్నెండు గ్రామాలను ఏలే దొరలు కొందరు.  చిన్న దొరలు పెద్ద దొరలకు తొత్తులు. పెద్ద దొరలు నిజాం తొత్తులుగా పాలన సాగుతుండేది
మొత్తానికి  పెద్ద దొరలు ఇప్పటి మన మంత్రులు లెక్క. సామాన్యులకు వాళ్ళ పేరు తప్ప ముఖాలు తెల్వదు. చిన్న దొరలు కూడా సామాన్యం కాదు, ఇప్పటి మన శాసన సభ్యుల లెక్క.

@ ఆనాటి దొరలకు తమ ఇలాఖాలో ఉన్న భూములే పెద్ద ఆస్తులు. ఎక్కడబడితే అక్కడ భూ కబ్జాలు, స్విస్ బ్యాంకుల్లో అకౌంట్స్ , ఇష్టం వచ్చినట్టల్లా గెస్టుహౌసులు, బినామీ ఆస్తులు, వీళ్లకు దాదాపుగా లేవు అనే చెప్పవచ్చు. 

#సంస్థానాలు 

హైదరాబాద్ సంస్థానం అతిపెద్ద సంస్థానం. తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల  14 చిన్న, పెద్ద సంస్థానాలు ఉన్నాయి. 

✔️పెద్ద సంస్థానాలు -

1) అమరచింత - ఆత్మకూరు సంస్థానం 
పెద్ద సంస్థానాల్లో ఇది ఒకటి. 
ముక్కెర గోపాల్ రెడ్డి సంస్థాన వ్యవస్థాపకులు. 

(2) వనపర్తి సంస్థానం 
స్వతంత్ర అధికారాలు కలిగిన పెద్ద సంస్థానం. 
జనుంపల్లి వీరకృష్ణారెడ్డి సంస్థానం మూలపురుషుడు. 

(3) గద్వాల సంస్థానం. 
సొంత అధికారాలు కలిగిన అతిపెద్ద సంస్థానం. 
బుడ్డారెడ్డి సంస్థాన మూలపురుషుడు. ఇతడినే నల్ల సోమనాద్రి అని కూడా పిలుస్తారు. 

(4) పాపన్నపేట సంస్థానం. 
ఇది అతిపెద్ద ప్రాచీన పెద్ద సంస్థానం. ప్రఖ్యాతమైనది. 
రాణీ శంకరమ్మ - సదాశివరెడ్డిల కాలం నుండి సంస్థానచరిత్ర లభ్యం అవుతున్నది. 

(5) దోమకొండ సంస్థానం. 
పెద్ద సంస్థానం. కామినేని కాచారెడ్డి సంస్థాన మూల పురుషుడు. 

(6) పాల్వంచ 
పెద్ద సంస్థానం. అశ్వరావు సంస్థాన మూలపురుషుడు. 

(7) జటప్రోలు 
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పెద్ద సంస్థానం. 
చెవ్విరెడ్డి మూల పురుషుడు. 

(8)మునగాల సంస్థానం. 
ఈ సంస్థానం మూలపురుషుడు గురించి ఇతమిద్ధమైన సమాచారం లేదు. తెలంగాణ ప్రాంతం వారు ఈ సంస్థానాన్ని పాలించారు. 

#చిన్న_సంస్థానాలు 

( 9 )నారాయణపురం - రాజాపేట సంస్థానాలు. 
సొంత అధికారాలు లేని చిన్న సంస్థానం. 
మంచల్ రెడ్డి సంస్థానం మూలపురుషుడు. 

( 10 )బోరవెల్లి సంస్థానం 
మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన చిన్న సంస్థానం. 
తమ్మారెడ్డి సంస్థాన మూలపురుషుడు. 

 అట్లాగే గోపాల్ పేట -  సీర్నాపల్లి - దుబ్బాకుల- దొంతి సంస్థానాలు ఉన్నాయి. వీటిలో గద్వాల, వనపర్తి, 
పాపన్నపేట సంస్థానాలు స్వతంత్ర అధికారాలు కలిగివున్నాయి. 
ఆత్మకూరు  -  దోమకొండ వంటి సంస్థానాలు నిజాం సామంత రాజ్యాలుగా కొనసాగాయి. 

👉ఇది నిజాం రాజ్యం వివరాలు. సంస్థానాలు సంగతి. 
ఆపరేషన్‌ పోలో తర్వాత హైదరాబాద్‌ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. హైదరాబాద్ తో పాటుగా సంస్థానాలు కూడా విలీనం అయ్యాయి. 

 నవంబరు 24,  1949లో హైదరాబాద్‌ రాష్ట్రాన్ని నాలుగు డివిజన్లు 16 జిల్లాలతో కూడిన ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది. 

భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1956 నవంబరు ఒకటో తేదీన పెద్దఎత్తున మార్పులు జరిగాయి. గుల్బర్గ పరిధిలోని ప్రాంతాలను కర్ణాటకలోకి  -  ఔరంగాబాద్‌ పరిధిలోని జిల్లాలను మహారాష్ట్రలోకి  కలిపేశారు. ఆ తర్వాత ఇప్పటి తెలంగాణ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాలను ఆంధ్ర - రాయలసీమ  ప్రాంతాలతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ప్రకటించారు.

Sunday, March 20, 2022

మల్లు స్వరాజ్యం సాయుధ పోరాట వీరనారి

మల్లు స్వరాజ్యం ( 1931 - 2022)
( సాయుధ పోరాట వీరురాలు )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

గుండె ధైర్యం  తోడు నిలవగా
నిండు గౌరవం వెంటరాగా
యుద్ద రథమై నువ్వు కదలగా
తల్లీ స్వరాజ్యమా వందనం.....
పౌరుషాగ్ని పెల్లు భికగా
ఆత్మగౌరవం సెగలు గక్కగా
 పోరు యావ పొంగి పొరలగా
అమ్మా మహోజ్వలితమా వందనం..

