Sunday, January 27, 2019

కోళ్ల పందాలు

కోళ్లు కాదు కొదమ సింహాలే
°°°°°°°°°°°°°°°°°°వివరణ*తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
కుక్కుటశాస్త్రం... !
ఇది కోళ్ల పందాలు గురించి వివరిస్తున్నది. ఈ శాస్త్రం ప్రకారం జాతిని బట్టి పందెం కోళ్లు ఆరు రకాలు. అవి 👇
1-సితావా
2-డేగ
3-నెమలి
4-కాకి
5-పర్ల
6-రసంగి
వీటిలో ఏ జాతి కోడి మరే జాతిపై ఉసిగొల్పితే విజయం వరించి తీరుతుందో శాస్త్రం స్పష్టంగా తెలియజెప్తుంది. పందెం రాయుళ్లు ఆ ప్రకారమే కోళ్ల జాతిని కొట్లాటకై ఎంపిక చేసుకుంటారు. జాతి ఆధారంగా కోళ్ల రంగులు కూడా ఉంటాయి.
   కోళ్ల పందాలు కూడా మూడు రకాలు. అవి 👇
1-కత్తికట్టి పందెం
2-విడికాలు పందెం (డెంకీ పందెమ్)
3-ముసుగు పందెం (  ఈ పద్దతిలో
ఎవ్వరు ఏ కోడిని తెస్తారో ఎవ్వరికీ తెల్వకుండా ముసుగు వేసి తెస్తారు.బరిలో కోడిని ఒదిలేదాకా ఎవరిది  ఏ కోడోఎవ్వరికీ  తెలియదు )
ఎవ్వరి వీలును బట్టి వాళ్ళు పందెం పద్దతిని ఎంపిక చేసుకుని అనుసరిస్తారు.
    సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, ఈ శాస్త్రం ప్రకారం పందెం రాయుళ్లు పుంజుల్ని సవరిస్తారు. నువ్వా నేనా అంటూ వినోదం ముసుగులో కదనభూమిని సృష్టిస్తారు.పుంజుల తరుపున తామే మీసం మెలివేస్తారు. తొడలు చరుస్తారు. ప్రేక్షకుల వెన్ను జలదరింపజేస్తారు. లక్షలు చేతులు మారేలా బెట్టింగుల పేరుతో వాతావరణాన్ని వేడిక్కిస్తారు.
     అవును ! ఇదంతా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండగ వేళా షరా మాములుగా కనిపించే అంశం ! ప్రభుత్వం జారీచేసే నిషేదాజ్ఞలు ఇక్కడ బేఖాతరు అవుతాయి. రాజకీయ నాయకుల  బడా బాబుల జోక్యం ప్రత్యక్షంగా వేడి పుట్టిస్తుంది.
    కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి ' సై 'అంటూ ఉసిగొల్పగానే అవి కొదమసింగాలై పోరు మొదలెడతాయి. ఎవ్వరి పుంజు గెలుస్తుందో చివరి వరకు కూడా అర్థం కాక, పందెం రాయుళ్లు లోలోపలే బెంబేలు ఎత్తిపోతుంటారు. ప్రేక్షకుల ఈలలు చప్పట్లు అరుపులు ఇవన్నీ పౌరుషాన్ని రగిలిస్తుంటాయి.
    ఓడిపోయిన కోడిని "కోజ " (కోశ ) అంటారు. ఇది సంబంధిత పందెంరాయుడికి పెద్ద అవమానం. ఈ క్రమంలో ఘర్షణలు సైతం అనివార్యం అవుతున్నాయి.చెప్పాలంటే కోడి పందెం ఒక పరువు... ఒక ప్రతిష్ట... ఒక కీర్తి... ఒక కిరీటం ! అందుకే గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తూ కోళ్లకు శిక్షణ అందిస్తారు. లక్షలు ఖర్చు పెడుతూ బలమైన పౌష్టికాహారం సమకూరుస్తారు. ఈ నేపథ్యంలో కోళ్లకు వైద్య చికిత్సలు చేయిస్తారు. బలం శక్తి కోసం మాత్రలు ఇస్తారు.
అయితే పందానికి కొన్ని రోజుల ముందు కోళ్లకు తిండిని తగ్గిస్తారు. ఆకలితో కసిని రేకెత్తిస్తారు.
    పందానికి ముందు సమయం, తిథి, నక్షత్రం, చూసుకుంటారు.అవిఘ్నం కోసం గణపతిని పూజిస్తారు. దృష్టి దోషాల నివారణ కోసం నల్ల కోడిని బలిస్తారు.
    ఇటీవల కాలంలో కోడి పందాలు సంప్రదాయం ఇతర ప్రాంతాల్లోను మొదలైనప్పటికీ కృష్ణ... ఉభయ గోదావరి జిల్లాల పైనే అందరి దృష్టి ఉంటుంది. మొత్తానికి కోళ్ల పందెం అంటే ఒక హిసాయుత జూదం ! మూగజీవాల అరణ్య రోదన !

No comments:

Post a Comment