Wednesday, January 2, 2019

ఆత్మకూరు సంస్థానంలో కురుమూర్తి జాతర

ఆత్మకూరు సంస్థానంలో
కురుమూర్తి దేవస్థానం
°°°°°°°°°°°°°°-సేకరణ ;తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

👉శేషాద్రి....ఏకాద్రి.....  కోటగట్టు...ఘనాద్రి.... భల్లూకాద్రి....పతగాద్రి....దేవతాద్రి అనే ఏడు కొండల్లో దేవతాద్రి పై కాంచన గుహాలో కురుమూర్తి ఆలయం ఉన్నది.దేవతాద్రిని వ్యవహారంలో  దేవరగట్టు అని పిలుస్తుంటారు. మొదట్లో ఒక రాతిగుండు స్వామి వారి ప్రవేశ మార్గంగా ఉండేది. ప్రస్తుతం ఆధునీకరించారు.   కురుమూర్తి, కురుమతి, కురుమన్న, అంటూ రకరకాలుగా పిలుచుకునే  కురుమూర్తి స్వామి....సాక్షాత్తు ఆ   వేంకటేశ్వరస్వామి అవతారంగా భక్తులు విశ్వసిస్తారు.
👉తెలంగాణ ప్రాంతం పూర్వ పాలమూరు జిల్లా ఆత్మకూరు సమీపాన చిన్నచింతకుంట మండలంలో ఉన్న కురుమూర్తి గుట్టలు  ఆధ్యాత్మిక శోభతో ప్రస్తుతం తెలంగాణ రాష్టానికి తలమానికమై  విలసిల్లుతున్నాయి.
👉దేవస్థానం క్రీ.శ. 1268 లేదా 1292 తర్వాత ప్రాంతములో ముక్కెర వంశ మూలపురుషుడు,గోన బుద్దారెడ్డి సామంతుడు  రాజా  గోపాలరెడ్డి  నిర్మించినట్టుగా లభిస్తున్న చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తున్నది. . కాగా గోపాలరెడ్డి హయాంలో  ఆలయం పెద్దగా వెలుగు చూడలేదు. వారి కుమారుడు చిన గోపిరెడ్డి క్రీ.శ.1363 ప్రాంతంలో తన  పాలనలో వివిధ అభివృద్ది  కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆలయం అభివృద్ధి పెద్దగా కొనసాగలేదని తెలుస్తున్నది. వీరి తర్వాత పాలనకు వచ్చిన చంద్రారెడ్డి  ఆలయాన్ని అభివృద్ధి పరిచి ఆలయ నిర్మాతగా  చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. కాగా ఈ విషయమై  లభిస్తున్న  చరిత్ర కొంత గందరగోళానికి తావు ఇస్తున్నది. ఎందుకంటే   1350లో  చంద్రారెడ్డి ఆలయాన్ని అభివృద్ధి పరిచినట్టుగా  సంస్థానాలు గురించి సమగ్ర సమాచారం అందించిన తూమాటి దోణప్ప పేర్కొంటున్నారు. కాగా ఈ విషయమై విశ్లేషణ జరుపుకుంటే తండ్రి పాలనలోనే కుమారుడు తన ముద్రను చూపించి ఉండవచ్చు.
 👉 మూడవ అసఫ్ జాహి సికిందర్ జా (1803-1829),నాలుగవ అసఫ్ జాహి నాసిరుద్దవౌలా (1829-1857) ఇద్దరి పాలనలో మనుగడ సాగించిన   ముక్కెర  వంశ వారసుడు  రాజా  వెంకట రెడ్డి
1810–1840 సం. మధ్య కాలంలో  ఆలయ అభివృద్ధికి  విశేష కృషి సలిపినట్టుగా తెలుస్తున్నది. ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయం  ఇదే  కాలంలో నిర్మితమైనట్టు భావిస్తున్నారు
 👉తర్వాత  నాల్గవ అసఫ్ జాహి నాసిరుద్దవౌలా  పాలనా కాలం వాడయినా  ముక్కెర వారసుడు రాజా  సోమభూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించాడు.  ఏటా జాతర నిర్వహించే సాంప్రదాయం అమలులోకి తీసుకు వచ్చాడు.
