Thursday, January 3, 2019

పల్లె పదాలు ( గేయం )

మన పల్లె పదాలే జనపదాలు...జానపదాలు...ఇవే మన మూలాలు..! ఈ క్రమంలో తెలంగాణ గ్రామీణ
సంస్కృతి సంప్రదాయాలు...యాస భాష...ఇవన్ని పామరం అనిపించినా అందులో గొప్ప తాత్వికత...తర్కం...నిబీడీకృతమైవుంటాయి.కొన్నిసార్లు వాళ్లపాట మనకు అర్థం కాదు.కాని అర్థవంతమైనదై ఉంటుంది.ఇలాంటి జానపదాన్ని దృష్టిలో పెట్టుకుని , తెలంగాణలో జరుపుకునే
సంప్రదాయ పండుగల అనుభవంతో  నేను రాసిన ఈ క్రింది పల్లె పాట ఎంతమందికి అర్థమౌతుంది???
.....
అందరికోసం అస్సలోడొచ్చే
ఆరు వేల రూపాయల్ అప్పుగ దెచ్చే....
పొద్దుగాల బోయి పొట్టేల్ దెచ్చే
కందూరు పేరా కంకణం గట్టే.....
సంతకు బోయి సౌదల్ దెచ్చే
బజార్ల బోయి బోగాన్లు దెచ్చే....
యాట గోయనీకే యాకూబొచ్చే
కూరగొట్టనీకే కటికన్నొచ్చే....
సుట్టు ముట్టోల్లు సుట్టాలైరి
పిల్లలు జెల్లల్ పీక్కోనొచ్చిరి....
తాగుబోతోల్లకు తలకాయ కూర
నా లాంటోళ్ళకు నల్లకూర...
తునుకల్ బొక్కల్ తీరుగ తిండ్రి
కుక్కలకేమో కాట్లాట బెట్టిరి....
ఆశగొంటోళ్ళకు ఆనక బాయే
మిగిలిన కూర మూటళ్ళ  బాయే....
అందరు బోయినంక అస్సలోడొచ్చే
ఆకలితోన ఆవురావుమనే...
అడుగు బొడుగున మాడి శెక్కలు
సర్వల్ల మిగిలిన సోర్వ సుక్కలు....
అంతెత్తు ఎగిరే ఆలి మీద
అలిగి గూసునే అరుగు మీద....
అప్పుగూసునే నెత్తి మీద
వడ్డి గూసునే గుండె మీద....2
                     ✍తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

1 comment: