Thursday, January 3, 2019

రవివర్మ చిత్రకారుడు

ఒకే ఒక అందానివో.....
°°°°°°°°°°°°°°°°°°°°°°°°సేకరణ ;తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
రాజా రవి వర్మ .....
భారతీయ చిత్రకారుడు.....
చిత్రాలకు మాటలు నేర్పిన మహాయోగి....
కుంచెతో కథలు చెప్పిన  చైతన్య స్పూర్తి....
          ఊహకు ఆకృతిని అందించి....ఊహాలోకాన్ని ఇలపై ప్రదర్శించిన ఈ కేరళ రాజకుమారుడు ....
1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు   తొలిసారిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు.
       భారతీయ ఇతిహాసాలు రామాయణ, మహాభారత ఘట్టాలను  అద్భుత చిత్రాలుగా మలచి   కళకు దైవత్వాన్ని అపాదించిపెట్టాడు. భావి కళాకారులకు బాటలు వేసాడు. దార్శనికుడిగా తన స్థానాన్ని సుస్థిరం  చేసుకున్నాడు.కళాకారుడిగా మాత్రమే కాదు...కళకే ఆద్యుడిగా  ప్రపంచ యవనిక మీద  మంచి గుర్తింపు పొందాడు.
       భారతీయ సాంప్రదాయాలు.... పాశ్చాత్య  సంప్రదాయాలు...  చిత్రకళా మెళకువలు... వీటన్నీటి సమాహారానికి మొదటి మాటగా  ఏకైక ఉదాహరణగా అతని చిత్రాలు అగ్రస్థానాన్ని అలరించాయి. . భారతీయ  స్త్రీలను అందంగా....అద్భుతంగా...అపురూపంగా...చక్కని  చిక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి.
           భారతీయ చిత్రకళా చరిత్రలో చరితార్థుడిగా... చిత్రరాజాల చిత్తరువుల  విధాతగా ..... ఎనలేని కీర్తి గడించిన  ఈ  రాజా రవి వర్మ  ... కేరళ రాష్ట్రంలో  తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలో వున్న  కిలమానూరు రాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు   ఏప్రిల్ 29, 1848నజన్మించాడు.
             చిన్నతనంలోనే  వీరి    ప్రతిభను  గమనించిన  ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్   వీరిని చేరదీసి ప్రోత్సహించాడు. ఈ క్రమంలో అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు వద్ద రవివర్మ  శిష్యరికం చేశాడు.గురువును మించిన శిష్యుడిగా ఎదిగాడు.
          పాశ్చాత్య చిత్రకళలోని జీవశక్తి.... కొట్టొచ్చినట్లుండే భావ వ్యక్తీకరణ....రంగుల్లో కొత్తదనం... రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి. కాబట్టి భారతీయ చిత్రకళను ఆ స్థాయికి తీసుకు వెళ్ళే ఆలోచనగా    తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు .
  .     వీరి చిత్రాల్లో విభిన్నత గురించి మాట్లాడితే  హిందూ దేవతాస్త్రీల చిత్రాలను  ప్రత్యేకంగా దక్షిణ భారత స్త్రీల కోవలో  ఊహించి  చిత్రించేవాడు. . ముఖ్యముగా మహాభారతములోని నలదమయంతులు... శకుంతలాదుష్యంతులు..... యశోదాకృష్ణులు....రాధాకృష్ణులు...  వీరి కథనాల్లోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఆ జీవకళలో నేటికీ జీవిస్తున్నాడు..
            రవివర్మ  తన చిత్రాల ఇతివృత్తాల కోసం  భారత దేశమంతటా పర్యటించాడు. 1894 లో లిథోగ్రాఫిక్ యంత్రాలు, చిత్రించడానికి అనువైన రాళ్ళూ, సాంకేతిక నిపుణులను జర్మనీ నుంచి తెప్పించాడు . దేశంలోనే మొదటి సారిగా అత్యాధునిక ప్రెస్ ను ముంబైలో ప్రారంభించాడు
          భయంకరమైన ప్లేగు వ్యాపించడం వల్ల...కార్మికులు సరిగా లభించకపోవడం వల్ల.. కొన్నాళ్ళకు  మహారాష్ట్ర లోనే కొండ కోనల నడుమ ఉన్న మలవాలి అనే గ్రామానికి ప్రెస్ ను మార్చాడు.. ప్రెస్ పక్కనే తన నివాసాన్ని కూడా ఏర్పరుచుకున్నాడు. ప్రింటింగ్ పనులు తృప్తిగా సాగడంతో కేరళ నుంచి తరచుగా ఈ గ్రామాన్ని సందర్శిస్తుండే వాడు.
            రాజా రవివర్మ తదనంతరం   భారతీయుల ఊహలలో పౌరాణిక పాత్రలన్నీ రవివర్మ చిత్రాలుగా మారిపోయాయి. అంకితభావం...కృషి...పట్టుదల...క్రమశిక్షణ.... వీరి పనితనానికి  ఒక ప్రశస్తిని ప్రసాదించాయి.
          1906లో, 58 సంవత్సరాల వయసులో రవివర్మ  మధుమేహంతో మరణించాడు. ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు కొలువై  ఉండేవని ప్రతీతి.   రవివర్మ చనిపోవడానికి రెండేళ్ళ ముందు ప్రెస్ ను తన స్నేహితుడైన ఒక జర్మన్ సాంకేతిక నిపుణుడికి విక్రయించాడు. దానితో పాటు వంద చిత్రాలకు కాపీరైట్ కూడా ఇచ్చాడు.
        1972లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రెస్ కు భారీ నష్టం జరిగింది. రవివర్మ చిత్రాలు చాలా వరకు కాలిపోయాయి. మిగిలిన చిత్రాలను, రాళ్ళనూ ప్రెస్ చుట్టు పక్కల నివసించేవారికి పంచి పెట్టేశారు. ఆ తరువాత ముంబై, పుణే ప్రభుత్వాలు కొన్నింటిని మాత్రమే భద్రపరచగలిగాయి.
        రాజా రవివర్మ చిత్రకళకు చేసిన మహోన్నత ఉపకారానికి గుర్తిృపుగా  కేరళ ప్రభుత్వము ఆయన పేరిట రాజా రవివర్మ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ పురస్కారము ప్రతి ఏటా కళలు...సంస్కృతి... విభాగాల్లో  విశేష కృషి సల్పిన వారికి ఇస్తుంది.
    రాజా రవివర్మ పేరిట కేరళలోని మావలికెరలో ఒక ఫైన్ఆర్ట్స్ కళాశాలను కూడా నెలకొల్పారు. రవివర్మపై గల ఆసక్తి వల్ల సినిమా, వీడియోలలో కుడా అతని చిత్రాలను ఉపయోగించుకుంటున్నారు.
     రాజా రవివర్మకు మావలికెర రాజ కుటుంబానికి చెందిన రాణీ భాగీరథీబాయి (కోచు పంగి అమ్మ)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు.
      పెద్ద కుమారుడు రాజా రామవర్మ .ఇతడు కూడా చిత్రకారుడు.. రెండవ వాడు  రాజరాజవర్మ. పెద్ద కుమార్తె రాకుమారి మహాప్రభ. (ట్రావెన్‌కూర్ రాణీ సేతులక్ష్మీబాయి తల్లి). రెండవ కుమార్తె రాకుమారి ఉమాబాయి.
         రవివర్మ సంతానము  కారణంగా 'మావెలికెర 'రాజ కుటుంబము ఏర్పడింది.  ఆయితే  రవివర్మ మనుమరాండ్రు  మావలికెర రాజ కుటుంబానికి దాయాదులయిన    ట్రావెన్ కూర్ రాజ కుటుంబానికి దత్తు పోయారు. వారిలో పైన చెప్పబడిన రాణీ సేతులక్ష్మీబాయి కూడా ఉంది. వారి సంతానమే ఇప్పటి ట్రావెన్‌కూర్ రాజ కుటుంబము.

No comments:

Post a Comment