Thursday, January 3, 2019

చారాణా (కథ )

చారాణ(కథ)
°°°°°°°° ✍తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
( ఇది నా మొదటి కథ. ఎప్పుడో బాల్యంలో రాసాను )
     సాయంత్రం ఐదు గంటలు కావొస్తున్నది.
     గొల్ల మంగవ్వ  ఇంటి ముందు బర్రెల కొట్టం కాడ  అందరూ తూగులు,  చెంబులు, పట్టుకుని నిలబడి ఉన్నారు. వాళ్ళంతా పాల కోసం వచ్చిన వాళ్ళు.  ప్రతి రోజూ ఉదయం సాయంత్రం వాళ్ళంతా పాల కోసం అక్కడికి వస్తుంటారు. మంగవ్వ ఇల్లు రెండు గదుల మట్టి మిద్దె. ఇంటి చుట్టూ పేడతో అలికి ఉంటుంది.ఆ అలుకు మీద సున్నం...జాజు చారలు నిలువుగా పూసి ఉంటాయి. అట్లాగే మిద్దె పై కప్పు అంచునుండి ఈత కమ్మలు వర్షం నీటిని నిలువరించడానికి వరుసగా కట్టి ఉంటాయి. ఆ ఇంటికి ఆనుకుని కూడా ఓ కొట్టం ఉంటుంది. అదే ఆ ఇంటి వరండా.
            మంగవ్వ వాళ్ళకు నాలుగు బర్రెలు..రెండు ఆవులు...నాలుగు ఎద్దులు.. గొర్రెల మంద ఉన్నాయి. వాళ్ళ కొడుకు శీనుగాడు గొర్రెలను మేపుకు వస్తాడు. మంగవ్వ భర్త కుర్మన్న బాడుగ బండ్లు నడుపుతుంటాడు. మంగవ్వది పాలు పిండి వాటిని అమ్మే బాధ్యత.అయితే మంగవ్వ ఇంటి వద్ద ఒక్కటే పాలు అమ్మడం కాదు , ఊర్లో హోటళ్ళకు వెళ్ళి కూడా పాలు పోసి వస్తుంటుంది.చెంబెడు పాలకు మరో రెండు చెంబుల నీళ్ళు కలుపుతారు వాళ్ళు.అయినా మంగవ్వ పాలకు గిరాకి తగ్గదు. ఎందుకంటే ఉద్దెర పైసలు ఆలస్యమైనా అవ్వ ఇబ్బంది పెట్టదు.
       పాలకోసం వచ్చిన వాళ్ళలో పదేండ్ల చంద్రమ్మ ఒకరు. చేతిలో తూగు పట్టుకుని ఆ పిల్ల ఒక పక్కగా నిలబడి వున్నది. రెండు జడలను రిబ్బన్లతో పైకి మడిచి కట్టుకుని...మోకాళ్ళదాకా కుట్టించిన లంగా తొడుక్కుని ...సన్నగా పీలగా చూడ్డానికి అమాయకంగా ఉంది ఆ పిల్ల. కానీ ఆ పిల్ల మనసు మాత్రం.... 'చారాణ ' గురించి ఆలోచిస్తున్నది.
      ప్రతిరోజూ తను పాల కోసం వెళ్లినప్పుడు ...పాలు  పిండుతున్నప్పుడు వచ్చే   శబ్దాన్ని హాయిగా వినేది.అట్లాగే శబ్దంతో పాటుగా పిండుతున్న పాలల్లో పైపైకి లేస్తున్న నురగను ఎంతో ఇష్టంగా చూసేది.కానీ ఈ మద్య అట్లా ఉండలేకపోతున్నది.
        పావు గంట గడిచింది.రెండు పాత్రల పాలతో  లోపలికి వెళ్ళి...నాలుగు గిన్నెలతో బయటకు వచ్చి , ఇంటి ముందున్న మట్టి అరుగుమీద  ఇంక అందరికి పాలు పోయడానికి సిద్దంగా కూర్చుంది మంగవ్వ. ఇందుకు అవ్వ భర్త కుర్మన్న సహకరించాడు.
       ముఖ్యంగా మంగవ్వ అరుగు మీద కూర్చోక ముందే జనాలు బిల బిల మని అరుగు వద్దకు కదిలారు. కాని చంద్రమ్మ మాత్రం అందరికి చివరగా నిలబడి పోయి ఉంది. ' చారాణ...చారాణ ...' అంటూ ఆ పిల్ల గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది.
       మంగవ్వను చూస్తే కాళ్ళకు లావుపాటి వెండి కడియాలు..కాలి వేళ్ళకు పెద్ద పెద్ద మెట్టెలు...మడమల దాకా ఎగ్గట్టిన కాటను చీర...చేతినిండా రంగు వెలసిన మట్టిగాజులు...ఆ గాజులకు ముందు భాగంలో వెండి కంకణాలు..పెద్దబొట్టు...చెవుల చివర్ల దాకా కమ్మలు...బన్ను సిగ....మొత్తానికి మంగవ్వ అలంకరణ చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. అయితే మంగవ్వ వాళ్ళు ఎర్ర గొల్ల వాళ్ళు. అందుకే అవ్వ అన్ని అలంకరణలను చేసుకుంది గానీ ముక్కుకు ముక్కుపుల్ల మాత్రం పెట్టుకోలేదు.
    చూస్తుండగానే చంద్రమ్మ వంతు వచ్చేసింది. భయం భయంగా మంగవ్వ ముందుకు వెళ్ళింది చంద్రమ్మ. ఆ పిల్లను చూసి  మంగవ్వ  ఏం మాట్లాడకుండా ...ఆ పిల్లకు పోయాల్సిన గ్లాసుడు పాలను కొలిచి పోసింది. పాలు పోయగానే ఆ పిల్ల మెల్లగా తన చేతిలోని చారాణ తీసి మంగవ్వ ముందు ఉంచింది.
       ' ఏమే పిల్లా ! చారాణ యిస్తివి. మొన్నటి చారాణతో కలిపి ఆఠాణ కదా !?  చారాణ బాకీకి ఎన్ని రోజులు చేస్తరే ?  ' కొట్టినట్టుగా అడిగింది.
   ' మా యమ్మ  చారాణ రేపు ఇస్త అన్నది '  మంగవ్వ పెద్ద నోరుకు ఎప్పట్లా గజా గజా వణికింది చంద్రమ్మ.
    ' ఇట్లా ఎన్ని రేపులే పిల్లా.. ? ' మంగవ్వ  గొంతు నిష్టూరంగా పలికింది.
   చంద్రమ్మ ఏం మాట్లాడలేదు. భయపడుతూ బెదురు కళ్ళతో నిలబడిపోయింది.
     మంగవ్వ  ఇంక  చారాణ గురించి ఏం మాట్లాడలేదు.... 'సర్లే..పో ! ఉన్నప్పుడే ఇద్దురు గానీ...' మాట ఎంత కటువైనా తనదైన మంచితనాన్ని సహజంగానే ప్రదర్శించింది మంగవ్వ. చంద్రమ్మ ఇంక వెంటనే ' హమ్మయ్యా ' అని మనసులోనే అనుకుంటూ అక్కడినుండి వెనుతిరిగింది.
    వెళ్తుంటే దారెంబడి చారాణ బాకీ గురించిన ఆలోచనలు  చంద్రమ్మకు పదే పదే గుర్తుకు వచ్చాయి.
     ఆరోజు....
     ఆదివారం...
     అమ్మ ఎప్పటిలా తనను పాల కోసం మంగవ్వ ఇంటికి పంపింది. వెళ్తుంటే మధ్యలో ఐస్ క్రీము డబ్బా అడ్డమొచ్చింది. డొక్కు సైకిలు మీద ఐస్ క్రీం డబ్బా ఉంచుకుని...ఆ సైకుల్ చక్రాలకు లోటా ఒకటి కట్టి...సైకిలు నడుపుతుంటే లోటా కారణంగా 'బుర్..ర్ ...ర్... ర్...'  అంటూ  శబ్ధం వస్తూ...ఊర్లో అందరికి ఐస్ క్రీం వచ్చిందనే సంకేతాన్ని ఇస్తుంటుంది.అప్పుడు  చాలా మంది పిల్లలు ఆ డబ్బా చుట్టు చేరి ఐస్ క్రీం కొనుక్కుని తింటుంటారు. చంద్రమ్మకూ ఆ ఐస్ క్రీం కొనుక్కోవాలని కోరిక. కానీ  డబ్బులు లేక ఎప్పుడూ కొనుక్కోలెకపోతుంది. దీంతో చాలాసార్లు  తన తమ్ముడితో కలిసి ఐస్ క్రీం డబ్బా మూలల్లో చినుకు చినుకుగా కారే ఐసు నీళ్ల  కోసం ఆ సైకిలు వెంబడి గ్లాసు పట్టుకుని చాలాదూరం పరుగెడుతుంటారు. అందుకే.. ' అమ్మా నాయినా ఎప్పుడు కూడా ఐస్ క్రీం ఇప్పించరు... ' ఈ నిరాశ  తన మనసును అస్తమానం వెంబడిస్తుంటుంది. అయితే ఆరోజు మాత్రం నిరాశను గెలవాలి అనుకుంది తను. కాబట్టే...పాల కోసం ఇచ్చిన చారాణతో ఐస్ క్రీం కొనుక్కుని తినేసింది.
      ఐస్ క్రీం అమ్మే తురక పాషా ఎప్పుడూ ఎవ్వరికీ ఉద్దెరలు ఇవ్వడు. అంతే కాదు...డబ్బాలో వృధాగా విరిగి పడిన ఐసు ముక్కలను కూడా పోనీలే పాపం అని తన లాంటి పిల్లలకు ఇవ్వడు. వాడి సంగతి అట్లా ఉంచితే మొత్తానికి ఆరోజు తన కోరికి తీరింది. ఇంక ఆరోజటి పాల సంగతి చూస్తే ...' అమ్మా ఈ రోజు బర్రెలు పాలు ఇయ్యలేదంట ' చెప్పి ఎంచక్కా తప్పించుకోవాలని చూసింది. కానీ ' బర్రెలు పాలు ఇయ్యకపోతే మరి పైసలు ఏవే ? ' అమ్మ అడిగే సరికి గొంతు తడబడింది. అయినప్పటికీ తేరుకుంటూ ' మంగవ్వకు ఇచ్చేసి వొచ్చిన. రేపటికోసం ' అని హడావిడిగా చెప్పేసింది.ఆతర్వాత కాసేపటికి ' అయ్యో ! మంగవ్వకు ఇచ్చి వచ్చిన అని చెప్పకుండా...పోగొట్టుకుపోయినవి అని చెప్పి ఉంటే సరిపోయేది ' అనిపించింది.
         ఇంటి దగ్గర అమ్మేమో ఏ రోజు పైసలు ఆరోజే ఇస్తూ ఉద్దెరలకు దూరంగా ఉండాలనుకుంటుంది. తనేమో ఆరోజు ఐసు క్రీం తిన్నదుకు మరుసటి రోజు అమ్మ పైసలు ఇవ్వకుండా ' నిన్ననే ఈరోజటి పైసలు ఇచ్చివొచ్చినావు గదా ..' అని అంది. దీంతో తను మంగవ్వకు ఆ మరుసటి రోజు  ' ఈ రోజు పైసలు మా యమ్మ రేపు ఇస్తదంట...' అని చెప్పి పాలు పోసుకొచ్చింది.అట్లా తను మంగమ్మకు చారాణ బాకీ పడింది. అది తీర్చలేక అవస్థలు పడుతున్నది.
