Thursday, January 3, 2019

రైతు కవిత

రైతు కన్నీళ్ళకు దోసిలి పట్టేది ఎవ్వరు?
-----------------------------------
 రచన: శ్రీదేవి రెడ్డి తంగెళ్ళ

రైతు అంటే రాజు అంటారు
           రైతు రాజ్యం మనది అంటారు
అన్నదాత దేవుడంటారు
జే కొడుతూ జయము అంటారు
పట్టుగొమ్మలు  మీరే అంటారు
శిరసు వంచి శరణు అంటారు.........

మనదిగాని రాజ్యమాయే
దళారీల భోజ్యమాయే
మెతుకులేని బతుకులాయే
బతుకునిండా  గతుకులాయే
కట్టుకథల సేద్యమాయే
కలల పంట ఎండిపాయే.........

ఊటబావి ఊరకున్నది
బోరుబావి పూడివున్నది
    వానదేవుడు     అయిపు లేడు
నేలతల్లికి తడుపు లేదు
పంట భూములు దుక్కిపాలు
బతుకులేమో నవ్వుల పాలు.......

 కడుపు మంటలు నిత్యమాయే
కలుపు మొక్కల రాజ్యమాయే
అప్పులేమో పెరిగిపాయే
ఆశలన్నీ ఆవిరాయే
రాకాసి కరువు చీడా
ఆదుకునే నాథుడు లేడా.......

 కల్తీ ఎరువుల మోసమాయే
బతుకు దెరువు గాసమాయే
వ్యవసాయం దండగాయే
మీ సావుల పండుగాయే
పురుగుమందే పరమాన్నం
పిల్లపాపలు ఆగమాగం.......

వెంటాడిన వెతలకోసం
ప్రాణమే ఖరీదాయే
బొందలగడ్డ సుట్టమాయే
గొర్రుకొయ్యల గురుతులాయే
బీడువారిన ఆశలు
ఇనుప గజ్జెల గోసలు.........

ఒట్టి మాటల మూటలతో
బతక నేర్చిన చేతలతో
గుడ్డి రాజుల పాలనాయే
గడ్డిపోసలు కరువాయే
డొక్కలెండిన పాడి జూడు
బొక్కదేలిన మీ పయ్యి జూడు......

వాడు వస్తడు  వీడు వస్తడు
ఎవ్వడో వచ్చి ఏదో జేస్తడు
ఓ రైతన్నలారా
సలుపుతున్న గాయాల వేదనల్లారా
ఎవ్వడో వచ్చి చేసేదేముంది?
ఓటు భిక్షకుల తరిమివేయండి........

చెదలు బట్టిన నాగలి
          మండుతున్నది    ఆకలి   
      సమయమిదేరా భూమిపుత్రా
ధరించు ధైర్యాన్ని...
త్యజించు దైన్యాన్ని...
సాముజెయ్యరా రైతుబిడ్డా...
మాయమాటల ప్రభుత్వాల్ని మట్టుబెట్టరా దొరబిడ్డా...
ఉద్యమించరా  వీరబిడ్డా......

No comments:

Post a Comment