దూసిన దళమై...నిరసన గళమై ...విముక్తి కోసం.. అస్తిత్వం కోసం...బరిసెల్  ఎత్తి..బాకుల్  ఎత్తి... బందూకుల్ ఎత్తి...
తెలంగాణ సాయుధ పోరాటంలోకి  దుంకిన యోధురాలు మల్లు స్వరాజ్యం !

▪️కుటుంబనేపథ్యం 

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించింది. కాగా నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా కరివిరాల  వీరి స్వస్థలం.
పోరాట స్పూర్తి కలిగిన  నల్లగొండకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా యోధుడు, పార్లమెంటేరియన్ భీమిరెడ్డి నరసింహారెడ్డి   ఈమె  సోదరుడు. 
భూస్వామ్య కుటుంబంలో పుట్టి  అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుబడిన ఈ తోబుట్టువుల పేదల పాలిటి పెన్నిధులు  ! 

తన అన్నతో  పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకొని అసమాన దైర్యసాహసాలు ప్రదర్శించిన స్వరాజ్యం, ఆనాడు ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. స్త్రీలు గడప దాటడమే పాపంగా వున్న రోజుల్లో వూరూర తిరిగి పాటలు పాడుతూ ఉపన్యాసాలు ఇస్తూ ప్రజల్లో చైతన్యం కోసం పాకులాడింది. 

▪️పాట_పాడితే_గుండెలు_ఆదరాల్సిందే 

      పోరాటకాలంలో  వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులను మేల్కొల్పింది. జానపద బాణీల్లో పాటలు  రాసి   స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకున్నది.
      భారతి భారతి ఉయ్యాలో
      మా తల్లి భారతి ఉయ్యాలో
      నైజాము రాజ్యాన ఉయ్యలో
      నాజి పాలనలో ఉయ్యాలో
      భూస్వాములందరూ ఉయ్యాలో
      భూమంతటిని చెరబట్టి ఉయ్యాలో ......
 వంటి పాటలు ఆమె వ్వక్తిత్వానికి..పోరోట పటిమకు..వీరత్వానికి...ప్రతిఘటనా తీవ్రతకు నిదర్శనం !

 ఆనాటి ఉద్యమకారుడు నీలరపు ఎర్రయ్య స్వరాజ్యం గురించి మాట్లాడుతూ..
'' వంగుతూ లేస్తూ బొడ్డెమ్మ ఆడటంలో మగవాళ్ళం కూడా స్వరాజ్యంతో పోటీ పడలేక అలసిపోయేవాళ్ళం. ఆమెకు మాత్రం అలసట ఉండేది కాదు. గంటల తరబడి బొడ్డెమ్మ ఆడుతూ పాటలు పాడేది.చిరుత లాగా చలాకీగా ఉండేది '' అంటూ ఆనాటి స్మృతుల్ని గుర్తుకుచేసుకునడంలో స్వరాజ్యం చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 

▪️పోరాటమే_ఊపిరిగా 

1945-48 సంవత్సరాల్లో  గెరిళ్ళా దళాలతో వీరోచిత  సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి... నైజాం     సర్కారును గడగడలాడించింది. 
తిరుగులేని శక్తియై ముచ్చెమటలు పట్టించింది. రజాకార్ల ఆగడాలు ఎదుర్కుంటూ...నిలువరిస్తూ...ఎదురిస్తూ... సింహనాదమై వణిిస్తూ ...ధీశాలిగా నిలిచింది. ఈ క్రమంలో  కొంత కాలం అజ్జాతంలో వుండిపోయింది. 
ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక  1947-48లో ఈమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. ఆమెను పట్టుకున్నవారికి బహుమతి ఇస్తామని కూడా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 

▪️వివాహం 

సాయుధ పోరాటం అనంతరం వీరి వివాహం ఉద్యమ సహచరుడు మల్లు వెంకట నరసింహారెడ్డి గారితో జరిగింది.

1954 మే నెలలో  హైదరాబాద్‌ ఓల్డ్‌ ఎమ్మెల్యే కార్వర్ట్స్‌లోని దేవులపల్లి వెంకటేశ్వరరావు నివాసంలో  వీరి నిరాడంబరంగా వివాహం జరిగింది. 

 బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావులు పెళ్ళి పెద్దలుగా ఉన్నారు. 
ఎటువంటి ఆర్భాటాలు లేకుండా కేవలం దండలు మార్చుకుని పెళ్లిచేసుకున్నారు

 మల్లు వెంకట నరసింహారెడ్డి గొప్ప  సాయుధ పోరాటయోధుడు .  ఆదర్శప్రాయుడు. విశాల దృక్పథం ఉన్నవాడు.  రాజకీయంగానూ  వీరికి మంచి తోడ్పటును...గొప్ప అండదండలను..అందించాడు. పుట్టింటి మెట్టింటి అండదండలతో ప్రజా బంధువుగా మన స్వరాజ్యం  అలుపెరుగక శ్రమించగలిగింది.

▪️రాజకీయ_ప్రస్థానం 

వీరి రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ...సాయుధ  పోరాటం అంతమైన ముగిసిన తర్వాత రాజకీయాలలో ప్రవేశించింది.
రెండు సార్లు శాసనసభకు ఎన్నికై  ప్రజాసేవను నిర్విగ్నంగా కొనసాగించింది.  నల్గొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1978, 1983లలో రెండు పర్యాయాలు సి.పి.ఐ.(ఎం)పార్టీ తరఫున ఎన్నికైంది. రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు.

