Wednesday, August 7, 2019

గ్రామదేవతలు

#దేవతలు... #గ్రామదేవతలు...
°°°°°°°°°°°°°°వివరణ :#తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
సిగమాడే శివసత్తులు-
             బొడ్రాయికి బొడొత్తులు...
కొడిగట్టని దీపంతలు-
          ముడిగట్టిన ఒడినింతలు... 
ఎడ కోరిన ద్యావరలు -
           బండారు అమ్మోరులు...
ముగ్గేసిన కుంకుమలు-
               ఉడికించిన కలిబువ్వలు...
దీవించే దేవతలు-
                 బలికోరే కాళికలు.. !!!!
అంటూ పూదించి పూజించే గ్రామదేవతలు గ్రామాలకు ఒక కాపలా ! వీరు గ్రామాలను గ్రామ ప్రజలను   ప్రకృతి విపత్తులు...  కరువు కాటకాల నుండి  రక్షిస్తూ.. అంటువ్యాదుల నుండి కాపాడుతూ.. పాడి పంటలను వృద్ధి  చేస్తూ,  భూత ప్రేతాలను పారద్రోలుతూ.. గ్రామ పొలిమేర్లలో వెలుస్తారు అనేది ఒక నమ్మకం !
🙏 గ్రామ దేవతలు గురించి చెప్పుకునే ముందు హిందూ ధార్మిక, జానపద, సంప్రదాయాల్లో ఆరాధ్య దేవతలు గురించి  చెప్పుకోవాలి. భారతీయ సనాతన ధర్మాల్లో దైవానికి బహురూపాలు బహునామాలు ఉన్నాయి. ఈ క్రమంలో దేవతలు ప్రధానంగా ఏడు  రూపాల్లో కనిపిస్తుంటారు. ఈ ఆరు రూపాలు కూడా పంచభూతాల నుండి పుట్టుకొచ్చాయి అనేది ప్రాచీన నమ్మకం ! వీరు వరుసగా పురాణదేవతలు, కులదైవాలు, ఇలవేల్పులు, ఇడుపు దేవతలు, పేరంటాలు దేవతలు, వనదేవతలు / కొండ దేవతలు, గ్రామదేవతలు..!వీళ్ళతో పాటుగా ' క్షుద్ర దేవతలు ' గురించి చెప్పుకుంటే వీరు బాణామతి యక్షిణి వంటి చేతబడుల విధానాల్లో రప్పించబడుతుంటారు అనేది జానపదుల విశ్వాసం !

#పురాణదేవతలు

🙏 దేవతల్లో లక్ష్మీ, పార్వతి, సరస్వతి, వంటి  పురాణదేవతల్ని హిందూ ఆస్తిక సమాజం మొత్తం ఆరాధిస్తుంది. దసరా, దీపావళి, వసంతపంచమి, వంటి పర్వదినాల్లో ఈ దేవతల్ని ప్రత్యేకంగా పూజిస్తుంటారు కూడా. ఒకరకంగా వీరు పరిచయం అవసరం లేని దేవతలు. కాగా లక్ష్మిని బాలికగా, పార్వతిని యవ్వనవతిగా, సరస్వతిని వృద్దురాలిగా, శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే  మన సంపద  ఎప్పుడూ కూడా బాలికలా స్వచ్ఛంగా ఉండాలని,
ఆ సంపద కోసం మన శక్తి పార్వతిలా ఉండాలని, ఈ శక్తిని నడిపించడానికి మన తెలివితేటలూ సరస్వతిలా పండిపోయి ఉండాలనేది ఈ నమ్మకంలో దాగిన పరమార్థం.

