Thursday, January 3, 2019

అనాథల అరణ్య రోదన (కవిత )

అ...అంటే అమ్మ అని
పలక మీద పంతులమ్మ
పదిలంగా రాసింది....
పలకలేక నా మనసు
వెక్కి వెక్కి ఏడ్చింది..........
ఆ.....అంటే ఆవు అని
ఓనమాల పుస్తకం
ఒద్దికగా చూపింది
ఆవుదూడ ఆబొమ్మను
చూడలేక నా గుండే
తల్లడిల్లి పోయింది..............
ఇ....అంటే ఇల్లు అని
తరగతిలో పిల్లలంతా
గొంతెత్తి చదివితే
ఇల్లు లేని నా బతుకు
దిగులుతో కుమిలింది........
ఈ...అంటే ఈషుడని
అందరికి తండ్రి అని
ప్రతినిత్యం చెబుతుంటే
నాన్న లేని  నా పయనం
నలిగి నలిగి చచ్చింది
నరకమే చూసింది.............
ఉ...అంటే ఉమ అని
అందరికి అమ్మ అని
పదే పదే చెబుతుంటే
అమ్మకై నా లేమి
అణువణువు  వెదికింది
అశ్రువై మిగిలింది..........
ఊ...అంటే ఊయలని
పసిపిల్లల పానుపని
అది - లాలిపాట రాగమని
ఊరిస్తూ వివరిస్తే
జోలలేని నా హృదయం
హృద్యమై పోయింది.......
పెంచలేని అమ్మకు
ఆడతనం ఎందుకు?
కనగలిగిన అమ్మకు
కాఠిన్యం ఎందుకు?
మోహమా మోసమా...
ఇది మాకు శాపమా?
మాతృత్వం వరమైన ఓ అమ్మలారా
ఆలోచించండి...
తలరాతలు మార్చొద్దు....
అనాథలను సృష్టించొద్దు....
                  ✍తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

No comments:

Post a Comment