Thursday, January 3, 2019

ఆత్మకూరు (A) చరిత్ర

మా ఆత్మకూరు చరిత్ర
°°°°°°°°°°°°°°° సేకరణ : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
ఆత్మకూరు సంస్థానం అమరచింత అనుబంధముగా గుర్తింపబడుతున్నది.పూర్వ పాలమూరు జిల్లా...ప్రస్తుత వనపర్తి జిల్లాకు చెందిన ఈ సంస్థానం వైశాల్యం 190 చదరపు మైళ్ళు.  తొలి రాజధాని తిపుడంపల్లి.
        ప్రస్తుతం నంది వడ్డేమాన్ గా పిలవబడుతున్న  ఒకప్పటి  వర్థమానపురాన్ని పాలిస్తున్న  కాకతీయుల సామంతుడు  గోన గన్నారెడ్డి తండ్రి గారైన గోనబుద్దారెడ్డి   క్రీ.శ.1292  ప్రాంతంలో  తిరుపతి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అప్పుడు తిరుపతి పక్కన  చంద్రగిరి  వాస్తవ్యులు గోపాల్ రెడ్డి ,  బుద్దారెడ్డికి సకల అథితి మర్యాదలు చేయడం జరిగింది.ఇందుకు మెచ్చిన బుద్దారెడ్డి  గోపాల్ రెడ్డిని ఆహ్వానించి ..... మగతలనాడు ప్రాంతానికి గౌడ పదవిలో నియమించడం జరిగింది. మగతలనాడు అనేది నేటి మఖ్తల్ ప్రాంతం.ముఖస్థలి అనే మరో నామం కూడా ఈ ప్రాంతానికి ఉన్నది.అంటే యాగాలు చేసే చోటు అని అర్థం. మఖ్తల్ ప్రాంతం కన్నడ దేశానికి సమీపంగా వున్నది. ఆ ప్రభావం కారణంగానే అది మగతల గా పిలవబడిందని చరిత్రకారులు తెలియ జెప్తున్నారు. ఎందుకంటే మగ అనగా కన్నడంలో కొడుకు లేదా కుమారుడు అని అర్థం. తల అనేది  చోటు లేదా  స్థలం అని సూచిస్తుంది.
         ఇక గౌడ పదవి అనేది పెద్దరికం సాగించే ఒక గౌరవప్రదమైన పదవి. కన్నడ దేశంలో నేటి గౌడలు ఈ క్రమానికి సంబంధించిన వాళ్ళే. తెలుగు ప్రాంతాల్లో రెడ్డి అనేది కూడా ఇట్లాంటి అధికారానికి సంబంధించినదే ! మొత్తానికి బుద్దారెడ్డి అనుగ్రహంతో గౌడ పదవి పొందిన గోపాల్ రెడ్డి ఆత్మకూరు సంస్థానానికి మూలపురుషుడు.
       గోపాల్ రెడ్డి కొడుకు చినగోపిరెడ్డి.  క్రీ.శ 1363  ప్రాంతంలో  తన  హవా కొనసాగించాడు. ఇతడు కాకతీయుల అనంతరం అధికారాల్లోకి వచ్చిన బహమని సుల్తానులకు అనేక యుద్దాల్లో సహకరించి వివిధ పదవులను వారి కృప  చేత చేపట్టడం జరిగింది.వీటిలో దొర తనాన్ని సూచించే దేశ్ ముఖ్ ,దేశ్ పాండ్యా ,దేశాయిగిరి , గౌడ , పదవులు వున్నాయి.
   చినగోపిరెడ్డి కొడుకు చంద్రారెడ్డి.ఇతడు కూడా తండ్రి తాతల బాటలో జీవిస్తూ....అధికారాలను...సహాయ సహకారాలను ...తన పూర్వికులను  అనుసరించే కొనసాగించినాడు. ఆత్మకూరు సాంస్కృతిక వైభవం కురుమూర్తి ఆలయ నిర్మాత వీరే .
      చంద్రారెడ్డి కుమారులు  చినగోపిరెడ్డి...సాహెబ్ రెడ్డి లు.సుల్తానుల మీద అభిమానంతో ఈ పేరు పెట్టి ఉండవచ్చనేది విమర్శకుల అభిప్రాయం.ఇక గోపిరెడ్డి విషయానికి వస్తే  తాతపేరు ఇతడికి పెట్టడం జరిగింది.కాబట్టి చరిత్ర ఇతడిని రెండవ గోపిరెడ్డిగా గుర్తించింది. వీరి కాలం నాటికి కుతుబ్ షాహిల యుగం కొనసాగుతున్నది.కుతుబ్ షాహిల్లో 6 వ రాజైన అబ్దుల్లా కుతుబ్ షాకు (1626-1672) రెండవగోపిరెడ్డి సమకాలికుడు .అబ్దుల్లా మన్ననలు పొందిన రెండవ గోపిరెడ్డి  అల్లిపురం జాగీరు పొందాడు. అట్లాగే సాహెబ్ రెడ్డి మగతలసీమను పాలించుటకు సుల్తాను చేత అనుమతిని పొందాడు.
     రెండవ గోపిరెడ్డి కొడుకు సర్వారెడ్డి.ఇతడు కూడా తాత ముత్తాతలు తండ్రుల బాటలో సామంతుడిగా రాణించాడు