#కులదైవాలు

సమాజంలో వివిధ కులాలు తమ కుల వృత్తులను అనుసరించి కొందరు దేవతలను పూజిస్తుంటారు. ఉదాహరణకు చేపలు పట్టే బెస్త వాళ్ళు గంగమ్మను పూజిస్తారు. పంచభూతాల్లో నీటిని సూచించే ఈ దేవత.... నదుల్లో వాగుల్లో కుంటల్లో బావుల్లో ఎప్పటికీ పుష్కలంగా ఉండాలని, తమ జీవనోపాధికి ఆటంకం కలుగకూడదు అనేది, బెస్త వారి ఆరాధనలో ఉన్న విశ్వాసం.
మరికొందరు కుల వృత్తితో సంబంధం లేకుండా, తమ కుల కీర్తిని నిలిపిన వారిని కలదైవాలుగా ఆరాధిస్తుంటారు. ఉదాహరణకు రెడ్లు కుంటి మల్లారెడ్డి తాతను తమ కులదైవంగా ఆరాధిస్తారు.
ఎరుకల వారు తమ జాతి ఆణిముత్యంగా ఏకలవ్యుడిని ఆరాధిస్తారు. బోయ కులస్తులు వాల్మీకి మహర్షిని ఆరాధిస్తారు. యాదవులు కృష్ణుడుని కొలుస్తారు. కురువలు బీరప్పను కొలుస్తారు. కోమట్లు వాసవీ మాతను కొలుస్తారు.

#ఇలవేల్పులు

వీరిని ఇడుపు దేవరలు లేదా ఇడుపు ద్యావర్లు అని పిలుస్తుంటారు. ఇంటి ముందు గానీ, ఇంటి గుమ్మానికి సమీపంగా గానీ, ద్యావరలు కొలువై ఉంటారు. ఈ దేవతలు ఆయా కుటుంబాల వంశానికి సంబంధించిన దేవతలు. బాలదానమ్మ, బాలమ్మ, వీరనాగమ్మ  (ఈరనాగమ్మ),  లక్ష్మమ్మ, వంటి  పేర్లతో ఈ ద్యావరలు  వెలుస్తుంటాయి. గురుగులు..గవ్వలు.. చెక్క బొమ్మలు... వంటి   రూపాలు ఇడుపు దేవతలుగా చెప్పబడుతాయి. గ్రామాల్లో '' ద్యావర పడ్తుంది  '' అనే నమ్మకం రాజ్యం ఏలుతున్నది. ఈ క్రమంలో చాలా మంది ద్యావరలు ఉన్న ఇంటి దరిదాపుల్లోకి వెళ్ళడానికి జంకుతారు.

#పేరంటాలు #దేవతలు

ఇతరుల మేలుకోసం త్యాగం చేసిన స్త్రీలు తర్వాతి కాలంలో పేరంటాలు దేవతలుగా వెలసి గ్రామ ప్రజల నుండి పూజలు అందుకుంటారు. చాలా గ్రామాల్లో పేరంటాలు దేవతలు వెలిసి ఉంటారు. వారి గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉంటాయి.  కట్టమంచి  రామలింగారెడ్డి రాసిన ముసలమ్మ మరణం పేరంటాలు దేవతకు ఉదాహరణ. ఈ కథలో ముసలమ్మ అనే ఒక ఊరి రెడ్డి కోడలు, ఊరి బాగుకోసం చెరువులో దూకి ఆత్మార్పణ చేసుకుంటుంది. ఆ తర్వాత ఊరంతా ఆమెను దేవతలా పూజిస్తారు. ఇదే క్రమంలో వనపర్తి పక్కన జగత్ పల్లి  పొలిమేరలో వ్యవసాయ  బావి ఒడ్డున గౌరమ్మ గుడి ఉన్నది. 
వెనుకటికి గౌరమ్మ అనే స్త్రీ ఊరి కోసం ఆ బావిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నది అని, ఆ సంఘటన చుట్టూ రకరకాల కథల్ని పెనవేసి చెప్పుకుంటుంటారు.

#వనదేవతలు

వీరినే కొండ దేవతలు అనికూడా అంటారు. వీరిని ఎక్కువగా గిరిజన తెగలు పూజిస్తుంటాయి.పంచభూతాల్లో నెలకొనే ప్రతికూల  పరిస్థితులు తమ జీవితాలకు ఆటంకం కలిగించకూడదు అని వీరు ఆయా దేవతల్ని పూజిస్తుంటారు. పంచభూతాల్లో ఒకటైన అగ్ని నుండి పుట్టుకొచ్చిన  అనలమ్మ  అగ్ని రూపం. సూరమ్మ దేవత సూర్యుడి ప్రతి రూపం.. గాలమ్మ  గాలి ప్రతి రూపం,అట్లాగే గంగమ్మ పేరుతో నీటిని పూజిస్తుంటారు. చంద్రమ్మ లేదా పౌర్ణమి ప్రతీకగా పున్నమ్మ పేరుతో చంద్రుడి రూపాన్ని, కొండమ్మలేదా గట్టమ్మ  పేరుతో గుట్టల్ని, నాగమ్మ  లేదా పుట్టమ్మ పేరుతో పుట్టల్నీ, అట్లాగే రాళ్లను రప్పలను మొక్కలను వృక్షాలను మట్టిని  ఆరాధిస్తుంటారు.

