Sunday, January 27, 2019

వీరగల్లు

వీరుల గురుతులే   "వీరగల్లు "
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°సేకరణ :తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
వీరగల్లు!
వీరుల త్యాగానికి ధర్మానికి జ్ఞాపకార్థాలుగా మిగిలిపోయిన శిలా రూపాలు !!
చరిత్ర మీద అవగాహన ఉన్నవాళ్లకు  వీరగల్లు విగ్రహాలు గురించి విశ్లేషించాల్సిన అవసరం లేదు. కానీ సామాన్యులు చాలామందికి వీరగల్లు అంటే ఏందీ అనేది తెలువదు. యుద్ధవీరులు మరణించినప్పుడు వారి పేరు మీద వేయించే రాతి చిహ్నమే వీరగల్లు. ఒక యుద్ధవీరుడు గ్రామ రక్షణ కోసం గానీ, పశువుల మందను కాపాడటం కోసం గానీ, క్రూర మృగాల బారినుండి ప్రజలను కాపాడే ప్రయత్నంలో గానీ, నదులు కాలువలు చెరువులు వంటివి కట్టలు తెగినప్పుడు  ఆ ప్రమాదం నుండి తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను తప్పించే సాహసంలో గానీ, వీరోచితంగా  పోరాడి వీరమరణం పొందినప్పుడు సంబంధిత రాజులు లేదా గ్రామ మోతుబరులు ....పెద్దలు... వీరగల్లులు వేయించేవాళ్ళు. ఇవి చాలా గ్రామాల్లో నేటికిని దర్శనం ఇస్తుంటాయి.చారిత్రక విషయాల్ని అవగాహన చేసుకోవడానికి ఇవి విలువైన అరుదైన  ఆధారాలు.
       తమ గ్రామ దేవతలుగా,తమని వెన్నంటి కాపాడే అదృశ్య శక్తులుగా భావిస్తూ  ప్రజలు వీరగల్లులను భక్తితో పూజిస్తుంటారు.ఏడాదికి ఒక్కసారి వారి పేర్ల మీద పండుగలు కూడా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో
" మేక బలి" కూడా ఒక ఆచారంగా కొనసాగుతుంటుంది. ఇక్కడ మేకబలి శత్రువు పీడన విముక్తికి  కొలమానం. ఈ ఆచారంలో చారిత్రక విశేషం  ఉన్నది. ఎట్లా అంటే ప్రాచీన కాలంలో యుధ్దంలో ఓడిపోయిన శత్రువుల తలలను బంతులుగా మలుచుకుని   "శిర కందుక క్రీడా వినోదం" ఊరంతా తిప్పేవారు.  అట్లాగే  మరణించిన శత్రువీరుల రక్తమాంసాలతో ఉడికించి   ‘రణం కుడుపు’ పేరుతో
ఊరిచుట్టూ పొలిజల్లటం చేసేవారు. ఈ సంస్కృతులు సంప్రదాయాలు కూడా వీరగల్లులలో ప్రతిబింబిస్తాయి.
             చాలా ప్రాంతాలు వీరుల పేరు మీద  గ్రామాలుగా స్థిరపడి పోయాయి. ఇట్లా వీరగల్లుల  పేరుమీద వివిధ ప్రాంతాల్లో చాలా గ్రామాలు ఏర్పడ్డాయి. ఈ గ్రామాలన్నీ మొదట "వీరులు " శబ్దంతో ఏర్పడినప్పటికీ కాలక్రమంలో కొన్ని మార్పులను సంతరించుకున్నాయి.
ఉదాహరణకు 👇
అప్పుడు             ఇప్పుడు
°°°°°°°°              °°°°°°°°°
వీరులదిన్నె     =    ఈర్ల దిన్నె
వీరులపల్లి      =   ఈర్లపల్లి
వీరులబండ    =   ఈర్ల బండ
      వీరగల్లులు సంప్రదాయం మధ్య యుగం నాటిది. ప్రపంచ దేశాలు అన్నిచోట్లా వీరగల్లుల  ఉనికి కనిపిస్తున్నది.
ఆంగ్లంలో విరగల్లును హీరో స్టోన్  అంటారు. జపాన్ లో  సమురాయ్ సంస్కృతిలో  "సెప్పుక్కు" " హరాకిరీ"లు     వీరగల్లులుల సంప్రదాయమే.
       మన దేశానికి వస్తే తెలుగులో వీరగల్లులు,  తమిళంలో నటుకల్,   కన్నడంలో వీర్గల్, అని పిలుస్తుంటారు.
వీర =వీరుడు
గల్లు =రాయి.
కన్నడ భాషలో 'కల్లు' శబ్దం రాయిని సూచిస్తున్నది.
        వీరగల్లు విగ్రహాలు పరిశీలిస్తే ఒక వీరుడు గుర్రం మీద సవారి చేస్తున్నట్టుగా,  విల్లంబులు ధరించి ఉన్నట్టుగా, ఖడ్గం ధరించి శత్రువులను వధిస్తున్నటుగా,ఖడ్గం.... విల్లంబులు రెండూ ధరించి ఉన్నట్టుగా, కర్రలు ఎత్తి పట్టుకున్నట్టుగా, క్రూర మృగాలతో పోరాడుతున్నట్టుగా రకరకాలుగా  ఉంటాయి కొన్ని వీరగల్లు విగ్రహాల పక్కన  స్త్రీ బొమ్మలు కూడా కనిపిస్తుంటాయి. ఇక్కడ కనిపించే స్త్రీలు ధైర్యలక్షికి ప్రతీకలు.
         12వ శతాబ్దంలో వీరశైవం విపరీతంగా వ్యాపించింది. శివకవులు పుట్టుకొచ్చారు. శివసారాన్ని ప్రజల్లోకి లోతుగా తమ పద్యాలతో పాటలతో తీసుకు వెళ్లే ప్రయత్నం చేసారు. ఇట్లా శైవం వ్యాపిస్తున్నకాలంలో వీరశైవులు ఎందరో  శివసాయుజ్యం కోరి ఆత్మాహుతి చేసుకున్నారు.  వీరి త్యాగ  శిలలు కూడా వీటిలో చేరి ఉన్నాయి. ఈ  శిలలను సులువుగా గుర్తించవచ్చు. తమ తలపై ఉన్న ముడిని ఒక చేతితో పట్టుకుని, మరోచేతిలో కత్తి ధరించి,  తమ మెడలను తెగకోసుకుంటున్నట్టుగా ఈ విగ్రహాలు ఉంటాయి

No comments:

Post a Comment