               ****
  చూస్తుండగానే  నెల రోజులు గడిచిపోయాయి . చంద్రమ్మ చారాణ బాకీ  తీరలేదు. దీంతో ఒకరోజు చంద్రమ్మ ఒంటరిగా కూర్చుని  చారాణ గురించి ఆలోచించడం మొదలెట్టింది.చివరకు ఒక ఆలోచనకు వచ్చింది.ఆలోచన ప్రకారం మరుసటి రోజు మంగవ్వతో పాలు పోసుకురాకుండా వాళ్ళమ్మ ఇచ్చిన  చారాణను బాకీ కిందికి కట్టేసింది.తర్వాత అక్కడినుండి నేరుగా తన దోస్తు గౌసియా ఇంటికి వెళ్ళింది.    గౌసియా వాళ్ళకు చాలా మేకలు ఉన్నాయి.వాళ్ళు రోజూ మేక పాలతోనే చాయ్ చేసుకుంటారు.
      ' మా తమ్మునికి  కడుపు నొస్తుంది.మా నాయినమ్మ   మందు తయారు చేస్తందంట.  మ్యాక పాలు కావాల్నంట '  గౌసియా వాళ్ళమ్మ ఖాతీజాను అడిగింది చంద్రమ్మ.
    ఖాతీజా  ' సరే ' అంటూ లేచి వెళ్ళి  అప్పటికప్పుడు మేక పాలు పిండటం మొదలెట్టింది. అది చూస్తూ చంద్రమ్మకు తన చారాణ బాకీ తీరిపోయిందనే సంతోషం లోలోపల  ఎగిసిపడటం మొదలయ్యింది.కానీ తీరా పాలు అందిస్తూ  ' చారాణ ' అని చెప్పింది ఖాతీజా. అంతే ! ఉచితం అని ఊహించుకున్న చంద్రమ్మ మనసు ఒక్కసారిగా అదిరిపడింది. కానీ చేసేది లేకా 'మాయమ్మ రేపు ఇస్తదంట ' అని చెప్పి మళ్ళీ నెత్తిన బడిన చారాణ బాకీని తలుచుకుంటూ దిగాలుగా ఇంటిదారి పట్టింది.
      ఇంటికి వెళ్ళాక గ్లాసులో చిక్కని పాలను చూసి ' మంగవ్వ పాలల్లో నీళ్ళు కలపడం మరిచిపోయిందా ఏం ? ' అని అన్నది వాళ్లమ్మ.
     ఆ మాట వినగానే చంద్రమ్మకు చప్పున ఒక ఉపాయం తోచింది. దీంతో  వెంటనే ' అవును ... గట్టి పాలు కాబట్టి ఆఠాణ ఇయ్యమంది.. ' అని చెప్పింది. తను చెప్పిన ప్రకారం రేపు అమ్మ ఆఠాణ ఇస్తే అటు గౌసియా వాళ్ళ బాకీ తీర్చవచ్చు. మిగిలిన చారాణతో ఎప్పటిలా పాలు కొనుక్కరావొచ్చు అనేది  చంద్రమ్మ ఆలోచన. కాని తీరా అమ్మ పాలను పసిగట్టింది.
     ' ఆ మంగవ్వకు కండ్లు నెత్తిన ఎక్కినట్టుండవి. మ్యాక పాలు పోసింది. పాలు లేకుంటే లేవని జెప్పాలే.  ఈ పాలు ఎవ్వరు తాగుతరని? మదం మదం ఉంటయి.. ' అంటూ కోప్పడింది. అంతే కాదు , ' ఒక్క పైస ఎక్కువ ఇచ్చేది లేదు.. ' అని తెగేసి అంది. దీంతో చంద్రమ్మ బాకీ మంగవ్వ ఇంటి నుండి గౌసియా ఇంటికి మారి అక్కడ బలంగా తిష్ట వేసుకుని కూర్చున్నట్టయ్యింది. అందుకే ఇంక ఆరోజు మొదలు చంద్రమ్మ... గౌసియా వాళ్ళ ఇంటి వైపుకు వెళ్ళడమే మానేసింది.

No comments:

Post a Comment