 ▪️పత్రికారంగంలో 

 వామ పక్షభావాలతో స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన  పత్రిక 'చైతన్య మానవి' సంపాదకవర్గంలో  ఒకరుగా తనవైన  సేవల్ని అందించింది

▪️సంతానం 

వీరికి ఇద్దరు కుమారులు  గౌతమ్‌ - నాగార్జున . 
ఒక కుమార్తె కరుణ.
కూతురు కరుణ 2009లో  'ప్రజారాజ్యం ' పార్టీ తరఫున నల్గొండ లోకసభ స్థానంలో పోటీచేసి ఓడిపోయింది.

 ▪️జీవితచరిత్ర 

 ప్రస్తుతం 90  ఏళ్ల వయసున్న స్వరాజ్యం జీవితకథ   #నామాటే_తుపాకి_తూటా’  పుస్తక రూపంలోకి వచ్చింది.  
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ఈ ఆత్మకథను ప్రచురించారు. రచయిత్రులు  విమల, కాత్యాయని స్వరాజ్యం జీవిత వివరాలను  కథనం చేశారు. 
జీవితకథ ఆధారంగా స్వరాజ్యం అనుభవాలను కొన్నింటిని పరిశీలిస్తే.... 

👉మా నాన్న వంటి భూస్వాములకు ఇంకా పెద్ద జాగీర్దార్లతో పోటీ ఉండేది. ఫలానా దొరల ఆడపిల్లలు గురుకులంలో చదువుతున్నారు, మనం కూడా వాళ్ల సాంప్రదాయంలో నడవాలె, వాళ్లంత పెద్దగా ఎదగాలె అనేటువంటిది ఉండేది. రేప్పొద్దున ఏమయినా జరిగితే– పురుషులు సమయానికి లేకపోవడమో, చనిపోవడమో జరిగితే, స్త్రీలు గూడా జమీందారీ నిర్వహించేట్టుగా తయారు కావాలనేది ఉండేది... అట్లా ఇంటి దగ్గరనే పంతుల్ని పిలిపించి ఆడపిల్లలకు చదువులు చెప్పించిన్రు... చదువు, ఈత, గుర్రపుస్వారీ వంటివి నేర్చుకున్నా.’’

‘‘ఒక రోజున ఎల్లమ్మ అనేటామె వడ్లు దంచుతూ కళ్లు తిరిగి పడిపోయింది. నేనక్కడే కాపలాగా ఉన్నానప్పుడు. దబదబ నీళ్లు తీసుకపోయి తాపించినా. ఆకలైతున్నదని ఆమె చెప్పంగనే అన్నం తీస్కొచ్చి తిన్పించినా. దంచుతున్నవాళ్లు అందరూ మాక్కూడా ఆకలైతున్నది అన్నం పెట్టమని అడిగిన్రు. ఇంట్లో చూస్తే అంత అన్నం లేదు. బియ్యం తీసుకోని నానపెట్టుకుని తింటమన్నరు. మంచిది, తినమని చెప్పినా. 
ఆ తర్వాత ఈ సంగతి తెలిసి మా చిన్నాయనవాళ్లు తప్పు పట్టిన్రు. ‘‘అది చిన్నపిల్ల, ఏమనకండి’’ అని మా అమ్మ నాకు సపోర్టుగా నిలబడ్డది. 
అది నాకు చాలా స్ఫూర్తిని అందించింది. అప్పటికి మా అన్నయ్య (భీమిరెడ్డి నరసింహారెడ్డి) హైదరాబాదులో చదువుకుంటున్నడు. నాకప్పటికి ఆంధ్రమహాసభ ఉద్యమం గురించి ఏమీ తెల్వదు.’’

‘‘ఆ రోజుల్లో బాగా చదువుకున్న ఆడవాళ్లు కూడా స్టేజిల మీదికెక్కి మాట్లాడ్డానికి వెనకాడుతుండిరి. నేను ఉపన్యాసాలిస్తుంటే, బాగా చదువుకున్న దాన్నేమోనని అనుకునేవాళ్లు. బి.ఏ. చదివిన్నని అనుకున్నరట. నిజానికి నా చదువు నాలుగో, ఐదో తరగతులు, అంతే. నా వయసు కూడా పద్నాలుగు, పదిహేనేళ్లకు ఎక్కువ లేదు. ‘ఆంధ్రదేశపు ముద్దుబిడ్డ’ అని పేరు పెట్టిన్రు నాకు.

నేను ఉపన్యాసం ఇస్తుంటే పార్టీ నిధుల కోసమని నా మీదకు డబ్బులు ఎగజల్లేటోళ్లు. రూపాయి నోట్ల దండలేసేటోళ్లు.’’ 

‘ఒకసారి మా దళం రాత్రిపూట ఒక అడవిలో పడుకున్నం. వెన్నెల రాత్రుల్లో పోలీసుల దాడులు ఎక్కువగా జరిగేవి. అందుకే వెలుతురు పడకుండా చీకటిగా ఉండే చోటు చూసుకొని రక్షణ తీసుకునేవాళ్లం. ఈ రోజు రాత్రి మేము పడుకున్న ప్రదేశంలో గుడ్డెలుగు ఉన్నట్టున్నది. అది దాని జాగా అయ్యుండొచ్చు, ఒక రకమైన వాసనొస్తున్నది... 

