Monday, January 28, 2019

సాయుధ పోరాట చరిత్ర లో చింతలపూరి రాంరెడ్డి

పోరాట వారసత్వం 
 
తెలంగాణ ఉద్యమ చరిత్రను ...ముఖ్యంగా మలి విడత ఉద్యమచరిత్రలో భాగంగా వచ్చిన గేయసాహిత్యాన్ని గమనిస్తే...తెలంగాణ పోరాట  వారసత్వంగా కొందరి పేర్లే ప్రముఖంగా వినిపించాయి.వాళ్ళల్లో ఆదివాసీల అడుగుజాడ కొమరం భీం,బహుజన రాజ్యం ఆశాజ్యోతి సర్వాయిపాపన్న , కాకతీయ ప్రతాపరుద్రుడిని ఎదురించిన సమ్మక్క సారలమ్మలు ,సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య , దేశ్ ముఖ్ దురాగతానికి బలైన షేక్ బందగీ ,భూమి హక్కుని ప్రశ్నిస్తూ ...ఆంధ్రమహాసభ కార్యకర్తల అండదండలతో దొరకు ఎదురు తిరిగిన చాకలి ఐలమ్మ , వీళ్ళను మాత్రమే ఉద్యమ కవులు పోరాట వారసత్వంగా స్మరించుకున్నారు. కానీ ఎందరో వీరులు ఇక్కడ విస్మరణకు గురి అయ్యరనేది వాస్తవం.  కవిత్వాలు రాసిన కవులు అగ్రకులాలకు సంబంధించిన వీరులను అమరులను ఉద్దేశ్యపూర్వకంగా స్మరించుకోలేదా? లేకా వాళ్ళు వీరులు కాదని భావిస్తూ పక్కకు పెట్టారా? లేకా తెల్వక తలుచుకోలేదా ?లేకా తెలిసీ మా వాళ్ళు కాదు కదా అనుకున్నారా? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు.ఈ క్రమంలో  కులమతాలకు అతీతంగా పోరాటవీరులకు...అమరులకు...పేరుపేరున వందనాలు ! ఊరూరా విగ్రహాలు అవుతున్న పైన చెప్పిన వీరులతో పాటుగా  పోరాట చరిత్ర మరిచిపోయిన  మన రెడ్డి వీరులకు కూడా  అభివoదనాలు !  ముఖ్యంగా సాయుధపోరాటానికి ముందు పోరాటస్పృహను కలిగించిన....అందుకు బాటలు వేసిన వీరులు ఎందరినో వెలికి తీయాల్సిన అవసరం వున్నది. అట్లాగే కందిమళ్ళ ప్రతాపరెడ్డి గారు సాయుధ పోరాట చరిత్ర ఇంకా అసంపూర్ణమే అన్నారు.  ఆ    అసంపూర్ణత పూరించబడాలంటే పెద్ద ఎత్తున పరిశోధన జరగాలి. అప్పుడు ఇంకా ఎందరో వీరులు బయటకు వస్తారు.


