Thursday, January 3, 2019

పూలు నలుగుతున్నాయి (కథ )

పూలు నలుగుతున్నాయి....
  (కథ)
        ✍శ్రీదేవి రెడ్డి...
....................
మనోహర్, లావణ్య దంపతులకు బుజ్జిగాడు  ఒక్కగానొక్క కొడుకు.బుజ్జిగాడి అస్సలు పేరు రాహుల్.కాని వాడి అస్సలు పేరు స్కూల్ లో తప్ప బయట ఎవ్వరికీ తెలియదు.ఐదు సంవత్సరాల వరకు ఇంటి దగ్గరే వుంటూ బడికి వెళ్ళి చదువుకున్న బుజ్జిగాడు తన ఆరో ఏటా హాస్టల్ కు వెళ్ళాడు.అక్కడికి వెళ్ళే వరకు కూడా వాడికి హాస్టల్ గురించి తెలియదు.వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు హడావిడి చేస్తుంటే తను ఎక్కడికో ఎంచక్కా వెళ్తున్నానని బోలెడంత సంబరపడ్డాడు.తీరా అక్కడికి వెళ్ళాక ...అక్కడ తనని వదిలిపెట్టి తల్లిదండ్రులు వెళ్ళిపోతుంటే గానీ తనకు ఏదో కష్టం వచ్చిందనే సంగతిని వాడు గుర్తించలేక పోయాడు.ఆ విధంగా వాడి జీవితంలో కన్నీటి ఎపిసోడ్ ఆరంభమయ్యింది.
        హాస్టల్ బుజ్జిగాడికి అస్సలు నచ్చలేదు.అక్కడ తనతో పాటుగా తనలాంటి పిల్లలు చాలామందే   వున్నప్పటికి వాడికి  ఒంటరితనమే తోడయ్యింది.అక్కడున్న పిల్లలు చాలామంది సంతోషంగానే కనిపిస్తున్నారు.కొందరు మాత్రమే పరధ్యానంగా వుంటున్నారు.వాళ్ళల్లో బుజ్జిగాడు ఒకడు. వాడికి తినాలనిపించట్లేదు.ఆడాలనిపించట్లేదు.చదవాలనిపించట్లేదు.నిద్రగూడా  రావట్లేదు. అమ్మ గుర్తుకు వస్తుంది....నాన్న గుర్తుకు వస్తున్నాడు...ఇల్లు ...స్నేహితులు గుర్తుకువస్తున్నారు.ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడా కలలోకి అమ్మ వచ్చేస్తుంది.తనని కావలించుకుంటుంది....ముద్దుపెట్టుకుంటుంది...ముద్దలు తినిపిస్తుంది.అంతే! ఒక్క వుదుటన మెలకువ వచ్చేస్తుంది.అప్పుడు చుట్టూ చూస్తే తనకు నచ్చని వాతావరణం తనని మరింత బాధ పెడ్తూ కనిపిస్తుంది.ఇంకేముందీ...కన్నీరు వాడి బుగ్గల వెంబడి చారికలు కడుతుంటుంది.
         సెలవులకు ఊరెళ్తే  మళ్ళీ హాస్టల్ కు రావడమటే బుజ్జిగాడికి అదొక నరకం.తల్లిదండ్రులకు కత్తిమీది సాము. తన మనసులో పరుగెడుతున్న శతకోటి బాధల సమాహారం గురించి బుజ్జిగాడికి పరిజ్ఞానం లేదు.వాటిని వెళ్ళడి చేసుకునే భాషా పరిజ్ఞానం కూడా వాడికి తెలీదు.వాడికి తెల్సిందల్లా ఒక్కటే....నాకు హస్టల్ వద్దు...అమ్మ కావాలి! లావణ్యకు కూడా కొడుకుని వదిలిపెట్ట బుద్దికాదు.తనదగ్గరే ఉంచుకోవాలని ఉంటుంది.కానీ చేస్తున్న ఉద్యోగం తనకా అవకాశం ఇవ్వడం లేదు.ఇలాగని ఎవ్వరైనా ఆయాను సమకూర్చుకుని బుజ్జిగాడిని తనకళ్ళెదుటే పెట్టుకుందామనుకున్నా ఇదివరకు పెట్టుకున్న ఆయాలు తన ఎదురుగా ఒకలా తను లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తూ బుజ్జిగాడిని ఇబ్బంది పెట్టారు.పైగా తమకు అందుబాటులో ఉన్న స్కూల్స్ కూడా పెద్దగా చెప్పుకోదగినవి కాదు .ఇలాంటి పరిస్తితుల్లో  ఇప్పుడు వాడి మీద జాలి పడితే భవిష్యత్తు ప్రశ్నగా మారే అవకాశం వుంది.కాబట్టే భర్తతో కలిసి ఆమె గుండె ధిటువు చేసుకుంది.అయినప్పటికి ప్రతిరోజూ ప్రతి నిముషం బుజ్జిగాడి ఆలోచనలు ఆమె అంతరంగాన్ని తీవ్రంగా కలిచి వేస్తునే ఉంటాయి.
        అలా అలా బుజ్జిగాడు పెద్దవాడయ్యాడు. పదోతరగతికి వచ్చేసాడు.అయినా వాడిలో అమ్మ కావాలనే ఆశ చావలేదు.కాపోతే చిన్నప్పుడు  ...దుప్పటి కప్పుకుని ,బాత్రూంలో దాక్కుని ,తనివితీరా ఏడ్చేవాడు.కాని ఇప్పుడు పెరిగిన స్నేహితులు....పెరిగిన వయసు.... అలవాటైన వాతావరణం ...ఇవన్నీ గుండెను ధిటువుగా ఉంచుతున్నాయి.కానీ అంతరంగాన్ని మాత్రం సందుదొరికితే చాలు సాధించుకు తింటుంటాయి.
********
బిజ్జిగాడికి చూస్తుండగానే పాతికేళ్ళ వయసు వచ్చేసింది.ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక మంచి సాఫ్ట్ వేర్ కపంపెనీలో ఉద్యోగంలో చేరాడు.అన్నాళ్ళ జీవితంలో వాడు ఎప్పూడూ ఇంటివద్దలేడు.హాస్టలే వాడికి ఇష్టంలేని ఇల్లయిపోయింది.ఇప్పుడు ఉద్యోగ జీవితంలో కూడా ఇంటిదగ్గర హాయిగా ఒక్కపూట గూడా వుండలేక పోతున్నాడు.బాద్యత ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది.ఏ పొద్దుటో వెళ్ళడం... మరే రాత్రో ఇంటికి రావడం దినచర్య అయిపోయింది.తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడ్డానికి లేదు.మంచి చెడు ఆలోచించడానికి లేదు.అందుకే బుజ్జిగాడికి అనిపిస్తుంటుంది...''ఏమిటీ జీవితం? ఎందుకీ జీవితం? ఎవ్వరికోసం ఈ జీవితం? ఏం సాధించాలని ఈ జీవితం?ఈ హాస్టళ్ళు...ఈ ఉద్యోగాలు....ఇదేనా బతుకంటే?ఈ కృత్రిమత్వం కోసమేనా మనిషి ఇంతలా ప్రాకులాడేది? ఇలాంటి కృత్రిమత్వాన్ని దూరం చేసుకుని మనిషి జీవించలేడా?ఏమీ సాధించలేడా? అభివృద్ది చెందిన జీవితాలు అంటే అన్నీ కోల్పోయి జీవించడమేనా? ఇదే నిజమైతే ఇలాంటి జీవితాలు అవసరమా?ఆత్మీయతలు అనురాగాలు అన్నీ బహుదూరపు  చుట్టాలౌతున్నప్పుడు మనం ఎవ్వరి కోసం జీవిస్తున్నట్టు?నిన్న నేను హాస్టల్లో వున్నాను...రేపు నా కొడుకూ వుంటాడేమో??? నేను వద్దనుకున్నా నా పరిస్థితులు నన్నలా తయారు చేస్తాయేమో???? అభివృద్ది అంటే నెలకు లక్షలు సంపాదించుకోవడమే....ఆస్తులు కూడ బెట్టుకోవడమే...అవునా?
ఈ డబ్బును ఆత్మీయులకు దగ్గరగా వుండి సంపాదించుకోలేమా??ఎప్పుడు చస్తామో తెలియని బతుకులో ఎందుకు ఉన్నంతలో తృప్తి పడలేక పోతున్నాం...ఎక్కడ లోపం వుంది??? వ్యవస్థలోనా??? వ్యక్తుల్లోనా??''