👉 తర్వాత ఆరవ అసఫ్ జాహి కాలంలో రాజా శ్రీ రాం భూపాల్ 1870-1878 మధ్య ప్రాంతంలో  ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. ఉద్దాలు అనగా పాదరక్షలు అని అర్థం. ఇక్కడ   నగారా బంగ్లా (నవత్ ఖాన బంగ్ల) వాద్యకారుల కోసం 1857-78 మధ్య కాలంలో నిర్మితమైనట్టు చెబుతున్నరు.. విశాలమైన ధర్మశాలను కూడా  ఇదే  కాలంలో నిర్మించినట్లు తెలుస్తున్నది  సీతారామభూపాలుడే ఉత్సవాల సందర్భంగా నగారా బంగ్లాను   ఉపయోగించేవారని కూడా  తెలుస్తోంది
👉కురుమూర్తి అస్సలు పేరు కురుమతి అని పండితులు పేర్కొంటున్నారు. కురు  అనగా ' చేయుట ' అని, మతి అనగా 'తలుచుట 'అని అర్థం. అంటే ఏది కోరినా చేసి పెట్టే తలంపు ఆ క్షేత్రానికి ఉన్నదని భావించవచ్చు. మొత్తానికి కాల క్రమంలో కురుమతి  కురుమూర్తిగా చెప్పబడింది అని తెలుస్తున్నది. మూర్తీభవించిన రూపం అక్కడ కొలువైనది కాబట్టే ' కురుమూర్తి ' గా చెప్ప బడి ఉండవచ్చు.
👉కురుమూర్తి ఆలయం గురించి ఎన్నో జానపద కథలు వ్యవహారంలో ఉన్నాయి.ఇవన్నీ తిరుపతి వేంకటేశ్వరస్వామి కుబేరుడి అప్పుల బాధను తట్టుకోలేక కురుమూర్తి  గుట్టల్లోకి విశ్రాంతి కోసం వచ్చి...లక్ష్మీ సమేత తన ప్రతి రూపాన్ని గుట్టల్లో వదిలి , తిరిగి తిరుపతి వెళ్లిపోయాడని ఈ కథల సారాంశం.  స్థలపురాణం కూడా  కురుమూర్తి స్వామి వెంకటేశ్వర అవతారంగా చెబుతున్నది. స్వామి స్వయంభూ అని కూడా చెబుతున్నది. ఈ  క్రమంలో స్వామి వారి ఆనవాళ్లు కనుక్కుని పాలకులు గుడి కట్టి ఉండవచ్చు అని మనం భావించవచ్చు.
👉కురుమూర్తి ఆలయానికి దళితులకు విడదీయరాని అనుబంధం ఉన్నది. ఆవు చర్మంతో స్వామి వారి పాదుకలను దళితులే తయారు చేస్తారు. పాదుకల తయారీ సమయంలో వీరు  నియమ నిష్టలు పాటిస్తారు. అంతేకాదు.. ఉద్దాల మండపంలో దళితులే అర్చకులుగా కొనసాగుతుంటారు.
👉కురుమూర్తి జాతర బ్రహ్మోత్సవాలతో ఆరంభం  అవుతుంది. ఉద్దాల  ఊరేగింపు ఇందులో ప్రధాన ఘట్టం. ఇదొక గొప్ప వేడుక. పూనకాలు... నృత్యాలు... పరవశిస్తూ తన్మయత్వంతో  పెట్టే కేకలు... ఇక్కడ కన్నుల పండుగై కనిపిస్తాయి.....వినిపిస్తాయి.  ఊరేగింపు తర్వాత పాదుకలను  మండపంలో ఉంచుతారు. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. 1999లో కొత్తగా మండపం ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలలో స్వామి వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు.
