Thursday, January 3, 2019

'అల్లుడి నోట్లో శని ' వ్యంగ రచన

అన్నీ ఉన్నాయి...అల్లుడి నోట్లో శనితో సహా...
°°°°°°°°°°°°°°°°°°°°°°° ✍🏿తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
2018...
ఒకానొకరోజు....
తన  యూనివర్సల్ సెర్చ్ లో ప్రపంచ దేశాలను గమనిస్తున్నాడు ఒక గ్రహాంతరవాసి..ఆయా దేశాల  అభివృద్దిని  అందుకు గల కారణాలను మాత్రమే కాదు ., అన్ని వనరులు వసతులు వుండీ బాగుపడని దేశాల వరసను కూడా గమనిస్తున్నాడు. ఈ క్రమంలో అతడిని ' భారతదేశం ' అంశం గందరగోళానికి గురిచేసింది.
     ఎందుకంటే...  ' అభివృద్ది చెందిన భారతం....! పేరుతో అతడికి కనిపించిన వ్యాసాలు.. వీడియోలు..విశ్లేషణలు..చిత్రాలు మొదట గొప్పగా ఆకర్షిస్తూ ప్రేరణ కలిగించినప్పటికీ , భారతదేశం విజయానికి ఉన్న  మెట్లు ఎక్కుతూనే జారిపడిపోతున్న పరిస్థితిని అర్థం చేసుకుని విస్మయానికి గురయ్యాడు.దీంతో పడిలేస్తున్న కెరటంలా ఉన్న  భారతదేశ పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు... అందుగురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు ...భారతావనిలో అడుగుపెట్టాడు.
     మొదటగా అతడికి ఒక విగ్రహం కనిపించింది. ఉత్సాహంగా అక్కడికి వెళ్ళి ' ఎవ్వరు నువ్వు ? ' అడిగాడు అతడు..
    ' నేనొక ప్రేమికుడిని ' చెప్పింది విగ్రహం.
   ' ఓహో ! సంతోషం ! ఏ ప్రేమికుడివి ? దేశ ప్రేమికుడివా ? దేశాన్ని ఉద్దరించడానికి నువ్వు ఏ విధంగా తోడ్పడ్డావు ? సంఘ సంస్కర్తగానా ...సామాజిక సేవా కార్యకర్తగానా ..దీనజనోద్దారకుడిగానా ? ' అడిగాడు అతడు.
     ' ఇవేమీ నాకు తెలియదు. ప్రేమ త్యాగానికి గుర్తుగా మాత్రమే నేను ఇక్కడ వెలిసి ఉన్నాను...' కన్నీరు కార్చింది విగ్రహం.
    ' అయ్యో ! అవునా !? మీ దేశంలో దేవదాసు పార్వతుల కథ విన్నాను. అట్లాంటిదేనా నీ ప్రేమ ?'  గ్రహాంతరవాసి కూడా కన్నీరు కార్చాడు.
    'అంతకంటే గొప్పది ' చెప్పింది విగ్రహం.
    ' ఏ విధంగా ? ' వివరణ అడిగాడు గ్రహాంతరవాసి.
    ' కాదా మరి ! పాఠాశాలలో అందరూ పాఠాలు నేర్చుకుంటే నేను నా ప్రేమ పాఠాలకు ఎగబడ్డాను. అందరూ కన్నవారి కలల కోసం రేయింబవళ్ళు కష్ట పడుతుంటే నేను వారి కలని కల్లలు చేస్తూ  లేచిపోవడానికై మార్గాలను అన్వేషించాను.ఇట్లా  ఎదురించడం..ఉద్యోగం సద్యోగం లేకపోతేనేం పవిత్ర ప్రేమను పంచుకుంటూ జీవించడం..ఇవన్నీ మా ప్రేమ గొప్పతనాలు...' ఆవేదనగా చెప్పుకొచ్చింది విగ్రహం.
     గ్రహాంతరవాసికి తల గిర్రున తిరిగింది. తాను చూసిన కొన్ని ఇతర దేశాల్లో దేశం కోసం ...ప్రజల కోసం...సమాజం కోసం...వ్యవస్థ కోసం..సేవలు త్యాగాలు చేసే పౌరులకు విగ్రహ అర్హతను నిర్ణయిస్తారు. కానీ ఈ దేశంలో ప్రేమ జంటలకు కూడా విగ్రహాలు పెడుతారా ? ఆ ప్రేమ ఎవ్వరిని ఉద్దరించినదని భావి తరాలు ఆ విగ్రహాన్ని చూసినప్పుడలా ప్రేరణ చెందాలి ? ' అంటూ తనలో తానే ప్రశ్నించుకున్నాడు.
