Thursday, January 3, 2019

వార్ధక్యం (కవిత )

ప్రాయానికి అవతలి తీరం
......................................
                 ✍తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
నా ఊరు..నాఇల్లు..నా గడప..
వీటితో ఏర్పడిన నా అనుబంధం
అమాంతం తెగిపోతుందేమోనని
భయంగా ఉంది....
***
ఆ గడియారం..ఆ బల్ల ..ఆ కుర్చీ..
అన్నీ నావే! వీటన్నీటినీ దాటుకుని
నేను వెళ్ళిపోతానేమోనని
ఆందోళనగా ఉంది...
***
ఎంతదూరం వెళ్ళినా...ఎంత అలసిపోయినా...
రాగానే ఉపశమనం అందించే
నా ఇంటిగోడల్ని వదులుకుని
కనుమరుగై పోతానేమోనని
కంగారుగా ఉంది....
***
అప్పుడెప్పుడో కొనుక్కున్న ఇనుపడబ్బా
చిలుము పట్టుకుపోయింది...
ఇంటివెనకాల చేదులబావి పూడుకుపోయింది...
ఊరించి అలరించిన రేడియో అటక ఎక్కింది....
కాంతివంతమైన నా శరీరం
ముడుతలలో కూరుకుపోయింది.....
***
ఊరు దూరం అవుతున్న గడియలు
దుఖానికి దగ్గరగా లాక్కెలుతున్నాయి...
ఎవ్వరో ఒకరి ఆసరా కోరుతున్న వార్ధక్యం 
నిన్నటి నా పొగరుని ప్రశ్నిస్తున్నది...
దేవ దేవా...!!
జీవితం అంటే ఇంతేనా???
తెలవారని చీకటేనా????☻
( ఎంతో చలాకిగా ఉండే మా అత్తగారిలో వయసు తెచ్చిపెట్టిన నిస్సత్తువని చూసాక ఈ కవిత..)

No comments:

Post a Comment