👉ప్రస్తుతం సంఘ సంస్కరణల నేపథ్యలో ఈ ప్రాంతంలో నెలకొని ఉన్న ' బసివిని ' ఆచారం తగ్గిపోయింది. కాగా ఒకప్పుడు మాదిగ తెగలు బసివి ఆచారం పాటిస్తూ కురుమూర్తి జాతర సమయంలో... తమ ఆడపిల్లలకు కురుమన్న పేరిట మాల దాసరి సమక్షంలో పెళ్ళి జరిపించేవారు. కురుమన్నను మొగుడిగా నిర్ణయించేవారు.
👉స్వామి వారికీ పెట్టే నైవేద్యాన్ని ఇక్కడ ' దాసంగం ' అంటారు. స్వామి వారికి దాసులై సమర్పించుకునే ఈ దాసంగంలో 'అన్నం - పచ్చి పులుసు 'లేదా ' పులగం ' ప్రధానంగా ఉంటాయి. పులగం అంటే బెల్లంతో వండే అన్నం.
 👉ముక్కెర వంశ మూల స్తంభం గోపాల్‌ రెడ్డి  కాలం నుండి,  తెలంగాణ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యే వరకు  తమదైన అధికారాన్ని కాపాడుకుంటూ వచ్చిన  రాణి భాగ్యలక్ష్మీ దేవి (1948) దాక   మొత్తం 28 తరాల వారు అందరూ  ‘కురుమూర్తి స్వామి’ ఆలయ అభివృద్ధికి  కృషి చేసారు. ముఖ్యంగా స్వామి వారిని తమ ఇలవేల్పుగా ముక్కెర వంశస్తులు మాత్రమే కాదు, ఆ ప్రాంత ప్రజలు అందరూ కూడా కురుమూర్తిని తమ ఇలవేల్పుగా ఆరాధిస్తారు.
👉 తిరుపతికి  కురుమూర్తి ఆలయాలకు మధ్య స్పషమైన  పోలికలు ఉన్నాయి. ప్రధానంగా తిరుమలలో మాదిరి  ఇక్కడా వినాయకుడి విగ్రహం లేదు.  ఏడు కొండల మధ్య దేవాలయం ఉంది. తిరుమల మెట్ల దారిపై శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి. కురుమూర్తి దర్శనానికి వెళ్తున్నప్పుడు తిరుపతి లో ఉన్నట్టు మోకాళ్ళ గుండు కూడా ఉన్నది. అలిపిరి మండపం పోలికలతో ఇక్కడ ఉద్దాల మండపం ఉన్నది  ఈ ఆలయం ఇన్ని విదాలుగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయాన్ని పోలి వుండాటానికి చారిత్రక కారణం  విశ్లేషిస్తే.... ముక్కెర వంశస్తులు  చంద్రగిరి వాస్తవ్యులు కావడం వలన, అక్కడి తిరుపతి పోలికలతో  ఇక్కడ సరైన చోట ఆలయం నిర్మించుకుని ఉండవచ్చు. పురాణం ప్రకారం ఆలోచిస్తే  వేంకటేశ్వరుడు తిరుపతిని పోలిన ప్రదేశాన్ని ఎంచుకుని ఉండవచ్చు. మొత్తానికి  ఈ కురుమూర్తి క్షేత్రాన్ని పాలమూరు తిరుపతిగా కూడా పిలుస్తారు. పేదల తిరుపతి అనికూడా అంటారు.