    ' కులం మతం వర్గం వర్ణం ఈ వివక్షలు కారణంగానే నేను విగ్రహం అయ్యాను '  గ్రహంతరవాసి మనసు తెలుసుకున్నదై వాపోయింది విగ్రహం.
    ' అవునా ? అయితే ఆ వివక్షలు ఎక్కడ ఉన్నాయి. వాటిని నేను వెళ్ళగొట్టేస్తాను...' హామీ ఇచ్చాడు  గ్రహాంతరవాసి .
    ' అవి మా రాజ్యాంగం సొరుగులో వున్నాయి. తాళాలు సర్కారు చేతిలో ఉన్నాయి. వాటిని అంత సులువుగా ఎవ్వరూ వెళ్ళగొట్టలేరు.. ' చెప్పింది విగ్రహం.
    అంతలో అక్కడికి ఒక అదృష్య శక్తి వచ్చింది.
     'ఇక్కడ రాజకీయంగా సామాజికంగా  ఉద్యోగపరంగా కులాలు కావాలి అనే పోరాటం ఉన్నది. ఒక్క పెళ్ళిళ్ళ విషయంలో మాత్రం వీటిని మినహాయించాలంటారు కొందరు ' ఆ అదృశ్య శక్తి గ్రహాంతరవాసి చెవిలో చెప్పింది.
    ' అది న్యాయం కాదు కదా...ఉంటే అన్ని చోట్లా ఉండాలి.లేదంటే ఎక్కడా ఉండకూడదు...' అన్నాడు గ్రహాంతరవాసి.
    అదృశ్య శక్తి అందుకు నిస్స హాయంగా తల వాల్చేసింది. గ్రహాంతరవాసి  ఇంక అక్కడ నిలబడలేక పోయాడు. దేశం మొత్తం ఇట్లాంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తే...ఈ దేశ భావి పౌరులకు అందే సందేశం ఏమిటి ? ' అని ప్రశ్నించుకుంటూ ముందుకు నడిచాడు.అప్పుడు అతడి మనసులో ఒకటి మెదిలింది.👇🏿
    ' బహూశా ! అపరిపక్వ ప్రేమలకు ఈ విగ్రహం ఒక హెచ్చరిక కావొచ్చు సుమా .. '
  అంతలో ఒకచోట ఒక చావు కనిపించింది. ఎవ్వరిదా అని  అతడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ దేశ సైనికుడు మరణించి ఉన్నాడు. శతృదేశాలు అతడిని పొట్టన పెట్టుకున్నాయని తెలుసు కున్నాడు. అంతే కాదు ఇక ఊరూరా అతడి విగ్రహాలు నిర్మించబడుతాయని కూడా అనుకున్నాడు. కాని అతడి ఊహను భంగపరుస్తూ అదృష్యశక్తి మళ్ళీ పెదవి విప్పింది.👇🏿
     ' భ్రమ పడొద్దు.ఇట్లాంటి త్యాగధనులకు ఇక్కడ పెద్దగా గుర్తింపు లేదు. ప్రజలు మాత్రమే వాళ్ళను గుర్తించి గౌరవిస్తారు. పాలకులు ఆ పూటకు స్పందించి మరిచి పోతారు '
     అంతే ! గ్రహాంతరవాసి  మళ్ళీ గిర్రున తలతిరిగి పడిపోయాడు. అదృశ్యశక్తి అతడిని ఆసుపత్రి దాకా తీసుకెళ్ళిది. అక్కడ వైద్యుడు సిద్దంగా ఉన్నాడు. గ్రహాంతరవాసి  సమస్య ఏమిటో తెలుసుకుని ., కంటికి సిరంజి గుచ్చబోయాడు. అది అక్కడే గదులు శుభ్రం చేస్తున్న ఒక చిన్న ఉద్యోగి గమనించి , పరుగున వచ్చి , వైద్యడిని వారించాడు.
    ' కడుపు నొస్తే కడుపుకు...వీపు నొస్తే వీపుకు...కన్ను నొస్తే కన్నుకు చికిత్స చేయకూడదని ఎన్ని సార్లు హెచ్చరించాలి. ఒకవైపు నా పని నేను చేసుకుంటూ...మిమ్మల్ని  కూడా ఎన్నేండ్లని గమనించాలి ? ' అనికూడా ఆ ఉద్యోగి వైద్యుడిని మందలించి  ..చికిత్సా విధానం చెప్పి వెళ్ళిపోయాడు
   అందుకు గ్రహాంతరవాసికి ఈ సారి కళ్ళు కాదు...నిలువెత్తు శరీరమే వణికిపోయింది. ' ఏమీ విపరీతం ? ' అంటూ అదృష్యశక్తి వైపు చూసాడు.