       బుజ్జిగాడికి తన ఆలోచనలకు సంబంధించి సరైన సమాధానం దొరకనేలేదు.అంతలోనే అతడి జీవితంలోకి మానస వచ్చేసింది.తనలా ఆమె కూడా ఇంజనీరే.ఇక్కడ కూడా పెద్దవాళ్ళు ..''కలిసి సంపాదించుకుంటారని ''ఆలోచించారే తప్ప  కలిసి అనురాగాల్ని మూటగట్టుకోండి అని చెప్పలేదు.చెప్పాలంటే వాళ్ళ ఉద్దేశ్యంలో కలిసి ఉద్యోగం చేసుకుంటూ నాలుగు రాళ్ళు వెనకేసుకోవడమే ఓ గొప్ప మమతానురాగం!! బుజ్జిగాడు కూడా ఇదే ఆలోచించాడు.అంతేకాదు...'రేపొద్దున తను కూడా ఇలాగే అలోచించే అవకాశం వుంది.మరి సహజ సిద్దమైన మానవ సంబధాల వెసలు బాటుకు అస్సలు అవకాశమే లేదా? ' అని కూడా ఆలోచించాడు.చివరకు అందర్లా తను వుండకూడదను కున్నాడు..కానీ వుండలేకపోయాడు.పోటీ ప్రపంచం అతడ్నీరోబో గా మార్చేసింది.తప్పు జరుగుతుందని అతడికి అర్థం అవుతోంది.కానీ అందులోనే కనిపిస్తున్న అభివృద్ది అతడ్ని శాషిస్తూ వెక్కిరిస్తోంది.
         ఆకలిగా వున్నప్పుడు అన్నం....దాహంగా వున్నప్పుడు నీరు...వయసులో వున్నప్పుడు పెళ్ళి....ప్రయాణంలో ఉన్నప్పుడు అవసరమయ్యే టిక్కెట్టు వంటివి.ఇది అతిక్రమిస్తే ప్రయాణం ప్రమాదంలో పడే అవకాశం ఎంతయినా వుంది.జీవితంలో అనుబంధాలూ ఇలాంటివే....వాటినీ మనసారా అనుభవించాల్సిన వయసులోనే అనుభవిస్తే ఆనందం...లేదంటే శాంతి లేని ఆత్మలా జీవితానుభవం చివరి దశలో సాధిస్తుంది.
ఇలాగని ఎవ్వరూ అవకాశాన్ని త్యాగం చేసుకోలేరు.బుజ్జిగాడి విషయంలోనూ ఇదే జరిగింది.తను తన బాల్యాన్ని కోల్పోయానని  ఆ బాధలోంచి జీవన పరమార్థాన్ని నేర్చుకున్నాఢు.కానీ ఇప్పుడు అమెరికా వెళ్ళే అవకాశం రావడంతో  భార్యతో కలిసి రెక్కలు కట్టుకుని వెళ్ళిపోయాడు.
        ఒకప్పుడు బుజ్జిగాడు హాస్టల్ లో వుండి అమ్మానాన్నల్ని మిస్సయాడు.ఇప్పుడు విదేశాలకు వెళ్ళి మిస్సయాడు.ఈ ఎడబాటు ఇరువురిలోనూ  ఆవేదనను మిగిల్చింది.అమెరికా వెళ్ళాక బుజ్జిగాడికి ఒక బాబు పుట్టాడు.మనవడ్ని ఆన్ లైన్లో చూసి తృప్తి పడ్డారు లావణ్య దంపతులు.అక్కడ సంపాదన మరిగాక బుజ్జిగాడి దంపతులకు స్వంతదేశం రావాలనిపించలేదు.అభిమానాలు అన్నం పెడ్తాయా ఆదుకుంటాయా అని అలోచింఛే స్థాయికి చేరిలోయాడు బుజ్జిగాడు.ఇలాగని వాడి మనసు వాస్తవాన్ని విస్మరించలేదు. కాబట్టే తనని తాను చూసుకుంటూ ' ' హతవిధీ'' అని రోజుకు ఒక్కసారయినా అనుకోవడం మొదలెట్టాడు.