అది నా దగ్గరకు వచ్చి గుంజుతుంటె మెలకువయ్యింది. ఇదేదో ఉన్నట్లే ఉన్నదనుకొని కప్పుకున్న దుప్పటి తీసి దాని మీద ఇట్ల పడేసిన. 
మీద గుడ్డ పడేసినా, కొర్రాయి చూపించినా ఆగిపోతదని కొయ్యోళ్లు చెప్తుంటే వింటుండేదాన్ని. మొకాన గుడ్డ పడంగనే తిక్కలేసినట్లయి ఇసురుకుంటనే పైకి లేచేటందుకు ప్రయత్నం చేస్తున్నది. దాని కాళ్లను మెసలరాకుంట పట్టుకొని వెనక్కి తోసిపారేసిన. బోర్ల పడ్డది... నేను వెంటనే తప్పించుకున్న. ఇంకొకసారి అడవిలో పోతుంటె పులి ఎదురొచ్చింది. నేనిక ఒక గడ్డ మీదెక్కి నిలబడ్డ. ఎటు కదిలితే ఏమయితదోనని అట్లనే నిలబడ్డ. ఆడనే నిలబడి చూస్తున్నదది. కొంత సేపటికి అది ముందుకు అడుగు వేయబోంగనే నేను తుపాకి తీసుకొని పక్కకు పేల్చిన... దానితో భయపడి వెనక్కుమళ్లి ఉరికింది.’’

▪️ స్ఫూర్తిదాయక_మహిళ 

మల్లు స్వరాజ్యం గారు తన  విశ్రాంత దశలో సైతం సభలు సమావేశాల్లో పాల్గొన్నారు. తొంబై ఏండ్ల వయసులోనూ ఆమెలో అదే ఆవేశం కనబర్చింది .

▪️కాలధర్మం

కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో  బాధపడుతున్న స్వరాజ్యం..... హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  19 మార్చి  2022  శనివారం  సాయంత్రం మృతి చెందారు.

సార్థక నామధ్యేయురాలు  స్వరాజ్యం స్మృతికి అరుణారుణ  వందనాలు

Tuesday, March 8, 2022

కుమ్ర లక్ష్మీబాయమ్మ (గిరిజనుల భూపోరాట ధీశాలి )

కుమ్ర లక్ష్మీబాయమ్మ 
(గిరిజనుల భూపోరాట ధీశాలి )
మహిళా దినోత్సవం సందర్బంగా 
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

నాగరిక సమాజానికి దూరంగా అడవులతో మమేకమై జీవించే మహిళ.....
తన కోసం కాదు, తన కుటుంబం కోసం కష్టాన్ని నష్టాన్ని భరించుకున్న మహిళ.....
నమ్ముకున్న మట్టి రేణువుల నుండే పోరాట పాటలు నేర్చుకున్న మహిళ.....
కుమ్ర లక్ష్మీబాయమ్మ !

▪️వివరాల్లోకి వెళితే...

తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, పిప్పల్‌ధారి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న  దహిగూడ గ్రామానికి చెందిన జంగు, రాంబాయి అనే దంపతులకు కుమ్ర లక్ష్మీబాయమ్మ  జన్మించింది.

బాల్యంలోనే  అదే గ్రామానికి చెందిన కుమ్ర భీంరావ్ తో లక్ష్మీబాయమ్మ  పెళ్లి జరిగింది. చిన్నతనంలోనే సంతానం కలిగింది. ఒక కొడుకు, ముగ్గురు ఆడపిల్లలు. ఉన్నంతలో జీవితం సంతోషంగా ముందుకు సాగుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లోనే అప్పుల బాధతో భీంరావు  ఆత్మహత్య చేసుకున్నాడు. నలుగురు చిన్నపిల్లలతో లక్ష్మీబాయమ్మకి  జీవితం భారం అయ్యింది. కష్టాన్ని ఓర్చుకుంటూ పిల్లలు కోసం వ్యవసాయం కొనసాగిస్తూ
బతకడం మొదలెట్టింది.

▪️భూ ఆక్రమణలు

తల్లిదండ్రుల కాలం నుండి పోడు వ్యవసాయం లక్ష్మీబాయమ్మ  కుటుంబానికి  జీవనధారం.

అడవిలో దొరికే  కాయలు పండ్లు జిగురు చెక్కలు మొదలగు అటవీ సంపదను సమీప సంతల్లో విక్రయించి పొట్ట పోసుకునే గిరిజనులు..... తమ శాశ్వత భుక్తి కోసం అడవులను కొంతమేర నరికి చదును చేసుకుని వ్యవసాయ పొలాలుగా మార్చుకుంటారు. ఇందులో శక్తికి మించిన శ్రమ ఉంటుంది. ఎకరం పొలం తయారు చేసుకోవడం కోసం యాడాది అసాంతం కష్టపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో   ఇక్కడి కొందరు  గిరిజనులు సమీప అడవుల్లో కొన్నేండ్లు కష్టపడి  చెట్లను  బండరాళ్లను తొలగించి వ్యవసాయం కోసం  నేలని సిద్ధం చేసుకున్నారు. అదే తమ ఆస్తిగా తమ అలా సాగులోకి తెచ్చిన ఆ భూమిని తమ వారసులకు అందించారు.ఈ వరుసలో కుమ్ర లక్ష్మీబాయమ్మ  పూర్వికులు కూడా ఉన్నారు.

అటువంటి భూముల మీద కొందరు గిరిజనేతరులైన పెద్దమనుషులైన  కన్ను పడింది.
వెంటనే రంగంలోకి దిగారు. రాజకీయ పరపతి ఉపయోగించి భూములను ఆక్రమించుకున్నారు.
ఈ క్రమంలో లక్ష్మీబాయమ్మతో పాటుగా తోటి గిరిజనులు తమ పూర్వీకుల నుండి తమకు సంక్రమించిన పొలాల్లోనే కూలీలుగా మారిపోయారు.

▪️భూ పోరాటం

తమ తాతలు సమకూర్చిన  పొలాల్లోనే తాము కూలీలుగా మారిపోవడం  లక్ష్మీబాయమ్మ   సహించలేకపోయింది. న్యాయం కోసం తోటి గిరిజనులతో చర్చించింది. పరపతి ఉన్న పెద్ద మనుషులను ఎదురించడానికి తోటి గిరిజనులు ధైర్యం చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో లక్ష్మీ బాయమ్మ ఒక్కరే  తమ  భూముల మీద తమకున్న హక్కుల ప్రకారం న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది.

