Tuesday, August 13, 2019

పల్లె పదాలు -2

#పల్లెపదాలు 2
°°°°°°°°°సేకరణ :#తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

పల్లెల్లో ఆయా పండుగల  సందర్భాల్లో జానపదులు పాడుకునే పాటలు పల్లె జీవనానికి, జీవితంలో అంతర్భాగమైన కొన్ని పద్ధతులకు  అద్దం పడుతుంటాయి. దక్షిణ తెలంగాణ వనపర్తి పరిసర ప్రాంతాల్లో కాముని పండుగ దినాల్లో, సంప్రదాయాన్ని అనుసరిస్తూ పిల్లలు పాడుకునే పాటలు ఈ సందర్బంగా గమనిస్తే అవి ఎంతో అర్థాన్ని వినోదాన్ని  అందిస్తూనే... పల్లె #అనుబంధాల మధ్య #పటిష్టతను తెలియజేస్తుంటాయి.

🌿కాముడు పండుగ రోజులు కొందరు పిల్లలకు మంచి ఆటవిడుపు. ఈ క్రమంలో  ఒక #కొత్తకుండ తీసుకుని, దానికి చుట్టూ జాగ్రత్తగా #చిల్లులు కొడుతారు. చిల్లుల కుండ లోపల ఒక దీపం పెట్టి, ఎవరో ఒకరు #చుట్టకుదురు సహాయంతో ఎత్తుకుంటారు. తర్వాత గుంపులుగా ఇళ్లిళ్లూ తిరుగుతూ పాటలు పాడుతారు.

🌿#పాట

సిక్కు దీసీ  కొప్పుగట్టి....
సిరిగందం బొట్టుబెట్టి...
సిరిమంతుడే మా కాముడు...

సన్నంచు పంచగట్టి
సన్నజాజులు చేయి జుట్టి...
సందమామనే మా కాముడు....

గునుగాకు ఉడకబెట్టి...
గురువిందల జతగట్టి 
గుణవంతుడే మా కాముడు...

పంటసేను గొర్రు కొట్టి...
పంచవన్నెల సెల్ల జుట్టి...
పంచతీర్థుడే మా కాముడు...

పాటలో రాగం మొత్తం ఒకే బాణీలో కొనసాగుతుంది. #సిక్కుదీసి కొప్పు గట్టడంలో కాముడు అలంకారం ప్రియుడు అని, సన్నజాజులు చేయి జుట్టడంలో #శృంగారపురుషుడని, #గురువిందల జతకట్టడంలో సహజంగా లోపాలు కూడా ఉన్నాయని, పంటచేను గొర్రు కొట్టడంలో శ్రమజీవి అని, పంచాతీర్ధుడు అనడంలో తియ్యని గుణగణాలు ఉన్నాయని, అర్థం అవుతుంది.  ముఖ్యంగా గునుగాకు తింటే గుణవంతుడవుతాడు అనే నమ్మకం కూడా పాటలో కనిపించింది.

No comments:

Post a Comment