Monday, January 28, 2019

చరిత్రలో మహిళలు

ఆరుట్ల కమలాదేవి (1920_2001)
..........................
✊తెలంగాణ వీరనారి...
రోషమున్న పోరుదారి...
బందూకు ఎత్తిన మగువ...
నిజాంను ఎదురించిన తెగువ...
ఎర్ర మందారం 
తరతరాలకు చెదరదు ఈ శౌర్య సిందూరం🤜
   
     తల్లిదండ్రులు పెట్టిన పేరు రుక్మిణి.  11 సంవత్సరాల వయస్సులో మేనమామ కుమారుడు ఆరుట్ల రామచంద్రారెడ్డితో వివాహం జరిగింది. వివాహం సమయంలోనే ఈమె పేరు కమలాదేవిగా మార్చబడింది.
           చదువుకోవాలన్న వీరి తపనను  అత్తింటివాళ్ళు ఆదరించగా....వివాహం అనంతరం హైదరాబాదులోని ఆంధ్రా గర్ల్స్ హైస్కూలులో విద్యనభ్యసించింది. ముఖ్యంగా వీళ్ళది విప్లవ భావజాలం వేళ్ళూనుకుపోయిన కుటుంబం. దీంతో ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన కమలమ్మ  సంఘహితానికై జరిగిన  ఉద్యమాల్లో  భర్తతో పాటు పాల్గొంది. అలనాడు  ప్రజల అండదండ అయిన ఆంధ్రమహాసభలకు  హాజరై ఉత్తేజాన్ని పొందింది.
       పీడనలా పీడకలా ....దుస్థితిలా దుస్సత్యంలా...తన దురాగతాలతో చెలరేగిపోయిన  నిరంకుశ నిజాం విమోచనోద్యమంలో నిర్భయంగా పాల్గొన్నది. సంకెళ్ళు నాకు గడ్డి పరకలు అంటూ అరెస్టు కాబడి జైలుకు కూడా వెళ్ళింది.సాహసంతో వ్యూహంతో 1946-48లో రజాకార్ల దురాగతాలను ఎదుర్కోడానికి మహిళా గెరిల్లా దళాన్ని ఏర్పాటుచేసింది.నిజాం తోక ముడవడంలో తనదైన పాత్రవహించింది.
        ప్రజాసేవకు ఉద్యమం ఉదయమై నడిపించగా....ఆ అనుభవాల  విప్లవ చురకత్తియై రాజకీయంలోకి అడుగు పెట్టి  1952 ఎన్నికలలో భువనగిరి నుంచి హైదరాబాదు శాసనసభకు ఎన్నికైనది. ఆ తర్వాత వరుసగా 3 పర్యాయాలు ఆలేరు నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎనికై విజయ భావుటా ఎగురవేసింది.
        శాసనసభలో కమ్యూనిస్టు పార్టీ ఉప నాయకురాలిగా.... పుచ్చలపల్లి సుందరయ్య చికిత్సకోసం విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకురాలిగా....సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించింది.
    వీరి స్వగ్రామం నల్లగొండ జిల్లా ఆలేరు తాలూకా మంతపల్లి.

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

No comments:

Post a Comment