     సర్వారెడ్ది కుమారుడి వివరాల గురించి  ఇతమిద్దమైన సమాచారం లేదు .కాపోతే సర్వారెడ్డి మనుమడు  రెండవ సర్వారెడ్డి కాలం నాటికి మొఘల్ చక్రవర్తుల శకం కొనసాగుతున్నది. ఈ క్రమంలో రెండవ  సర్వారెడ్డి ఔరంగాజేబుకు అనేక యుద్దాల్లో సహకరించాడు.ఇందుకు మెచ్చిన ఔరంగాజేబు  రెండవ సర్వారెడ్డికి దుప్పల్లి జాగీరును అప్పగించడం జరిగింది.
    రెండవ సర్వారెడ్డి కుమారుడు గురించిన స్పష్టమైన సమాచారం లేదు.కాగా రాజ్యపాలన మాత్రం కొనసాగించాడు అనేది అర్థమౌతున్న విషయం. అయితే అప్పటికే అధికారాలతో కొనసాగుతున్న  మొదటి  తిమ్మారెడ్డి...లభిస్తున్న వివరాల ప్రకారం  సాహెబ్ రెడ్డి వారసత్వంగా తెలుస్తున్నది. ఇది ఒక అంచనా మాత్రమే !
     మొదటి తిమ్మారెడ్డి కుమారుడి గురించి  కూడా ఇతమిద్దమైన సమాచారంలేదు.కాగా తిమ్మారెడ్డి మనుమడుగా చెప్పబడుతున్న రెండవ సాహెబ్ రెడ్డి కాలానికి అసఫ్ జాహీలుగా చెప్పబడే నిజాం రాజుల శకం కొనసాగుతున్నది.
        రెండవ సాహెబ్ రెడ్డి అసఫ్ జాహీలకు కర్ణాటక దండయాత్రలో సహకరించాడు.ఇందుకు గానూ అసఫ్ జాహీల నుండి ' సవై రాజా ' బిరుదును కూడా గౌరవానికి చిహ్నంగా పొందాడు.అంటే శ్రేష్టుడు అని అర్థం.
      రెండవ సాహెబ్ రెడ్డి తర్వాత వరసత్వంగా కూమారులు ..మనుమలు...ముని మనుమలు...తమ తమ వారసత్వాన్ని చేజారకుండా కాపాడుకున్నారు. ఈ క్రమంలో సాహెబ్ రెడ్డికి 7 వ తరం వాడైన ముని మనుమడు పెద వెంకటరెడ్డి ...,3 వ నిజాం  నిజాం  సికిందర్ జా (1803-1829) వద్ద మిక్కిలి ప్రీతి పాత్రుడుగా కొనసాగాడు.ఇందుకు సికిందర్ జా పెద వెంకటరెడ్డికి అమరచింత ...వడ్డెమాను  ప్రాంతాలను కట్టబెట్టాడు. అప్పుడు పెద వెంకటరెడ్డి తిపుడంపల్లిని రాజధానిగా తన పాలన కొనసాగిస్తూ ...కొంతకాలానికి తన పాలనా సౌలభ్యం కోసం రాజధానిని ఆత్మకూరుకు మార్చుకోవడం జరిగింది.
     పెద వెంకటరెడ్డి కుమారుడు బాలక్రిష్ణారెడ్డి. వీరి కుమారుడు సోమభూపాలరావు. రావు అనేది బిరుదు. ఇతడు  4 వ నిజాం నాసిరుద్దౌలా కాలంలో అమరచింత వడ్డెమాన్ పరగణాలకు శాశ్వత అధికారాన్ని సంపాదించుకున్నాడు. దీన్నే  బిల్ మఖ్తా పొందినట్టుగా చెప్పవచ్చు.
     సోమ భూపాలరావు కుమారుడు సీతారామభూపాలరావు.ఇతడి కుమారుడు 'శ్రీమంత్ సవైరాజా శ్రీరామ భూపాలరావు.'
      శ్రీరామభూపాలరావు తన హయాంలో  తన ఆత్మకూరు సంస్థానం అభివృద్ది చెందడానికి అనేక ప్రజాప్రయోజనాలను చేపట్టడం జరిగింది. వీరి సతీమణి శ్రీమతి భాగ్యలక్ష్మమ్మ మిక్కిలి తెలివి తేటలు కలిగినది.రాజ్యపాలనకు కావల్సిన తెలివితేటలు ఈమె స్వంతం.కాబట్టి భర్త శ్రీరామభూపాలరావు మరణం తర్వాత  నిజాం ప్రభువుల సహాయ సహకారాలతో పాలనా భాద్యతలను స్వీకరించడం జరిగింది. ఈమె కాలం లోనే ఆత్మకూరు సంస్థానం హైదరాబాదు రాష్ట్రంలో విలీనం అయ్యింది.
    ప్రస్తుతం వీరి వారసుడు అయిన శ్రీరాంభూపాల్ హైదరాబాదులో నివసిస్తున్నప్పటికీ ఆత్మకూరుతో మంచి సంబధ బాంధవ్యాలను కొనసాగిస్తున్నారు.నియోజకవర్గంలో జరిగే కొన్ని పూర్వ సంప్రదాయ వేడుకలకు వీరు తమ వంశం తరుపున పాల్గొంటున్నారు. అయితే వీరు తమ తాతలు తండ్రులు కాపాడుకుంటూ వచ్చిన రాజ్యపాలన అదృష్టానికి మాత్రం దూరంగా వున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయంగా రాణిస్తే తప్ప పూర్వ వైభవం సిద్దించదు అనేది వాస్తవం.

No comments:

Post a Comment