    అందుకు ఆ శక్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ... ' ప్రతిభకు గుర్తింపు లేదు ' అన్నది.
    తర్వాత ఇద్దరూ కలిసి అక్కడి నుండి నెమ్మదిగా ముందుకు కదిలారు. ఓ పాఠశాల వచ్చింది. ఉలిక్కిపడ్డాడు గ్రహాంతరవాసి.                   
  ' ఎందుకు ? అడిగింది అదృష్యశక్తి.
    ' ఏమో ! ఉడకని భోజనాన్ని తింటున్నట్టు...తడవని నేలలో గింజలు వేస్తున్నాట్టు...ఇక్కడ ప్రేమలు ఉంటాయేమోనని భయం వేసింది చెప్పాడు గ్రహాంతరవాసి..
      అంతలో అతడి దృష్టి అక్కడున్న ఆయా మీద పడింది. ఉపాధ్యాయులు ఎక్కడున్నారో తెలువదు. పిల్లలకు ఆయా  చదువు చెప్తున్నది. అక్కడికి వెళ్ళి విషయాన్ని వాకాబు చేస్తే....ఆమెకు తెలివి ఉన్నది. కానీ  తగిన ఉద్యోగం లేదు. ఇట్లాగని నోరు మూసుకుంటే భావి భారతం వెన్నముక లేని యువతతో నిండిపోతుందని గ్రహించి...ఉద్యోగం లేకపోయినా పరవాలేదనుకుంటూ పిల్లలకోసం తన జ్ఞానాన్ని పంచుతున్నదని తెలిసింది. అంతే కాదు ఆమె సరిదిద్దుతున్న అంశాలు ఏమిటా అని గమనిస్తే... 👇🏿
      'గోఉను ఆఉ అని అన్ టరు...' అని రాసి ఉన్న వాక్యాన్ని ఆమె ' గోవును ఆవు అని అంటారు ' అని సరిదిద్దడం చూసి మరోసారి కిందపడబోయి తమాయించుకున్నాడు గ్రహాంతరవాసి.
     తర్వాత ఇద్దరూ ముందుకు నడిచారు. మేధో వలసలు కనిపించాయి.అవి  ఇంటి తోటను ఎండగొడుతూ  పక్కింటి తోటకు నీళ్ళు పోస్తున్నట్టుగా అనిపించాయి. అట్లాగే ఇంకొంచం ముందుకు వెళ్ళారు. అక్కడ ప్రతిభావతులైన స్త్రీలు సంకెళ్ళు ధరించుకుని కనిపించారు.అంతా చూస్తూ గ్రహాంతరవాసి అక్కడి నుండి భయంతో తమ గ్రహానికి బయలుదేరబోయాడు.
  ' ఎవ్వరు నువ్వు ? ఎందుకు వచ్చావు ? ' అతడిని ఆపుతూ అడిగింది అద్శ్యశక్తి.
    ' మా గ్రహాన్ని కూడా ఒక జీవ సంచారంతో నింపాలనుకుంటున్నాను. కాబట్టి  మానవ ప్రపంచంలో ఉన్న గొప్ప నియమాలను పద్దతులను అరువు తీసుకెళ్ళి ఒక అద్భుతలోకాన్ని సృష్టించే ప్రయత్నంగా సంచరిస్తున్నాను. కానీ నాకు ఇక్కడ అభివృద్ది కారణాలు సంతోషపెట్టడం కంటే...వెనకబాటు తనానికి గల కారణాలే మిక్కిలి భయపెడుతున్నాయి... ' వణుకుతూ చెప్పాడు గ్రహాంతరవాసి.
     ' అయ్యో ! నా బిడ్డల చేష్టలు మీకు కూడా ఇబ్బందిగానే ఉన్నాయా ? ' శోకించింది అదృష్యశక్తి.
    అది చూసి చలించిన గ్రహాంతరవాసి ' ఎవ్వరు మీరు ఎందుకు శోకిస్తున్నారు ? ' అడిగాడు.
    ' నేను భారతిని ! ఈ దేశపు మాతృమూర్తిని ' చెప్పింది అదృష్యశక్తి.
    అదివిని గ్రహాంతరవాసి ఇట్లా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
      ' అమ్మా ! నీ దగ్గర అన్నీ ఉన్నాయి. కాని అల్లుడి నోట్లో శనిలా ఉన్నది గదా పరిస్థితి !!??'

No comments:

Post a Comment