Tuesday, August 13, 2019

పల్లె పదాలు -1

పల్లె పదాలు... 1
°°°°°°°°°°✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

మన పల్లె పదాలే జనపదాలు...జానపదాలు...ఇవే మన మూలాలు..! ఈ క్రమంలో తెలంగాణ గ్రామీణ
సంస్కృతి సంప్రదాయాలు...యాస భాష...ఇవన్ని పామరం అనిపించినా అందులో గొప్ప తాత్వికత...తర్కం...నిబీడీకృతమైవుంటాయి.కొన్నిసార్లు వాళ్లపాట మనకు అర్థం కాదు.కాని అర్థవంతమైనదై ఉంటుంది.ఇలాంటి జానపదాన్ని దృష్టిలో పెట్టుకుని , తెలంగాణలో మతాలకు అతీతంగా గ్రామీణులు జరుపుకునే
సంప్రదాయ పండుగల్లో ఒకటైన #కందూరు అనుభవంతో  నేను రాసిన ఈ క్రింది పల్లె పాట ఎంతమందికి అర్థమౌతుంది???

#సాకి --
ఆ.. ఆ... మడికట్ల ఉన్నది మస్మాన్ల దర్గా...  మా  మల్లారెడ్డి తాత మాలీజా చేసి,  పాతాలెక్కించి పదిమందిని పిలుస్తాడు. ఏళ్ళొద్దాం రావే నా ఎంకటమ్మా...

#పదం

#అందరికోసం అస్సలోడొచ్చే
ఆరు వేల రూపాయల్ అప్పుగ దెచ్చే....
పొద్దుగాల బోయి పొట్టేల్ దెచ్చే
కందూరు పేరా కంకణం గట్టే.....

#సంతకు బోయి సౌదల్ దెచ్చే
బజార్ల బోయి బోగాన్లు దెచ్చే....
యాట గోయనీకే యాకూబొచ్చే
కూరగొట్టనీకే కటికన్నొచ్చే....

#సుట్టు ముట్టోల్లు సుట్టాలైరి
పిల్లలు జెల్లల్ పీక్కోనొచ్చిరి....
తాగుబోతోల్లకు తలకాయ కూర
నా లాంటోళ్ళకు నల్లకూర...

#తునుకల్ బొక్కల్ తీరుగ తిండ్రి
కుక్కలకేమో కాట్లాట బెట్టిరి....
ఆశగొంటోళ్ళకు ఆనక బాయే
మిగిలిన కూర మూటళ్ళ  బాయే....

#అందరు బోయినంక అస్సలోడొచ్చే
ఆకలితోన ఆవురావుమనే...
అడుగు బొడుగున మాడి శెక్కలు
సర్వల్ల మిగిలిన సోర్వ సుక్కలు....

#అంతెత్తు ఎగిరే ఆలి మీద
అలిగి గూసునే అరుగు మీద....
అప్పుగూసునే నెత్తి మీద
వడ్డి గూసునే గుండె మీద....2

No comments:

Post a Comment