Thursday, January 3, 2019

ముగ్గులు సమాచారం

ముగ్గులు ...
మగువలు  గీసే  ధవళ కాంతి మొగ్గలు...!!
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° సేకరణ :తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

అరవై నాలుగు కళల్లో చిత్రలిపి ఒకటి !ఈ చిత్రలిపిలో అంతర్భాగమే స్త్రీల ముగ్గులు ! అద్భుతంగా ముగ్గులు వేయడం అంటే సృజనాత్మకతకు  అందంగా ప్రాణం పోయడమే !కళా నైపుణ్యాన్ని వివిధ తీరుల్లో ఒద్దికగా తీర్చి దిద్దడమే !!
     👉 ముగ్గులు గృహాలంకరణలో ఒక భాగం మాత్రమే కాదు, ఒక సాంప్రదాయo ...ఒక సంస్కృతి... ఒక శాస్త్రీయ విజ్ఞానం... ఒక సాంస్కృతిక వైభవం... !
అవును ! ప్రాచీన కాలం నుండి కూడా  ముగ్గుల చుట్టూ అనేక నమ్మకాలూ ఆచారాలు అపోహలు భ్రమలు ముడిపడి ఉన్నాయి.
   👉  దృశ్య విశేషమైన ముగ్గు భారతీయ సనాతన ధర్మంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకోగలిగింది.
కుమారసంభవం,  శుకసప్తతి, క్రీడాభిరామం, వంటి ప్రాచీన సాహిత్య గ్రంధాలు ముగ్గు గురించిన ప్రస్తావన చేసాయి.
   👉ముగ్గులు జానపద పరిజ్ఞానంలో ఒక భాగం. వీటి పుట్టుపూర్వోత్తరాలను నిర్ధారణ చేయలేము.కానీ సింధు నాగరికతతో ఆరంభమైన చిత్రలిపి కాల క్రమంలో సంస్కృతిలో భాగంగా నాటుకు పోయి... వివిధ తీరులుగా విస్తరిస్తూ  స్త్రీల ముగ్గులుగా కూడా క్రమంగా విరాజిల్లినదని భావించవచ్చు.
   👉ముగ్గులు ఎవ్వరు సృష్టించారు?  ఏ విధంగా వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఒకే విధమైన ముగ్గులను వేయగలుగుతున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం లేదు. కానీ ముగ్గుల  వెనక ఉద్దేశ్యాలను మర్మాలను  మాత్రం కచ్చితంగా అంచనా వేసుకోవచ్చు.  ఉదాహరణకు  పండుగలు పర్వదినాలు, పెండ్లి పేరంటాలు, చావు పుట్టుకలు, మంత్ర తంత్రాలు, పూజలు, కాలాలు  వంటి వివిధ ఆచారాలు నమ్మకాలను అనుసరిస్తూ ముగ్గులు అర్థాలను పరమార్థాలను కనబరుస్తుంటాయి.
    ఈ క్రమంలో🔸కృష్ణష్టామి నాడు ఉయ్యాలలు... కోలలు.. పాదముద్రలు,🔸సంక్రాతి రోజుల్లో  గుమ్మడి... భోగి కుండలు... పతంగులు... చెరుకు గడలు..., 🔸రథసప్తమి సందర్బంగా సూర్య రథం, 🔸నాగుల పంచమి నాడు మెలికలు తిరిగిన నాగులు, 🔸వినాయక చవితి సందర్బంగా గజపాదం, 🔸దసరా రోజుల్లో నవరాత్రులను ఉద్దేశిస్తూ తొమ్మిది చుక్కల ముగ్గులు,  🔸వసంతకాలంలో మన్మధ విహారం జరుగుతుందనే నమ్మకాన్ని కనబరుస్తూ మన్మధ వాహనమైన చిలుకల ముగ్గులు,🔸 దీపావళి నాడు దివ్వెల ముగ్గులు, 🔸తులసి కోటల ముందు పద్మాల ముగ్గులు, ఇతర పూజల సమయంలో గద్దె లేదా పీట ముగ్గులు,  మొదలగునవి ఆయా  పండుగల కాలాల విశిష్టతకు సంకేతార్థాలుగా గీయబడుతుండటం గమనించవచ్చు.