#గ్రామదేవతలు

🙏ఇంక గ్రామ దేవతలు విషయానికి వస్తే  ఈ దేవతలు వెలిసిన విధానాన్ని అనుసరించి పలు పరమార్థాలు బోధించబడుతుంటాయి. జానపద కథలు ' ఏడుగురు అక్కజెల్లెల్లు ఉయ్యాలో... ఒక్క తమ్ముడు ఉయ్యాలో.. '' అంటూ ఏడుమంది దేవతలకు పోతరాజు తమ్ముడుగా కొన్నిరకాల  గాథల్ని వినిపిస్తుంటారు. ఇవన్నీ మౌఖికమే. లిఖిత ఆధారాలు లేవు. అయితే ఈ ఏడుమంది ఒక్కో ప్రాంతంలో ఒక్కో వరుసలో చెప్పబడుతుంటారు. అట్లా గ్రామ దేవతలు మొత్తం 100 కు  పైగా ఉన్నారు. వీరిమీద అష్టోత్తర నామావళి తయారుచేయవచ్చును కూడా !ముఖ్యంగా చాలా  గ్రామదేవతలు పేర్లు వారి విధిని అనుసరించి నిర్ణయించబడ్డాయా లేకా వారి పేర్లను అనుసరించి నమ్మకాలు స్థిరపడ్డాయా అనేది  చెప్పలేము కానీ గ్రామదేవతల మహిమలు మీద జానపదులకు అపారమైన విశ్వాసం ఉన్నది అనేది మాత్రం వాస్తవం. తెలుగు ప్రాంతాల్లో అన్ని చోట్లా వెలిసిన  ఈ దేవతల నామాలు... నమ్మకాలు.. గమనిస్తే...

1)ఎల్లలు కాపాడి, ఎల్లవేళలా వెన్నంటి వుండే తల్లి ఎల్లమ్మ. కొన్ని గిరిజన తెగలు / కొన్నికులాలు /  ఎల్లమ్మను సర్పరూపంలో తమ ఇలావేల్పులుగా ఆరాధిస్తున్నాయి.
2) బాలల్ని కాపాడే తల్లి బాలమ్మ. బాలమ్మ రూపం ఇడుపుదేవతగా కూడా ఉన్నది.
3)బ్రోచే తల్లి పోచమ్మగా మారింది
4)పోషించే తల్లి పోశమ్మ.
5) వచ్చిపోయే వ్యక్తులు, శక్తులు, రోగాలు  గమనిస్తూ గ్రామం పొలిమేరలో వెలసిన తల్లిని  పొలిమేరమ్మ అన్నారు.కాలక్రమంలో పొలిమేరమ్మనే   పోలేరమ్మగా మారింది అనేది ఒక నమ్మకం.
6)కుంకుళమ్మలేదా కంకులమ్మ. ఈ దేవత పంచభూతాల్లో నేల నుండి ఏర్పడినది. ఇక్కడ కుంకు అంటే కంకి అని అర్థం. కంకులు పండించే  దేవతా అని చెప్పుకోవచ్చు.
7) నూకాలమ్మ దేవత కూడా భూమి నుండి ఏర్పడిందే. నూక అంటే వరి ధాన్యంలో ఒక భాగం. ఈ దేవతను పూజిస్తే కడుపు ఎండదని,ఎంత కరువొచ్చినా నూకలైనా దొరుకుతాయనేది ఒక నమ్మకం.
8)తలుపు అంటే రక్షణ. ఈ క్రమంలో తలుపులమ్మను తమకు  రక్షణగా ఆరాధిస్తారు.
9) ఇరుకళమ్మ అంటే ఇరువురిని కన్నతల్లి అని,
లేదా  ఇరువురిని దయతో ప్రేరేపించేది అని అర్థం. ఈ పేరుతో వెలసిన గ్రామ దేవతల గుడుల్లో సూర్య చంద్రుల ప్రతిరుపాలు ఉంటాయి.
10) కురువలి అంటే పెద్దగాలి.ఈదురు గాలులు, వడగాలులు, దెయ్యం గాలులు నుండి ప్రజల్నే కాదు పంటపొలాలను కాపాడే తల్లిగా కురువలమ్మను పూజిస్తుంటారు.
11) గజ్జ అంటే శబ్దం. లక్ష్మీ స్వరూపం సన్నని గజ్జల సవ్వడి చేస్తూ వస్తుంది అనేది ఒక సగటు నమ్మకం. ఈ క్రమంలో గజ్జెలమ్మను పూజిస్తారు.