ఇది చూసి తోటి గిరిజనులు లక్ష్మీ బాయమ్మను భయపెట్టారు. బతికి ఉంటే బలుసాకు తినొచ్చని నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. కానీ లక్ష్మీ బాయమ్మ వినిపించుకోలేదు. అధైర్య పడలేదు. కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ భూమి కోసం 16 ఏండ్లు పోరాటం చేసింది.  అప్పటికి గిరిజనులు తమ పొలాల గురించే మర్చిపోయారు. 

 లక్ష్మీబాయమ్మ న్యాయస్థానానికి  సమర్పించుకున్న పత్రాలు, ప్రభుత్వం అధీనంలో ఉన్న పత్రాలు, భూములు  లక్ష్మిబాయమ్మకు చెందాల్సినవే అని తెలియజేస్తున్నప్పటికి  కేసు నత్త నడక సాగింది. ప్రభుత్వాలు మారాయి. అధికారులు మారారు. అయినప్పటికీ లక్ష్మీబాయమ్మ  వెనకడుగు వేయలేదు.

" నేను సచ్చేంత వరకు వస్తే రానీ పోతే పోనీ " అనుకుంటూ పోరాటం కొనసాగించింది. చివరకు న్యాయస్థానం లక్ష్మీబాయమ్మకు 
అనుకూలంగా తీర్పునిచ్చింది.

▪️భూముల అప్పగింత

ఒక్క లక్ష్మీబాయమ్మ పోరాటం వందల మంది గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపింది. ఒక్క
లక్ష్మీబాయమ్మ పొలాలే కాదు, పెద్ద తలకాయలు ఆక్రమించుకున్న మొత్తం పొలాలను
సంబంధిత గిరిజనులకు అప్పగించాలని న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది.

2016 - 2017 ప్రాంతంలో రెవెన్యూ అధికారులు  భూములను  గిరిజనులకు అప్పగించారు.

▪️విశిష్ట మహిళా పురస్కారం

లక్ష్మీబాయమ్మ పోరాటశక్తిని ప్రభుత్వం గుర్తించింది.
తెలంగాణ ప్రభుత్వం నుండి - అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా 
" తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం -2017"
అందుకున్నారు.

▪️గుడుంబా నిర్మూలన కోసం 

గిరిజనుల ఆవాసాల్లో గుడుంబా నిర్మూలన కోసం స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నప్పుడు.....తమ గిరిజన జాతిని గుడుంబాకు దూరం చేయాలని వాళ్ళకు మద్దతు పలికింది. గూడెంలో యువతని ఒక సమూహంగా ఏర్పాటు చేసి, గుడుంబా స్థావరాల మీద దాడులు నిర్వహించింది.ఈ క్రమంలో గ్రామంలోనే ఒక వర్గం లక్ష్మీబాయమ్మకు శత్రువుగా అనివార్యంగా మారిపోయింది.

▪️గంటుబాయి

ఇక్కడి గిరిజనుల కులదైవం గంటుబాయి. పొలాలు తిరిగి పొందిన గిరిజనులు లక్ష్మీబాయమ్మ ఇప్పుడు గంటుబాయమ్మగా పిలుచుకుంటున్నారు.

ఇది  కష్టాలను ఎదురించి, సమస్యలను హక్కులను పోరాడి సాధించిన  లక్ష్మీబాయమ్మ  జీవిత గాథ - కథ

Monday, March 7, 2022

ఆత్మకూరు సంస్థానంలో భాగ్యలక్ష్మిదేవమ్మ

ఆత్మకూరు సంస్థాన మహిళ
రాణి భాగ్యలక్ష్మిదేవమ్మ
( మహిళా దినోత్సవం సందర్బంగా )
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
హైదరాబాద్‌ రాజ్యంలో నిజాం హయాంలో స్వయంపాలన అధికారాలు కలిగిన చిన్నా పెద్ద సంస్థానాలు 14 ఉండేవి. పన్ను వసూలు అధికారాలు పొందిన భూస్వాముల గడీలు 9 ఉండేవి.

అతిపెద్ద సంస్థానంలో ఒకటైన ఆత్మకూరు సంస్థానం ( అమరచింత ) చరిత్ర పాలనలోను సాహిత్య పోషణలోనూ చెప్పుకో దగింది. పాలించడంలోనే కాదు, సాహిత్యాన్ని పోషించడంలో ఆత్మకూరు సంస్థానం తన ఉదారతను చాటుకుంది. ఈ సంస్థానం పూర్వ పాలమూరు జిల్లా, ప్రస్తుతం వనపర్తి జిల్లాలో ఉన్నది. 

సంస్థానం చివరి పాలకురాలు మహారాణి భాగ్యలక్ష్మిదేవమ్మ. వీరి భర్త శ్రీరాంభూపాల్ గారి మరణం తర్వాత పాలనా బాధ్యతలు స్వీకరించిన భాగ్యలక్ష్మిదేవమ్మ జనరంజకంగా పాలన సాగించింది.

ప్రజలను ఆదరించడం.....సాహిత్యాన్ని గౌరవించడం.... రాణీ భాగ్యలక్ష్మమ్మ ప్రత్యేకత !

▪️సంస్థానం పరిచయం

దాదాపు 190 చ.కి.మీ.ల విస్తీర్ణములో వ్యాపించి ఉన్న ఈ సంస్థానం చరిత్ర ప్రాచీనమైనది.
సంస్థానం అధీనంలో 69 గ్రామాలు , రెండు పరాగణాలు ఉండేవి. పరాగణాలు అంటే తాలూకాలు.