  👉ముగ్గులు సాధారణంగా రాతి పిండితో... వరి  పిండితో... సుద్ద చూర్ణంతో ... సున్నం పొడితో వేస్తుంటారు. పూజలు సమయాల్లో వరి పిండికి పసుపు కుంకుమలు జోడించి వేస్తుంటారు. కమ్మ, రెడ్డి,యాదవ , వంటి  కొన్ని వర్గాల పెండ్లిళ్లలో నవధాన్యాలు ఉపయోగించి రోకలి బండల సహాయంతో ముగ్గులు వేస్తుంటారు. ఈ ముగ్గులను  ' పోలు ' అంటారు. ప్రత్యేకించి యాదవ తెగల్లో తమ వాళ్ళు చనిపోయినప్పుడు ముగ్గువేసి దానిపై  శవాన్ని పాడుకోబెడతారు. ఈ ముగ్గును ' రతి ' అంటారు. అట్లాగే కొందరు గ్రామ దేవతలకు సంబంధించిన పూజలు, బాణామతి -యక్షిణి- వంటి కొన్ని క్షుద్ర పూజలు సమయాల్లో వేసే ముగ్గును కూడా 'రతి ' అంటారు. ఇక్కడ రతి పదం పున:రాగమనం లేదా పున:ప్రవేశం అర్థాలను సూచిస్తుంది.
    👉 తెలుగులో  ముగ్గులు అని పిలుచుకునే చిత్రలిపిని  వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.కేరళ తమిళనాడుల్లో 'కోలం' అంటారు. మహారాష్ట్ర కర్ణాటకల్లో  'రంగోలి ' అంటారు.తెలుగు ప్రాంతంలో మాత్రం రంగులు వేసిన ముగ్గులను రంగవల్లులు అంటాము.ఇక ఒరిస్సాలో 'ఝటి' అంటారు. బెంగాల్లో 'అల్పన'అంటారు. వీళ్ళ  అల్పనల్లో  ఎక్కువగా చేపలు చిత్రణ ఉంటుంది. మధ్య ప్రదేశ్ లో 'ఎపన్'అంటారు.రాజస్థాన్ లో ' మండనాలు' అంటారు. ఏ ప్రాంతంలో ముగ్గును ఏ పేరుతో పిలిచినప్పటికీ అందరికీ తెలిసిన పరిభాషలో అదొక great art !
  👉ధనుర్మాసం వచ్చిందంటే చాలు చాలా కుటుంబాలు ముగ్గులకు ప్రాధాన్యత ఇస్తాయి. ఈ సమయంలో  'గురు శిష్యులు' ముగ్గులు వేస్తుంటారు. అంటే  మధ్యలో ముగ్గువేసి దాని చుట్టూ నాలుగు వైపులా గీతలు గీయడం అన్నమాట. ఈ నేపథ్యంలో చుక్కలు ముగ్గులకు పూర్వం నుండి ప్రాధాన్యత ఉన్నప్పటికీ... ఇటీవల కాలంలో అన్ని రకాల ముగ్గులు వేస్తున్నారు.
  👉ముగ్గుల్లో రేఖాగణితశాస్త్రం,వర్ణమాల, విధిగా పొందుపర్చబడి ఉంటాయి. నిశితంగా పరిశీలిస్తే ఇవి అగుపిస్తాయి. ఇంక పద్మం, స్వస్తిక్, గోపురం, చక్రం, వంటి ముగ్గులు వాస్తుశిల్పానికి ప్రతీక. వాస్తవానికి ఇల్లు నిర్మాణానికి ముందు కూడా ముగ్గు పోస్తారు.
   👉ముగ్గుల్లో  మరి కొన్ని నమ్మకాలను గమనిస్తే... చతుర్భుజ ఆకారంలో వేసే ముగ్గులు 'స్థిరత్వానికి' నిదర్శనం. ఈ  ముగ్గులను పీట ముగ్గులు అంటారు. ఇంట్లో మనుషులే కాదు ఆస్తులు కూడా ఇట్లాంటి ముగ్గులు క్రమం తప్పకుండా వేస్తే స్థిరంగా ఉండటం జరుగుతుందని కొందరు భావిస్తుంటారు. అట్లాగే త్రికోణంలో ఉండే ముగ్గులు త్రిమూర్తులుకు...సత్త్వా రజో తమో గుణాలకు  ప్రతిరూపంగా భవిస్తూ అట్లాంటి ముగ్గులకు ప్రాధాన్యత ఇచ్చే కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. పూల ముగ్గులు సౌభాగ్యానికి హేతువుగా నమ్మే వాళ్ళు కూడా కోకొల్లలు.
   👉మొత్తానికి ముగ్గు అనేది దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండ కాపాడే శాస్త్ర రహస్యంగా పెద్దలు చెబుతుంటారు. తంత్ర శాస్త్రంలో బిందువు అనేది శక్తి సమానం. కాబట్టి ఇంటి ముందు చుక్కల ముగ్గులు వేయాలని కూడా ఇంట్లో పెద్దలు సూచిస్తుంటారు.

No comments:

Post a Comment