Monday, January 28, 2019

తెలంగాణ అమరులు

కొండేటి వేణుగోపాల్ రెడ్డి :(1987-2010)

తెలంగాణ కోసం జరిగిన బలిదానాల్లో అమరులు ఎందరో ! ఎవ్వరి త్యాగం వృధా కాలేదు. వారి త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు స్వయం పాలనలో నిన్నటి వేదనల గాయాలను మానుపుకుంటున్నది.కానీ గర్భశోకాన్ని మిగుల్చుకున్న తల్లుల గాయలకు మాత్రం చికిత్స లేదు.ఇది జీవితకాల గాయం ! ముగింపులేని కన్నీటి గేయం ! ఈ వరుసలో అమరత్వాన్ని తన బతుకు వాకిట నిలుపుకుని....తన ఆయుష్షును త్యాగాల జెండాకు కట్టిన  మనరెడ్డి బిడ్డ  కొండేటి వేణుగోపాల్ రెడ్డి.
       ఉస్మానియా విశ్వవిద్యాలయం సాక్షిగా ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో   వేణుగోపాల్ రెడ్డి తన శరీరాన్ని సంకల్పం కోసం నిప్పుల కొలిమిని చేసుకున్నాడు.ఎం.సి.ఎ  చివరి సంవత్సరం చదువుతున్న ఈ కాపుబిడ్డ ఉడికిన నెత్తుటితో  తల్లి తెలంగాణ కోసం యమపాశాన్ని స్వీకరించి ....నేను సైతం అంటూ ప్రాణమొక్కటి అర్పించాడు.మరణించేనాటికి 23 ఏండ్ల వయసు వున్న ఈ యువకిరణం ప్రాంతం కోసం తన చావుతో వెలుగుల్ని పూయించాలనుకుందే తప్ప...కన్న వారి రేపటి తెలవారని బతుకుల గురించి ఆలోచించలేదు.మరి ఇంతటి త్యాగానికి సిద్దపడి బతుకును బుగ్గిపాలు చేసుకున్న  ఈ అమరుడికి తెలంగాణ అమరుల  వరుసలో  తగిన ప్రాధాన్యత లభించడంలేదు.ముఖ్యంగా ఇతడు చనిపోయిన చోట విగ్రహం ప్రతిష్టించే ఆలోచన ఇటు పాలక వర్గంలో గానీ...రెడ్డి వర్గాల్లో గానీ ...విద్యార్థి  వర్గాల్లో గానీ లేదు.ఇది బాధాకరమైన విషయం.
     హైదరాబాద్  ఉప్పల్ కు దగ్గరగా నాచారం లో నివాసం వుంటూ ఘట్ కేసర్ 'లలిత పి .జి. డిగ్రీ కాలేజ్ ' అనే ప్రయివేటు కళాశాలలో  చదువుకునే వేణుగోపాల్ రెడ్డికి మొదటినుండి కూడా తెలంగాణ అంటే వీరాభిమానం.ప్రత్యేకరాష్ట్రం తన బంగారు కలల్లో ఒకటిగా తన మిత్రులతో సంభాషించేవాడు. ముఖ్యంగా  'మన తల్లి దండ్రులు మన జీవితాల గురించి ఎన్ని కలలు కంటారో అట్లాంటి కలనే తనదిగా ' ఈ రెడ్డిబిడ్డడు పదే పదే మిత్రులతో చెప్పుకోవడం వెనుక...ఇంత కఠినమైన నిర్ణయం వుంటుందనేది ఎవ్వరూ ఉహించనిది.
   19 జనవరి 2010 రోజు తన స్నేహితులతో కలిసి ఉస్మానియ  విశ్వవిద్యాలయానికి వచ్చిన వేణుగోపాల్ రెడ్డి ....ఆ రోజు  సాయంత్రం  5:10 కి  తన సోదరుడు శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి ' ఇంటికి రావడం ఆలస్యమౌతుందని '  మాత్రం చెప్పాడు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్ అఫ్ అయ్యింది.ఆరోజు చివరి సారిగా అతడ్ని అక్కడే గార్డెన్ లో చూసినట్టుగా అతడి స్నేహితుల్లో ఒకరైన రవిందర్ పేర్కొనడం జరిగింది.తర్వాత అతడు ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి రాని సోదరుడి కోసం శ్రీనివాస్ రెడ్డి రాత్రంతా ఎదురుచూసాడు.స్నేహితుల ఇంటికి వెళ్ళాడేమో అని భ్రమ పడ్డాడు. కాని పొద్దుటే మార్నింగ్ వాక్ కు వచ్చిన వాళ్ళకు ...నల్లగా మాడిన శరీరరం ఒకటి టాగూర్ స్టేడియం వద్ద కనిపించడం కలకలం రేపింది.
  ' జై తెలంగాణ ' అంటూ సూసైడ్ నోట్ రాసిన వేణుగోపాల్ రెడ్డి మరణం  వెనుక కొన్ని అనుమానాల్ని కూడా సన్నిహితులు వెలిబుచ్చారు. తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ...తెలంగాణ రాష్టాన్ని చూడాలని కలలు కంటూ...తెలంగాణకై ఉద్యమ దళాల వెంట గ్రామాలు కూడా సంచరిస్తూ...ఉద్యమ సైనినుకుల్ని తయారు చేయడంలో చురుకైన పాత్ర వహిస్తూ...నరనరాన ప్రాంతీయాభిమానాన్ని నింపుకున్న వేణుగోపాల్ రెడ్డి తన ఆశయాన్ని అభిమతాన్ని అంత సులువుగా వదులుకుని ఎట్లా వెళ్ళిపోగలిగాడు అనేది సన్నిహితుల సందేహం !  వేణుగోపాల్ రెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా.ఈ జిల్లాలో ఒక ప్రాంతానికి  త్యగధనుడి పేరు పెట్టాల్సిన అవ్వసరం ఎంతయినా  ఉన్నది
   వేణుగోపాల్ రెడ్డీ....
   నీవు కూలిన పర్వతానివి...
   కానీ అందుకోలేని శిఖరాగ్రానివి !
   నీవు నేలరాలిన తారవి...
   కానీ తట్టుకోలేని మహోజ్వల కాంతివి !
   నీవు విరిగిన కొమ్మవి...
   కానీ పెకిలించలేని మహావృక్షానివి !
   జోహార్ ..అమరుడా...జోహార్  !!

✍️తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

ఆత్మకూరు

పూర్వ పాలమూరు జిల్లా 

No comments:

Post a Comment