సంస్థానం మూల పురుషుడు ముక్కెర గోపాలరెడ్డి రాయలసీమ చిత్తూరు జిల్లా చంద్రగిరి వాస్తవ్యులు. కాకతీయ సామంతరాజు గోన బుద్దారెడ్డికి వీరు స్నేహితులు. అవిధంగా క్రీ. శ.1292 ప్రాంతంలో బుద్దారెడ్డి ఆహ్వానం మేరా తెలంగాణ ప్రాంతానికి వచ్చి , పాలమూరు పరిధిలో మగతలనాడు ప్రాంతానికి గౌడ పదవిలో నియమించడం జరిగింది. మగతలనాడు అనేది నేటి మఖ్తల్ ప్రాంతం.ముఖస్థలి అనే మరో నామం కూడా ఈ ప్రాంతానికి ఉన్నది.అంటే యాగాలు చేసే చోటు అని అర్థం. మఖ్తల్ ప్రాంతం కన్నడ దేశానికి సమీపంగా వున్నది. ఆ ప్రభావం కారణంగానే అది మగతల గా పిలవబడిందని చరిత్రకారులు తెలియ జెప్తున్నారు. ఎందుకంటే మగ అనగా కన్నడంలో కొడుకు లేదా కుమారుడు అని అర్థం. తల అనేది చోటు లేదా స్థలం అని సూచిస్తుంది. ఈ విధంగా 1680 వరకు మండలాధి పతులుగా ముక్కెర వారసులు పాలన కొనసాగిస్తూ వచ్చారు.

1680 లో పెదసోమనాద్రి గద్వాల సంస్థానం ఏర్పాటు చేస్తాడు . అదే కాలాన ముక్కెర వారసుడు చెన్నారెడ్డి కూడ సంస్థానాన్ని ఏర్పాటు చేసాడు . లభిస్తున్న చారిత్రక వివరాలు ప్రకారం 1680 ప్రాంతంలో సంస్థానం ఏర్పాటు అయ్యింది .

అమరచింత / ఆత్మకూరు సంస్థానం వారు పరిపాలన సౌలభ్యం కోసం వివిధ కాలాల్లో ఐదు ప్రాంతాలను తమ రాజధానులుగా చేసుకుని పాలించడం మూలాన సంస్థానాన్ని రాజధాని పేరుతో ఉద్దేశించడానికి కొంత గందరగోళం ఏర్పడింది.
ఈ క్రమంలో సంస్థానాధీశుల అధికారిక పత్రాలు గమనిస్తే సంస్థాన్ అమరచింత - ఆత్మకూరు అని కనిపిస్తున్నది. సురవరం ప్రతాపరెడ్డి వంటి చరిత్రకారుల గ్రంధాలు గమనిస్తే ఆత్మకూరు సంస్థానం అని కనిపిస్తున్నది.రాజధానుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1 ] అమరచింత -
1680 -1797 వరకు మొత్తం దాదాపుగా 117 సంవత్సరాలు అమరచింత సంస్థానం రాజధానిగా కొనసాగింది.
2] పరిదిపురం -
1797 నుండి 1807 వరకు అంటే మొత్తం పది సంవత్సరాలు పరిధిపురం సంస్థానం రాజధానిగా కొనసాగింది. 
3]దుప్పల్లి -
1807 -1810 వరకు అంటే మొత్తం మూడు సంవత్సరాల కాలం సంస్థాన్ రాజధానిగా దుప్పల్లి కొనసాగింది. 
4]తిపుడంపల్లి -
1810 -1813 వరకు అంటే మొత్తం మూడు సంవత్సరాల కాలం సంస్థాన్ రాజధానిగా తిప్పుడంపల్లి 
5] ఆత్మకూరు -
1813 -1948 వరకు అంటే దాదాపుగా 135 సంవత్సరాలు సంస్థానం రాజధానిగా ఆత్మకూరు కొనసాగింది.
సంస్థానాన్ని క్రీ. శ. 1813-1834 వరకు పాలించిన రాజ పెద వెంకటరెడ్డి 1820 లో ఆత్మకూరుకు పునాదులు వేసాడు.1820లో ఊరిలో పాలన కోసం కోటతో పాటుగా.... ప్రజల కోసం పేటలు (వాడలు ) నిర్మించబడ్డాయి. ఆ తరవాత వరుసగా బాలకృష్ణారెడ్డి, సోమభూపాల్, సీతారామభూపాల్, శ్రీరాం భూపాల్, రాణి భాగ్యలక్ష్మి దేవమ్మలు ఆత్మకూరు రాజధానిగా పాలన కొనసాగించిన వాళ్లలో ఉన్నారు.

▪️భాగ్యలక్ష్మిదేవమ్మ జననం

భాగ్యలక్ష్మి దేవమ్మ దోమకొండ సంస్థానం ఆడపడుచు.ఖర నామ సంవత్సరం ఆశ్వయుజ శుక్ల షష్టినాడు వృషభలగ్నం నందు క్రీ శ. 1891 లో 
దోమకొండ సంస్థానాధీశులు మహాయశవంత్ , రంగమాంబ దంపతులకు జన్మించారు .
భాగ్యలక్ష్మమ్మ చురుకైనది. తెలివైనది. మంచి విద్యావంతురాలు.చిన్నతనం నుండే రాజనీతి ఎరుగతూపెరగడం మూలాన జనరంజక పాలన అందివ్వగలిగింది.

▪️శ్రీరాంభూపాల్ తో వివాహం

ముక్కెర వారసుల్లో ఒకరైన సీతారాంభూపాల్ ఏకైక కుమారుడు శ్రీరాంభూపాల్. రామలక్ష్మమ్మ , సీతారామ భూపాల బల్వంత బహదూరు దంపతులకు సర్వధారి సంవత్సర అధిక చైత్ర శుక్ల పంచమినాడు వృశ్చిక లగ్నమందు
శ్రీరామభూపాల్ క్రీ. శ.1888 లో .
జన్మించాడు .. శ్రీరాంభూపాల్ గారు ఆంధ్రం, ,ఆంగ్లం, పార్సీ భాషలను భ్యసించాడు .