    *******
కాలం చూస్తుండగానే చాలా దూరం వెళ్ళిపోయింది.బుజ్జిగాడి కొడుక్కి పదేళ్ళు వచ్చాయి.అమెరికా దేశంలో వాడు హాస్టల్లో లేడు కాని అలాంటి జీవితమే వాడు గడుపుతున్నాడు.తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోగా ఆయా సం రక్షణలో వాడి బతుకు రెండవతరం కృత్రిమత్వంలో నలగడం మొదలయ్యింది.కాని వాడికి అది తెలియడం లేదు .అదే జీవితం అనుకుంటున్నాడు.ఈ క్రమం లోనే మనోహర్ కాలం చేసాడు.బాగున్నంత వరకు ఉద్యోగం ..సంపాదన...అనుకున్నాడు.ఉద్యోగ విరమణ తర్వాత  విశ్రాంతి తీసుకుందామంటే ఆశ ఊరుకోనివ్వలేదు.ప్రయివేటులో చేరిపోయాడు.అలా భార్యాభర్తలు కూడా కలిసి ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఎలాంటి గందరగోళాలకు తావు లేకుండా బతకలేక పోయారు.ఇలాంటి పరిస్థితిలోనే మనోహర్ గుండెపోటుతో ఆకస్మత్తుగా వెళ్ళిపోయాడు.లావణ్య ఒంటరిదై పోయింది.బతుకంతా కష్టపడటమే అయ్యింది. తిరిగి చూసుకుంటే కష్టం తప్ప జివితలో ఏదీ కనబడలేదు.ఎవ్వరి కోసం కష్టపడాల్సి వచ్చిందో వాళ్లు ఎవ్వరూ ఇప్పుడు తోడుగా రాలేరు.వచ్చే పరిస్థితి కూడా లేదు.రావాలని కోరుకోవడంలో అర్థం కూడా లేదు.తను వాళ్ళ వద్దకు వెళ్ళే పరిస్థితులు కూడా లేవు.అయ్యో జీవితం అంటే ఇంతేనా...ఇదేనా???? ఒంటరి తనంతో లావణ్య కృషించసాగింది.జీవితం భారంగా తోస్తుంటే ఏ ఆలంబన కోసమో మనసు ఎదురుచూడసాగింది.ఇప్పుడామె ఎడారి అంచులో తడారిన గొంతుక!!!
     బుజ్జిగాడికి తల్లి పరిస్థితి అర్థమయ్యింది.అందుకు తను ఎంతో బాధ పడ్తున్నాడు.అందుకే ఒకరోజు ఇండియాలో వున్న తన స్నేహితుడితో మాట్లాడాడు.వాడి ఉద్దేశ్యం తన తల్లి ఒంటరితనాన్ని దూరం చేయాలన్నదే.ఉద్యోగం చేయలేని పరిస్థితిలో వుందామె.దీంతో ఆమె మరీంత ఒంటరితనానికి లోనవుతోంది.ఇదంతా అర్థం చేసుకున్నడు కాబట్టే బుజ్జిగాడు తనదైన ఆలోచనకు పదను పెట్టాడు.ఆ విషయాన్ని ఫోన్ లో చెబుతూ...'' అమ్మా నువ్వేం బాధ పడొద్దు.నీకోసం నేను రాలేను కాబట్టి నీ కోసం ఆశ్రమం ఒకటి మాట్లాడాను.అది చాలా పెద్ద ఆశ్రమం.ధనవంతులు మాత్రమే ఉండగలిగేది.నా కోసం మీరు ఎంతో చేసారు. మీ కోసం నేను ఈ మాత్రం చేయలేనా ? ఖర్చు ఎక్కువైనా పర్వాలెదు  మంచి స్కూల్లో చదవాలని మీరు నాకోస ం పడిన శ్రమను నేను ఎలా మర్చిపోతాను.అందుకే డబ్బుకు వెనకాడకుండా నేను ఖరీదైన ఆశ్రమాన్ని చూసాను.ఇన్నాళ్ళ జీవితంలో మీరు మీకంటూ ఏమీ సంపాదించుకోలేదు.మీ ఋణాన్ని నేను ఏమిచ్చినా తీర్చుకోలెనమ్మా..'' అంటూ అవతల్నుంచి బుజ్జిగాడు కొండత ప్రేమగా మాట్లాడుతూ పోతున్నాడు.ఇవతల అన్నీ వింటూ లావణ్య కళ్ళు ధారాపతం అవుతున్నాయి.
   మరో రెండు రోజుల తర్వాత లావణ్య ఆశ్రమానికి ప్రయాణం అయ్యింది.స్వంత ఇల్లు కాకపోయినా ఇల్లు వదిలి వెళ్తుంటే ఆమె మనసు నిర్వీర్యం అయిపోయింది.అప్పుడు బుజ్జిగాడు అమ్మ కావాలని ఎలా అనుకున్నాడో...ఇప్పుడామె మనసు ఇల్లు కావాలనుకుంది.
   ఇంతే...జీవితం అంటే ఇంతే..! అన్నిరోజులు మనవికాదు...అందరూ మనవారే అయినా మన కోసం ఎవ్వరూ రాకపోవచ్చు!!!అన్నిసార్లూ అన్నిచోట్లా 'బరువు '' ను ఊహించాల్సిన అవసరం లేదు.బాధ్యత కూడా వొంటుంది.కానీ ఒక్కటి బరువైనా బాధ్యతైనా లావణ్య ఉన్న పరిస్థితుల్లో ఎవ్వరికైనా కలిగే ఒకే ఒక్క భావన ' ఈ జీవితం అవసరమా?? ''
      ××××

No comments:

Post a Comment