ఇట్లాగే జానపదుల వివిధ విశ్వాసాలకు ప్రతిరూపంగా ఆయా ప్రాంతాల్లో దేవతలు వెలసి ఉన్నారు.
నాయినికాడి మశమ్మ ( నాగర్ కర్నూల్ ).నాగారపమ్మ ( గుంటూరు జిల్లా నంబూరు  ), గంగాళమ్మ ( తిరుపతి ప్రాంతం ), సుంకులమ్మ ( కర్నూలు ప్రాంతం ) ఉర్లమ్మ (గణపవరం, కర్లపాలెం మండలం, గూంటూరుజిల్లా), బర్రెమ్మ (పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా),మురుగులమ్మ (బండారులంక, తూ.గో.జిల్లా) గుర్రాలక్కలేదా గుర్రాలమ్మ (అంతర్వేది, తూ.గో.జిల్లా)  కుంకాళమ్మ  ( నెల్లూరు జిల్లా , ఇందుకూరుపేట మండలం , లేబూరు గ్రామం )
బలుసులమ్మ (తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా),జములమ్మ లేదా జంబులమ్మ ( గద్వాల ) మురుగులమ్మ (బండారులంక, తూ.గో.జిల్లా) కొట్లమ్మ  (పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా)
ఇట్లా ఇంకా  ఎందరో గ్రామదేవతలు భక్తుల్ని అలరిస్తూ పూజలు అందుకుంటున్నారు. వారు... బూసులమ్మ, ఈదెమ్మ, మైసమ్మ, మశమ్మ, మాంకాలమ్మ, మాదెమ్మ, అన్నమ్మ, అంకాలమ్మ, ఈరమ్మ, గొల్లమ్మ, ముత్యాలమ్మ, పగడమ్మ, బంగారమ్మ, మొదలగు వారు. ముఖ్యంగా గ్రామ దేవత అనగానే జంతుబలి ఉంటుంది. అట్లాగే వివిధ ఆచారాలు ఆనవాయితీగా కొనసాగుతుంటాయి. ఈ క్రమంలో  పొలాల్లో వెలసిన లక్షమ్మ లేదా లచ్చుమమ్మ కు వండిన వంటకాలు ఇంటికి తీసుకు వెళ్లడం నిషేధంగా భావిస్తారు. మిగిలిన లేదా తిన్నాక మిగిలిన ఎంగిలిని  అక్కడే గోతి తీసి పూడ్చి పెడుతారు.  కొన్ని చోట్లా జంతుబలి నిషేధంగా ఉన్నది. ఏలూరు పక్కన పెదవేగి మండలం రాట్నాలకుంటలో రాట్నాలమ్మ వారికి జంతుబలి నిషేధం. అట్లాగే కొందరు దేవతల వద్ద కొన్ని పద్ధతులు పాటిస్తారు. నాగర్ కర్నూల్ నాయినిపల్లి మశమ్మను దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు మౌనం పాటిస్తారు.

🙏తెలంగాణ సంప్రదాయంలో #బతుకమ్మ దేవత కూడా గ్రామ దేవతే. కానీ ప్రత్యేకంగా గుడులు లేవు. దసరా రోజుల్లో ఉత్సవాలు మాత్రమే జరుగుతాయి.  #బొడ్డెమ్మ తల్లి కూడా దేవతే. ఆటపాటల రూపాన జనపదుల్ని అలరిస్తుంది.
మొత్తానికి గ్రామదేవతలు జానపదుల జీవితంలో భాగంగా కొనసాగుతున్నారు. నమ్మకం ఏదయినా... భక్తి మూర్ఖంగా ఉండకూడదు.

1 comment:

  1. బాగా రాసారు మంచి విశ్లేషణ, పాత గుంటూరు లో అంకమ్మ తల్లి చాలా ప్రసిద్ధి.

    ReplyDelete