 అప్పటి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ శ్రీరాంభూపాల్ ఫర్మణా అనుసరించి విశ్వావసు సంవత్సరంలో 1905 లో తన 17 వ ఏటా శ్రీరాం భూపాల్ పట్టాభిషేక్తుడు అయ్యాడు.

భాగ్యలక్ష్మ్మ గారితో వీరి వివాహం 1900 - 1910 మధ్య కాలంలో జరిగినట్టుగా పెద్దలు పేర్కొంటారు.

▪️ఆధ్యాత్మిక చింతన - భర్త వియోగం 

శ్రీరాం భూపాల్ గారు స్వయంగా న్యాయధికారం వహించి ప్రజాభ్యుదయానికి పాటుబడ్డారు. వివిధ ఆలయాలకు దాన ధర్మాలు వొసగుతూ భార్య భాగ్యలక్ష్మమ్మతో కలిసి మిక్కిలి తీర్థ యాత్రలు చేసేవాడు. ఈ క్రమంలో అనంతశయనము , సేతు మొదలైన దక్షిణ దేశ యాత్రలను చేసి అక్కడి భక్తులకు వసతి సదుపాయాలు కల్పించారు.

ఇటువంటి పరిస్థితిల్లోనే ప్రమోదూత సంవత్సర వైశాఖ బహుళ అమావాస్యనాడు మరణించాడు
42 వ ఏటా 1930లో
శ్రీరాంభూపాల్ గారు తనువు చాలించాడు.

▪️సంస్థాన పాలనాదక్షురాలిగా భాగ్యలక్ష్మమ్మ  

భర్త శ్రీరాం భూపాల్ మరణం తర్వాత 1934 లో
భావ సంవత్సర జ్యేష్ఠ శుక్ల పూర్ణిమ నాడు ప్రభుత్వ అనుమతి అనుసరిస్తూ భాగ్యలక్ష్మమ్మ పాలనలోకి వచ్చింది. రాజ వ్యవహారాలు చక్కదిద్దడంలో నేర్పరిగా పనిచేసింది. సమర్థులైన అధికారులను నియమించుకుని, సంస్థానంలో విద్య వైద్య సదుపాయాలను మెరుగుపరిచింది.

హైదరాబాద్ రాష్ట్రంలో క్రమంగా నిజాం వ్యతిరేకత ఉద్యమం అట్టుడికింది. ఆత్మకూరు ప్రాంతంలో కూడా నిజాం వ్యతిరేకత నివురు గప్పిన నిప్పులా మొదలయ్యింది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం , ఆ తర్వాత ఆత్మకూరులో స్థానికుల జెండా సత్యాగ్రహాలు, నిజాం వ్యతిరేక ధీక్షలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో భాగ్యలక్ష్మమ్మ అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది.ఈ పరిస్థితిలోనే 1948లో సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమై స్వయం పాలనకు స్వస్తి పలికింది.రాజరికం అంతం అయ్యింది.

▪️గోలుకొండ కవుల సంచికకు తోడ్పాటు 

తెలంగాణలో కవులే లేరనే ఒక నిందావ్యాఖ్యను ఆత్మ గౌరవంగా తీసుకుని 1934లో "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని వెలువరిచాడు వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఇందులో 354 మంది కవుల పద్య గద్య కవితలు ఉన్నాయి.తెలంగాణ సాహిత్య చరిత్రలో ఇది ఒక సంచలనం.తెలంగాణ సాహిత్య వికాసం క్రమంలో వెలువడిన తొలి సంకలనం ఈ గోలకొండ కవుల సంచిక ప్రచురణలో రాణి భాగ్యలక్ష్మిదేవమ్మ ఆర్థిక సహకారం చెప్పుకోదగింది. ముద్రణ వ్యయం మొత్తం రాణిగారు అందించారు. ఇందుకు సగౌరవంగా ప్రతాప రెడ్డి గారు తన కవుల సంచికను భాగ్యలక్ష్మమ్మ గారికి అంకితం ఇచ్చారు.

తెలంగాణకవుల పరిచయ ప్రప్రథమగ్రంథాన్ని ఆదరించి అంకితంపొందినది ఆత్మకూరు మహారాణి రాణీ కావడం సంస్థానానికి గర్వకారణం. ఈ ఉజ్వల కాంతిరేఖలు సాహిత్య చరిత్రలో సుసంపన్నం.

ప్రతాప రెడ్డి గారు తన గోలుకొండ కవుల సంచికను భాగ్యలక్ష్మమ్మ గారికి అంకితం ఇస్తూ ఈ విధంగా ప్రశంసించి ఉన్నారు.

👉‌అంకితము
అమరచింత - ఆత్మకూరు సంస్థాన ప్రభ్విణి
శ్రీ శ్రీ శ్రీ
సవై రాణీ భాగ్యలక్ష్మమ్మ
బహదరువారికి
శ్రీవారి నిర్మల యశ స్సౌరభము
నిఖిలాంధ్ర ప్రపంచము నందు
చిరస్థాయిగా బ్రసరించు నట్లు
గోలకొండ
ఆంధ్రకవివరేణ్య కవితావిలాసపుష్పము
కృతజ్ఞతాబద్ధముగ - అనుజ్ఞాపూర్వకముగ
సమర్పితము.

👉 భాగ్యలక్ష్మమ్మ దంపతుల అన్యోన్య దాంపత్యాన్ని, భక్తి చింతనను, మహారాణిగా ఆమె పాలనా దక్షతను గురించి కూడా గోలుకొండ కవుల సంచికలో పేర్కొనడం గమనించాల్సిన విషయం.

శ్రీమంతు నవైరాజా శ్రీరామభూపాలరావు బల్వంత బహదరుగారి పట్టపు రాణి శ్రీమంతు సవైరాణి భాగ్యలక్ష్మమ్మ గారు . పతివ్రతా శిరోమణులు , దేవబ్రాహ్మణ భక్తియుక్తులు , ప్రజాపాలనా ప్రావీణ్యురాలు , న్యాయైక విచక్షణలు , ధైర్య స్థయిర్య సౌశీల్య చాతుర్య వినయాది సుగుణోపేతలు , విద్యా వివేకయుతులు , రాజనీతి నిపుణురాలు . "

▪️విద్వత్కవి గాయక సభలు

ఆత్మకూరు సంస్థానంలో సోమభూపాల్ కాలం నుండి ప్రతి యేటా ఫాల్గుణ శుక్ల తదియ , చవితి రోజుల్లో విద్వత్కవి గాయక సభలు నిర్వహించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతున్నది. ఈ సభల్లో పాల్గొని తమ విద్వత్తును ప్రదర్శించేందుకు తెలుగు వివిధ ప్రాంతాల నుంచి పండితులకు ఆహ్వానాలు అందేవి. సవైరాణి భాగ్యలక్ష్మమ్మ పరిపాలన సమయంలో కూడా ఈ సభలు ఎలాంటి ఆటంకం జరగలేదు.

త్రిపురాంతక శాస్త్రి , గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి , బులుసు అప్పన్నశాస్త్రి , శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి , అవధానం చంద్రశేఖర శర్మ , పోకూరి కాశీపతి అవధాని , పెద్దమందడి వేంకట కృష్ణకవి , చెమికల చెన్నారెడ్డి తదితరులు పాల్గొనేవారు .  
ఈ సభల్లో నంబాకం రాఘవాచార్యులు, తిరుమల బుక్కపట్టణం వేంకటాచార్యులు న్యాయ నిర్ణేతలుగా 
 వ్యవహరించే వారు . విలువైన బహుమతులు ప్రకటించబడేవి.

▪️భాగ్యలక్ష్మమ్మ ప్రశంస

గోలుకొండ పత్రికలో భాగ్యలక్ష్మమ్మ ప్రశంస ఈ విధంగా ఉన్నది.

👉స్థిర సామ్రాజ్యమనాయంబు జయలక్ష్మీ వ్యాప్తి శశ్వద్యశ
స్ఫురణంబండిత పోషనాభిరతి సంపూర్ణానుకంపాప్తియున్
ఐరమౌదార్యము నైజపాదభజన వ్యాసంగమున్ గూర్చి
 శ్రీ కర కుర్మూర్తి గిరీశుడోము నిను దీక్షన్ భాగ్యలక్ష్యంబికా

-----దీక్షితుల నరసింహ శాస్త్రి

👉శ్రీమద్దివ్యరథాంగ శంఖ మహాపద్మాగిసర్వాయుధైః
శమతౌస్తుభ దివ్యహారమణిభి శ్రీవత్స చిహ్నాదిభిః యుక్త శ్రీపతి రేషనిత్యమవతు శ్రీభూమినీళాదిభిః శ్రీరామా వనిపాల మౌళి మహిషీం శ్రీ భాగ్యలక్ష్యంబికాం

         ---- తిరుమల బుక్కపట్టణం వేంకటాచార్యులు

👉జయతు జయతు నైజాం చక్రవర్తి రాజ్యం
జయతు జయతు రాజత్తత్ప్రజా తత్కుటుంబం జయతు జయతు తస్మానుగ్రహాలబ్ధ రాజ్యా
జయతు జయతు రాజ్ఞి భాగ్యలక్ష్మాంబికాబ్యా 

 -----జోస్యం వేంకటాచర్యులు 

▪️సంతానలేమి - దత్తత స్వీకరణ

ఆత్మకూరు సంస్థానాన్ని పాలించిన ముక్కెర రాజుల్లో చివరివాడైన శ్రీరామభూపాలుడు - భాగ్యలక్షమ్మ దంపతులకు సంతానం లేదు . సంతానం కలిగి మరణించడం జరిగింది. ఇది అంతఃపుర కుట్రగా ఇప్పటికీ అక్కడి జానపదులు రకరకాల కథలు చెప్పుకుంటారు.కానీ తెలివైన భాగ్యలక్ష్మమ్మ ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు. 

స్వయంగా తన సోదరి, దోమకొండ సంస్థానం ఆడపడుచు, తాటికొండ దేశాయ్ ల కుటుంబ కోడలు
సోమేశ్వరమ్మ అనంతరెడ్డిల కుమారుడిని తన 
వారసుడుగా దత్తత తీసుకుంది.

దత్తత స్వీకార సమయంలో సత్యనారాయణరెడ్డి పేరుతో ఉన్న ఆ బాలుడికి శ్రీరామభూపాల్ తాత గారి పేరు సోమభూపాల్ ' అని పెట్టుకోవడం జరిగింది. వీరు 1929లో జన్మించారు. ఇతడు సంస్థాన బాధ్యతలు నిర్వహించలేదు. ఎందుకంటే ఇతడి సమయానికి నిజాం ప్రభువు సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసాడు.

ఇది రాణి భాగ్యలక్ష్మమ్మ మనో ధైర్యం కోల్పోని కథ - గాథ..
__________________________________________
ఆధారం :
1 )ఆంధ్ర సంస్థానములు సాహిత్య సేవ
తూమాటి దోణప్పు
2) గోలుకొండ కవుల సంచిక
సురవరం ప్రతాపరెడ్డి
3) ఆత్మకూరు సంచిక
4) వైద్యం వెంకటేశ్వర చార్యులు
5)స్థానిక జానపదులు