👉రేణికుంట రామిరెడ్డి

పోరాటాలకు పెట్టిది పేరయిన నల్లగొండ జిల్లా భువనగిరి తాలూకా రేణికుంట గ్రామానికి చెందిన రామిరెడ్డి ఒక సామాన్య రైతుబిడ్డ.వీరి ఇంటిపేరు చింతలపూడి.ఆంధ్రమహాసభ  ప్రేరణతో చైతన్యం పొందిన రామిరెడ్డి నిజాం అకృత్యాలమై తన తిరుగుబాటును ధైర్యంగా ప్రకటించుకున్నాడు.1944లో రజాకర్ల నుండి దేశ్ ముఖ్ ల నుండి ప్రజలను కాపాడడానికి  గ్రామ రక్షక దళాలను ఏర్పాటు  చేసి...ముందుండి పోరాడి అమరుడైన వీరగాథ ఈ రామిరెడ్డిది.కాని ఈ వీరుడు చరిత్ర పుటల్లో ఎక్కడో మరుగున పడిపోయాడు.1948 మార్చి 2 న నిజాం రజాకర్ల  సైన్యం రామిరెడ్డి మట్టుపెట్టాలని నిర్ణయించుకుని రేణికుంట గ్రామాన్ని చుట్టు ముట్టింది. వాళ్ళతో మరతుపాకులు మెషీన్ గన్నులు వున్నాయి.8 లారీల సైన్యం వున్నది. గ్రామ బురుజు మీద నుండి ఎల్లవేళలా పరిస్థితుల్ని కనిపెట్టుకుని వుండే రామిరెడ్డి దళ సభ్యుడు ఒకరు విషయాన్ని రామిరెడ్డికి చేరవేయగానే...రామిరెడ్డి నిజాం సైన్యాన్ని చూసి పారిపోకుండా పోరాటానికి సిద్దమయ్యాడు.ప్రజలు మాత్రం భయతో  గ్రామం చుట్టూ సహజ సంరక్షణగా వున్న  గుట్టల్లోకి  పారిపోయి  ప్రాణాలు కాపాడుకున్నాయి .విజయమో వీరస్వర్గమో అని ప్రజలకు ధైర్యం  చెప్పి.. తన దళంలో వున్న 16 మంది సభ్యులతో 15 తుపాకులతో రజాకర్లతో పోరాటానికి తెగబడ్డాడు రామిరెడ్డి.ఈ భీకర పోరాటంలో 40 మంది రజాకర్లు చనిపోయారు.2 గంటల పాటు జరిగిన పోరాటంలో రామిరెడ్డి దళంలొ ఒక్క సభ్యుడు మాత్రమే చనిపోయాడు.ఇది రజాకర్లకు అవమానంగా తోచింది.రామిరెడ్డి పోరాట పటిమను వాళ్ళు తట్టుకోలేకపోయారు.దీంతో రజాకర్ సైన్యాన్ని రెచ్చగొట్టి తీసుకొచ్చిన తహసిల్దారు రామిరెడ్డిని దొంగచాటుగా అయినా చంపి నిజాం మెప్పు పొందాలనుకున్నాడు.అప్పటికి రామిరెడ్డికి సంబందించిన తుపాకుల్లో మందుగుండు దాదాపు అయ్యిపోయింది.ఇదే అదనుగా తహసిల్దారు రామిరెడ్డి వున్న మిద్దె కు వెనక వున్న చింతచెట్టు ఎక్కి ...వెనక నుండి పిరికిగా రామిరెడ్డిపై కాల్పులు జరిపాడు. వీరుడిపై కాల్పులు జరగగానే సభ్యులు అంతా పారిపోవడం మొదలెట్టారు. సైన్యం వాళ్ళను పట్టుకుని వరుసగా నిల్చోబెట్టి క్రూరంగా కాల్చి చంపింది.అయితే వీరుడైన రామిరెడ్డి తన మరణం తర్వాత తన కొడుకు రంగారెడ్డి శతృవుల చేతికి చిక్కకూడదని భావిస్తూ తను చనిపోతూ కొడుకును కూడా కాల్చి చంపాడు.తర్వాత రజాకర్లు గ్రామాన్ని నిర్ధాక్షిణ్యంగా తగుల బెట్టారు.కాలిన శవాలను గుట్టలుగా లారీల్లో తరలించారు.రామిరెడ్డి వీరత్వం  ...అమరత్వం...ప్రజలు పాటలుగా పాడుకున్నారు.కథలుగా చెప్పుకున్నారు. మరి ఈ అమరుడిని మనం కూడా పాటై తలుచుకుందాం...

     పోరుబాటైనావు రామిరెడ్డీ...
     త్యాగధనమైనావు ఎదురొడ్డీ..
     రజాకర్ గుండాలను తరిమికొట్టి...
     వీరుడవైనావు తుపాకి పట్టి...
     పోరాటకథల్లో నీ పేరు తలిచి...
     నిలుపుకుంటాము నిన్ను మా గుండెలు తెరిచి...

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

No comments:

Post a Comment