👉సంస్థానాధీశులు  స్వామి వారికి 15వ శతాబ్దంలో బంగారు ఆభరణాలను సమర్పించారు.వీటిలో  శంఖుచక్షికాలు, కిరీటం, మకర కుందనాలు, భుజ కిరీటాలతో సహా వివిధ ఆభరణాలు  ఉన్నాయి.. నాటి నుండి నేటి వరకు ఆ ఆభరణాలను స్వామివారికి ఉత్సవాల సందర్భంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తున్నది. మొదట్లో ఆభరణాలను
సంస్థానాధీశుల బంగ్లాలోనే ఉంచేవారు. ఉత్సవాల సందర్భంగా రాజభవనం ముందున్న కొలనులో ఆభరణాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు జరిపించి.... ఏనుగు అంబారీపై స్వామివారి అలంకరణలను  ఊరేగింపుగా  వేడుకగా తీసుకు వెళ్ళి స్వామివారికి అలంకరించేవారు.
👉1968లో కురుమూర్తి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖలో విలీనమైంది. ఫలితంగా 1976 నుంచి ఆభరణాలను ఆత్మకూరు బ్యాంకులోని ప్రత్యేక లాకర్‌లో భద్రపరుస్తున్నారు . ఉత్సవాల సందర్భంగా నేటికిని  ముక్కెర వంశస్థులు విచ్చేసి ఆభరణాల అలంకరణోత్సవంలో ప్రధాన పాత్ర  పోషిస్తున్నారు
👉 కురుమూర్తి స్వామి గురించి అనేక రచనలు కూడా వెలువడ్డాయి. వివిధ గ్రంధాల్లో స్వామి వారి ప్రస్తావన ఉన్నది. .

వనపర్తి సంస్థానంలో సావుదేవుడి జాతర

వనపర్తి సంస్థానంలో
సావుదేవుడి జాతర
°°°°°°°°°°°°°°°°°°°°సేకరణ :తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

               వనపర్తి జిల్లా రాజనగరంలో జరిగే జాతరను అక్కడి చుట్టుపక్కల ప్రజలు '' సావుదేవుడి జాతర '' గా కూడా అభివర్ణించుకుంటారు. వనపర్తి సంస్థానాన్ని పాలించిన రాజుల్లో  ఒకరైనా  రాజా రామకృష్ణారావు పేరున ప్రతి ఏటా ఈ జాతర సాగుతుంది. సావుదేవుడుగా చెప్పబడుతున్నది ఈ రామకృష్ణారావే.ఇతడు వనపర్తి సంస్థానాధీశుల్లో ప్రథమ రామకృష్ణరావు. వీరి వంశ మూలపురుషుడు  జనుంపల్లి వీరకృష్ణారెడ్డి (1510-1540).  వీరిది మోటాటి తెగ, పెనుబాల గోత్రం.వీరి స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల తాలూకా జనుంపల్లి గ్రామం.  రావు అనేది వీరు పొందిన గౌరవార్థం . వీరు  పెబ్బేరు మండలం 'పాతపల్లి' కి వలస వచ్చి కొన్నాళ్ళు నివాసం ఉండి, దానికి సమీపానగల 'సూగూరు'లో కోటను నిర్మించుకొని పాలన సాగించాడు. తర్వాత   వీరి వంశ క్రమాలు   కొత్తకోట, శ్రీరంగాపురం, వనపర్తిలను తమ నివాస కేంద్రాలుగా చేసుకొని 178 చిన్న, పెద్ద గ్రామాలపై తిరుగులేని  ఆధిపత్యాన్ని కొనసాగించారు. .  తమ అధీనంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో  ఆలయాలు నిర్మించి అభివృద్ధి చేసారు.
        ముఖ్యంగా ప్రథమ రామకృష్ణారావు చావు గురించి జానపదులు రకరకాల కథలు చెప్పుకుంటారు. . ఈ వరుసలోనే నేను  '' సావుదేవుడు '' పదాన్ని గ్రహించాను. కథల్ని విన్నాను. నా అనుభవంలో  వనపర్తికి ఆరు కిలోమీటర్లు దూరాన ఉన్న జగత్ పల్లి వాస్తవ్యుడు నల్లమద్ది రాంరెడ్డి తాత చెప్పిన కథ నాలో ఆసక్తిని కనబర్చింది. ఎందుకంటే వారు చెప్పిన కథ పరిసరాలను ప్రాథమికంగా నిర్దారించి చూపించేందుకు అనుకూలంగా ఉన్నది. ఈ ప్రకారం అక్కడి ప్రాంతాన్ని సందర్శించి వీడియో రూపంగా కూడా చిత్రీకరణ చేశాను గమనించగలరు.  ఆ కథ వివరాల్లోకి వెళ్తే  👇
        గోపాల్ పేట సంస్థానాధీశుడికి, రామకృష్ణారావుకు మధ్య యుద్ధం జరిగింది. యుద్దానికి కారణాలు ప్రాంతాల ఆక్రమణలు. అయితే గోపాల్ పేట సంస్థానానికి వనపర్తి సంస్థానానికి మధ్య సంబంధం పరిశీలిస్తే......వనపర్తి సంస్థానాధీశుల్లో అష్టభాషి బహిరి గోపాల్ రావు  ప్రసిద్ధుడు. ఈ  వంశంలో బహరి బిరుదము పొందిన మొదటి వ్యక్తి. ఎనిమిది భాషల్లో నిష్ణాతుడు. ఇతడి పేరుమీదే  ఇతడి దత్తపుత్రుడు   మూడవ వెంకటరెడ్డి '' గోపాల్ పేట ''  సంస్థానాన్ని స్థాపించి,  తన తమ్ముడు రంగారెడ్డిని సంస్థానాధీశుడిగా నియమించాడు. వీరు  ప్రథమ రామకృష్ణారావుకు  7,8, తరాలు ముందు వారు. మొత్తానికి ఈ యుద్ధం  అటు రాజపేటకు ఇటు రాజనగరానికి సమీపంగా ఉన్న రెండు గుట్టల మధ్య జరిగింది. ఈ యుద్ధంలో రామకృష్ణారావు మరణించారు. వారు అధిరోహించివచ్చిన రథం అక్కడే మట్టిలో కూరుకుపోయింది అనేది కథనం. రథం కూరుకుపోయిన  ప్రాంతంలో  ఇప్పటికీ సువాసనలు గుబాళిస్తుంటాయని..... కానీ రథం ఎక్కడ ఉన్నదనే సంగతి నిర్ధారణ జరగడం లేదనేది కూడా ఒక కథ. కాగా ఇటీవలి కాలంలో ఆ గుట్టల ప్రాంతంలో ఎదో విశేషం ఉన్నదని అధికారిక పర్యటనలు పరిశోధనలు జరగడం.... వినిపిస్తున్న జానపద కథకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
        వినిపిస్తున్న రెండవ కథలోకి.....వెళ్తే రాజా రామకృష్ణారావుకు గుర్రపు స్వారి అంటే  మిక్కిలి ఆసక్తి. ఈ  క్రమంలో ప్రతి ఏడాది రాజనగరం ఊరివెలుపల  గుర్రపు పందేలు నిర్వహించేవాడు. గుర్రం ప్రయాణించే మార్గంలో కొన్ని మైళ్ళ వరకు  అడ్డంగా తాళ్లు  కట్టించి వాటిపైనుంచి గుర్రాన్ని దూకిస్తూ పోయేవాడు. ఈ క్రీడలో వినోదిస్తున్న సమయంలోనే వారు  ప్రాణాలు కోల్పోయాడు.
           ఈ కథల వెనుక నిజానిజాలు ఎట్లా ఉన్నప్పటికీ..... ప్రథమ రామకృష్ణారావు హేవళంబి నామ సంవత్సరం భాద్రపద మాసం శుక్రవారం నాడు జన్మించి,   చిత్రభాను నామ సంవత్సరం కార్తీక మాసం సోమవారం నాడు మరణించిట్టుగా  సమాధిపై వేయించిన శాసనం ద్వారా తెలుస్తున్నది. అట్లాగే సమాధిపై  వేయించిన తెలుగు అంకెలను తర్జుమా చేసుకుంటే  1699-1745 మధ్య కాలంలో  44 ఏండ్లు  జీవించినట్టుగా తెలుస్తున్నది.( బహుశా ఈ అంకెలు తెలుగు కాకపోవచ్చును??? ). కానీ ఇప్పటి వరకు లిఖించబడిన చరిత్రలో వీరి కాలం  1807 నుండి  1822 వరకు సంస్థాన భాద్యతలు స్వీకరించినట్టుగా  తెలుస్తున్నది.   వీరి పాలనా కాలంలోనే  రాజధానిని శ్రీరంగాపురం నుండి వనపర్తికి మార్చాడు.  వనపర్తి  అనగా వనాలు ఎక్కువగా ఉన్న చోటు. దీని అస్సలు పేరు ''వనం పతి ''. అంటే వనాలకు  అధిపతి అని అర్థం  ''.వనం పఱ్రు''
' వనపురి ''అనే పేర్లతో కూడా ఈ  ప్రాంతం పిలువబడేది.
 ఇప్పటికీ వనపర్తి చుట్టూ పెద్ద పెద్ద  కొండలు అడవులు విస్తరించి ఉన్నాయి. 
          రాజావారి మరణం కార్తీక సోమవారం నాడు జరిగింది కాబట్టి... ఆ  పుణ్య గడియల్ని పురస్కరించుకొని  రామకృష్ణారావు భార్య రాణి  నాంచారమ్మ  రాజానగరం దగ్గర ఒక శివాలయాన్ని నిర్మించింది. ఈ సంస్థాన ప్రభువులు నిర్మించిన మొదటి శివాలయమిది.
             రామకృష్ణాలయం పేరుతో నిర్మించిన ఈ శివాలయం పేరు విని  ఎవ్వరైనా కొత్తవాళ్లు ఇది రామాలయమో లెేకా కృష్ణాలయమో అనుకోవడం సహజం. ఇది ఏమైనప్పటికి తర్వాత పాలనకు వచ్చిన   రాణి శంకరమ్మ 1866 నుండి 1892 వరకు అంటే 24 ఏండ్లు  పాలన సాగించింది. రామకృష్ణారావు దత్త కుమారుడు రామేశ్వర రావు (ప్రథమ ).వీరి సతీమణి రాణి శంకరమ్మ. ఈ  రాణిగారు తన మామగారు
రామకృష్ణారావు పేరు చిరస్థాయిగా మిగిలిపోయే ఉద్దేశ్యంతో  గుడిని నిర్మించిన గుడిలో ప్రత్యేక కార్యక్రమాలకు ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో  ప్రతి యేటా కార్తీక శుద్ధ చతుర్దశి నాడు స్వామివారికి తలంబ్రాలు, పున్నమినాడు తేరు ఉత్సవం ఏర్పాటు చేసింది. కార్తీక పౌర్ణమి నాడు ప్రారంభమైన ఈ ఉత్సవాలే  జాతరగా ఒక పక్షం రోజుల వరకు  కొనసాగడానికి పునాదులు వేసింది.
          మొదట దీన్ని ''రాజావారి జాతర'' అని అధికారికంగా అనేవారు. ప్రజలు మాత్రం ''సావుదేవుని జాతర '' అని మరణించిన రాజావారిని  చనిపోయిన దేవుడిగా గుర్తుచేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ రాజనగరం పరిసర ప్రాంతాల్లో పాత కాలం పెద్ద మనుషులు
 '' సావుదేవుడి '' జాతర అనే పేర్కొంటున్నారు. కాలక్రమంలో ''రాజనగరం జాతర''గా అధికారికంగా ప్రసిద్ధికెక్కింది. అట్లాగే ఈ రాజనగరం రామకృష్ణారావు తల్లి జానమ్మ పేరిట ( నిర్మించబడింది 👇
     రా''జాన''గరం లో జానమ్మ పేరు నిక్షిప్తమై ఉండటాన్ని గమనించవచ్చు. ఇక్కడ ఉన్న చెరువు పేరు కూడా జానమ్మ చెరువు. వ్యవహారంలో  'అమ్మ చెరువు ' అంటుంటారు.
ఆ ప్రాంతంలో ఉన్న రాణిపేట,  రాజపేట, రామన్ పహాడ్  గ్రామాలు వివిధ కాలాల ప్రభువులవారి పేరు మీద ఏర్పడినవే.
          ముఖ్యంగా  ఆలయం ముందు 'రాజవిలాసం' అనే రెండంతస్తుల భవనం ఉంది. ఇది నేటికిని సంస్థానాధీశుల విశ్రాంతి మందిరం.  ఇందులో వివిధ తరాల రాజ కుటుంబీకుల చిత్రపటాలు, వారి దర్బారు సామగ్రి భద్రంగా ఉన్నది.
          సుమారు 450 ఏళ్ళు వనపర్తి సంస్థానం మనుగడ సాగించింది.  స్వాతంత్య్రానంతరం భారత దేశంలో సంస్థానం కలిసే నాటికి 15 తరాలు.....17మంది రాజులు.....ఆరుగురు రాణులు .....సంస్థానాన్ని పాలించారు.  'సప్త సముద్రాలు' అనే పేరుతో పెద్ద పెద్ద చెరువులను తవ్వించి రైతులను.......సామాన్య ప్రజలను ఆదుకోవడానికి  తమ వంతు ప్రయత్నం చేశారు.
వీరి వంశంలో దత్తపుత్రులకే పెద్దపీట వేయబడింది.
         ఒకప్పుడు జాతర ఉత్సవాల్లో భాగంగా జానపద కళాకారులకు  ప్రోత్సాహం  అందిస్తూ....  కోడి పందేలు,  ఎద్దు లకు రాతి దూలాలను లాగించే పోటీలు.,  ఘనంగా జరిగేవి. సాంస్కృతిక ప్రతిభను ఆదరిస్తూ  యక్షగానం, పౌరాణిక నాటకాలు   ప్రదర్శించబడేవి.  కవి పండిత సభలు కూడా ఘనంగా జరిగేవి. ఇవి కార్తీక పౌర్ణమి నుండి మూడు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా జరిగేవి.పండిత సభల్లో ప్రధానంగా  యజుర్వేదం,పూర్వమీమాంస,వ్యాకరణం,  న్యాయం, ద్వైతం,అద్వైతం, విశిష్టాద్వైతం,  , సాహిత్యం, ఆయుర్వేదం, వంటి   శాస్త్రాల్లో పాండిత్యం ప్రదర్శించిన వారికి విలువైన  బహుమాన సత్కారాలు ఉండేవి..   
             1949 వరకు   నిరాటంకంగా కొనసాగిన పండిత సభల్లో  హొసుదుర్గం కృష్ణమాచార్యులు, కార్యమపూడి రాజమన్నారు, మానవల్లి రామకృష్ణకవి,  ధూళిపాళ సూర్యనారాయణ శాస్త్రి, నూకల సుబ్రహ్మణ్యశాస్త్రి, వెల్లాల శంకర శాస్త్రి వంటి మహాపండితులెందరో  పాల్గొనేవారు.
కాల క్రమేణ జాతర  సంప్రదాయంలో  ఇవన్నీ కనుమరుగై పోయాయి. కాపోతే నాటి శంకరమ్మ కాలం నుండి నేటి వరకు కూడా రథోత్సవంగా జరుపుకునే '' తేరు లాగడం '' వేడుకలో భాగంగా   జాన పదులు ప్రదర్శించే కోలాటం, బొడ్డెమ్మ, చెక్క భజన, తాళ భజన, అడుగుల భజన, మొదలుగు  కళారూపాలు కనువిందు చేస్తూ వస్తున్నాయి.